telugu woman
-
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్‌గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్‌లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్‌లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి -
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
జాహ్నవి మృతికి సంతాపంగా అమెరికాలో క్యాండిల్ ర్యాలీ
అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే.అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు. సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దీనిపై పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. -
ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం
‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్‌కి తగ్గట్టు ఫుల్‌గా డ్యాన్స్ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్ సౌండ్‌కి డ్యాన్స్ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు... ► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్ హంగామా చేస్తూ ట్యాంక్‌బండ్‌కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం. ► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్‌కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్ (ప్రేరణ) జోన్లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా? నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్ శారీస్ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ. ► హాఫ్ శారీస్ కట్టుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి. ► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా? నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను. ► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా? మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్ వైబ్స్‌తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ► ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో? అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్‌కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా. ► ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్.. అక్కడికి వెళుతుంటారా? ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది. ► చిన్నప్పుటి నుంచి హీరోయిన్ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..? నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది. ► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా... తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది? స్కూల్లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ). -
ఆ పోలీసును తొలగించాలి
వాషింగ్టన్: అమెరికాలో గత జనవరిలో పోలీసు వాహనపు అతి వేగానికి బలైన తెలుగమ్మాయి జాహ్నవి కందుల విషయంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సియాటిల్ పోలీసు అధికారి డేనియల్ ఆడరర్పై ఆగ్రహ జ్వాలలు నానాటికీ పెరుగుతున్నాయి. ‘ఇదేమంత పెద్ద విషయం? ఏ 11 వేల డాలర్లకో చెక్కు రాస్తే సరి. ఆమెకు 26 ఏళ్లు. అలా చూస్తే ఆమె జీవితం అంత విలువైనదేమీ కాదు‘ అంటూ ఈ ఉదంతంపై అతను చేసిన వ్యాఖ్యలు గత సోమవారం బాడీకామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజా కృష్ణమూర్తి వంటి భారత అమెరికన్ చట్ట సభ్యులతో పాటు అమెరికా చట్ట సభ్యులు కూడా వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డేనియల్ ప్రవర్తన మీద స్వతంత్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. నిషిత రహేజా గోయల్ అనే భారత్ అమెరికన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. శుక్రవారం రాత్రికే సంతకాల సంఖ్య 6,700 దాటిపోయింది. ‘డేనియల్ ప్రవర్తనతో సియాటిల్ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఇకపై కొత్తగా పోలీసు శాఖలో చేరే ప్రతి ఒక్కరికీ సున్నితత్వం తదితరాల విషయంలో విధిగా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే జాహ్నవి, అలాంటి ఇతర బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన చేకూరుతుంది‘ అని పిటిషన్ పేర్కొంది. మరోవైపు, డేనియల్ను సియాటిల్ పోలీసు అధికారుల గిల్డ్ సమర్థించింది! అతను ప్రైవేట్‌గా చేసిన వ్యాఖ్యలను అసంబద్ధంగా విడుదల చేసి అపార్థాలకు తావిచ్చారని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. తన వ్యాఖ్యలను దురర్థం వచ్చేలా వక్రీకరించారని డేనియల్ కూడా ప్రకటన విడుదల చేశాడు. -
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
Miss and Mrs VogueStar India 2023: బ్యూటీ స్టార్ డాక్టర్ శ్రీ కీర్తి పల్మనాలజిస్ట్...
మరో కీర్తికిరీటం ‘మిసెస్ తెలంగాణ’. ‘మిసెస్ వోగ్స్టార్ ఇండియా’ విజేత. మహిళ ఎలా ఉండాలో చెప్పింది. మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ‘మంచిని తీసుకోవాలి... చెడును వదిలేయాలి’ ఇదీ ఆమెను విజేతగా నిలిపిన సమాధానం. ‘మా ఊరికి వస్తే మా ఇంటికి రండి’ మరో ప్రశ్నకు బదులుగా ఆత్మీయ ఆహ్వానం. బ్యూటీ కంటెస్ట్ నాడి పట్టుకుంది. సంపూర్ణతకు ప్రతీకగా కిరీటధారి అయింది. ఏప్రిల్ 14,15,16 తేదీల్లో జైపూర్ వేదికగా వోగ్ స్టార్ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయి డాక్టర్ కీర్తి. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మంది పాల్గొన్న పోటీల్లో ‘మిసెస్ తెలంగాణ’ కిరీటంతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి వోగ్స్టార్ కిరీట ధారణ వరకు తన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను ‘సాక్షి’తో పంచుకుంది. ‘‘అమ్మ ఉద్యోగ రీత్యా నేను పుట్టింది ఒంగోల్లో, కానీ మా మూలాలు నెల్లూరులో ఉన్నాయి. అమ్మ బీఎస్ఎన్ఎల్, నాన్న సిప్లాలో ఉద్యోగం చేసేవారు. బాల్యం నుంచి నా జీవితమంతా హైదరాబాద్‌తోనే మమేకమైపోయింది. సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో టెన్త్ టాపర్‌ని. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉండడానికి స్కూలే కారణం. నాలుగు రకాల డాన్స్‌లు ప్రాక్టీస్ చేశాను. యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నాను. త్రో బాల్ ఆడేదాన్ని. ఖోఖో స్టేల్ లెవెల్ ప్లేయర్‌ని. ఇదంతా ఒక దశ. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆకాంక్ష ఉండేది. రెండో ఆలోచన లేకుండా కాకతీయ కాలేజ్‌లో బైపీసీలో చేరిపోయాను. సీనియర్ ఇంటర్లో ఉండగా ఓ యాక్సిడెంట్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, తలకు కూడా గాయమైంది. సర్జరీలతో దాదాపు నాలుగు నెలలు బెడ్ మీదనే ఉన్నాను. పరామర్శకు వచ్చిన వాళ్లు సానుభూతి కురిపిస్తూ ‘నడవడం కూడా కష్టమే, ఆరోగ్యం ఒకింత కుదుటపడిన తర్వాత ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేసేయండి’ అనే సలహా ఇచ్చేవాళ్లు. ఏఎస్రావు నగర్లో మా కాలనీ వాళ్లు నాకు చాలా సహాయం చేశారు. హాస్పిటల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. మా అమ్మానాన్న చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించిన రోజులు నాకు గుర్తు లేవు, కానీ నన్ను మామూలు మనిషిని చేయడానికి మా తమ్ముడు కార్తీక్ నన్ను చేయి పట్టి నడిపించిన రోజుల్ని మాత్రం మర్చిపోలేను. అలాగే చదివి ఎమ్సెట్లో రెండు వేల ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నాను. టాప్ టెన్‌లో ర్యాంకు నా కల, యాక్సిడెంట్ వల్ల ఆ కల నెరవేరలేదు. ► ... డాన్స్ మానలేదు! కుప్పంలో ఎంబీబీఎస్ చేశాను. అప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ మానలేదు. నేను స్టేజ్ మీదకు వెళ్లకుండా కొరియోగ్రఫీ చేసి షోలు నిర్వహించాను. ఇక పీజీలో చదువు తప్ప మరిదేనికీ టైమ్ ఉండేది కాదు. పల్మనాలజీ తర్వాత కేరళలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ చేశాను. పెళ్లి తర్వాత మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. మాది లవ్ మ్యారేజ్. డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్‌లో నా సీనియర్. ఆయన గాయకుడు. ఇల్లు, హాస్పిటల్‌తో జీవితాన్ని పరిమితం చేసుకోవడం నాకే కాదు ఆయనకూ నచ్చదు. డాన్స్ కాకపోతే మరేదైనా ఆసక్తిని అభివృద్ధి చేసుకోమనేవారు. అలా గత ఏడాది మిస్ హైదరాబాద్ పోటీలకు నా ఫొటోలు పంపించాను. టాలెంట్ రౌండ్లో ర్యాంప్ వాక్, డాన్స్ వీడియోలు పంపించాను. అందులో ఫస్ట్ రన్నర్ అప్ని. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మిసెస్ తెలంగాణ ఆడిషన్’ పిలుపు వచ్చింది. డెలివరీ తర్వాత సెలవులో ఉండడంతో ఆ పోటీల్లో పాల్గొనే వీలు దొరికింది. గత ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా అనేక సెషన్లు జరిగాయి. అన్నీ వర్చువల్‌గానే. ► పోటీల నుంచి నేర్చుకున్నాను! ఈ పోటీలో ఒకరికొకరు నేరుగా కలిసింది జైపూర్‌లో కిరీటధారణ సమయంలో మాత్రమే. ప్రతి రాష్ట్రం నుంచి విజేతలకు కిరీట ధారణ జరిగింది. విజేతల్లో నాతోపాటు మరో ఇద్దరు డాక్టర్లున్నారు. మనుమళ్లు, మనుమరాళ్లున్న మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా అనేక స్ఫూర్తిదాయకమైన జీవితాలను దగ్గరగా చూశాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో ఎదురీత ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలకు చెప్పేదొక్కటే... జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాలి. పెళ్లయిందనగానే ఇక జీవితం అయిపోయిందని, తమనెవరూ పట్టించుకోవట్లేదని ఇంట్లో వాళ్లను వేలెత్తి చూపుతూ తమను తాము నైరాశ్యంలోకి నెట్టేసుకుంటూ ఉంటారు. నిర్లిప్తతను దగ్గరకు రానివ్వకూడదు, ఒకవేళ ఆందోళన, ఆవేదనలు చుట్టు ముట్టినా సరే వాటి నుంచి బయటపడడానికి తమను తాము ఉత్తేజితం చేసుకోవాలి’’ ఎంపిక ఇలా! స్వయం శక్తితో జీవితంలో ఎదిగిన వాళ్లు, జీవితంలో పడిలేచిన వాళ్లు, సామాజికంగా సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వాళ్లు... ఇలా ఉంటుంది. అలాగే అందరిలో ఒకరిగా జీవించడం కాకుండా ప్రొఫైల్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను పర్యావరణం కోసం చేసిన పనులు, కోవిడ్ వారియర్, జగిత్యాలలో ఐదేళ్లు సామాన్యులకు వైద్యం చేయడంతో సరిపెట్టుకోకుండా హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ ఇవ్వడం వంటివి నాకు ఉపకరించాయి. – డాక్టర్ ఎం.వి. శ్రీకీర్తి, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు
విమానం నడిపిన అమ్మాయిలను చూస్తున్నాం. విమానంలో యుద్ధం చేసే అమ్మాయిలనూ చూశాం. ఇప్పుడు... విమానాలు తయారు చేస్తున్న అమ్మాయిని చూద్దాం. వల్లూరి సుధీర ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్. జర్మనీలోని లిలియుమ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలో మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్. ఆ కంపెనీ స్థాపించిన తర్వాత ఉద్యోగంలో చేరిన వంద మంది ఇంజనీర్లలో ఒకే ఒక యువతి ఆమె. సెలవు మీద హైదరాబాద్‌కి వచ్చిన సుధీర ఈ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని, ఏరోస్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్ విభాగంలో తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన! ‘‘మా తాతయ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్‌గా పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో ఉద్యోగం చేశారు. అమ్మమ్మ అదే డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా భువనేశ్వర్‌లో రిటైర్ అయ్యారు. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావడానికి డైరెక్ట్‌గా ప్రభావితం చేయలేదు, కానీ పరోక్షంగా వారి నేపథ్యం నాకు మంచి భరోసానిచ్చింది. నిజానికి మా అమ్మానాన్నలిద్దరి మూలాలూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులోనే ఉన్నాయి. అమ్మానాన్న హైదరాబాద్‌లో సెటిల్ కావడంతో నా బాల్యం భాగ్యనగరంలోనే. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. పైలట్ల కోసం ప్రకటన అది. అయితే మగవాళ్లకు మాత్రమే. అప్పుడు ‘అమ్మాయిలెందుకు వద్దు’ అనిపించింది. అమ్మాయిలు విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదవరా అని కూడా అనుకున్నాను. నేను ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మానాన్న పెద్దరికపు సవరణలేమీ చేయకుండా నన్ను నేను కోరుకున్న కోర్సులో చేర్చారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్‌లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అప్పట్లో నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి ఆర్మీలో పని చేయాలని ఉండేది. పరీక్షలు రాశాను, కానీ సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఆదిభట్లలో ఉన్న ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీ మా క్యాంపస్‌కి ప్లేస్మెంట్ గురించి వచ్చింది, అలా 2012లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ప్రొడక్షన్ ప్లానింగ్, కంట్రోల్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా చేయడంతో పని మీద మంచి పట్టు వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలని, అది కూడా మాన్యుఫాక్చరింగ్లోనే చేయాలనుకుని యూఎస్‌లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. కోర్స్ పూర్తయిన తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశాను. అది బిజినెస్ జెట్లు తయారు చేసే కంపెనీ. ఇప్పటి వరకు నాది చాలా మామూలు జర్నీనే. 2017లో పెళ్లి, అబ్బాయి నాకు బీటెక్ క్లాస్మేటే. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఏవియేషన్ ఆఫీసర్. పెళ్లి తర్వాత ఇండియాలో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందట నేను మాత్రమే జర్మనీలో ‘లిలియుమ్ ఎయిర్ క్రాఫ్ట్’ కంపెనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో అప్పుడు... అంటే 2018లో వందమంది ఇంజనీర్లలో అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఆ గుర్తింపు నాకు పెద్దగా సంతోషాన్నివ్వదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది జెండర్ సెపరేషన్తో కూడిన గుర్తింపు కాదు. వందమందిలో యాభై మంది అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మా కంపెనీలో ఎనిమిది వందల మంది ఇంజనీర్లున్నారు, వారిలో వందమంది వరకు అమ్మాయిలున్నారు. ఈ నాలుగేళ్లలో వచ్చిన పురోగతి. ఈ ఫీల్డ్‌లో అమ్మాయిలు నెగ్గుకురావడం కష్టమనేది అపోహ మాత్రమే. నేనిప్పుడు మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్‌ని. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి సెలెక్ట్ చేసుకోగలిగాను. మా టీమ్‌లో పోలండ్, బ్రెజిల్, యూకే, యూరప్ దేశాల వాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసి పని చేయడం, వాళ్ల నుంచి పని తీసుకోవడంలో ఎక్కడా ఇబ్బందులేవీ రాలేదు. అయితే ఒక టాస్క్ ఇచ్చే ముందు వాళ్ల బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్‌ని అర్థం చేసుకోగలిగితే టీమ్‌తో పని చేయించుకోవడం ఏ మాత్రం కష్టంకాదనేది నా అభిప్రాయం. నేను టీమ్ లీడర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది మహిళలను చూశాను, వారితో పనిచేశాను కూడా. మిగిలిన అన్ని రంగాల్లోలాగానే ఈ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారు’’ అన్నారు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ వల్లూరి సుధీర. సబ్జెక్ట్‌ని నిరూపించుకోవాల్సిందే! ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ వంటి సాంకేతికత ఎక్కువగా ఉంటే రంగాల్లో టెక్నికల్ పీపుల్‌తో పని చేసేటప్పుడు వాళ్లు ఆడవాళ్ల మాటను పట్టించుకోరనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే... యంగ్ ఇంజనీర్కంటే సీనియర్ టెక్నీషియన్‌కి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త మార్పును తెచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్‌కి మనం విషయమంతా వివరించేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మనం ఒక అడుగు ముందున్నామనే విషయాన్ని నిరూపించుకోవాలి. ఈ నిరూపణ మగవాళ్లకైనా ఉంటుంది, ఆడవాళ్లకూ ఉంటుంది. నేను మహిళలకు చెప్పే మాట ఒక్కటే... మనల్ని మనం ‘ఇంజనీర్, సైంటిస్ట్, పైలట్’ అని ప్రొఫెషన్పరంగా మాత్రమే గుర్తించుకోవాలి, ‘ఉమన్ ఇంజనీర్, ఉమన్ పైలట్, ఉమన్ సైంటిస్ట్’ అని జెండర్‌పరంగా కాదు. అన్ని పరీక్షలనూ మగవాళ్లతోపాటు పూర్తి చేసి ఈ స్థాయికి వచ్చాం. రిజర్వేషన్లలో రాలేదు. ఇక ఉమన్ అని జెండర్‌తో ఐడింటిఫై అవడం ఎందుకు? – వల్లూరి సుధీర, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ – వాకా మంజులారెడ్డి -
అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం. రవాణా ఇంజనీర్‌గా సేవలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మాంట్గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్‌లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఐదుగురు భారత అమెరికన్ల విజయం వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు. -
మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలో తెలుగు బ్యూటీ
పోటీలో తెలుగు బ్యూటీ మనకు... మిస్ యూనివర్స్ పోటీలు... బాగా తెలుసు. మిస్ వరల్డ్ కూడా... పరిచయమే. అలాగే... మిస్ ఎర్త్ గురించి తెలుసు. మరి... మిసెస్ యూనివర్స్? మిసెస్ వరల్డ్?? మిసెస్ ఇంటర్నేషనల్??? పెద్దగా తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. మిసెస్ ఇంటర్నేషనల్‌కు అర్హత సాధించిన తెలుగు మహిళ రాధికామూర్తిని పరిచయం చేసుకుందాం. మిసెస్ ఇంటర్నేషనల్ పోటీల్లో దేహం కొలతల చట్రంలో ఇమడాల్సిన అవసరం లేదు. ఆత్మసౌందర్యం, అంతఃసౌందర్యమే ప్రధానం. అంతఃసౌందర్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఉలి. ఆ ఉలి చెక్కిన శిల్పమే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం... భావవ్యక్తీకరణలో బహిర్గతమవుతుంది. భావవ్యక్తీకరణకు సాధనం మాట. మాటలో వెలుగు చూసే భావమే అంతఃసౌందర్యానికి కొలమానం. బాధ్యతాయుతమైన వ్యక్తి అని, ఒక సామాజిక బాధ్యత అప్పగిస్తే కర్తవ్యానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనే విశ్వాసం కలిగించడానికి ఒక వేదిక ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పీజంట్. అమెరికాలో జరిగే ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఈ ఏడాది కూడా అనేక దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే ఈ పోటీల్లో పొల్గొంటున్న వారిలో ఓ తెలుగు మహిళ ఉంది. ఆమె రాధికామూర్తి. మరో విశేషం ఏమిటంటే... ఆమె పాల్గొంటున్నది యూకే నుంచి. అవును, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌గా పన్నెండేళ్ల నాడు లండన్‌లో అడుగుపెట్టిన రాధిక అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. భర్త, ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటూ కెరీర్‌ను బాలెన్స్ చేసుకుంటూ గడిచిపోయిన కాలాన్ని, విద్యార్థి దశలో మొగ్గలు విచ్చుకున్న అభిరుచులను, సామాజిక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన శూన్యత తనను అంతరయానం చేయించిందన్నారు రాధికామూర్తి. రొటీన్ చట్రం బయట ప్రపంచం ఉంది ‘‘నేను పుట్టింది పెరిగింది, చదువుకున్నది అంతా నెల్లూరులోనే. ఉద్యోగం కోసం బెంగళూరులో ఐదేళ్లు ఉన్నాను. యూకేలో ఉద్యోగం రావడంతో 2010లో లండన్‌కి వచ్చాను. ఆరేళ్ల తర్వాత సిటిజన్‌షిప్ కూడా వచ్చింది. పెళ్లి, ఇద్దరు అబ్బాయిలు, ఉద్యోగం... ఈ చట్రంలో గడిచిపోతూ ఉన్న సమయంలో కరోనా వచ్చింది. జ్ఞాపకాల్లోకి వెళ్లడానికి కొంత విరామం దొరికింది మనసుకి. స్కూల్లో, కాలేజ్‌లో నేను ఫ్యాషన్ షోలు, డాన్స్, పాటల పోటీలు, చిన్న చిన్న నాటికలు... ఇలా స్టేజ్ షోలలో చురుగ్గా పాల్గొనేదాన్ని. యూకేలో నివసిస్తున్న భారతీయులు పరస్పరం కలవడం కోసం మిసెస్ ఇండియా యూకే వంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. నా సెకండ్ ఇన్నింగ్స్ అలా మొదలైంది’’ అన్నారామె. కరోనా వదల్లేదు కరోనా తగ్గినట్లే తగ్గి తిరిగి విజృంభించడంతో ఆ పోటీలు ఎప్పటిలాగ ఆఫ్‌లైన్‌లో జరగలేదు. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. అలా ఎంపికైన నేను ఈ ఏడాది యూఎస్‌లో జరిగే మిసెస్ ఇంటర్నేషనల్‌కు యూకే ప్రతినిధిగా పాల్గొంటున్నాను. ఈ పోటీల్లో ఉండే సంతృప్తి ఏమిటంటే... విజేతలు ఏ రంగంలో సేవలందించాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. నేను మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం పని చేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు రాధికామూర్తి. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కాలంతో పోటీ పడి పరుగులు తీస్తున్న సమయంలో కూడా రాధికామూర్తి ఫిట్నెస్ను నిర్లక్ష్యం చేయలేదెప్పుడూ. రోజూ వర్కవుట్‌కి, యోగసాధనకు తప్పనిసరిగా కొంత టైమ్ కేటాయిస్తారు. ఆమె ఒక హెర్బల్ ఉత్పత్తికి ప్రమోటర్ కూడా. కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి జీవనశైలి, ఆహారపు అలవాట్లను తెలుసుకోవడం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. కుటుంబ బంధం సమాజం పట్ల బాధ్యత మిసెస్ పోటీల్లో పాల్గొనే వాళ్ల నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబాన్ని, కుటుంబంతో ఉన్న బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన ట్రాక్ రికార్డ్‌ను కూడా. స్థూలంగా చెప్పాలంటే సమాజంలో ఒక వ్యక్తిగా, కుటంబంలో కీలకమైన వ్యక్తిగా ఎంత బాధ్యతగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారనేది ముఖ్యం. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతరుల పోస్టులకు ప్రతిస్పందించే తీరు కూడా ముఖ్యమైన అంశమే. సమాజాన్ని సానుకూల ధోరణిలో ప్రభావితం చేయగలరా లేదా అనే నిర్ధారణకు రావడానికి ఆ పోస్టులు కూడా కొలమానం అవుతాయి. నేను నా వంతు సామాజిక బాధ్యతగా చేసిన కొన్ని పనుల గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రభావవంతంగా తెలియచేయగలిగాను. మిసెస్ ఇండియా యూకే టీమ్ గత ఏడాది నుంచి నాకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ పోటీలకు మనదేశం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి పరిచయం చేసుకుంటాను. – జె. రాధికా మూర్తి, ‘మిసెస్ ఇంటర్నేషనల్’ (యూకే) పార్టిసిపెంట్ – వాకా మంజులారెడ్డి -
అంతరిక్షంలో తెలుగు ధీర
అంతరిక్షం అచ్చ తెలుగులో ‘నమస్కారం’ అనే పలకరింపు విననుంది. కోట్లాదిమంది తెలుగువారి చారిత్రక, జీవన పరంపరకు ప్రతినిధిగా ఒకరు తన వద్దకు వచ్చినందుకు అది విస్మయపు ముచ్చటపడనుంది. యుగాలుగా తల ఎత్తి తెలుగువారు దిగంతాలలో చూపు గుచ్చి ఉంటారు. ఇవాళ పై నుంచి ఒక తెలుగమ్మాయి మనకు చేయి ఊపి హాయ్ చెప్పనుంది. అవును. చరిత్రలో తొలిసారిగా తెలుగు ధీర శిరీష బండ్ల అంతరిక్ష ప్రయాణం కట్టనుంది. అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సామాన్యుల ఊహకు అందేది కాదు. శ్రీమంతులు అందుకోగల ఆలోచనా కాదు. అంతరిక్ష శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ జాబితాలో ‘కమర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్’ ద్వారా ఇటీవల అత్యంత సంపన్నులు చేరుతున్నారు. టెస్లా సి.ఇ.ఓ ఎలాన్ మస్క్ నుంచి అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వరకూ అంతరిక్షం అంచులు తాకాలనువారు ఈ రేస్‌లో ఉన్నారు. అటువంటిది– ఈ అద్భుత ప్రయాణం చేసే అవకాశం మన తెలుగింటి అమ్మాయి బండ్ల శిరీషకు దక్కింది. ఇది ఒక చరిత్రాత్మక అవకాశం. తెలుగువారి చరిత్రలో తొలి అంతరిక్ష యానం చేసిన వ్యక్తిగా/మహిళగా బండ్ల శిరీష ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి మరో తొమ్మిదిరోజుల్లో శిరీష రోదసిలో అడుగుపెట్టబోతోంది. చీరాలలో పుట్టింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాపర్ల వెంకట నరసయ్య, రమాదేవిల కుమార్తె అనూరాధ సంతానం శిరీష. అనురాధ భర్త డాక్టర్ బండ్ల మురళీధర్ ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ప్లాంట్ వైరాలజీలో పీహెచ్డీ చేసి అమెరికాలో స్థిరపడడంతో చీరాలలో పుట్టిన శిరీష నాలుగేళ్ల వయసులో తన అక్క ప్రత్యూషతో అమెరికా వెళ్లింది. శిరీష విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి స్పేస్సైన్స్ను అమితంగా ఇష్టపడే శిరీష పర్డ్యూ యూనివర్సిటిలో ఏరోనాటికల్ అండ్ అస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యాక కమర్షియల్ స్పేస్‌ఫ్లైట్ ఫెడరేషన్ (సీఎస్ఎఫ్)లో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అధునాతన విమాన విడిభాగాలను రూపొందించేది. మరోపక్క జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.‡ఈ క్రమంలోనే 2015లో రిచర్డ్ బాన్సన్ ‘స్పేస్‌ఫ్లైట్’ సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరిన అంచెలంచెలుగా ఎదిగి పరిశోధనా విభాగంలో వైస్‌ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తోంది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తో్తన్న వర్జిన్ ఆర్బిట్ వ్యహారాలను చూస్తూ, మరోపక్క అమెరికన్ ఆస్ట్రోనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్లలో సభ్యురాలిగా, పర్డ్యూ యూనివర్సిటీ యంగ్ ప్రొఫెషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగా ఉంది. ఫలితంగా ఆమెకు అంతరిక్షయానం అవకాశం దక్కింది. బ్రాన్సన్తో కలిసి వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించనున్న నాలుగో స్పేస్ ట్రిప్పులో వర్జిన్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తనతో కలిపి మొత్తం ఆరుగురు టీమ్‌తో పాల్గొననున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు ఉన్నారు. శిరీష ఈ స్పేస్ స్పెషలిస్టుల్లో ఉంది. ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వీరి స్పేస్‌క్రాఫ్ట్ న్యూమెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనితో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్, స్పేస్‌లో అడుగుపెట్టిన తొట్టతొలి తెలుగమ్మాయిగా శిరీషలు చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్‌లో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగానూ, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత భారత సంతతి నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో వ్యోమగామిగా శిరీష నిలవడమే గాక ఈ మిషన్‌లో వెన్నెముకగా పనిచేయనుంది. ఈ క్రూ టీమ్‌లో శిరీషతోపాటు బెత్ మోసెస్ అనే మరో మహిళ కూడా ఉన్నారు. నా మనసంతా అంతరిక్షమే ‘‘నేను చిన్నప్పటి నుంచి వ్యోమగామి అయి అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకునేదాన్ని. ఎప్పుడూ అందుకు సంబంధించిన ఆలోచనలతో నా మనసు నిండిపోయి ఉండేది. హ్యూస్టన్‌లో మా ఇంటికి దగ్గర్లో జాన్సన్ స్పేస్ సెంటర్ ఉండేది. ఆ సెంటర్‌ను సందర్శించినప్పుడల్లా నా కోరిక మరింత బలపడేది. ముందు పైలట్ అవ్వాలి ఆ తర్వాత నాసాలో వ్యోమగామి అవ్వాలి అనుకుని ఆ దిశగా అడుగులు వేద్దామనుకున్నాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడే నా కంటి చూపు సరిగా ఉండేది కాదు. దీంతో పైలట్టే కాదు ... ఆస్ట్రోనాట్ కూడా కాలేను అనుకున్నాను. అయితే 2004లో తొలి ప్రైవేటు వాహనం అంతరిక్షంలోకి వెళ్లిందని తెలిసి నాసా ద్వారానే కాదు వ్యోమగామి అయ్యేందుకు మరో మార్గం ఉందనిపించింది. దీంతో అప్పుడు ఏరో స్పేస్ ఇంజినీర్ అయ్యి వాణిజ్య స్పేస్ సెక్టార్లో పని చేయవచ్చని అనుకున్నాను. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు మైక్రో గ్రావిటీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నేను సీఎస్‌ఎఫ్‌లో చేసిన ఉద్యోగానుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా చిన్ననాటి కల ఈరోజు తీరనున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ శిరీష గతంల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాతయ్య మాట ‘శిరీషకు ఊహ తెలిసినప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి కనపరిచేది. వయసుతోపాటు, ఆకాశం, విమానాలు, రాకెట్లపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. నాలుగేళ్ల వయసులో ఓ రోజు ఇంట్లో కరెంటు పోతే ఒంటరిగా భయపడుతోన్న అమ్మమ్మకు ధైర్యం చెప్పింది’ అని తాతయ్య నరసయ్య సాక్షితో చెప్పారు. ‘2016లో మా వివాహ స్వర్ణోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి శిరీష ఇక్కడకు వచ్చింది. చదువు, ఉద్యోగంతో ఎంత బిజీగా ఉన్నా తరచూ ఫోనులో మా యోగక్షేమాలు తెలుసుకునేది. చిన్నపిల్లగానే మాకు తెలిసిన శిరీష ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లనుందని చెబుతుంటే ఆశ్చర్యంగా, అంతకుమించిన సంతోషంగా ఉంది’ అన్నారు. – పి.విజయ, సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి -
రాజమౌళి సినిమాలో చేయాలని ఉంది: మానస వారణాసి
ఫెమినా మిస్ ఇండియా కిరీటంతో అందరి హృదయాలను గెలుచుకొని మిస్ వరల్డ్ కోసం అడుగులు వేస్తున్న తెలుగమ్మాయి మానస వారణాసి. నగరానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన మానస తనకంటూ ఉన్న కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు, ఇష్టాలను షేర్ చేసుకున్నారు. ► ముందుగా మీలో మీకు బాగా నచ్చే లక్షణం? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రశాంతంగా ఉంటేనే ఎదైనా సాధించగలం. ► మీలో నచ్చనిది..? లేజీనెస్...! చేయవలసిన పనులను ఎక్కు వగా వాయిదా వేస్తుంటాను. ► ఇష్టమైన ఫుడ్..? పూర్తిగా వెజిటేరియన్‌ని. వెజిటేరియన్లో ఎదైనా సరే ఇష్టంగా తింటాను. ముఖ్యంగా పులిహోరా నా ఫేవరెట్. ► నచ్చిన సినిమాలు..? తెలుగులో బాహుబలి, వేరే బాషల్లో అయితే ఇంటర్స్టెల్లర్. ► ఇష్టపడే ఫిల్మ్ స్టార్స్...? ఆయుష్ ఖురానా, ప్రియాంక చోప్రా. ► నచ్చిన కలర్..? ఫైర్ రెడ్. ► ఎలాంటి డ్రెస్సింగ్‌ని ఇష్టపడతారు...? ఇండియన్ వేర్. ► పెర్ఫ్యూమ్స్...? కొరియాండర్, లావెండర్ ఫ్లేవర్స్.. ► నచ్చే పుస్తకం..? లిటిల్ ప్రిన్స్ ► ఎలాంటి గేమ్స్ ఇష్టం..? మెదడుకు పనిపెట్టేవి. ► నచ్చిన ప్లేస్? ఎవ్వరినైనా ఆహ్వానించే సుగుణం ఉన్న హైదరాబాద్ నగరం. ► ఇష్టమైన వాహనం? కంఫర్ట్‌గా ఉండే ఏ కారైనా ఇష్టమే. ► ఇష్టమైన పనులు...? సేవ చేయడం. ఆల్రెడీ కొన్ని ఎన్జీవోలతో కలిసి వాలంటీర్‌గా పని చేసాను. ► మోడలింగ్‌లోకి రాకుండా ఉంటే..? యోగా ట్రైనర్‌ని అయ్యేదానిని. ► హబీస్...? పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. పాటలు కూడా పాడతాను. ► ఫిట్‌నెస్‌కు సంబంధించిని నియమాలు? రెండేళ్లుగా క్రమం తప్పకుండా యెగా చేస్తున్నాను. కానీ డైట్ మాత్రం పాటించను. మా అమ్మమ్మ చేసిన వంటకాలేవీ వదలను. ► మీ సక్సెస్ మంత్ర? ఎమోషనల్‌గా, స్ప్రిచ్యువల్గా బ్యాలెన్స్డ్ గా ఉంటాను. అప్పుడే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతాను. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను. ప్రతి పనిలో గతం కంటే ఉన్నతంగా ఉండేలా కష్టపడుతాను. గోల్స్ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అప్పుడే మనం చేసే పనులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఐ లవ్ చాలెంజెస్. ► సినిమాల్లో అవకాకాశాలు వస్తే ..? ప్రస్తుతం నా ధ్యాస అంతా మిస్ వరల్డ్ పైనే. రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని ఉంది. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి, హైదరాబాద్ ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
ఒడిదుడుకులు తట్టుకుంటేనే విజయం సాధిస్తాం
షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికై రికార్డు సృష్టించారు. షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం జరిగిన రెండవ టర్మ్ మేయర్ ఎన్నికల్లో యెన్నం కాంచన ఘన విజయం సాధించారు. అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో రెండేళ్ల క్రితం కృష్ణవేణి రెడ్డి కార్పొరేటర్‌గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు మహిళ కాంచన యెన్నం ఏకంగా మేయర్ పదవిని కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. పెళ్లి తర్వాతే తన జీవితంలో మార్పు పచ్చిందని కాంచన యెన్నం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఈగె అయిలప్ప, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన కాంచన షోలాపూర్‌లోనే పుట్టి పెరిగారు. స్థానిక డీఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాంచనకు ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన యెన్నం రమేష్‌తో 1992లో వివాహం జరిగింది. సాధారణ గృహిణిగానే జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఆమె భర్త రమేష్ రాజకీయాల్లో తిరుగుతుండడం చూసి ఆమెకు కూడా కూడా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజసేవ చేయాలన్న సంకల్పం కలిగింది. దాంతో బీడీ కార్మికులు, కుట్టు పనులు చేసే మహిళలు తదితరుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయగలగడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. భర్త ప్రేరణ, ప్రోత్సాహం సమాజసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలోనే కాంచనకు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ‘‘1997లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేముండే మార్కండేయనగర్ వార్డు మహిళ కోటాలోకి రావడంతో ఈ వార్డు నుంచి టికెట్ కోసం నా భర్త తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఏ పార్టీకోసం పాటు పడుతున్నారో, ఆ పార్టీనే తనను పక్కన పెట్టేసరికి ఇద్దరం పార్టీ మారాం. ఇలా సుమారు గత 22 సంవత్సరాలుగా మేము బీజేపీలో కొనసాగుతున్నాం. 2002లో బీజేపీ నాకు మార్కండేయనగర్ వార్డు (షోలాపూర్ కార్పొరేషన్) నుంచి టికెట్ ఇచ్చింది. అలా నేను నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్‌గా విజయం సాధించి కార్పొరేషన్లో అడుగుపెట్టాను. అప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాను’’ అని కాంచన తెలిపారు. ఊహించని విజయం అయితే మేయర్ పీఠం దక్కుతుందని మాత్రం తను ఊహించలేదని కాంచన అన్నారు. ‘‘బీజేపీ నన్ను అభ్యర్థిగా ప్రకటించింది. నాకు పోటీగా శివసేనకు చెందిన సారిక పిసే, కాంగ్రెస్‌కు చెందిన ఫిర్దోస్ పటేల్, ఎంఐఎంకు చెందిన శహజిదా బానో శేఖ్ బరిలోకి దిగారు. అయితే ఎన్నికకు ముందు సారిక పిసే, ఫిర్దోస్ పటేల్‌లు తప్పుకోవడంతో బానో శేఖ్తో నాకు పోటీ ఏర్పడింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఐఎంలు జత కట్టాయి. కాని ఎన్నికకు ఒక రోజు ముందే వీడిపోయారు. దాంతో ఈ ఎన్నికలో నాకు 51 ఓట్లు పోలవ్వగా బానో శేఖ్కు కేవలం ఎనిమిది ఓట్లు పోలయ్యాయి. ఇలా ఊహించని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించగలిగాను’’ అని ఆమె చెప్పారు. ఆదర్శ కార్పొరేటర్ కుటుంబ సభ్యులతో (భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తె, మనుమడు) యెన్నం కాంచన కాంచన యెన్నం అనేక పదవులను అలంకరించారు. సుమారు 17 ఏళ్లనుంచి కార్పొరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా ప్రస్తుతం షోలాపూర్ బీజేపీ వర్కింగ్ కమిటి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దీంతోపాటు ఇందిరా మహిళ సహకార బ్యాంకుకు వైస్ చైర్మన్‌గా, షోలాపూర్ మన్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) మహిళ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, అదేవిధంగా ఎస్‌ఎంసిలోని పలు పదవులను అలంకరించారు. 2016–17లో స్టాండింగ్ కమిటి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆదర్శ కార్పొరేటర్ అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోనే కాదు ఏ పనిలోనైనా జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజమని కాని వాటిని తట్టుకుంటేనే విజయం లభిస్తుందని కాంచన యెన్నం అంటారు. – గుండారపు శ్రీనివాస్, మావునూరి శ్రీనివాస్ సాక్షి, ముంబై -
షోలాపూర్ మేయర్‌గా తెలుగు మహిళ
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ మున్సిపాలిటీ మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మేయర్ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. జిల్లా పరిషత్ సీఈవో ప్రకాశ్ వాయ్‌చల్ పర్యవేక్షణలో ఎస్ఎంసీ కౌన్సిల్ హాల్లో బుధవారం జరిగిన ఎన్నికలో బీజేపీ కార్పొరేటర్ అయిన కాంచన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా బీజేíపీ కార్పొరేటర్ రాజేశ్ కాళే విజయం సాధించారు. 22 ఏళ్లుగా ప్రజా జీవితంలో.. సదాశివపేటకు చెందిన కాంచన కుటుం బం చాలా కాలం కిందే షోలాపూర్ వెళ్లి స్థిరపడింది. కాంచన భర్త రమేశ్ దుప్పట్లు, టవల్స్ సేల్స్ ఏజెంటుగా పనిచేస్తుంటారు. ప్రజా జీవితంలో సేవలందించడం అంటే కాంచనకు ఎంతో ఇష్టమని ఆమె భర్త తెలిపారు. 22 ఏళ్ల కిందట 1997లో కాంచన రాజకీయ ప్రవేశం చేశారని చెప్పారు. మహిళా పొదుపు సంఘాలు స్థాపించి మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు. 2002లో ఎన్నికల బరిలో దిగిన తొలిసారే షోలాపూర్ కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత 2007, 2012, 2017 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ‘అందరినీ కలుపుకొని ముందుకెళ్తా’ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని మేయర్‌గా విజయం సాధించిన అనంతరం కాంచన పేర్కొన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీతో పాటు మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు లేకుండా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. -
ట్విట్టర్ సీఈవో రేసులో తెలుగు మహిళ
విజయవాడ: ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్‌కు సీఈవోగా విజయవాడకు చెందిన ఎల్లపద్ది పద్మశ్రీ వారియర్ పేరు పరిశీలనలో ఉంది. నలుగురి పేర్లను ట్విట్టర్ యాజమాన్యం పరిశీలనకు తీసుకుంది. ఇందులో పద్మశ్రీ పేరు కూడా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. పద్మశ్రీ ఎలిమెంటరీ స్థాయి నుంచి డిగ్రీ వరకు విజయవాడలోనే చదువుకున్నారు. అనంతరం ముంబై, అమెరికాల్లో విద్యాభ్యాసం చేశారు. మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో 23 ఏళ్ల పాటు పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా పలు అవార్డులు కూడా అందుకున్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో పద్మశ్రీ 1961లో జన్మించారు. పదో తరగతి వరకు చిల్డ్రన్స్ మాంటిస్సోరిలో.. మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్ చదివారు. ఐఐటీ, ముంబైలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలో కార్నెల్లి యూనివర్సిటీలో పీజీ చేసిన అనంతరం మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో 1984లో ఉద్యోగంలో చేరిపోయారు. 2007 వరకు పనిచేశారు. 2007లో సిస్కో ఎనర్జీ సిస్టమ్స్‌లో సీటీవోగా చేరారు. 2015 జూన్‌లో సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ఆమెకు భర్త మోహన్‌దాసు వారియర్, కుమారుడు కర్నా వారియర్ ఉన్నారు. -
వరకట్నదాహానికి యువతి బలి!