హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు కోటు కేసులో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, సీఎం చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలని సామాన్య జనం కోరుతున్నారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ కు ఆన్ లైన్ పిటిషన్ పంపనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా change.org పేరుతో ఒక పేజీని రూపొందించి సంతకాల సేకరణ చేపట్టారు. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పేజీని ప్రారంభించిన 24 గంటల్లోనే 5 వేల మందిపైగా సంతకాలు చేయడం విశేషం. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులకు ఈ పిటిషన్ పంపనున్నారు.
ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ పై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సామాన్యులు తమ గళం వినిపించేందుకు ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. డబ్బు, అధికారం ఉంటే కేసులు నుంచి తప్పించుకోవచ్చన్న భావన సమాజంలో ఉందని.. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని గళం విప్పారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని విచారణ ముందుకు సాగకుండా చూసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భారతదేశ పౌరులుగా ఇలాంటి పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ఓటుకు కోట్లు కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుకుంటున్నట్టు ఆన్ లైన్ పిటిషన్ (change.org) లో పేర్కొన్నారు. దోషులను తగిన విధంగా శిక్షించాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు. గత రెండు రోజులుగా ఈ ఆన్ లైన్ పిటిషన్ పై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఈ సంతకాల సేకరణ ఊపందుకుంది.
చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలి
Published Wed, Mar 8 2017 6:39 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement
Advertisement