ఆ సీరియల్‌పై కేంద్రం కన్నెర్ర!
వెంటనే చర్య తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లేఖ
వివాదాస్పద సీరియల్ 'పెహ్రెదార్ పియా కీ'పై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ సీరియస్‌గా స్పందించారు. తొమ్మిదేళ్ల బాలుడు 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకొనే కథాంశంతో రూపొందిన ఈ సీరియల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్లైట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)కు లేఖ రాశారు. అధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ సీరియల్ ప్రసారాలపై చర్య తీసుకోవాలని లేఖలో కోరారు.
ఈ సీరియల్ సోనీ టీవీలో ప్రసారం అవుతోంది. ఇందులో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్ కథ. 18 ఏళ్ల అమ్మాయిని బాలుడు వెంటాడుతున్నట్టు.. 'మొదటిరాత్రి' గురించి చెప్తున్నట్టు అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ టైమ్‌లో వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చే ప్రమాదం ఉందని పలువురు వాదిస్తున్నారు
ఛేంజ్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో మాన్సి జైన్ అనే పిటిషనర్ ఈ సీరియల్‌కు విరుద్ధంగా ఆన్‌లైన్ సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే ఈ పిటిషన్‌కు భారీస్థాయిలో మద్దతు లభిస్తుండటంతో కేందమంత్రి స్మృతి ఇరానీ స్పందించి.. సీరియల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీసీసీని కోరారు.