Miss and Mrs VogueStar India 2023: బ్యూటీ స్టార్‌ డాక్టర్‌ శ్రీ కీర్తి పల్మనాలజిస్ట్‌... | Miss and Mrs VogueStar India 2023: Doctor SreeKeerthi Wins From Mrs Voguestar India 2023 G-1 Telangana | Sakshi
Sakshi News home page

Miss and Mrs VogueStar India 2023: బ్యూటీ స్టార్‌ డాక్టర్‌ శ్రీ కీర్తి పల్మనాలజిస్ట్‌...

Published Tue, May 2 2023 12:47 AM | Last Updated on Tue, May 2 2023 12:47 AM

Miss and Mrs VogueStar India 2023: Doctor SreeKeerthi Wins From Mrs Voguestar India 2023 G-1 Telangana - Sakshi

మరో కీర్తికిరీటం ‘మిసెస్‌ తెలంగాణ’. ‘మిసెస్‌ వోగ్‌స్టార్‌ ఇండియా’ విజేత. మహిళ ఎలా ఉండాలో చెప్పింది. మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ‘మంచిని తీసుకోవాలి... చెడును వదిలేయాలి’ ఇదీ ఆమెను విజేతగా నిలిపిన సమాధానం. ‘మా ఊరికి వస్తే మా ఇంటికి రండి’ మరో ప్రశ్నకు బదులుగా ఆత్మీయ ఆహ్వానం. బ్యూటీ కంటెస్ట్‌ నాడి పట్టుకుంది.

సంపూర్ణతకు ప్రతీకగా కిరీటధారి అయింది. ఏప్రిల్‌ 14,15,16 తేదీల్లో జైపూర్‌ వేదికగా వోగ్‌ స్టార్‌ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయి డాక్టర్‌ కీర్తి. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మంది పాల్గొన్న పోటీల్లో ‘మిసెస్‌ తెలంగాణ’ కిరీటంతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి వోగ్‌స్టార్‌ కిరీట ధారణ వరకు తన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను ‘సాక్షి’తో పంచుకుంది.
 
‘‘అమ్మ ఉద్యోగ రీత్యా నేను పుట్టింది ఒంగోల్లో, కానీ మా మూలాలు నెల్లూరులో ఉన్నాయి. అమ్మ బీఎస్‌ఎన్‌ఎల్, నాన్న సిప్లాలో ఉద్యోగం చేసేవారు. బాల్యం నుంచి నా జీవితమంతా హైదరాబాద్‌తోనే మమేకమైపోయింది. సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో టెన్త్‌ టాపర్‌ని. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉండడానికి స్కూలే కారణం. నాలుగు రకాల డాన్స్‌లు ప్రాక్టీస్‌ చేశాను. యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నాను. త్రో బాల్‌ ఆడేదాన్ని. ఖోఖో స్టేల్‌ లెవెల్‌ ప్లేయర్‌ని.

ఇదంతా ఒక దశ. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలనే ఆకాంక్ష ఉండేది. రెండో ఆలోచన లేకుండా కాకతీయ కాలేజ్‌లో బైపీసీలో చేరిపోయాను. సీనియర్‌ ఇంటర్‌లో ఉండగా ఓ యాక్సిడెంట్‌. మల్టిపుల్‌ ఫ్రాక్చర్స్, తలకు కూడా గాయమైంది. సర్జరీలతో దాదాపు నాలుగు నెలలు బెడ్‌ మీదనే ఉన్నాను. పరామర్శకు వచ్చిన వాళ్లు సానుభూతి కురిపిస్తూ ‘నడవడం కూడా కష్టమే, ఆరోగ్యం ఒకింత కుదుటపడిన తర్వాత ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేసేయండి’ అనే సలహా ఇచ్చేవాళ్లు.

ఏఎస్‌రావు నగర్‌లో మా కాలనీ వాళ్లు నాకు చాలా సహాయం చేశారు. హాస్పిటల్‌లో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. మా అమ్మానాన్న చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించిన రోజులు నాకు గుర్తు లేవు, కానీ నన్ను మామూలు మనిషిని చేయడానికి మా తమ్ముడు కార్తీక్‌ నన్ను చేయి పట్టి నడిపించిన రోజుల్ని మాత్రం మర్చిపోలేను. అలాగే చదివి ఎమ్‌సెట్‌లో రెండు వేల ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నాను. టాప్‌ టెన్‌లో ర్యాంకు నా కల, యాక్సిడెంట్‌ వల్ల ఆ కల నెరవేరలేదు.

► ... డాన్స్‌ మానలేదు!
కుప్పంలో ఎంబీబీఎస్‌ చేశాను. అప్పుడు కూడా డాన్స్‌ ప్రాక్టీస్‌ మానలేదు. నేను స్టేజ్‌ మీదకు వెళ్లకుండా కొరియోగ్రఫీ చేసి షోలు నిర్వహించాను. ఇక పీజీలో చదువు తప్ప మరిదేనికీ టైమ్‌ ఉండేది కాదు. పల్మనాలజీ తర్వాత కేరళలో ఇంటర్‌వెన్షనల్‌ పల్మనాలజీ చేశాను. పెళ్లి తర్వాత మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. మాది లవ్‌ మ్యారేజ్‌. డాక్టర్‌ శశిధర్‌ ఎంబీబీఎస్‌లో నా సీనియర్‌. ఆయన గాయకుడు. ఇల్లు, హాస్పిటల్‌తో జీవితాన్ని పరిమితం చేసుకోవడం నాకే కాదు ఆయనకూ నచ్చదు.

డాన్స్‌ కాకపోతే మరేదైనా ఆసక్తిని అభివృద్ధి చేసుకోమనేవారు. అలా గత ఏడాది మిస్‌ హైదరాబాద్‌ పోటీలకు నా ఫొటోలు పంపించాను. టాలెంట్‌ రౌండ్‌లో ర్యాంప్‌ వాక్, డాన్స్‌ వీడియోలు పంపించాను. అందులో ఫస్ట్‌ రన్నర్‌ అప్‌ని. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మిసెస్‌ తెలంగాణ ఆడిషన్‌’ పిలుపు వచ్చింది. డెలివరీ తర్వాత సెలవులో ఉండడంతో ఆ పోటీల్లో పాల్గొనే వీలు దొరికింది. గత ఏడాది నవంబర్‌ నుంచి దశల వారీగా అనేక సెషన్‌లు జరిగాయి. అన్నీ వర్చువల్‌గానే.  
 
► పోటీల నుంచి నేర్చుకున్నాను!
ఈ పోటీలో ఒకరికొకరు నేరుగా కలిసింది జైపూర్‌లో కిరీటధారణ సమయంలో మాత్రమే. ప్రతి రాష్ట్రం నుంచి విజేతలకు కిరీట ధారణ జరిగింది. విజేతల్లో నాతోపాటు మరో ఇద్దరు డాక్టర్లున్నారు. మనుమళ్లు, మనుమరాళ్లున్న మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా అనేక స్ఫూర్తిదాయకమైన జీవితాలను దగ్గరగా చూశాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో ఎదురీత ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలకు చెప్పేదొక్కటే... జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాలి. పెళ్లయిందనగానే ఇక జీవితం అయిపోయిందని, తమనెవరూ పట్టించుకోవట్లేదని ఇంట్లో వాళ్లను వేలెత్తి చూపుతూ తమను తాము నైరాశ్యంలోకి నెట్టేసుకుంటూ ఉంటారు. నిర్లిప్తతను దగ్గరకు రానివ్వకూడదు, ఒకవేళ ఆందోళన, ఆవేదనలు చుట్టు ముట్టినా సరే వాటి నుంచి బయటపడడానికి తమను తాము ఉత్తేజితం చేసుకోవాలి’’

ఎంపిక ఇలా!

స్వయం శక్తితో జీవితంలో ఎదిగిన వాళ్లు, జీవితంలో పడిలేచిన వాళ్లు, సామాజికంగా సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వాళ్లు... ఇలా ఉంటుంది. అలాగే అందరిలో ఒకరిగా జీవించడం కాకుండా ప్రొఫైల్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను పర్యావరణం కోసం చేసిన పనులు, కోవిడ్‌ వారియర్, జగిత్యాలలో ఐదేళ్లు సామాన్యులకు వైద్యం చేయడంతో సరిపెట్టుకోకుండా హెల్త్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌ ఇవ్వడం వంటివి నాకు ఉపకరించాయి.  
– డాక్టర్‌ ఎం.వి. శ్రీకీర్తి,  సీనియర్‌ కన్సల్టెంట్, ఇంటర్‌వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, టీఎక్స్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌.

– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement