
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli).
అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్‌ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.
అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.
చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు