
మోనార్క్ పార్క్‌ని శుభ్రం చేసిన నాట్స్ సభ్యులు
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.