Beauty contest
-
ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!
వయసు శరీరానికే గానీ మనసుకు కాదు అని చేసి చూపిస్తున్నారు కొందరూ. చాలామంది వయసు రీత్యా పెద్దవారైనా.. యువకుల మాదిరిగా తమకు ఇష్టమైన రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్నారు. అలానే ఓ మహిళ ఏడు పదుల వయసులో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. పైగా ఈ వయసులో ఇలాంటి పోటోల్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించింది. ఈ పోటీలో ఆమె గెలవకపోయినప్పటికీ అంత పెద్ద వయసులో కూడా తన కోరికను నెరవేర్చుకునేందుకు ముందుకు వచ్చి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు అందానికి వయసుతో సంబంధం లేదని చాటి చెప్పింది. ఎవరామె అంటే..ఏడు పదుల వయసులో మారిస్సా టీజో అనే మహిళ మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో పాల్గొనాలనే తన కలను సాధించింది. గత వారాంతంలో హ్యూస్టన్‌లో జరిగిన ఈ మిస్ టెక్సాస్ ఈవెంట్లో పాల్గొన్న 75 మంది మహిళలో టీజో కూడా ఉన్నారు. ఈ ఈవెంట్లో ఆరియోన్నా వేర్ విజేతగా నిలిచినప్పటికీ..71 ఏళ్ల టీజోనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పైగా ఈ ఏజ్‌లో పాల్గొన్న వృద్ధురాలిగా రికార్డు సృష్టించారు. ఇక టీజో తాను ఈ పోటీల్లో పాల్గొనడానికి గల కారణాలను ఇన్స్టాగ్రాం వేదికగా చెబుతూ..తాను ఈ మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో పోటీదారుగా పాల్గొనడం అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నాను. అందులో తాను భాగమైనందుకు సంతోషిస్తాన్నాను. ఇది కేవలం మహిళలు తమ శారీరక, మానసికంగా ధృఢంగా ఉండటమేగాక వారు ఏ వయసులోనైనా అందంగానే ఉంటారని విశ్వసించేలా ప్రేరేపించేందుకే ఇలా చేశానని పోస్ట్‌లో తెలిపారు. అంతేగాదు తాను ఈ పోటీలో పాల్గొనేల మద్దతు ఇచ్చిన స్పాన్సర్లందరికి ధన్యవాదలని కూడా చెప్పారు. కాగా, ఇటీవలే అందాల పోటీల్లో వయోపరిమితి నిబంధనను తొలగించాలనే మార్పుకు శ్రీకారం చుడటంతోనే టీజోకి ఈ మిస్ టెక్సాస్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అంతేగాదు ఈ సరికొత్త నిబంధన మార్పులో.. వివాహం చేసుకున్న లేదా వివాహితలు, గర్భణీ స్త్రీలు, పిల్లలు కలిగిన మహిళలు సైతం అందాల పోటీలో పాల్గొనడానికి అనుమతివ్వడం విశేషం. అయితే ఈ విధానం 2023 నుంచి అమలులోకి రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Marissa Teijo (@marissateijo) (చదవండి: పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ వేరేలెవెల్!..పూజకు అందరిలా..!) -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
Mahati Kaumari: నాతో నేనే పోటీ పడ్డాను..!
ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిసెస్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 (29–40 ఏళ్లలోపు పెళ్లైన మహిళలకు నిర్వహించే కాంటెస్ట్) పోటీల్లో హైదరాబాద్ వాసి శ్రీమతి మహతి కౌమారి 2వ స్థానం దక్కించుకుంది. మలేషియా దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుంచి 45 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం గురించి, తనను తాను కొత్తగా మెరుగు పరుచుకునే విధానాల గురించి వివరించింది మహతి కౌమారి. ‘మన పరిధిని విస్తరించుకుంటేనే అవకాశాలు పెరుగుతాయి, ఏ కిరీటాలైనా దక్కుతాయి’ నవ్వుతూ వివరించింది. ‘‘సొంతంగా ఎదగాలన్న ఆలోచనే ఈ రోజు నన్ను ఎల్లలు దాటేలా చేసింది. పదేళ్లు ఐటీ కంపెనీలలో వర్క్ చేశాను. పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబం.. జీవితం ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళుతూనే ఉంది. దీనితోపాటు నా కలలను కూడా తీర్చుకునే క్రమంలో నాతో నేనే పోటీపడుతుంటాను. కాలేజీ రోజుల నుంచి నా డ్రెస్సులు నేనే స్వయంగా డిజైన్ చేసుకునేదాన్ని. రీ సైక్లింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపేదాన్ని. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా నా ఈ అలవాటు మానుకోలేదు. నా స్నేహితులు, సహోద్యోగులు నా డ్రెస్సింగ్ గురించి అడిగేవారు. వాళ్లూ తమకు డ్రెస్‌లు డిజైన్ చేయమని కోరేవారు. అలా మా బంధుమిత్రుల్లో అడిగిన వారికి నాకున్న ఖాళీ సమయాన్ని కేటాయించి డిజైన్ చేసిచ్చేదాన్ని. నేను డిజైన్ చేసిచ్చిన డ్రెస్సుల్లో వారిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగేది. సొంతంగా డిజైనింగ్ స్టూడియో పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. కుటుంబం, ఉద్యోగం అనే వ్యాపకాలు ఉన్న నాకు సొంతంగా నా డిజైన్ స్టూడియో పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన పెరగడానికి నా డిజైన్స్ ఇష్టపడే బంధుమిత్రులే కారణం. మా కుటుంబం కూడా ఆమోదం తెలపడంతో ఉద్యోగం వదిలి, డ్రెస్ డిజైనింగ్లోకి వచ్చేశాను. ఎనిమిదేళ్లుగా డిజైనింగ్ స్టూడియో నడుపుతున్నాను. మొదట ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన నేను, ఇప్పుడు పదిహేనుమందికి ఉపాధి చూపించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు క్లాసులు కూడా ఇస్తుంటాను. బ్యూటీ కాంటెస్ట్‌తో మరో అడుగు ‘తెలిసిన వారికి వర్క్ చేసిస్తే సరిపోదు, నేను చాలామందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది మహిళలకు పని కల్పించేలా నన్ను నేను మలుచుకోవాలి..’ ఈ ఆలోచన నన్ను అవకాశాల కోసం వెతికేలా చేసింది. ఆన్లైన్లో మిసెస్ బ్యూటీ కాంటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నా స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాను. కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. మన దేశం నుంచే కాదు మరో పదిహేను దేశాల నుంచి చాలామంది మహిళలు ఈ పోటీలకు అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత మన దేశం నుంచి నేను ఎంపిక అయ్యాను. రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నాకు విదేశాలలోనూ స్నేహితులు పెరిగారు. పోటీలకు వచ్చిన వారందరితోనూ మంచి స్నేహం ఏర్పడింది. దీంతో నాకున్న అవకాశాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’’ అని వివరించి ఈ బ్యూటీ. మనసును సేదతీర్చేలా... కర్ణాటక సంగీతం నాకున్న మరో హాబీ. కుటుంబం, బిజినెస్ బాధ్యతలు ఎన్ని ఉన్నా నాకు ఇష్టమైన సంగీతాన్ని నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. హాబీస్‌కి నాకంటూ కొంత సమయం కేటాయించుకోవడంలో ఏ మాత్రం అలక్ష్యం చేయను. పిల్లలు కూడా నా ఇష్టాలను ప్రోత్సహిస్తుంటారు. – నిర్మలారెడ్డి -
Miss and Mrs VogueStar India 2023: బ్యూటీ స్టార్ డాక్టర్ శ్రీ కీర్తి పల్మనాలజిస్ట్...
మరో కీర్తికిరీటం ‘మిసెస్ తెలంగాణ’. ‘మిసెస్ వోగ్స్టార్ ఇండియా’ విజేత. మహిళ ఎలా ఉండాలో చెప్పింది. మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ‘మంచిని తీసుకోవాలి... చెడును వదిలేయాలి’ ఇదీ ఆమెను విజేతగా నిలిపిన సమాధానం. ‘మా ఊరికి వస్తే మా ఇంటికి రండి’ మరో ప్రశ్నకు బదులుగా ఆత్మీయ ఆహ్వానం. బ్యూటీ కంటెస్ట్ నాడి పట్టుకుంది. సంపూర్ణతకు ప్రతీకగా కిరీటధారి అయింది. ఏప్రిల్ 14,15,16 తేదీల్లో జైపూర్ వేదికగా వోగ్ స్టార్ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయి డాక్టర్ కీర్తి. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మంది పాల్గొన్న పోటీల్లో ‘మిసెస్ తెలంగాణ’ కిరీటంతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి వోగ్స్టార్ కిరీట ధారణ వరకు తన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను ‘సాక్షి’తో పంచుకుంది. ‘‘అమ్మ ఉద్యోగ రీత్యా నేను పుట్టింది ఒంగోల్లో, కానీ మా మూలాలు నెల్లూరులో ఉన్నాయి. అమ్మ బీఎస్ఎన్ఎల్, నాన్న సిప్లాలో ఉద్యోగం చేసేవారు. బాల్యం నుంచి నా జీవితమంతా హైదరాబాద్‌తోనే మమేకమైపోయింది. సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో టెన్త్ టాపర్‌ని. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉండడానికి స్కూలే కారణం. నాలుగు రకాల డాన్స్‌లు ప్రాక్టీస్ చేశాను. యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నాను. త్రో బాల్ ఆడేదాన్ని. ఖోఖో స్టేల్ లెవెల్ ప్లేయర్‌ని. ఇదంతా ఒక దశ. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆకాంక్ష ఉండేది. రెండో ఆలోచన లేకుండా కాకతీయ కాలేజ్‌లో బైపీసీలో చేరిపోయాను. సీనియర్ ఇంటర్లో ఉండగా ఓ యాక్సిడెంట్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, తలకు కూడా గాయమైంది. సర్జరీలతో దాదాపు నాలుగు నెలలు బెడ్ మీదనే ఉన్నాను. పరామర్శకు వచ్చిన వాళ్లు సానుభూతి కురిపిస్తూ ‘నడవడం కూడా కష్టమే, ఆరోగ్యం ఒకింత కుదుటపడిన తర్వాత ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేసేయండి’ అనే సలహా ఇచ్చేవాళ్లు. ఏఎస్రావు నగర్లో మా కాలనీ వాళ్లు నాకు చాలా సహాయం చేశారు. హాస్పిటల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. మా అమ్మానాన్న చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించిన రోజులు నాకు గుర్తు లేవు, కానీ నన్ను మామూలు మనిషిని చేయడానికి మా తమ్ముడు కార్తీక్ నన్ను చేయి పట్టి నడిపించిన రోజుల్ని మాత్రం మర్చిపోలేను. అలాగే చదివి ఎమ్సెట్లో రెండు వేల ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నాను. టాప్ టెన్‌లో ర్యాంకు నా కల, యాక్సిడెంట్ వల్ల ఆ కల నెరవేరలేదు. ► ... డాన్స్ మానలేదు! కుప్పంలో ఎంబీబీఎస్ చేశాను. అప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ మానలేదు. నేను స్టేజ్ మీదకు వెళ్లకుండా కొరియోగ్రఫీ చేసి షోలు నిర్వహించాను. ఇక పీజీలో చదువు తప్ప మరిదేనికీ టైమ్ ఉండేది కాదు. పల్మనాలజీ తర్వాత కేరళలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ చేశాను. పెళ్లి తర్వాత మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. మాది లవ్ మ్యారేజ్. డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్‌లో నా సీనియర్. ఆయన గాయకుడు. ఇల్లు, హాస్పిటల్‌తో జీవితాన్ని పరిమితం చేసుకోవడం నాకే కాదు ఆయనకూ నచ్చదు. డాన్స్ కాకపోతే మరేదైనా ఆసక్తిని అభివృద్ధి చేసుకోమనేవారు. అలా గత ఏడాది మిస్ హైదరాబాద్ పోటీలకు నా ఫొటోలు పంపించాను. టాలెంట్ రౌండ్లో ర్యాంప్ వాక్, డాన్స్ వీడియోలు పంపించాను. అందులో ఫస్ట్ రన్నర్ అప్ని. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మిసెస్ తెలంగాణ ఆడిషన్’ పిలుపు వచ్చింది. డెలివరీ తర్వాత సెలవులో ఉండడంతో ఆ పోటీల్లో పాల్గొనే వీలు దొరికింది. గత ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా అనేక సెషన్లు జరిగాయి. అన్నీ వర్చువల్‌గానే. ► పోటీల నుంచి నేర్చుకున్నాను! ఈ పోటీలో ఒకరికొకరు నేరుగా కలిసింది జైపూర్‌లో కిరీటధారణ సమయంలో మాత్రమే. ప్రతి రాష్ట్రం నుంచి విజేతలకు కిరీట ధారణ జరిగింది. విజేతల్లో నాతోపాటు మరో ఇద్దరు డాక్టర్లున్నారు. మనుమళ్లు, మనుమరాళ్లున్న మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా అనేక స్ఫూర్తిదాయకమైన జీవితాలను దగ్గరగా చూశాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో ఎదురీత ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలకు చెప్పేదొక్కటే... జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాలి. పెళ్లయిందనగానే ఇక జీవితం అయిపోయిందని, తమనెవరూ పట్టించుకోవట్లేదని ఇంట్లో వాళ్లను వేలెత్తి చూపుతూ తమను తాము నైరాశ్యంలోకి నెట్టేసుకుంటూ ఉంటారు. నిర్లిప్తతను దగ్గరకు రానివ్వకూడదు, ఒకవేళ ఆందోళన, ఆవేదనలు చుట్టు ముట్టినా సరే వాటి నుంచి బయటపడడానికి తమను తాము ఉత్తేజితం చేసుకోవాలి’’ ఎంపిక ఇలా! స్వయం శక్తితో జీవితంలో ఎదిగిన వాళ్లు, జీవితంలో పడిలేచిన వాళ్లు, సామాజికంగా సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వాళ్లు... ఇలా ఉంటుంది. అలాగే అందరిలో ఒకరిగా జీవించడం కాకుండా ప్రొఫైల్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను పర్యావరణం కోసం చేసిన పనులు, కోవిడ్ వారియర్, జగిత్యాలలో ఐదేళ్లు సామాన్యులకు వైద్యం చేయడంతో సరిపెట్టుకోకుండా హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ ఇవ్వడం వంటివి నాకు ఉపకరించాయి. – డాక్టర్ ఎం.వి. శ్రీకీర్తి, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
ఆలిండియా లెవల్లో ప్రకాశం కోడి పుంజు సత్తా
ప్రకాశం: ఆలిండియా చిలకముక్కు కోళ్ల అందాల పోటీల్లో కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కోడి పుంజు 4వ స్థానంలో నిలిచింది. గ్రామానికి చెందిన కోళ్ల పెంపకందారుడు సయ్యద్ బాషా తన కోళ్లతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన కోళ్ల అందాల పోటీల్లో పాల్గొన్నారు. తన కోడికి బహుమతి దక్కడంపై బాషా ఆనందం వ్యక్తం చేశారు. -
అందం హిందోళం.. అధరం తాంబూలం
అందంలో మనకు ఐశ్వర్యరాయ్ ఎలాగో.. ఒంటెల్లో ఇదలాగన్న మాట.. ఖతర్‌లో అటు ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీలు జరుగుతున్న సమయంలోనే ఇటు ఈ ఒంటెల అందానికి సంబంధించిన ప్రపంచ కప్ పోటీలూ జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందమైన ఆడ ఒంటెలు ఈ పోటీల్లో తమ హొయలను ప్రదర్శించాయి. ఈ చిత్రంలోని ఒంటె.. మొదటి స్థానాన్ని గెలుచుకుని.. రూ.44 లక్షల బహుమతిని గెలుచుకుంది. ఇందులో గెలవడం అంత ఈజీ కాదు.. ముందుగా ఈ ఒంటెలకు వైద్యుల పర్యవేక్షణలో ఎక్స్‌రేలు వంటివి తీస్తారు. ఎందుకంటే.. అందాన్ని ఇనుమడింపజేయడానికి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్ ఇంజెక్షన్లు వంటివి వాటికి ఇచ్చారా అన్నది తెలుసుకోవడానికట. సహజ సౌందర్యరాశికే పట్టం కట్టాలన్నది తమ లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. గత పోటీల్లో వైద్య పరీక్షల్లో పట్టుబడిన 47 ఒంటెలపై అనర్హత వేటు వేశారట. పోటీల్లో భాగంగా.. వాటి చెవులు, ముక్కు.. పెదాలు ఇలా అన్నిటినీ నిశితంగా పరీక్షించి.. జడ్జీలు మార్కులేస్తారు. Spectators watch a camel beauty contest in Ash-Shahaniyah, Qatar 📸 @reuterspictures pic.twitter.com/0wQ3WCyQBm — Reuters (@Reuters) November 30, 2022 -
తన గౌను తానే కుట్టుకుని మిసెస్ యూనివర్స్ టైటిల్ నెగ్గిన మధ్యప్రదేశ్ మహిళ
పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అయితే అ అననుకూలతలనే అవకాశాలుగా మార్చుకుని ఏకంగా మిసెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది డాక్టర్ దివ్యా పాటిదార్ జోషి. గతేడాది జరగాల్సిన ‘మిసెస్ యూనివవర్స్ సెంట్రల్ ఏషియా–2021’ పోటీలను కరోనా కారణంగా ఇటీవల సియోల్‌లో నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న దివ్య 120 దేశాల అందాల రాశులను వెనక్కు నెట్టి మిసెస్ యూనివర్స్ సెంట్రల్ ఏషియా కిరీటాన్ని దక్కించుకుంది. కిరీటమేగాక తన ప్రతిభాపాటవాలతో ‘మిసెస్ యూనివర్స్ ఇన్స్పిరేషన్’ పురస్కారాన్ని కూడా గెలుచుకుని ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన దివ్య చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే అమ్మాయి. డిగ్రీ చదివిన దివ్య హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. గిటార్‌ను చక్కగా వాయించడమేగాక, మంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్, సామాజిక కార్యక్రమాలు, నటన, సంగీతం పోటీలలో ఎంతో చురుకుగా పాల్గొనేది. సరిగమపా టీవీషో, ఇండియన్ ఐడల్లలో పాల్గొని టాప్ –100 జాబితాలో కూడా నిలిచింది. అత్తమామల ప్రోత్సాహంతో... రత్లాంకు చెందిన మర్చంట్ నేవీ అధికారి ప్రయాస్ జోషితో 2013లో దివ్యకు పెళ్లయ్యింది. ముందు నుంచి దివ్యకు ఉన్న ఆసక్తి, ప్రతిభా నైపుణ్యాలు తెలుసుకున్న భర్త, అత్తమామలు పెళ్లి తరువాత మోడలింగ్, అందాల పోటీలలో పాల్గొనమని ప్రోత్సహించడంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మోడలింగ్‌లో రాణిస్తూనే...‘మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ–2018’ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ పోటీలో పాల్గొనే సమయంలో దివ్యకు ఏడాది బాబు ఉన్నాడు. ఈ టైటిల్ తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం...‘‘మధ్యప్రదేశ్‌లో అత్యంత ప్రభావవంత మహిళ ’’గా నిలిచింది. మరుసటి ఏడాది ‘మిసెస్ యురేషియా’ టైటిల్‌ను గెలుచుకుంది. మోడలింగ్‌లో రాణిస్తూనే, పెళ్లి తరువాత ఇంగ్లిష్ సాహిత్యం, మ్యూజిక్‌లో మాస్టర్స్‌తోపాటు, మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎమ్బీఏ, సోషల్ వర్క్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్‌ను పొందింది. గౌను డిజైన్ చేసుకుని.. కరోనా సమయంలో దివ్య తండ్రి మరణించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న కూతుర్ని ఓదార్చే క్రమంలో ఆమె తల్లి రాధా పాటిదార్ ‘ఇవన్నీ మర్చిపోయి, అందాల పోటీలపై మనసుపెట్టు’ అని చెప్పింది. దీంతో తన మూడేళ్ల కొడుకు ఆర్యమన్‌ను చూసుకుంటూనే ఎంబ్రాయిడరీ, మిషన్ కుట్టడం బాగా తెలిసిన దివ్య.. మిసెస్ సెంట్రల్ ఏషియా పోటీలకు వేసుకోవాల్సిన గౌనును తనే స్వయంగా డిజైన్ చేసి కుట్టుకుని దానినే ధరించి, టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఎన్జీవోలను నడుపుతూ... మహిళలు, పిల్లల అభ్యున్నతే లక్ష్యంగా ‘ద గ్రోయింగ్ వరల్డ్ ఫౌండేషన్, ద గ్రోయింగ్ ఇండియా ఫౌండేషన్’ల పేరిట దివ్య ఎన్జీవోలను నడుపుతోంది. ఇవేగాక ఇతర ఎన్జీవోలతో కలిసి సామాజిక సేవ చేస్తోంది. బాలికల విద్యపై వివిధ కార్యక్రమాలు చేపడతూ బాలికల్లో అవగాహన కల్పించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తోంది. పదకొండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికోసం పనిచేస్తోంది. గృహహింసపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల్లో ధైర్యం నింపుతోంది. ఇవేగాక వివిధ రకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా, రత్లాం మున్సిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛభారత్ మిషన్’కు అంబాసిడర్‌గా పనిచేస్తోంది. ఇన్ని కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ తన కొడుకుని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తోంది. వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగడంతోపాటు, ఎన్నోవిజయాలు సాధిస్తూనే, సామాజికసేవలోనూ ముందుండి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది దివ్య. నమ్మకం ఉంటే రోజూ అద్భుతమే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వారిలో అమ్మ తొలివ్యక్తి. ఆమెకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎవరైనా తమ కలలను నిజం చేసుకునేందుకు కనిపించే ప్రతిదారిలో వెళ్లవచ్చు. కానీ ఆ దారి ఇతరులెవరికి హాని చేయనిదై ఉండాలి. దేనిని ప్రతిబంధకంగా భావించకూడదు. అది జీవితంలో ఒక భాగం. ఇక్కడ అందరం విద్యార్థులమే. మొదట మనం నేర్చుకుని తరువాత మనమే ఇతరులకు టీచర్లుగా మారి నేర్చుకున్నది పాఠాలుగా చెప్పగలగాలి. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నమ్మకం ఉన్నప్పుడు ప్రతిరోజూ అద్భుతాలు చూడగలుగుతాము. – డాక్టర్ దివ్యాపాటిదార్ జోషి. -
అందంగా లేమా.. అసలేం బాలేమా!
హొయలుపోతూ వయ్యారపు నడక... అదిరేటి అధరాలు.. పొడవాటి మెడ.. నిగనిగలాడే మేని ఛాయ... అందానికి తగ్గ శరీర సౌష్టవం... ఇంకేం, న్యాయ నిర్ణేతలు ముగ్ధులయ్యారు. అంతటి సౌందర్యరాశిని ఈ ఏటి అందాల పోటీ విజేతగా ప్రకటించేశారు. ప్రైజ్‌మనీ కింద భారీ మొత్తం సైతం ముట్టజెప్పారు. ఇంతకీ ఆ కుందనపు బొమ్మ ఎవరో తెలుసా.. ఒక ఒంటె! అవాక్కయ్యారా.. పైన చెప్పిన ఆ వర్ణన అంతా దాని అందం గురించే..! ఈ పోటీ ప్రత్యేకతలు, విజేతగా ఆ ఒంటె ఎంపిక వెనక సాగిన తతంగం ఏమిటో తెలుసుకుందామా? ఎక్స్‌రేలతో తనిఖీలు... ఖతార్‌లోని అల్ షహనియా నగరంలో ఇటీవల జరిగిన ఒంటెల అందాల పోటీలో మంగియ గుఫ్రాన్ అనే ఒంటె విజేతగా నిలిచింది. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈల నుంచి వచ్చిన వేలాది ఒంటెలతో పోటీపడుతూ వివిధ వడపోతలను దాటుకొని మరీ ట్రోఫీ సాధించింది. అయితే ఈ విజయం దానికి ఊరికే ఏమీ దక్కలేదు. ఇందుకోసం అది ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఎక్స్‌రేల ద్వారా వెటర్నరీ వైద్యులు ఒంటె శరీరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కృత్రిమంగా అందాన్ని మెరుగుపరిచే బ్యూటీ సర్జరీలు ఏమైనా చేశారా అనే విషయాన్ని తేల్చేందుకు ఈ పరీక్ష చేపట్టారు. ఎందుకంటే... సౌదీ అరేబియాలో ఇటీవల నిర్వహించిన అందాల పోటీలో తమ ఒంటెలు అందంగా కనపడేందుకు కొందరు యజమానులు వాటికి బొటాక్స్ ఇంజెక్షన్లు ఇవ్వడంతోపాటు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించారు. ఆ పోటీలో వారి ఒంటెలు గెలిస్తే అప్పనంగా భారీ నజరానా కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. అయితే ఈ విషయం చివరి నిమిషంలో బయటపడటంతో 43 ఒంటెలను అక్కడి నిర్వాహకులు పోటీల నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఖతార్‌లో ఒంటెల అందాల పోటీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. ఈ పరీక్షలో మంగియ గుఫ్రాన్ సులువుగానే గట్టెక్కింది. ఇక ఆ తర్వాత... ఒంటెల అందానికి కొలమానాలుగా పరిగణనలోకి తీసుకొనే తల సైజు, మెడ పొడవు, వీపుపై మూపురం ఉండాల్సిన ప్రదేశం, పెదవుల అందం వంటి కొలతల లెక్కల్లోనూ పాసైంది. భారీ నజరానా... మంగియ గుఫ్రాన్ న్యాయ నిర్ణేతలను మెప్పించడంతో నిర్వాహకులు దాన్ని ఈ అందాల పోటీ విజేతగా ప్రకటించారు. ఒంటె యజమాని ఫాహెద్ ఫర్జ్ అల్గుఫ్రానీకి 10 లక్షల ఖతారీ రియాళ్ల (సుమారు రూ. 2.10 కోట్లు) చెక్కును అందించారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నమైన ఒంటెలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫుట్‌బాల్, ఫార్ములా వన్ వంటి క్రేజ్ ఉన్న టోర్నమెంట్లకు దీటుగా ప్రజామద్దతు కూడగట్టేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలిరావడంతో తమ ఉద్దేశం నెరవేరిందని చెప్పారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
Banjara Hills: మిసెస్ ఇండియాగా డాక్టర్ మతీన్
బంజారాహిల్స్: నగరానికి చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ మతీన్ అస్రార్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన అందాల పోటీల్లో డాక్టర్ మతీన్ రెండు విభాగాల్లో పతకాలను సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తిచేసిన డాక్టర్ మతీన్ ప్రస్తుతం నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా వన్ ఇన్ ఏ మిలియన్ క్లాసిక్ విభాగంలో పాల్గొన్న డాక్టర్ మతీన్ బ్యూటీ విత్ బ్రెయిన్, ఇంటర్నేషనల్ ఐకాన్ కేటగిరీలలో విజేత గా నిలిచారు. డాక్టర్ మతీన్ జూబ్లీహిల్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైద్యురాలైనా ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పోటీల్లో 103 మంది పాల్గొన్నారని తాను రెండు కేటగిరీలలో విజేతగా నిలవడం సంతోషంగా ఉంది అని అన్నారు. (చదవండి: ఉత్సాహంగా బర్డ్ వాక్ ఫెస్టివల్) -
బాప్రే!...ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!!
Camels get disqualified: ఇటివల కాలంలో మంచి శరీరాకృతికోసం సెలబ్రిటీలు, ప్రముఖులు, అందాల పోటీల్లో పాల్లోనేవారు రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడటం గురించి ఉన్నాం. అంతెందుకు మంచి శారీరక ధారుడ్యం కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి కటకటాల పాలైన వాళ్ల గురించి కూడా విని ఉన్నాం. కానీ అచ్చం అదే తరహాలో సౌదీఅరేబియన్ వాసులు జంతువుల అందంగా ఆకర్షణీయంగా ఉండట కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి వాటిని హింసకు గురి చేశారు. (చదవండి: బిపిన్ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!) అసలు విషయంలోకెళ్లితే...సౌదీ రాజధాని రియాద్‌కు ఈశాన్యంలో ప్రసిద్ధ కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ఏటా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అంతే కాదు ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు రూ. 500 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చి సత్కరిస్తుంది. అయితే నిర్వాహకులు ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఫేస్ లిఫ్ట్‌లు వంటి ఇతర సౌందర్య సాధనాలను వినియోగించుకూడదనే ఒక నియమం విధించారు. ఈ మేరకు ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఒంటెల పోటీల్లో మోసపూరిత చర్యలను అరికట్టే నిమిత్తం అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. దీంతో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు. చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లు నిర్వాహకులు గుర్తించి ఆయా ఒంటెలకు అనర్హత వేటు విధించడమే కాక పెంపకందారులకు కఠిన జరిమాన కూడా విధించినున్నట్లు తెలిపారు. (చదవండి: పక్షిలా షి‘కారు’) -
కిరీటం పై కిరి కిరి
-
నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తోంది
బెంగళూరు: సౌందర్య ఉత్పాదనలు జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేస్తారని తెలుసుకున్న సబ్రినా మొదట ఆశ్చర్యపోయింది. అందాన్ని పెంచే సుగుణాలు గల ఔషద మొక్కలు ఉంటే జంతువులకు హాని కలిగించే అవసరం ఏమిటి అని ఆలోచించింది. దీంతో సౌందర్య ఉత్పాదనల్లో మొక్కల గురించి పరిశోధనలు చేసింది. వేగన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చి, నెలకు 4 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. సబ్రినా సుహైల్ బెంగళూరు వాసి. మేకప్ ఆరిస్ట్‌గా15 ఏళ్ల అనుభవం ఉంది. మేకప్‌లో వాడే ఉత్పాదనల గురించి ఆమెకు ఎప్పుడూ సందేహం రాలేదు. అయితే, ఏడేళ్ల క్రితం ఓ రోజు సౌందర్య ఉత్పాదనల్లో జంతువుల నుంచి తీసిన కొవ్వులను ఉపయోగిస్తారని తెలుసుకుంది. అందాన్ని పెంచే ఎన్నో రకాల ఔషధ మొక్కలు భూమి మీద ఉండగా జంతువులకు హాని కలిగించడం ఎందుకు అనుకుంది. అందుకు తను చదివి కెమిస్ట్రీ, వృక్షశాస్త్ర అధ్యయనాలు ఆమెకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ పరిశోధనల తర్వాత 2014లో కాస్మెటిక్ బ్రాండ్ ‘టిన్జ్’ పేరుతో బెంగుళూరులో బ్యూటీ ప్రొడక్ట్స్ స్టార్టప్ ప్రారంభించింది. మొదటి మూడేళ్లలో క్లీన్ బ్యూటీ ఉత్పత్తులపై మరింతగా పరిశోధనలు చేసి వ్యాపారం కోసం లైసెన్స్ పొందింది. 2018 లో అధికారికంగా నమోదు అయిన తరువాత, కస్టమర్ డిమాండ్ మేరకు సబ్రినా తన సౌందర్య ఉత్పత్తులలో నచ్చిన రంగు, సువాసనను వారే ఎంచుకునే మార్పులు కూడా తెచ్చింది. ఈ ఉత్పత్తులు కస్టమర్ ముందే తయారు చేయడం ప్రారంభించింది. ఒక దానిని అమ్మిన తర్వాత మరొక కస్టమర్ కోసం కొత్త ప్రొడక్ట్‌ని తయారుచేస్తుంది. ఈ విధంగా సబ్రినా స్టార్ట్ అప్ భారీ శ్రేణి వేగన్ ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో వేగన్ లిప్ బామ్, లిప్ స్టిక్, ఫౌండేషన్, కన్సీలర్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు తన బ్యూటీ ప్రొడక్ట్స్ ద్వారా ప్రతి నెలా 4 లక్షల రూపాయలను సంపాదిస్తుంది. 2018 – 2020 మధ్య ఆమె బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారం 40 శాతం పెరిగింది. పాదాలను లాక్ చేద్దాం ఇంటికి తాళం వేయడం తెలుసు. కానీ, పాదాలకు లాక్ వేయడం ఏంటి అనేదేగా మీ సందేహం. ఇక్కడ ఫుట్ వేర్ చూస్తుంటే ఇట్టే అర్ధమైపోతుంది. చెప్పులకు లాక్ మోడల్స్ జత చేసి, ఇలా విభిన్నంగా డిజైన్ చేశారు. కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నామని చెప్పడానికి అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు లాక్ స్టైల్ మోడల్ ఫుట్‌వేర్‌తో మన చూపుల్ని లాక్ చేస్తున్నారు. అమ్మాయిల ఫుట్ వేర్లో ఎక్కువగా హైహీల్స్, శాండల్స్కి లాక్స్ ఉంటే అబ్బాయిల ఫుట్‌వేర్‌లో ప్లిప్ ఫ్లాప్స్, లెదర్ షూస్‌కి ఈ డిజైన్స్ కనువిందు చేస్తున్నాయి. కళల కలంకారీ కలంకారీ ఫ్యాబ్రిక్ గురించి, ఆ ఆర్ట్ వర్క్ గురించి మనకు తెలిసిందే. నెమళ్లు, ఏనుగులు, బుద్ధుని రూపాలు, అమ్మవారి కళారూపం.. అన్నీ పెన్‌కలంకారీ కళ సొంతం. కలంకారీ చీరలైనా, డ్రెస్సులైనా ఒంటికి, కంటికి హాయినిస్తాయి. వాటిని ధరించిన వారిని అందంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి. అందుకే, ఆభరణాల నిపుణులు ఈ కలంకారీ ఫ్యాబ్రిక్‌ను కూడా పట్టేసుకున్నారు. ఆభరణాలుగా రూపుకట్టేసుకున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఆకర్షణీయంగా డిజైన్ చేసి, చూపులను కొల్లగొట్టేస్తున్నారు. ఖాదీ, కాటన్ ఫ్యాబ్రిక్ డ్రెస్సులైనా, చీరల మీదకైనా ఎంతో అందంగా ప్రత్యేకంగా కనువిందు చేస్తున్న ఈ కలంకారీ ఆభరణాలు చెవి బుట్టలుగా, జూకాలుగా, మెడలో హారాలుగా, చేతి గాజులుగా అమరాయి. మువ్వలు, గవ్వలు, ఆక్సిడైజ్డ్ సిల్వర్.. ఇలా ఏ లోహంతో కలిసినా కలంకారీ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. వర్క్, డిజైన్ బట్టి ఇవి రూ.300/– నుంచి ధర పలుకుతున్నాయి. -
కాన్ఫిడెన్సే కిరీటం
‘మీకు ఒక అద్భుత శక్తి వచ్చి... చరిత్ర నుంచి ఎవరినైనా వెనక్కు తీసుకురావచ్చు అంటే మీరెవరిని తెస్తారు?’.. ఇది మహిళల అందాల పోటీలో ఒక కంటెస్టెంట్‌గా స్వప్నకు ఎదురైన ప్రశ్న. అందుకు ఈమె ఇచ్చిన సమాధానమే ఆమెను విజేతను చేసింది. ఈవారం మనకు ఆమె ‘పరిచయం’ అయ్యేలా చేసింది. ‘‘ప్రతి మనిషిలోనూ వారికంటూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఒక వ్యక్తిని గొప్ప అని, మరొకరిని గొప్పకాదు అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికీ ఓ చరిత్ర ఉంటుంది. చారిత్రక వ్యక్తులంటూ కొందరికే గౌరవం ఇవ్వడం సరికాదు. ఏ వ్యక్తి అయినా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఒక ఇల్లు బాగుండాలంటే అందుకు తల్లి ప్రధానం. నేనైతే.. తల్లులు లేని ఇళ్లను వెతికి వాళ్లకు వారి తల్లులను తిరిగి తెచ్చిస్తాను. సమాజానికి దారి చూపే ప్రతి నాయకుడూ ఒక తల్లి తీర్చిదిద్ది్దన బిడ్డే. తల్లి బాగుంటే ప్రతి ఇల్లూ సమాజానికి ఒక లీడర్నిస్తుంది’’.. ఇది అందాల పోటీలో స్వప్న సమాధానం. ఏడేళ్ల కిందట దూరమైన తల్లిని తలుచుకుంటూ ఇచ్చిన సమాధానం. ఈ సమాధానమే ఆమెను ‘డ్యాజిల్ మిసెస్ ఇండియా వరల్డ్ 2019 ఎలీట్’ పోటీల్లో విజేతగా నిలిపింది. ఈ పోటీల్లో సెకండ్ రన్నర్ అప్ కిరీటం ధరించిన స్వప్న కోరిప తన విజయ ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. అందానికి భాష్యం రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్‌లో గత నవంబర్ తొమ్మిదవ తేదీన జరిగిన మిసెస్ బ్యూటీ కాంటెస్ట్‌లో మిసెస్ బ్యూటీ రన్నర్ అప్ కిరీటాన్ని ధరించారు స్వప్న. అందం అంటే ముఖానికి మెరుగులు దిద్దుకునే మేకప్పులు కాదని, మహిళల దేహాకృతి– కొలతలు కాదని, ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని అందానికి భాష్యం చెప్పారామె. ‘‘అందంతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా తోటి వారితో వ్యవహరించే తీరు, ఒక అంశం మీద స్పందించే వైఖరి ఆధారంగా సాగే పోటీలివి. మనిషి లోపల భయం, ధైర్యం, అంతర్మధనం, అపరాధభావం, ఆత్మవిశ్వాసం వంటివన్నీ నడకలో ప్రతిబింబిస్తాయి. ముఖంలో ప్రతిఫలిస్తాయి. అందుకే అడుగు తీసి అడుగు వేయడం నుంచి, ముఖ కవళికల వరకు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇవన్నీ ద్వితీయాంశాలే. అసలైన పోటీ మన ఆలోచన తీరుదే. ఒక ప్రశ్నకు మనం ఏ సమాధానం చెప్పినా అది తప్పు కాదు. ఆ సమాధానంలో మన ఆలోచన తీరు వ్యక్తమవుతుంది. ఏ ప్రశ్నకూ ‘అవును, కాదు’ అనే పొడి సమాధానాలివ్వకూడదు. మన సమాధానంలో ఒక రీజనింగ్ ఉండి తీరాలి. ఆ సమాధానాన్ని విశ్లేషించి మార్కులు వేస్తారు’’ అని వివరించారు స్వప్న. స్నేహపూర్వక పోటీ ‘‘మహిళలోని పరిపూర్ణత్వానికి ఈ పోటీ ఒక గీటురాయిగా ఉంటుందే తప్ప పోటీలో పాల్గొన్న వారి మధ్య పోటీతత్వం కనిపించదు. సాధారణంగా కనిపించే ఈర్ష్య, అసూయలు కూడా లేకుండా చాలా స్నేహపూర్వకంగా ఉంటారని తెలుసుకున్నాను’’ అన్నారు స్వప్న. ఆమె రాజస్థాన్‌లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నేను వేసుకున్న గాజు నా చీరకు సరిగ్గా మ్యాచ్ అవలేదు. మా పోటీలు జరిగిన రిసార్ట్ పుష్కర్ నగరానికి దూరంగా విసిరేసినట్లు ఉంది. ఏదైనా ఒక వస్తువు మర్చిపోతే బజారుకెళ్లి తెచ్చుకుందాం అనుకోవడానికి వీల్లేదు. దాంతో నా దగ్గర ఉన్న గాజునే వేసుకున్నాను. అది చూసి అస్సాం నుంచి వచ్చి న‘మరోమి’ తన దగ్గరున్న బ్యాంగిల్ ఇచ్చింది. ఆ గాజు వేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. ఈ పోటీల్లో ఉండే వాళ్లందరూ బిడ్డల తల్లులే కావడంతోనే షేరింగ్, పరిణితి సాధ్యమైందనిపించింది. పోటీలకు వెళ్లేటప్పుడు తెలియలేదు, కానీ పోటీల అనుభవమే నాలో పరిపూర్ణత తెచ్చిందనిపిస్తోంది’’ అన్నారు స్వప్న. ‘మార్గదర్శక్’ విస్తృతం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్వహించే ట్రాఫిక్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ శిక్షణ తరగతుల్లో ‘ఉమెన్ సేఫ్టీ’ విభాగంలో ఆరువారాల పాటు శిక్షణ పొందారు స్వప్న. ఈ శిక్షణ పొందిన వారికి పోలీస్ డిపార్ట్మెంట్ ‘మార్గదర్శక్’ సర్టిఫికేట్ ఇస్తుంది. గృహహింసకు గురవుతున్న బాధిత మహిళలకు ఆలంబనగా ఉంటూ వారికి చట్టాల గురించి అవగాహన కల్పించడం, వారి అవసరాన్ని బట్టి షీ టీమ్స్, భరోసా సెంటర్ల ద్వారా మార్గనిర్దేశనం చేయడమే మార్గదర్శక్ ప్రధాన విధులు. మిసెస్ బ్యూటీ విజయంతో వచ్చిన గుర్తింపును మార్గదర్శక్ సేవలను విస్తృతం చేయడానికి వినియోగించుకుంటానని చెప్పారు స్వప్న. ‘‘అమ్మ పోయిన తర్వాత ఏర్పడిన వెలితిని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న అనాథ శరణాలయం భర్తీ చేసింది. మా పాప పుట్టిన రోజు, అమ్మ పోయిన రోజుల్లో ఆ పిల్లల మధ్యనే గడుపుతున్నాను. వారికి బియ్యం, పుస్తకాలు, స్కూలు బ్యాగ్‌లు ఇవ్వడం వంటి చేతనైన సహాయం చేస్తున్నాను. ఈ చిన్న పనిలో ఎంత సంతోషం పొందుతున్నానో, బాధిత ఆడవాళ్లకు అండగా నిలవడం కూడా సంతోషం కలుగుతోంది’’ అన్నారు. బిర్యానీ ల్యాండ్ ఈ కాంటెస్ట్‌లో మరో ముఖ్యమైన విషయం తమను తాము ఆవిష్కరించుకోవడం. సౌత్ ఇండియా కిరీటం గెలుచుకుని జాతీయ పోటీలకు హాజరైన స్వప్న ‘‘మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్న నేను ‘ల్యాండ్ ఆఫ్ బిర్యానీ’ నుంచి వచ్చాన’’ని చెప్పగానే 22 మంది పార్టిసిపెంట్స్, ఆహుతులు ‘హైదరాబాద్, బిర్యానీ’ అని అరిచారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం హైదరాబాద్‌లోనే. కానీ ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో ఉన్నాయి. ‘‘తాత కోరిప అంకయ్య, నానమ్మ రమణమ్మ. మా చిన్నాన్న, పెద్దనాన్నలు ఆ ఊరిలో ఉన్నారు. నాన్నకు బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం కారణంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మా తాత జ్ఞాపకంగా మా ఊరిలో ఏదైనా చేయాలనుంది. చేసి తీరుతాను’’ అని స్వప్న ఆత్మవిశ్వాసంతో చెప్పారు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: దేవేంద్రనాథ్ ఇసుకపట్ల కూతురే కాంటెస్ట్‌కి పంపింది! ఇంటర్ చదివే కూతుర్ని బ్యూటీ కాంటెస్ట్‌కి సిద్ధం చేయకుండా, 38 ఏళ్ల వయసులో తాను పాల్గొనడానికి వెనుక ఉన్న కారణాన్ని వివరించారు స్వప్న. ‘‘2008లో ఒక షోరూమ్ వాళ్లు చీరలకు మోడలింగ్ చేస్తారా... అని అడిగారు. చేయాలని చాలా ఉత్సాహంగా ఉండింది. కానీ మా పేరెంట్స్ వద్దన్నారు. అప్పటికి నేను పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికి బయటపడి, అమ్మానాన్నల దగ్గర ఉన్నాను. నా భర్త వేధింపుల నుంచి నన్ను కాపాడుకోవడం కోసం మా అమ్మానాన్నలు కంటి మీద కునుకులేకుండా ఉన్న రోజులవి. వాళ్లు వద్దనడానికి అదీ ఒక కారణమే. ఈ మధ్య ఓ రోజు మా అమ్మాయితో ఆ మాట చెప్పాను. అప్పటి నుంచి తను ఎలాగైనా నన్ను మోడలింగ్‌లోకి తీసుకురావాలని ప్రయత్నించింది. అయితే ఈ కాలంలో మోడలింగ్ రంగంలోకి రావాలంటే అంతకంటే ముందు ఏదో ఒక గుర్తింపు ఉండాలని తెలిసి నన్ను బ్యూటీ కాంటెస్ట్‌కి పంపించింది. మా అమ్మాయికి ఊహ తెలిసినప్పటి నుంచి తను నా కన్నీళ్లను, కష్టాలను మాత్రమే చూసింది. రెండు–మూడేళ్ల నుంచి అప్పులు తీరి జీవితం గాడిన పడింది. నా ముఖంలో ఇంకా ఇంకా సంతోషం చూడాలని పట్టుపట్టి తను ఈ పని చేసింది. -
బ్యూటిఫుల్ ఫ్యామిలీ
అందం అంటే తెల్లటి మేను.. కొలతల ఆకృతి కాదు.. అందం అంటే అంతులేని ఆత్మవిశ్వాసమే అని మొన్న విశ్వసుందరిగా నిలిచిన జొజొబిని తుంజీ నిరూపించింది. అసంపూర్ణతలు అవకాశాలను అడ్డుకోలేవు.. వైకల్యాలు పరిధిని నిర్ణయించలేవు అని చాటారు అపర్ణ క్రోవి.. ఆమె ఇద్దరు కూతుళ్లు షీతల్, శ్రీనిధి! జొజొబిని తుంజి ఘనతకు వీళ్ల విజయానికి సంబంధం ఏంటీ? వీళ్లూ గెలుపొందింది బ్యూటీకాంటెస్ట్‌లోనే! అపర్ణ క్రోవి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్నారు. భర్త వ్యాపారవేత్త. ముగ్గురు పిల్లలు షీతల్, శ్రీనిధి, సుహాస్. పెద్దమ్మాయి షీతల్ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. రెండో అమ్మాయి, అబ్బాయి కవలలు. టెన్త్‌క్లాస్‌లో ఉన్నారు. అపర్ణా, తన ఇద్దరు కూతుళ్లు ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ‘‘మిస్ భారత్ యూఎస్ఏ 2019’’ అందాల పోటీల్లో పాల్గొని ముగ్గురూ టైటిల్స్ గెలుచుకున్నారు. ‘‘మిస్ భారత్ యూఎస్ఏ 2019’’గా షీతల్, ‘‘మిసెస్ భారత్ ఫస్ట్ రన్నరప్’’గా 39 ఏళ్ల అపర్ణ, ఇండియా నెక్ట్స్ టాప్ మోడల్‌గా శ్రీనిధి విజేతలయ్యారు. ఒక పోటీలో తల్లీకూతుళ్లు గెలుపొందడం అరుదే. ఈ అచీవ్మెంట్ ఈ ముగ్గురికీ ప్రత్యేకం అనడానికి ఇదొక్కటే కారణం కాదు. దీని వెనక ఈ ముగ్గురికీ ఒకే రకమైన స్ట్రగుల్ ఉండడం కూడా! కన్నుమూసి తెరిచేలోగా తలకిందులు.. అయిదేళ్ల కిందటిదాకా ఆనందంగా ఉంది అపర్ణ కుటుంబం. 2015 కొత్త సంవత్సరం వేడుక వాళ్ల జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ యేడు న్యూ ఇయర్‌ను జైపూర్‌లో జరుపుకుందామనుకున్నారు.ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాణాసంచా పేలి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపర్ణ, షీతల్, శ్రీనిధిలకి గాయాలయ్యాయి. చికిత్స కోసం వాళ్లు తిరగని దేశం లేదు. గాయాలకన్నా కాలిన మచ్చలతో ఉన్న తమను చూసే చూపులే ఎక్కువ బాధించాయి అంటారు అపర్ణ. ‘‘పిల్లలు కుంగిపోకుండా ఉండాలంటే ముందు నేను ధైర్యం కూడగట్టుకోవాలి. దానికి ఆ మచ్చలనే ప్రేరణగా తీసుకున్నా. మేము మేముగా నిలబడాలి. ఆ గుర్తింపు మాకు కావాలి అని తపన మొదలైంది. దానికి అందాల పోటీలను ఎందుకు వేదికగా మలచుకోకూడదు అనిపించింది. అందుకే ధైర్యాన్నే ఆయుధంగా చేసుకున్నా. పిల్లల్నీ ట్రైన్ చేశా. మొన్న జరిగిన ‘‘మిస్ భారత్ యూఎస్ఏ 2019’’కి దరఖాస్తు చేశాం. గెలిచాం’’ అని చెప్తారు అపర్ణ మునుపటి ఆనందాన్ని సొంతం చేసుకున్న విశ్వాసంతో. ఫుడ్ బ్లాగర్.. అపర్ణకు పందొమ్మిదేళ్లకు పెళ్లయింది. ఇరవై ఏళ్లు గృహిణిగానే సాగింది. ఆమె రచయిత, స్టోరీ టెల్లర్, మారథాన్ రన్నర్, ఫుడ్ బ్లాగర్ కూడా. ఇవన్నీ అగ్నిప్రమాదం అయిన తర్వాత సాధించినవే. ఈ కలలన్నీ ముందునుంచే ఉన్నా పెళ్లి, పిల్లలతో కొంతకాలం, ఫైర్ యాక్సిడెంట్‌తో మరి కొంతకాలం వెనకబడ్డాయి. ఇప్పుడు అన్నింటిలో రాణిస్తోంది. ‘‘కలలు అంటూ ఉంటే ఎప్పుడైనా సాధించవచ్చు. టైమ్ లిమిట్ ఉండదు. కావల్సిందల్లా మన మీద మనకు నమ్మకం, సామర్థ్యం, పట్టుదల అంతే! ఏ వైకల్యమూ మన అవకాశాలను కుదించలేదు’’ అంటుంది అపర్ణ. ఆమె కూతుళ్లూ అంతే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. పెద్దమ్మాయి షీతల్ ఫ్యాషన్ డిజైనర్‌గా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటుందట. ఈ విజయం ఆ ప్రయాణాన్ని మరింత సులువు చేసింది అంటుంది షీతల్. సానుకూల దృక్పథం ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదిస్తుంది.. కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది అనడానికి ఈ కుటుంబమే మంచి ఉదాహరణ. -
అందం..అరవిందం
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు పలు చోట్ల ఆడిషన్స్ జరిగిన 5వ మిస్ ఆసియా గ్లోబల్ అందాల పోటీల ఫైనల్స్ శుక్రవారం (నవంబర్ 1న) జరగనున్నాయని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న గోకులమ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయని, దీనిలో ప్రపంచవ్యాప్తంగా 26మంది ఫైనలిస్ట్‌లు పోటీ పడుతున్నారని వివరించారు. మలేషియా పర్యాటక మంత్రి ఈ ఈవెంట్‌కి అతిథిగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. -
మన నమ్మకమే మన విజయం
ఈ అచ్చ తెలుగు అమ్మాయి చెన్నైలోనే కాదు, అందాల పోటీల్లోనూ ఒక సంచలనం. మిస్ సౌత్ ఇండియా.. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా అందాల పోటీల్లో అదరగొట్టి ఇప్పుడు గ్లోబల్ టైటిల్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. ‘‘అసలే మొండిదాన్ని.. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోను’’ అంటోంది అక్షర. కుటుంబ నేపథ్యం నాన్న సుధాకర్ రెడ్డి. అమ్మ గౌరి. చెన్నైలో స్థిరపడిన కుటుంబం. నన్ను ఇంట్లో ముద్దుగా గుగ్గుపాప అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచే బ్యూటీ కాంటెస్ట్‌లపై ఎక్కువ ఆసక్తి ఉండేది. 2011లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నాను. 2016లో మిస్ అమరావతి పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించా. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 పోటీల్లో విజేతగా నిలిచా. ఈ టైటిల్‌కు 22 రాష్ట్రాలకు చెందిన 240 మంది పోటీపడ్డారు. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా తర్వాత దుబాయ్‌లో జరిగే మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీలకు భారత్ తరఫున సిద్ధమౌతున్నా. అక్టోబర్‌లో జరిగే ఈ పోటీలలో 45 దేశాలకు చెందిన యువతులు పాల్గొంటారు. భారత్ తరఫున ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనాలన్నది నా కల. మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ ద్వారా అది నెరవేరుతుండటం సంతోషంగా ఉంది. ప్రపంచ అందాల పోటీల్లో భారత ప్రతిష్టను మరింత పెంచాలన్నదే నా లక్ష్యం. దుబాయ్‌లో జరిగే పోటీల కోసం అందానికి మరిన్ని మెరుగులద్దుకోవడంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్పై దృష్టి సారించా. మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీలో పాల్గొనే మిగతా కంటెస్టెంట్లను వెనక్కినెట్టి టైటిల్ తీసుకువస్తానన్న నమ్మకం నాకుంది. జీరోసైజు వద్దేవద్దు ఫ్యాషన్ రంగంపై మోజుతో వచ్చే యువతకు నాదొకటే సలహా. మోడల్ కావాలనే ఆశతో డైటింగ్ అంటూ ఎక్సర్ సైజులతో జీరోసైజ్ కోసం ప్రయత్నిస్తారు. అవన్నీ అవసరం లేదు. మీ శరీరాకృతిపై మీ కంట్రోల్ ఉంటే చాలు. మరీ చబ్బీగా కాకుండా హెల్దీగా ఉంటే చాలు. అపనమ్మకాన్ని వదిలేయండి. మనలోని ప్లస్‌లు మైనస్‌లు బేరీజు వేసుకుని మన నుండి నెగిటివ్ థాట్స్ తీసేస్తే చాలు.. ఏ పోటీలోనైనా విజయం సాధ్యమే. నేను అలాగే ఉంటా. మీపై మీ నమ్మకమే విజయానికి చేరువ చేస్తుంది. నా రోల్ మోడల్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగటం నాపై నాకు బలమైన నమ్మకం ఏర్పడేలా చేసింది. మిస్ ఇండియా సౌత్ కు ముందు తమిళ్లో ఓ చానెల్‌కు చేసిన ‘విల్లా టు విలేజ్’ అనే కార్యక్రమం.. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసానికి దోహదపడింది. అంతేకాదు.. ఆ కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడైతే వెండితెర అవకాశాలు కూడా వస్తున్నాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరుతో తీసిన షార్ట్ ఫిలిమ్ ఇప్పుడు యూట్యూబ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. తమిళంలో రెండు సినిమాలకు సంతకాలు చేశా. అవి ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాయి. నా అభిమాన హీరో అజిత్ కుమార్. ఆయనతో ఒక్క చిత్రంలోనైనా నటించాలనుంది. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. కానీ.. ప్రపంచ పోటీలపై దృష్టి పెట్టా. టైటిల్ సాధించాక భవిష్యత్తు గురించి ఆలోచిస్తా’’ అని ముగించింది అక్షర. సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షీటీవీ, చెన్నై -
టాలీవుడ్‌కి మిస్ యూఎస్ఏ
బ్యూటీ కాంటెస్టుల్లో గెలిచిన భామలు హీరోయిన్లుగా సినిమాల్లో ఎంపిక కావడం గతంలో చాలాసార్లు చూశాం. సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్, ప్రియంకా చోప్రా వంటి తారలు ముందు అందాల పోటీల్లో పాల్గొని, లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చారు. లేటెస్ట్గా జో శర్మ (జ్యోత్స ్న) ఈ లిస్ట్‌లో జాయిన్ కాబోతున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన యూఎస్ఏ ఇంటర్నేషనల్ బ్యూటీ అండ్ టాలెంట్ కాంటెస్ట్ 2019 విజేతగా నిలిచారు జో శర్మ. 15 దేశాలకు చెందిన 15 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. అందం, ప్రతిభ, నృత్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ స్పీచులు.. ఇలా అన్నింటి ఆధారంగా విజేతను నిర్ణయించారు. అన్నింటిలోనూ జో శర్మ తన ప్రతిభ కనబర్చి, ‘మిస్ యూఎస్ఏ’ టైటిల్ గెలిచారు. త్వరలో ఆమె టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. ప్రస్తుతం ‘లవ్ 2020’ చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాత మోహన్ వడ్లపాటి త్వరలో రూపొందించబోయే మరో చిత్రం ద్వారా జో శర్మను హీరోయిన్గా పరిచయం చేయనున్నారు. -
కోడి గుడ్డు రూ.వెయ్యి.. కోడి పిల్లల జత 10 వేలు
పందేనికి ఓ పుంజు కావాలి.. అయితే చలో కంభం! కంభంలో కోళ్లు అంత బాగుంటాయా? ఒకసారి చూస్తే కదా తెలిసేది!! అవును కంభంలో కోళ్లు ఫేమస్సే!! కోళ్లే కాదు.. పావురాలు, జాతి శునకాలు కూడా. ఇక్కడ లభించే కోడి గుడ్లు, కోడి పిల్లల కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి క్యూ కడుతున్నారు మరి. ఇంతకీ కంభంలో కోళ్లు పెంచుతోంది ఎవరు? గుడ్డు రేటెంత? పిల్లలైతే ఎంత ధర? ఆ వివరాలు తెలుసుకుందాం కథనంలోకి పదండి.. ప్రకాశం, కంభం: కంభం పట్టణానికి చెందిన చిలకచర్ల కృష్ణామాచారి ఐటీఐ చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు. 1989లో ఇంట్లో సరదాగా రెండు కోళ్లను పెంచుకునేవాడు. అది కాస్తా అతనికి వ్యాపకంగా మారి.. చిరు వ్యాపారంగా రూపాంతరం చెందింది. అదే వృత్తిగా మలుచుకున్న కృష్ణమాచారి 1994లో తన ఇంటి వద్ద షెడ్లు వేసి కోళ్లను పెంచడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో రకాల కోళ్లను పెంచడమే కాకుండా, పలు రాష్ట్రాల్లో నిర్వహించే కోళ్ల అందాల పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, పతకాలు సాధించి కంభం పేరును దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. కోళ్ల కోసం ప్రత్యేక దాణా.. పెట్టలకు సజ్జలు, మొక్కజొన్న, రాగులు, సోయా చిక్కుడు, శనగలు, పొద్దుతిరుగుడు, తవుడు, నూక మిశ్రమాలను ఆహారంగా అందిస్తారు. పుంజులకు ఉదయం బాదం పప్పు, ద్రాక్ష, ఖర్జూరాలు, శనగపప్పు, సాయంత్ర 5–6 గంటల సమయంలో సజ్జలు, రాగులు 4 గంటలు నానబెట్టి పెడతారు. వెటర్నరీ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కోళ్లకు ఆహారం తినిపిస్తూ.. గుడ్డు రూ.1,000 ఒక పెట్ట ఏడాదికి నాలుగుసార్లు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను ఆ కోడి ద్వారానే పొదిగించి పిల్లలను విక్రయిస్తారు. పుంజులు 4 నుంచి 6.5 కిలోల బరువు, పెట్టలు 3 నుంచి 5 కేజీల బరువు పెరుగుతాయి. గుడ్డు ఒకటి రూ.1,000 కాగా, 40 రోజుల పిల్లల జత రూ.10 వేలు పలుకుతోంది. దుబాయ్, శ్రీలంకతోపాటు, మన దేశంలో ఒడిశా, తమిళనాడు నుంచి కొనుగోలుదారులు కంభం వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారని కృష్ణమాచారి తెలిపారు. ఏటా పెరుగుతున్న ఆదాయం తొలుత నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఆదాయం వచ్చేది. 2000 సంవత్సరంలో రూ.7 వేల వరకు వచ్చాయి. ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి కోళ్లు, గుడ్ల విక్రయం, అందాల పోటీల్లో నగదు బహుమతులు అన్నీ కలిపి 2015 నుంచి ఏడాదికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చింది. 2017 నుంచి ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. అరుదైన ఆశీల్.. భారతదేశంలోనే అరుదైన ఆశీల్ జాతి కోళ్లను కృష్ణమాచారి పెంచుతున్నారు. అందమైన చిలుకలాంటి ముక్కు, నెమలి లాంటి తోకలు, గద్దను తలపించే దేహాదారుఢ్యం.. చూడ చక్కని ఆకృతి అస్లీ జాతి కోళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం చారి వద్ద 20 పెట్టలు, 3 పుంజులు ఉన్నాయి. ఇవి నూరు శాతం నాణ్యమైనవి. వీటి జీవిత కాలం గతంలో తొమ్మిదేళ్లు కాగా ప్రస్తుతం 6 నుంచి 7 సంవత్సరాలు బతుకుతున్నాయి. వీటికి ఎటువంటి జబ్బులు సోకవు. భారతదేశంలోనే అత్యంత అరుదుగా దొరికే ఆశీల్ జాతి కోళ్లను అందాల పోటీల కోసం, ఇంట్లో సరదాగా పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. పావురాలు, కుక్కలు కూడా.. కృష్ణమాచారి కోళ్లతోపాటు అమెరికన్ విత్ ఇంగ్లిష్ క్యారియర్, జర్మన్ బాటిన్, రోమన్, బడంగ్ రేసర్ వంటి అరుదైన జాతి పావురాలను పెంచుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు కర్నూలు, కడప, హైదరాబాద్, ఒంగోలు నుంచి వస్తుంటారు. వీటితోపాటు రెండు డాబర్‌మెన్ కుక్కలు కూడా చారి వద్ద ఉన్నాయి. ‘అరుదైన జాతులను అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో కంభం పట్టణానికి గుర్తింపు తీసుకురావలన్నదే నా ఆశయం. ప్రస్తుతానికి కోళ్ల కోసం దుబాయ్, శ్రీలంకతోపాటు ఇతర దేశాల వారు కూడా సంప్రదిస్తున్నార’ని కృష్ణమాచారి చెబుతున్నారు. అందాల పోటీల్లో కోళ్లు సాధించిన బహుమతులు, దిండిగల్‌లో జరిగిన అందాల పోటీల్లో8 గ్రాముల బంగారు చైన్ గెలుపొందిన పుంజు అందాల పోటీల్లో బహుమతుల పంట కృష్ణమాచారి తన కోళ్లను తీసుకుని పోటీలకు వెళ్లాడంటే బహుమతి సాధించే తిరిగొస్తారు.! 2015లో దిండిగల్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో ఒక సారి ప్రథమ, మరోసారి తృతీయ బహుమతి సాధించారు. ఈ ఏడాది ఆలిండాయా ఆశీల్ క్లబ్, ఇండియా ఆశీల్ క్లబ్, ఓఏటీ క్లబ్‌ల ఆధ్వర్యంలో జనవరి 5, మార్చి 3, జూన్ 10వ తేదీన పోటీలు నిర్వహించగా మూడింటిలో బంగారు పతకాలు పొంది హ్యాట్రిక్ సాధించారు. వీటితోపాటు మండల, జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు అందుకున్నారు. -
మా పేరెంట్స్ చాలా భయపడ్డారు
సాక్షి, ముంబై: ఫెమినా మిస్ ఇండియా-2018 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయా రావు కామవరపు(23) రెండో రన్నరప్‌గా నిలిచి సత్తా చాటారు. ఆర్కిటెక్చర్ అయిన శ్రేయా.. ఓ స్నేహితురాలు పట్టుబట్టడంతో అడిషన్స్‌కు వెళ్లి మరీ ఈ అదృష్టాన్ని అందుకున్నారంట. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం అందాల పోటీలనగానే ముందు భయపడ్డారని ఆమె చెబుతున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ‘అర్కిటెక్ అయిన నాకు మిస్ ఇండియా పోటీలకు యత్నించటం తొలుత కష్టంగానే అనిపించింది. ర్యాంప్ వాక్ అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు. పైగా మేకప్ వేసుకోవటం కూడా నాకు రాదు. దీనికితోడు అందాల పోటీలు అనగానే నా పెరెంట్స్ ఒక్కసారిగా భయపడ్డారు. వారిలో తెలీని ఏదో ఆందోళన. నా అడిషన్స్ అన్నీ చూశాక వాళ్ల అభిప్రాయం మారింది. ఇది కేవలం ఒక్క అందాల పోటీలే కాదని, నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానన్న నమ్మకం వారికి ఏర్పడింది. అందుకే చివర్లో మంచి ప్రోత్సాహం అందించారు. సాధ్యమైనంత వరకు నా వ్యవహారాలు నేనే చూసుకున్నా’ని ఆమె తెలిపారు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని, ఇంత కంటే పెద్ద విజయాన్ని తన దేశానికి అందించాలనుకున్నట్లు శ్రేయా ధీమాతో చెబుతున్నారు. ‘నా కల తీరాక తిరిగి నా ప్రొఫెషన్‌కు వెళ్లిపోతా. విద్యాసంస్థలు నెలకొల్పటం నా కల. అది నెరవేరే దాకా కృషి చేస్తా. అంతేగానీ గ్లామర్ వరల్డ్‌లో మాత్రం అడుగుపెట్టదల్చుకోలేదు’ శ్రేయా రావు స్పష్టం చేశారు. కాగా, రెండో రన్నరప్ అయిన శ్రేయా.. మిస్ యునైటెడ్ కాంటీనెంట్స్ 2018 పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. -
అమ్మో.. అమ్మాయేనా..
2018 మిస్ వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీ ఫైనలిస్ట్ అయిన ఈ పిల్లను చూసినోళ్లంతా ఇదే పాటేసున్నారు... అందమంటే.. అరినా అలియెవాదే అని అనేసుకున్నారు... అందాల కిరీటమూ ఆమెదేనని అందరికీ డప్పేసుకున్నారు.. ఈ పాటేసుకోడాలు.. అనేసుకోడాలు.. డప్పేసుకోడాలు మధ్య.. మనకు తెలియని మరో కథ ఉంది.. కింగ్‌ఖాన్ అన్నట్లు.. ‘అబీ పిక్చర్ బాకీ హై మేరే దోస్త్’ ఇంతకీ మనకు తెలియని ఆ స్టోరీ ఏంటంటే.. ఎలీ డయాగ్లెవ్(22).. ఓ మోడల్.. ఓ రోజు తన ఫ్రెండ్స్‌లో కాఫీ షాపులో కూర్చుని ఉండగా వాళ్ల మధ్య ఓ చర్చ.. ఒకప్పుడు మహిళలు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చేవారని.. ఇప్పుడంతా ట్రెండ్ ఎటు ఉంటే అటు పోతున్నారని ఎలీ అన్నాడు. ఫ్యాషనబుల్‌గా దుస్తులు ధరించడం, మేకప్ వేసుకుంటే చాలు తాము అందంగా ఉంటామని అనుకుంటున్నారని.. ప్రస్తుతమున్న ఆధునిక పద్ధతులతో ఓ మగాడు కూడా అందమైన మహిళగా మారిపోవచ్చని చెప్పాడు.. స్నేహితులు ఇతడి వాదనను వ్యతిరేకించారు. ఎలీ మాత్రం తన మాటే రైట్ అని నిరూపించాలనుకున్నాడు.. అంతే.. మేకప్ ఆర్టిస్టు సాయం తీసుకున్నాడు.. ఎలీ కాస్త.. అరినాగా మారిపోయాడు. వర్చ్యువల్ కజకిస్తాన్ అందాల పోటీలో భాగంగా ఆన్లైన్లో తన ఫొటోలను పెట్టాడు.. స్పందన అదిరిపోయింది.. ఫైనలిస్టుగా ఎంపికయ్యాడు.. తన మాట నెగ్గింది.. ఇక నిజం చెప్పాల్సిన టైమొచ్చింది.. దీంతో తాను అరినాను కాదని.. ఎలీ అంటూ ఓ వీడియో నెట్లో పోస్ట్ చేశాడు.. ‘కొంత మంది అమ్మాయిలు ఈ మధ్య బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఆ బాహ్య సౌందర్యాన్ని ఓ మగాడు కూడా సాధించగలడు. వ్యక్తిత్వం, అంతః సౌందర్యం అన్నవి అన్నింటికన్నా ముఖ్యం.. నా ఈ పని కొంతమందైనా అమ్మాయిలను ఆ దిశగా ఆలోచించేలా చేస్తుందని భావిస్తున్నాను’ అంటూ ఎలీ తన వీడియోలో పేర్కొన్నాడు.. మగాళ్ల పరిస్థితి ఏమైంది? ఓకే.. ఓకే.. అమ్మాయిలకు మెసేజీ ఇచ్చేశాడు సరిపోయింది.. మరి ఎలీని.. అరినా అనుకుని.. పిచ్చపిచ్చగా ఆరాధించేసిన మగాళ్ల పరిస్థితి ఏమైంది? ఏమవుతుంది? వాళ్లే సాంగ్‌ను కాస్త మార్చుకున్నారు.. శాడ్ ట్యూన్లో మళ్లీ పాటేసుకున్నారు.. అయ్యయ్యో.. బ్రహ్మయ్య.. అన్యాయం చేశావేమయ్యా.. ఈ బుల్లోడే.. బుల్లెమ్మనుకుని.. ఎంతగానో మోసపోయామయ్యా.. యా.. యా..యా.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
అందాల పోటీలను ఆపకుంటే ఉద్యమిస్తాం
ఒంగోలు టౌన్: మహిళలను మనుషులుగా కాకుండా వారి అందచందాలపై వ్యాపారం చేసి సొమ్ము చేసుకోవాలనుకోవడం దుర్మార్గమైన చర్య..అని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. పద్మ ధ్వజమెత్తారు. విశాఖలో బ్యూటీ కంటెస్టు పేరుతో నిర్వహించనున్న అందాల పోటీలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పీఓడబ్ల్యూ, పీడీఎస్‌యూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల సాధికారిత గురించి, వారి అభివృద్ధి గురించి నిత్యం మాట్లాడే తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల వ్యాపార ప్రకటనల కోసం అందాల పోటీలను నిర్వహించడం వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనన్నారు. ప్రజా రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పదేళ్ల క్రితం ఒంగోలులో కూడా అందాల పోటీలను నిర్వహించతల పెడితే అన్ని సంఘాలు వ్యతిరేకించి ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రమలో, సంపద ఉత్పత్తిలో సగభాగంగా ఉన్న మహిళలు, వారి అస్తిత్వాన్ని గుర్తించకుండా సెక్స్ సింబల్‌గా చూసే ధోరణి మారాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు బడుగు ఇందిర మాట్లాడుతూ కారు షెడ్లో ఉంటేనే భద్రంగా ఉంటుందని, అదే మాదిరిగా మహిళలు వంటింట్లో ఉంటేనే రక్షణ ఉంటుందని మాట్లాడే నాయకులు ఉండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మహిళపై అత్యాచారం జరిగితే పట్టించుకోని నాయకులు, అందాల పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించి అలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్.భారతి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావలి సుధాకరరావు, పౌరసమాజం నాయకుడు జి.నరసింహారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణోదయ అంజయ్య, కోశాధికారి ఎన్.సామ్రాజ్యం, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు ఎన్.నాగరాజు, ఏఐకేఎంఎస్ నాయకుడు కె. హనుమంతురావు, మహిళా నాయకులు సీహెచ్ పద్మ, సీతారావమ్మ, కాశమ్మ పాల్గొన్నారు. -
మహిళలపై ప్రతాపమా...
అందాల పోటీల పేరుతో అతివలను ఆటబొమ్మలను చేయొద్దన్న డిమాండ్‌తో రెండో రోజూ ఆందోళనకు దిగిన మహిళా సంఘాల ప్రతినిధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆందోళన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత రేగింది. మద్దిలపాలెం జంక్షన్లో సోమవారం ఉదయం తలపెట్టిన నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. వాహనాల్లో వచ్చిన సంఘాల ప్రతినిధులను వాహనాలు దిగకుండా అడ్డుకున్నారు. ప్రతిఘటించిన వారిని ఈడ్చుకెళ్లి, ఎత్తుకెళ్లి పోలీసు వాహనాల్లోకి నెట్టి.. త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. వారందరినీ సాయంత్రం వరకు అక్కడే ఉంచి.. అనంతరం విడిచిపెట్టారు.. దీనికి నిరసనగా ఆడవాళ్లను ఆటబొమ్మలను చేయొద్దన్నందుకు అరెస్టులు చేయడం సిగ్గచేటంటూ మహిళా సంఘాలు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించాయి. మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైపోతుంది. అన్యాయాన్ని ప్రశ్ని స్తున్న మహిళా సంఘాలపై పోలీసులు జూలుం ప్రదర్శిస్తున్నారు. ఇదేం పాలనరా.. బాబు అనే దుస్థితికి మన రాష్ట్ర పాలన దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. నగరంలో అందాల పోటీలను రద్దు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసనకు సమాయత్తమైన మహిళా సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయడంపై ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన మహిళా సంఘాల ప్రతినిధులను మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కలిసి మద్దతు తెలిపారు. ఆమెతోపాటు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పీలా వెంటకలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, మైనార్టీ సెల్ నగర ప్రధాన కార్యదర్శ సబీరాబేహంలు కలిసి పరామర్శించారు. మహిళ సంఘాలపై దాడులు అమానుషం మహిళలకు రక్షణలేని నేటి సమాజంలో.. అందాల పోటీలను నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామూర్తి,పి.వి.రమణ ఒక ప్రకటనలో ఖండించారు. గొంతు నొక్కితే ప్రభుత్వానికి పతనం తప్పదు అందాల పోటీలు నిర్వహించి మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని అఖిల పక్ష మహిళా సంఘాలు నిరసన చేపడితే పోలీసులు బలవంతంగా అరెస్టులు చేయడం అన్యాయమని సీపీఐ గ్రేటర్ కార్యదర్శి దేవకొండ మార్కెండేయులు అన్నారు. ఉద్యమకారులు గొంతునొక్కె ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. కేసులు బనాయించం దుర్మార్గం అందాల పోటీలు వద్దని నిరసన తెలిపిన మహిళా సంçఘాలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ నగర అధ్యక్ష,కార్యదర్శిఆర్.కె.ఎస్.కుమార్, జగ్గునాయుడు అన్నారు. మహిళాసంఘాల అరెస్టు తీరు చూసి సభ్యసమాజం తలదించుకుంటుందన్నారు. అరెస్టు చేయడం తగదు ఆందాల పోటీలు వద్దన్నందుకు మహిళా సంఘాల నాయకుల్ని అరెస్టు చేయడం దుర్మార్గమని ఐద్వా ఉపాధ్యక్షురాలు బి.పద్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథ, నగర కార్యదర్శి బి.గంగారావు, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. అందగత్తెల పోటీలు నిర్వహించొద్దని మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అందగత్తెల పోటీల పోస్టర్ ఆవిష్కరించడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ మహిళలను గౌరవించే పద్దతి ఇదేనా?, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ అందాల పోటీలు వద్దన్నందుకు పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయంచడం తగదన్నారు. పీవోడబ్ల్యూ నాయకులు లక్ష్మి నిర్బంధం -
జంబలకిడి పంబ.. వర్కవుట్ కాలేదు!
ఆంథోనీ నగోర్నీ.. అందాల పోటీలలో పాల్గొని విజేతగా కూడా నిలిచింది. కానీ కాసేపటి తర్వాత జడ్జీలు ఆమెకు ఇచ్చిన టైటిల్‌ను వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకంటే.. ఈ పోటీలలో పాల్గొనడం కోసమే అంతకుముందు వరకు అబ్బాయి అయిన అతడు తన స్నేహితురాలి సాయంతో అమ్మాయిగా మారిపోయాడు!! ఆ విషయం జడ్జీలకు తెలిసిపోవడంతో టైటిల్ ఊడలాక్కున్నారు. సఖాలిన్ యూనివర్సిటీలో చదివే ఆంథోనీ.. ఆన్లైన్ పోటీ ద్వారా ఈ అందాల పోటీలోకి అడుగుపెట్టాడు. స్థానికంగా ఉండే ఓ లోదుస్తుల స్టోర్స్ వాల్లు బికినీలో అందమైన ఫొటో తీయించుకుని పంపాలని అడిగారు. ఆంథోనీ స్నేహితురాలు ఈ విషయంలో అతడికి సాయం చేసింది. జుట్టు నీట్‌గా కట్ చేసి, మేకప్ వేసి అతడిని మంచి 'అందగత్తె'గా తయారుచేసి మరీ ఫొటోలు తీయించి పంపించింది. మిస్ అవకాడో అనే పేరుతో అతడు ఆన్లైన్ అందాల పోటీలో పాల్గొన్నాడు. అయితే ఎలా తెలిసిందో గానీ, జడ్జీలకు ఈ విషయం తెలిసిపోయింది. దాంతో వాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని.. అతడిని పోటీ నుంచి బహిష్కరించడమే కాక అతడు విజేత కాదని కూడా ప్రకటించారు. ఆ అబ్బాయి చూడ్డానికి అచ్చం అమ్మాయిలాగే ఉన్నాడని, ఫొటోలు అప్లోడ్ చేయడం సులభం కావడంతో అతడు చేసేశాడని లోదుస్తుల స్టోర్స్ యజమానులు చెప్పారు. ఇప్పుడు అతడు విజేత కాకపోవడంతో మరో ముగ్గురు అమ్మాయిలకు బహుమతి మొత్తాన్ని పంచుతున్నారు. ఆంథోనీ అమ్మాయిగా తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. అతడికి టైటిల్ ఇవ్వలేదని తెలిసి.. చాలామంది అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. -
బ్యూటీ క్వీన్స్.. సిల్లీ ఆన్సర్స్!
అందం–తెలివి అందాల పోటీల్లో నెగ్గడం ఎంత కష్టమో మీరు చూసే ఉంటారు. వందలు, వేల వడపోతల్లో నుంచి ఒకే ఒక్కరికి ‘అందాల సుందరి’ అయ్యే అదృష్టం దక్కుతుంది. అందం ఒక్కటే ఉంటే సరిపోదు. ఫైనల్ ఈవెంట్లో తెలివినీ ప్రదర్శించాలి. చిట్టచివరికి మిగిలిన ముగ్గురు అమ్మాయిలకు... జడ్జీలు మూడు ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు అక్కడికక్కడ సమయస్ఫూర్తితో తెలివైన సమాధానం చెప్పి, న్యాయనిర్ణేతల మనసు గెలుచుకోవాలి. అప్పుడే.. అందాల కిరీటం దక్కుతుంది. అయితే మరి... అందాల కిరీటం గెలుచుకున్న ‘మిస్’లు అందరూ ‘వండర్ఫుల్ ఆన్సర్స్’ ఇచ్చినట్లే అనుకోవచ్చా? అనుకోవచ్చో, లేదో ఈ సమాధానాలు చదివితే మీకే తెలుస్తుంది. 1. ప్రియాంకా చోప్రా (మిస్ వరల్డ్ 2000) ప్రశ్న: ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ‘మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమన్’ ఎవరు? ఎందుకు? సమాధానం: మదర్ థెరిసా. ఎందుకంటే ఆమె అమిత కారుణ్యమూర్తి, దయామయి. 2. జీనీ ఆండర్సన్ (మిస్ ఫిలిప్పీన్స్ 2001) ప్రశ్న: అందమా? అమోఘమైన తెలివితేటలా? మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారు? సమాధానం: అందం సహజసిద్ధంగా వస్తుంది కనుక అందాన్నే ఎంచుకుంటాను. తెలివితేటలు అలా కాదు. వాటిని జీవితానుభవాల నుంచి నేర్చుకోవలసి ఉంటుంది. 3. లారెన్ కేట్లైన్ ఆప్టన్ (మిస్ టీన్ యు.ఎస్.ఎ. 2007) ప్రశ్న: అమెరికన్లకు భౌగోళిక పరిజ్ఞానం తక్కువుంటుంది ఎందుకు? సమాధానం: ఎందుకంటే, అందరికీ మ్యాపులు అందుబాటులో ఉండవు. 4. గయోసీ కజరెలీ (మిస్ పనామా 2009) ప్రశ్న: learning without thought is labour lost అని కన్ఫ్యూషియస్ చెప్పాడు. దీనర్థం ఏమిటో చెప్పండి. సమాధానం: కన్ఫ్యూషియస్ కన్ఫ్యూజన్ని కనిపెట్టాడని అర్థం. 5. శాంజా పాపిక్ (మిస్ యూనివర్శ్ 2003) ప్రశ్న: మీరు నిప్పు అవడానికి ఇష్టపడతారా? నీరు అవడానికి ఇష్టపడతారా? సమాధానం: నేను మనిషిని. మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. నీటికి, నిప్పుకు ఎమోషన్స్ ఉండవు. 6. అలీషియా మోనిక్ బ్లాంకో (మిస్ యు.ఎస్. 2009) ప్రశ్న: అమెరికా పౌరులందరికీ ఆరోగ్య భద్రత హక్కు ఉండాలా? సమాధానం: అది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. సరైనది కానిదాని నుంచి, పాలిటిక్స్ నుంచి.. సరైన దాన్ని ఎన్నుకోవడం కోసం నా కుటుంబ సభ్యులు నన్ను ఎంచుకున్నారు. 7. నాడీన్ టెనీగా (మిస్ హవాయి 1992) ప్రశ్న: ఒక అమెరికన్‌గా మీరు గర్వించే సంగతి ఏమిటి? సమాధానం: హవాయీ కల్లోల తీరాల నుంచి, అద్భుతమైన హవాయీ ఇసుక మేటల వరకు... అమెరికా మా ఇల్లు. 8. లీ సెసిల్ (మిస్ కాలిఫోర్నియా 2012) ప్రశ్న: euthanasia (కారుణ్య మరణం) మీద మీ అభిప్రాయం? సమాధానం: నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ, అదొక వ్యాక్సిన్. 9. ఇరీన్ సోఫియా ఎస్సర్ క్వింటెరో (మిస్ యూనివర్స్ 2012) ప్రశ్న: మీకు అవకాశం ఇస్తే మీరు ఎలాంటి చట్టం తెస్తారు? ఎందుకు? సమాధానం: చట్టాలు, అలలు ఒకటే. నేను సర్ఫర్ని కాబట్టి నేను అవలీలగా తేలియాడేందుకు అనువైన అల కోసం ఎదురు చూస్తాను. ప్రజలకు అలాంటి చట్టం కావాలి. 10. మేరిస్సా పావెల్ (మిస్ యు.ఎస్.ఎ. 2013) ప్రశ్న: మన సమాజంలో ఎందుకని మహిళలు, మగవాళ్ల కన్నా తక్కువ నేర్చుకుంటారు? సమాధానం: దీన్ని మనం వెనక్కి వెళ్లి ‘చదువు’ అనే కోణంలోంచి చూడాలి. సరైన ఉద్యోగాలను ఎలా క్రియేట్ చేయాలో ఆలోచించాలి. నిజంగా అది పెద్ద సమస్య. నా ఉద్దేశం ఏమిటంటే... మగవాళ్లే అన్నిట్లోనూ లీడర్లుగా ఉంటున్నారు. సో... మంచి ఎడ్యుకేషన్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడొక సందేహం వస్తోంది కదా! ఇంత సిల్లీగా సమాధానాలు చెప్పినప్పటికీ వీళ్లెలా అందాల రాణులు అయ్యారబ్బా అని!! పోటీలో ఉండే మిగతా ఇద్దరు ఇంత కంటే ఘోరమైన అన్సర్లు ఇచ్చి ఉండాలి. -
మిస్ బొద్దుగుమ్మ..
సాధారణంగా అందాల పోటీలలో పాల్గొనే భామలంటే నాజూగ్గా, ఉందా లేదా అనిపించే నడుముతో కనిపిస్తారు. కానీ, తొలిసారిగా అందాల పోటీలో ఓ బొద్దుగుమ్మ కిరీటాన్ని గెలుచుకుని అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అర్జెంటీనాలో జరిగిన ’క్వీన్ ఆఫ్ వెండీమియా’ అనే అందాల పోటీలో 24 ఏళ్ల ఎస్టెఫానియా కారియా మొదటి స్థానంలో నిలిచి కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె బరువు 120 కిలోలు. కిరీటాన్ని గెలుపొందిన తర్వాత అప్పటికప్పుడు చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినందుకు ఆమెకు’యాంటీడిస్క్రిమినేషన్ క్వీన్’ అనే మరో అవార్డు కూడా దక్కింది. అర్జెంటీనాలోని మెండోజా రాష్ట్రంలో వైన్ మేకింగ్ ఫెస్టివల్లో భాగంగా ఈ అందాల పోటీలు నిర్వహించారు. కేవలం నాజూకు శరీరం, అందమైన ముఖం ఉంటేనే అందాల పోటీలలో నెగ్గుతారన్న భావనకు స్వస్తి చెప్పాలనే తాను ఈ పోటీలలో పాల్గొన్నట్లు ఎస్టెఫానియా తెలిపింది. దాదాపు ఏడాది నుంచి ఆమె ఈ పోటీల కోసం సిద్ధమవుతోంది. ఒక మోడలింగ్ ఏజెన్సీలో కూడా చేరింది. తనను ఎవరూ ఎక్కడా తక్కువ చేసి చూడలేదని, వివక్షకు లోను కాలేదని తెలిపింది. ఎవరైనా ముందు తమను తాము ప్రేమించుకోవాలని చెప్పింది. ఎవరి కోసమో ఏదో మారిపోవాల్సిన, మార్చుకోవాల్సిన అవసరంలేదని తెలిపింది. ఈ కిరీటం తర్వాత తనకు వచ్చేవన్నీ తన జీవితానికే మంచి బహుమతులని వివరించింది. స్టీరియోటైప్ అందాలను ఓడించిన అందాలరాణిగా తాను చరిత్రలో నిలిచిపోతానని చివరిమాటగా చెప్పింది.