వాషింగ్టన్: అమెరికాలో గత జనవరిలో పోలీసు వాహనపు అతి వేగానికి బలైన తెలుగమ్మాయి జాహ్నవి కందుల విషయంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సియాటిల్ పోలీసు అధికారి డేనియల్ ఆడరర్‌పై ఆగ్రహ జ్వాలలు నానాటికీ పెరుగుతున్నాయి. ‘ఇదేమంత పెద్ద విషయం? ఏ 11 వేల డాలర్లకో చెక్కు రాస్తే సరి. ఆమెకు 26 ఏళ్లు. అలా చూస్తే ఆమె జీవితం అంత విలువైనదేమీ కాదు‘ అంటూ ఈ ఉదంతంపై అతను చేసిన వ్యాఖ్యలు గత సోమవారం బాడీకామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి.
అప్పటినుంచీ వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజా కృష్ణమూర్తి వంటి భారత అమెరికన్ చట్ట సభ్యులతో పాటు అమెరికా చట్ట సభ్యులు కూడా వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డేనియల్ ప్రవర్తన మీద స్వతంత్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆన్‌లైన్ పిటిషన్ దాఖలైంది.
నిషిత రహేజా గోయల్ అనే భారత్ అమెరికన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. శుక్రవారం రాత్రికే సంతకాల సంఖ్య 6,700 దాటిపోయింది. ‘డేనియల్ ప్రవర్తనతో సియాటిల్ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఇకపై కొత్తగా పోలీసు శాఖలో చేరే ప్రతి ఒక్కరికీ సున్నితత్వం తదితరాల విషయంలో విధిగా శిక్షణ ఇవ్వాలి.
అప్పుడే జాహ్నవి, అలాంటి ఇతర బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన చేకూరుతుంది‘ అని పిటిషన్ పేర్కొంది. మరోవైపు, డేనియల్‌ను సియాటిల్ పోలీసు అధికారుల గిల్డ్ సమర్థించింది! అతను ప్రైవేట్‌గా చేసిన వ్యాఖ్యలను అసంబద్ధంగా విడుదల చేసి అపార్థాలకు తావిచ్చారని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. తన వ్యాఖ్యలను దురర్థం వచ్చేలా వక్రీకరించారని డేనియల్ కూడా ప్రకటన
విడుదల చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment