online petition
-
ఆ పోలీసును తొలగించాలి
వాషింగ్టన్: అమెరికాలో గత జనవరిలో పోలీసు వాహనపు అతి వేగానికి బలైన తెలుగమ్మాయి జాహ్నవి కందుల విషయంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సియాటిల్ పోలీసు అధికారి డేనియల్ ఆడరర్పై ఆగ్రహ జ్వాలలు నానాటికీ పెరుగుతున్నాయి. ‘ఇదేమంత పెద్ద విషయం? ఏ 11 వేల డాలర్లకో చెక్కు రాస్తే సరి. ఆమెకు 26 ఏళ్లు. అలా చూస్తే ఆమె జీవితం అంత విలువైనదేమీ కాదు‘ అంటూ ఈ ఉదంతంపై అతను చేసిన వ్యాఖ్యలు గత సోమవారం బాడీకామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజా కృష్ణమూర్తి వంటి భారత అమెరికన్ చట్ట సభ్యులతో పాటు అమెరికా చట్ట సభ్యులు కూడా వాటిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డేనియల్ ప్రవర్తన మీద స్వతంత్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. నిషిత రహేజా గోయల్ అనే భారత్ అమెరికన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. శుక్రవారం రాత్రికే సంతకాల సంఖ్య 6,700 దాటిపోయింది. ‘డేనియల్ ప్రవర్తనతో సియాటిల్ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఇకపై కొత్తగా పోలీసు శాఖలో చేరే ప్రతి ఒక్కరికీ సున్నితత్వం తదితరాల విషయంలో విధిగా శిక్షణ ఇవ్వాలి. అప్పుడే జాహ్నవి, అలాంటి ఇతర బాధిత కుటుంబాలకు కాస్తయినా సాంత్వన చేకూరుతుంది‘ అని పిటిషన్ పేర్కొంది. మరోవైపు, డేనియల్ను సియాటిల్ పోలీసు అధికారుల గిల్డ్ సమర్థించింది! అతను ప్రైవేట్‌గా చేసిన వ్యాఖ్యలను అసంబద్ధంగా విడుదల చేసి అపార్థాలకు తావిచ్చారని ఆరోపించింది. ఈ మేరకు సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. తన వ్యాఖ్యలను దురర్థం వచ్చేలా వక్రీకరించారని డేనియల్ కూడా ప్రకటన విడుదల చేశాడు. -
‘ట్రీ వాక్’ చేద్దాం.. మర్రిచెట్లను కాపాడుదాం!
ఊడలుగా విస్తరిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వందల ఏళ్లు జీవిస్తుంది ఎన్నో జీవ రాశులకు ఆశ్రయమిస్తుంది అందుకే, భగవద్గీతలో పరమాత్మ చెట్లలో నేను మర్రిచెట్టును అన్నాడు. మనిషి ఎదుగుదలలో మర్రిచెట్టును శిఖరమంతగా పోల్చవచ్చు. అలాంటి మర్రిచెట్టుకు రక్షణ కరువైతే ...!! రోడ్లు అనో, డబ్బు వస్తుందనో... మనిషి తన స్వార్థం కోసం మర్రిచెట్లను తొలగించుకుంటూ పోతే... మన మనుగడ మాత్రమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయానికి గొడ్డలిపెట్టు కాదా?! చెట్లను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఈ నినాదంతో మర్రిచెట్లను కాపాడుదాం.. అని బయల్దేరారు. హైదరాబాద్‌వాసులు ఆసియా ఖాన్, కోబితా దాస్ కొల్లి, సాధన రాంచందర్. వీరి ఆలోచనకు మద్దతునిస్తూ మరికొందరు జత కలిశారు. ఒక చెట్టు ఊడలు ఊడలుగా విస్తరిస్తుందంటే ఆ చెట్టు మనకేదో సందేశం ఇస్తుందని అర్థం. కానీ, ఈ రోజుల్లో ఇది అనర్థం వైపుగా కదులుతోంది. దీనికి అడ్డుకట్టవేయడానికే మేం బయల్దేరాం అన్నారు అసియా, సాధన, కోబితా దాస్. కదిలించిన వార్త ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరంతా కొన్నాళ్లుగా ‘ట్రీ వాక్’ పేరుతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి, వందలనాటి చెట్లను గమనించి, వాటి గురించి తెలుసుకుని వచ్చేవారు. స్కూల్ పిల్లలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. ‘కొన్నాళ్లుగా చెట్లను స్టడీ చేయడంలో ఉండే మా ఆసక్తి ఒక రోజు వచ్చిన వార్త కదిలించింది. 2019లో రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో ఉన్న 9 వేల చెట్లను కట్ చేయడం లేదా వేరే చోటకు తరలించబోతున్నారు..’ అనేది ఆ వార్త సారాంశం. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. చేవెళ్ల రోడ్డులో ఉన్న ఆ చెట్ల సౌందర్యం చూడటానికి మాటలు చాలవు. అంతటి అనుభూతిని ఎలా దూరం చేస్తారు..? మాలో ఎన్నో అలజడులు. మాతో కలిసిన మరికొంత మందితో ఈ విషయాన్ని చర్చించాం. వారూ మా ఆలోచనకు మద్దతునిచ్చారు. వారం వారం ఆ చెట్లకిందనే జనాలను పోగుచేసి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వెయ్యి మర్రి చెట్లను రక్షించడానికి ఒక ఆన్లైన్ పిటిషన్ పెట్టాం. 63 వేల మంది ఈ పిటిషన్ మీద సంతకాలు చేసి, మద్దతు ఇచ్చారు. నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర ప్రభుత్వ అధికారులనే కలిసి మర్రిచెట్ల సంరక్షణ గురించి వివరించాం. ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం’ అని వివరించారు ఈ పర్యావరణ ప్రేమికులు. తరలింపు సరైనదేనా?! రోడ్డు వెడల్పు కోసం ఇక్కడి మర్రిచెట్లను మరో చోటకు తరలించాలనుకుంటే.. వాటిని యధాతధంగా చేయలేరు. వాటి కొమ్మలను నరికేస్తారు. కేవలం మధ్యలో ఉన్న భాగాన్నే తీసుకెళ్లి నాటుతారు. వందల ఏళ్లుగా పాతుకుపోయిన వేళ్లు లేకపోతే, ఆ చెట్టు ఎలా బతుకుతుంది. మోడుపోయినట్టుగా ఉన్న చెట్టు చిగురించినా ఎన్నాళ్లు బతుకుతుంది? అందుకే నేషనల్ (ఎన్హెచ్ఎ) వాళ్లను కలిశాం. కాపాడమని లెటర్లు ఇచ్చాం. తర్వాత ఈ చెట్లను కట్ చేయడం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయరు అని అదే ఏడాది వార్త వచ్చింది. సంతోషమేసింది. అయితే, అంతటితో వదిలేయలేదు. రెగ్యులర్‌గా వెళ్లి చెట్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. మళ్లీ కిందటేడాది రోడ్డు వెడల్పుకు చెట్లను కొట్టేస్తారన్నారు. దీంతో అవగాహన కార్యక్రమాలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులను కలిసి, ప్రపంచంలో మరెక్కడా లేని ఈ మర్రి చెట్ల మార్గాన్ని తొలగించవద్దని అర్జీలు పెడుతున్నాం. అవగాహన అవసరం చెట్టుకు ఇవ్వాల్సిన రక్షణ గురించి తెలిస్తే, కాపాడే గుణం కూడా వస్తుంది. అందుకే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీపావళి సమయంలో చెట్లకింద దీపాలు పెట్టడం, మరోసారి చెట్లకింద నిల్చొని పద్యాలు చదవడం, ఇంకోసారి నిశ్శబ్దంగా ఉండటం, చెట్టుకు స్వాతంత్య్రం .. ఇలా రకరకాల థీమ్‌లతో చెట్ల వద్దే కాదు, నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో ప్రాచీన వృక్షాలను కాపాడటం ఎలాగో వివరిస్తున్నాం. మొత్తం పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న మర్రిచెట్టును రక్షిస్తే సకల జీవరాశిని రక్షించినట్టే. ఇటీవలే ఢిల్లీలో ఒకచోట ఇలాగే చెట్లను మరో చోట నాటే ప్రయత్నం చేస్తే, వాటిలో చాలా చెట్లు బతకలేదని తెలిసింది. ప్రభుత్వం ఈ చెట్ల మార్గాన్ని నేచురల్ హెరిటేజ్‌గా మార్చాలన్నది మా ప్రయత్నం. కొన్నిసార్లు నెమ్మది అవసరమే! ‘జీవితంలో అన్ని చోట్లా వేగం సరికాదు. కొంత నెమ్మది కూడా మంచిది. వేగంగా వెళ్లాలనుకునేవారు ఇతర హైవేల నుంచి వెళ్లచ్చు. ఈ ఒక్క రోడ్డును మాత్రం వదిలేయమని మేం కోరుతున్నాం’ అంటారు ఆసియా ఖాన్. ‘మాతోపాటు మా బృందంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. మాకు సపోర్ట్ చేసే మగవారు కూడా మా బృందంలో చేరారు. స్వచ్ఛందంగా చేసే ఈ నేచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మర్రిచెట్లను కాపాడటం కోసం చేసే అవగాహన సదస్సులలో పాల్గొనేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. (క్లిక్: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!) ఈ యేడాది జూన్‌లో 914 మర్రి చెట్లకు జియో ట్యాగ్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి వాలెంటీర్ల చాలా రోజులపాటు పనిచేశారు. చెట్టు ఏ దిశలో, ఎలా ఉంది..అనే వివరాలతో ఫొటోలతో సహా ప్రతి మర్రి చెట్టు డేటా ఏర్పాటు చేశాం. దీనిని ఆన్లైన్లో కూడా పెట్టాం. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వందల ఏళ్ల నాటి చెట్లు ఉంటే, వాటి గురించి సమాచారం సేకరించి, వాటిని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని వివరించారు ఈ పర్యావరణప్రేమికులు. అనవసర ఆలోచనలు, అవసరాల నుంచి దూరమై, చెట్టును కాపాడుదాం. – నిర్మలారెడ్డి -
US Open: 'జోకర్' ఆడడం కష్టమే.. ఆన్లైన్లో ఫ్యాన్స్ సంతకాల సేకరణ
సెర్బియా టెన్నిస్ స్టార్.. ముద్దుగా 'జోకర్' అని పిలుచుకునే నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో మరోషాక్ తగిలేలా ఉంది. ఇటీవలే ముగిసిన వింబూల్డన్ ట్రోఫీ నెగ్గడం ద్వారా 21 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన జొకోవిచ్.. యూఎస్ ఓపెన్‌లో ఆడి స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ రికార్డు (22)ను సమం చేయాలని భావిస్తున్నాడు. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న జొకోవిచ్‌కు మరో గండం పొంచి ఉంది. గురువారం విడుదలైన డ్రా లో జొకోవిచ్ పేరు ఉన్నప్పటికీ అతడు ఈ టోర్నీ ఆడేది అనుమానంగానే ఉంది. వ్యాక్సిన్ వేసుకోనివారిపై నిషేధం లేకున్నా అమెరికా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు మెలిపెట్టడంతో జొకోవిచ్ ఈ టోర్నీ ఆడటం కష్టమేనంటూ వార్తలు వస్తున్నాయి. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో.. ‘ఈ టోర్నీలో వ్యాక్సిన్ వేసుకున్నవారినే అనుమతించాలన్న ఆదేశాలేం లేవు. కానీ మా ప్రభుత్వ విధానం ప్రకారం మేం నడుచుకుంటాం..’ అని తెలిపింది. అగ్రరాజ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. యూఎస్ పౌరులు మినహాయించి వ్యాక్సిన్ వేసుకోని వారికి దేశంలో ప్రయాణం చేసే ఆస్కారం లేదు. దీంతో జొకోవిచ్‌కు ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ (కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదని ఈ టోర్నీ ఆడనివ్వలేదు)లో ఎదురైన అనుభవమే మళ్లీ ఎదుర్కోక తప్పదని వాదనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జొకోవిచ్ అభిమానులు ఆన్లైన్ పిటిషన్ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. జొకోవిచ్‌ను యూఎస్ ఓపెన్‌లో ఆడించాలని కోరుతూ ఆన్లైన్లో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా దీనిలో సంతకాలు చేశారు. మరి జొకోవిచ్ విషయంలో అమెరికా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోనని అతడి అభిమానులతో పాటు టెన్నిస్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆగస్టు 27 నుంచి యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. అయితే మొదటినుంచి కరోనా వ్యాక్సిన్ వేసుకొనంటూ మొండి పట్టు పట్టిన ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భంగపాటే ఎదురైంది. కోర్టు మెట్ల వరకు సాగిన వివాదంలో తీర్పు చివరకు జొకోవిచ్‌కు వ్యతిరేకంగానే వచ్చింది. వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించిన జోకోవిచ్‌పై ఆసీస్ ప్రభుత్వం మూడేళ్లపాటు నిషేధం విధించింది. ఒక రకంగా జొకో కెరీర్లో ఈ ఉదంతం మాయని మచ్చ అని చెప్పొచ్చు. Apparently 12000 people have signed an online petition to the US government and the USTA to allow @DjokerNole to play the US Open. These people need to understand it has nothing to do with the USTA, they have no control over the situation. It's a federal government mandate. — Craig Gabriel (@crosscourt1) July 20, 2022 చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది' -
ఆ సీరియల్‌కు షాక్!
తీవ్ర వివాదాస్పదమైన హిందీ సీరియల్ 'పెహ్రెదార్ పియా కీ'కు బ్రేక్ పడింది. సోనీ చానెల్ ఈ సీరియల్ ప్రసారాన్ని అర్ధంతరంగా నిలిపేసింది. తొమ్మిదేళ్ల బాలుడు 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకొనే కథాంశంతో రూపొందిన ఈ సీరియల్‌పై తీవ్ర విమర్శలు రావడంతో.. సోనీ చానెల్ సోమవారం నుంచి అర్ధంతరంగా దీని ప్రసారాలు నిలిపేసింది. సీరియల్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఇందులో నటించిన నటీనటులకు, దర్శకనిర్మాతలకు షాక్‌నిచ్చింది. ఈ సీరియల్‌కు వ్యతిరేకంగా ఛేంజ్.ఓఆర్జీ వెబ్సైట్లో చేపట్టిన ఆన్లైన్ సంతకాల సేకరణకు పెద్దస్థాయిలో మద్దతు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఈ సీరియల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్లైట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)కు లేఖ రాశారు. రంగంలోకి దిగిన బీసీసీసీ సీరియల్ ప్రసార సమయాన్ని మార్చాలని, బాల్యవివాహాలను ప్రోత్సహించడంలేదంటూ సీరియల్ ప్రారంభంలో ప్రకటన ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీరియల్లో కాలాన్ని కొంత ముందుకుతీసుకెళ్లి ప్రధాన పాత్రలు యుక్త వయస్సుకొచ్చిన తర్వాత ఎపిసోడ్స్‌ను ప్రసారం చేస్తారని భావించారు. కానీ, వివాదాల నేపథ్యంలో సోనీ చానెల్ ఏకంగా సీరియల్ ప్రసారాన్నే నిలిపివేయడం 'పెహ్రెదార్ పియా కీ' యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోనీ చానెల్ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తసున్నారు. ఈ సీరియల్లో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్ కథ. బాలుడు యువతి వెంటపడుతున్నట్టు.. 'మొదటిరాత్రి' గురించి చెప్తున్నట్టు అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో ఈ సీరియల్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైమ్ టైమ్‌లో వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఆ సీరియల్‌పై కేంద్రం కన్నెర్ర!
వెంటనే చర్య తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లేఖ వివాదాస్పద సీరియల్ 'పెహ్రెదార్ పియా కీ'పై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ సీరియస్‌గా స్పందించారు. తొమ్మిదేళ్ల బాలుడు 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకొనే కథాంశంతో రూపొందిన ఈ సీరియల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్లైట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)కు లేఖ రాశారు. అధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ సీరియల్ ప్రసారాలపై చర్య తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ సీరియల్ సోనీ టీవీలో ప్రసారం అవుతోంది. ఇందులో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్ కథ. 18 ఏళ్ల అమ్మాయిని బాలుడు వెంటాడుతున్నట్టు.. 'మొదటిరాత్రి' గురించి చెప్తున్నట్టు అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ టైమ్‌లో వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చే ప్రమాదం ఉందని పలువురు వాదిస్తున్నారు ఛేంజ్.ఓఆర్జీ వెబ్సైట్లో మాన్సి జైన్ అనే పిటిషనర్ ఈ సీరియల్‌కు విరుద్ధంగా ఆన్లైన్ సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే ఈ పిటిషన్‌కు భారీస్థాయిలో మద్దతు లభిస్తుండటంతో కేందమంత్రి స్మృతి ఇరానీ స్పందించి.. సీరియల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీసీసీని కోరారు. -
ఆ సీరియల్ బ్యాన్ చేయాల్సిందే!
వైవిధ్యమైన కాన్సెప్ట్‌ల పేరిట బుల్లితెరపై చేస్తున్నప్రయోగాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా హిందీలో ప్రసారం అవుతున్న ఓ సీరియల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాన్ చేయాలంటూ ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకే విజ్ఞప్తి చేస్తున్నారు. దాని కాన్సెప్ట్ అలాంటిది మరి. వివరాల్లోకి వెళితే... `పెహ్రేదార్ పియా కీ` అనే సీరియల్ సోనీ టీవీలో ప్రసారం అవుతోంది. అందులో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్ కథ. అయితే ప్రైమ్ టైమ్‌లో వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచనా విధానాలను మార్చే విధంగా ఉందని పలువురు వాదిస్తున్నారు ఛేంజ్.ఓఆర్జీ పేరిట మాన్సి జైన్ ఆన్లైన్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే ఈ పిటిషన్‌పై 42,000 మంది సంతకాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. జూలై 17న మొదటి ఎపిసోడ్ ప్రసారంకాగా, ఈ మధ్య కొన్ని ఎపిసోడ్లలో శోభనం రాత్రి, హనీమూన్ వంటి రిఫరెన్స్‌లతో కూడిన కొన్నిసన్నివేశాలను చూపించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు కోటు కేసులో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, సీఎం చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలని సామాన్య జనం కోరుతున్నారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ కు ఆన్ లైన్ పిటిషన్ పంపనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా change.org పేరుతో ఒక పేజీని రూపొందించి సంతకాల సేకరణ చేపట్టారు. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పేజీని ప్రారంభించిన 24 గంటల్లోనే 5 వేల మందిపైగా సంతకాలు చేయడం విశేషం. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులకు ఈ పిటిషన్ పంపనున్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ పై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సామాన్యులు తమ గళం వినిపించేందుకు ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. డబ్బు, అధికారం ఉంటే కేసులు నుంచి తప్పించుకోవచ్చన్న భావన సమాజంలో ఉందని.. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని గళం విప్పారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని విచారణ ముందుకు సాగకుండా చూసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశ పౌరులుగా ఇలాంటి పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ఓటుకు కోట్లు కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుకుంటున్నట్టు ఆన్ లైన్ పిటిషన్ (change.org) లో పేర్కొన్నారు. దోషులను తగిన విధంగా శిక్షించాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు. గత రెండు రోజులుగా ఈ ఆన్ లైన్ పిటిషన్ పై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఈ సంతకాల సేకరణ ఊపందుకుంది. -
ఆన్ లైన్ పిటిషన్ వైరల్, 15 వేల మంది సంతకాలు!
మహిళలపై అత్యాచారాలకు పాల్పడతామని, యాసిడ్ దాడులు చేస్తామని సోషల్ మీడియాలో బెదిరించిన వారి ట్విటర్ ఖాతాలు తొలగించాలని ప్రముఖ గాయని శ్రీపాద చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ ఫైల్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న వారి ట్విటర్ ఖాతాలు మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. 'ఇలాంటి బెదిరింపులు నన్ను భయాందోళనకు గురిచేశాయి. నా జీవితం గురించి ఎంతో భయం కలుగుతోంద'ని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు దుండగులను అరెస్ట్ చేశారు. వీరిని 10 రోజుల పాటు జైలులో ఉంచారు. తనలా బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్న సామాన్య మహిళలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్న చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ పెట్టారు. మహిళలను బెదిరిస్తున్న వారి ఖాతాలు మూసివేయాలని ట్విటర్ ను కోరారు. 'మహిళలపై దాడులను ప్రోత్సహించేవిధంగా ట్విటర్ ఉండకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న ఖాతాలను తొలగిస్తున్నట్టుగానే మహిళలను వేధిస్తున్న వారి అకౌంట్లను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. వైరల్ గా మారిన చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ పై 15,364 మంది సంతకాలు చేశారు. ఇంకా 9,636 మంది సంతకాలు చేస్తే ఆమె లక్ష్యం నెరవేరుతుంది. -
కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో?
న్యూయార్క్: శ్వేతజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల వ్యవహారం అమెరికాలో తెలుగువారిని గట్టిగానే మేల్కొలిపింది. వరుసగా తెలుగువారిపై, భారతీయులపై జాతి వివక్ష పూరితమైన దాడులు జరుగుతుండటం పట్ల ఇప్పటికే బాహాటంగా తమ నిరసన వాణిని సోషల్ మీడియా, పత్రికల ద్వారా వెలిబుచ్చిన భారతీయ ముఖ్యంగా తెలుగు సమాజం ఇప్పుడు నేరుగా అమెరికా అధ్యక్ష భవనం నుంచి హామీ ప్రకటనకోసం ప్రయత్నం ప్రారంభించింది. ఇందుకోసం నేరుగా అధ్యక్ష భవనానికి తమ మొర వినిపించేందుకు ఇప్పటికే ఉన్న ఆన్లైన్ పోర్టల్ ‘వి ది పీపుల్’ ద్వారా ప్రస్తుతం జరిగిన ఘటనపై స్పందనగానీ, ఇక ముందు అలాంటివి జరగకుండా అనుసరించనున్న విధానాలపై వివరణ ఇవ్వాలంటూ కోరింది. ఇందు కోసం సంతకాల సేకరణ ప్రారంభించింది. ఫిబ్రవరి 24న జాతి వివక్షతో భారతీయ ఇంజనీర్లపై దాడులు జరుగుతున్నాయి అనే శీర్షిక పెట్టి ఎస్వీ అనే వ్యక్తి ఆన్లైన్ పిటిషన్ వేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. శ్వేత సౌదం స్పందించాలంటే నెల రోజుల్లో దీనిపై కనీసం లక్ష సంతకాలు ఉండాలి. ప్రస్తుతం ఈ అంశంపై 3,023మంది సంతకాలు చేశారు. ఇంకా కొనసాగుతోంది. మార్చి 26నాటికి ఈ సంతకాల సంఖ్య లక్షకు చేరాల్సి ఉంటుంది. ఈ నెల (ఫిబ్రవరి) 22, కాన్సాస్‌లోని ఆస్టిన్ బార్లో ఓ అమెరికన్ దురహంకారి కాల్పులు జరపడంతో తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోయాడు. మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని గాయపడ్డాడు. ఈ ఘటనపై మొత్తం తెలుగువారికే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపే వ్యక్తి మా దేశం నుంచి వెళ్లిపోండి అని అడిగి మరీ కాల్పులు జరపడం ముమ్మాటికి జాతి వివక్ష దాడిగానే పరిణించాలని, ఆ కోణంలోనే దర్యాప్తు చేయాలని అక్కడి తెలుగువారు డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా దీనిని ఒక మాములు అంశంగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటే బాధితుల కుటుంబాలకు న్యాయం జరగనట్లేనని వారు అంటున్నారు. మరోపక్క, ఈ ఘటనను ట్రంప్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కారణంగా ఆన్లైన్ పిటిషన్ వైట్ హౌస్‌కు చేశారు. (చదవండి: విద్వేషపు తూటా!) నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! వైట్‌హౌస్ సంప్రదాయాలు కాలరాస్తున్న ట్రంప్! -
ఆ పోర్న్ స్టార్‌ను రాయబారిగా నియమించండి!
అమెరికాలో వైరల్ ఆన్లైన్ పిటిషన్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడంతో చాలామంది షాక్ తిన్నారు. పలువురు అమెరికన్లయితే గుండెలు అవిసేలా రోదించారు. బిజినెస్ టైకూన్ అయిన్ ట్రంప్ గెలుపుతో అమెరికా అంతటా ఆందోళనలు చెలరేగాయి. అందుకు కారణం ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఉయోగించిన విద్వేష భాషనే. ముస్లింలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తానని, అమెరికాలోని వలసదారులపై కొరడా ఝళిపిస్తానని ట్రంప్ పలు విద్వేషపూరితమైన హామీలు ఇచ్చారు. అయితే, ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన హామీలపై కొంత వెనుకకు తగ్గినట్టు కనిపిస్తోంది. భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. ట్రంప్ తొలి మహిళా నియామకం ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఒక చిత్రమైన విజ్ఞప్తి ఆన్లైన్లో అందింది. ప్రముఖ పోర్న్‌స్టార్‌గా, శృంగార తారగా పేరొందిన మియా ఖలిఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలంటూ చేంజ్.ఓఆర్జీ వెబ్సైట్లో ఆన్లైన్ పిటిషన్ నమోదైంది. ‘సాంస్కృతిక నేపథ్యాలకు అతీతంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజలను ఒక్కచోటకు చేరుస్తున్న ఘనత మియా ఖలిఫాది. మధ్యప్రాచ్యంలో ఆమె మనకు గొప్ప నేతగా వెలుగొందనుంది. అమెరికా బహుళ సంస్కృతికి ప్రతీకగా నిలువనుంది’ అంటూ పిటిషనర్ దీనిని పెట్టాడు. సరదాకు పెట్టినట్టు భావిస్తున్న ఈ ఆన్లైన్ పిటిషన్ వెంటనే వైరల్‌గా మారిపోయింది. దీనికి మద్దతుగా ఇప్పటికే 1200మంది సంతకాలు చేశారు. మరో మూడు వందల సంతకాలు వస్తే.. ఈ పిటిషన్ అధికారికంగా స్వీకరించేందుకు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ వైరల్ పిటిషన్‌పై సోషల్ మీడియాలో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి.