
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ మున్సిపాలిటీ మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మేయర్ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. జిల్లా పరిషత్ సీఈవో ప్రకాశ్ వాయ్‌చల్ పర్యవేక్షణలో ఎస్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికలో బీజేపీ కార్పొరేటర్ అయిన కాంచన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా బీజేíపీ కార్పొరేటర్ రాజేశ్ కాళే విజయం సాధించారు.
22 ఏళ్లుగా ప్రజా జీవితంలో..
సదాశివపేటకు చెందిన కాంచన కుటుం బం చాలా కాలం కిందే షోలాపూర్ వెళ్లి స్థిరపడింది. కాంచన భర్త రమేశ్ దుప్పట్లు, టవల్స్ సేల్స్ ఏజెంటుగా పనిచేస్తుంటారు. ప్రజా జీవితంలో సేవలందించడం అంటే కాంచనకు ఎంతో ఇష్టమని ఆమె భర్త తెలిపారు. 22 ఏళ్ల కిందట 1997లో కాంచన రాజకీయ ప్రవేశం చేశారని చెప్పారు. మహిళా పొదుపు సంఘాలు స్థాపించి మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు. 2002లో ఎన్నికల బరిలో దిగిన తొలిసారే షోలాపూర్ కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత 2007, 2012, 2017 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
‘అందరినీ కలుపుకొని ముందుకెళ్తా’
అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని మేయర్‌గా విజయం సాధించిన అనంతరం కాంచన పేర్కొన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీతో పాటు మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు లేకుండా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment