
స్కాట్లాండ్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్‌లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది.

ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు..

సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది.
ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.
(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)