
తాడేపల్లి: తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Ugadi
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2025