sadashivapeta
-
షోలాపూర్ మేయర్‌గా తెలుగు మహిళ
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ మున్సిపాలిటీ మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మేయర్ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. జిల్లా పరిషత్ సీఈవో ప్రకాశ్ వాయ్‌చల్ పర్యవేక్షణలో ఎస్ఎంసీ కౌన్సిల్ హాల్లో బుధవారం జరిగిన ఎన్నికలో బీజేపీ కార్పొరేటర్ అయిన కాంచన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా బీజేíపీ కార్పొరేటర్ రాజేశ్ కాళే విజయం సాధించారు. 22 ఏళ్లుగా ప్రజా జీవితంలో.. సదాశివపేటకు చెందిన కాంచన కుటుం బం చాలా కాలం కిందే షోలాపూర్ వెళ్లి స్థిరపడింది. కాంచన భర్త రమేశ్ దుప్పట్లు, టవల్స్ సేల్స్ ఏజెంటుగా పనిచేస్తుంటారు. ప్రజా జీవితంలో సేవలందించడం అంటే కాంచనకు ఎంతో ఇష్టమని ఆమె భర్త తెలిపారు. 22 ఏళ్ల కిందట 1997లో కాంచన రాజకీయ ప్రవేశం చేశారని చెప్పారు. మహిళా పొదుపు సంఘాలు స్థాపించి మహిళలను ఆర్థికంగా చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు. 2002లో ఎన్నికల బరిలో దిగిన తొలిసారే షోలాపూర్ కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత 2007, 2012, 2017 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ‘అందరినీ కలుపుకొని ముందుకెళ్తా’ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని మేయర్‌గా విజయం సాధించిన అనంతరం కాంచన పేర్కొన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీతో పాటు మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఎక్కడ ఎలాంటి లోపాలకు తావు లేకుండా తన విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. -
పా(హా)లాహలం
* పాలను విషతుల్యం చేస్తున్న అక్రమార్కులు * రసాయనాలు కలుపుతూ యథేచ్ఛగా కల్తీ * మినరల్ వాటర్.. ప్యాకెట్ల పాలు కలుపుతూ మరో రకం మోసం * సదాశివపేటకు తరలింపు * ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం సదాశివపేట: పాల సముద్రం చిలికితే హాలాహలం వచ్చిందన్నది పురాణాల్లోని మాట.. కానీ పాలనే హాలాహలంగా మారుస్తున్నారు అక్రమార్కులు. డబ్బు జబ్బు పట్టిన అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాలల్లో నీళ్లు కలపడం పాత మాట.. కానీ పాలే అసలైనవా కాదా అనేట్టుగా రసాయనాలు కలిపి పాలను తయారు చేయడం నేటి మాట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగున్న ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కల్తీపాలు వేకువజామునే సదాశివపేట పట్టణానికి చేరుకుంటున్నాయి. ఆయా ప్రాంత పాల ఉత్పత్తి దారులు ఇక్కడ డీలర్లను నియమించుకుని ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. డీలర్లు సేల్స్ బాయ్‌లను నియమించుకుని ఇళ్లు హోటళ్లు, మండల పరిధిలోని వివిధ పరిశ్రమల్లోని క్యాంటిన్లకు కల్తీ పాలను అమ్ముతున్నారు. కొన్ని కంపెనీలు పూర్తిగా కల్తీ పాలనే సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలోని పాల ప్యాకెట్లను పాల డబ్బాల్లో అందరూ చూస్తుండగానే కలుపుతూ గేదే పాలంటూ ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. పాల డబ్బాలో పాల కంటే ముందుగా మినరల్ వాటర్‌ను కలుపుతున్నారు. గ్రామాల నుంచి ఖాళీ డబ్బాల్లో మంచినీళ్లు పోసుకుని వేకువజామునే వ్యాపారుల వద్ద పాల ప్యాకెట్లను కొనుగొలు చేసి అందులో కలుపుకుని యాథేచ్ఛగా గేదే పాలని ప్రజలను నమ్మిస్తూ విక్రయిస్తున్నారు. సదాశివపేట పట్టణానికి గ్రామాల నుంచి వచ్చి పాల ప్యాకెట్లను హోల్‌సేల్‌గా తీసుకువెళ్లి గ్రామాల్లో కిరాణా దుకాణాల వారు చిల్లరగా విక్రయిస్తున్నారు. జనాభా ఎక్కువ.. ఉత్పత్తి తక్కువ సదాశివపేట పట్టణ జనాభా దాదాపు 60 వేలుంటుంది. దానికి అనుగుణంగా పాల ఉత్పత్తి జరగకపోవడంతో కల్తీ పాల వ్యాపారం పెరిగిందని తెలుస్తోంది. పట్టణంలో రోజు లక్ష లీటర్ల వరకు పాల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. స్థానికంగా లభించే పాలు కృత్రిమమైనవిగా నిరూపణ అవుతోంది. గ్రామాల్లో చాలా వరకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాంటప్పుడు రోజూ లక్ష లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన సదాశివపేటలో పాల అవసరాన్ని గుర్తించిన కల్తీ వ్యాపారులు ఇక్కడ పెద్ద ఎత్తున దృష్టి సారించి అమ్మకాలు జరుపుతున్నారు. హోటళ్లు, స్వీట్ హౌస్‌లలో కల్తీ పాలతో టీ, పెరుగు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రసాయనాలతో కల్తీ పాల ఉత్పత్తి తక్కువ.. అమ్మకాలు ఎక్కువ కావడంతో కొన్ని కంపెనీలు పాలను కల్తీ చేస్తున్నాయి కృత్రిమంగా తయారు చేయడం లేదా పాలలో యూరియా, డిటర్జెంట్ పౌడర్, క్లాస్టిక్ సోడా పెయింట్లు వాడుతున్నారు. డిటర్జెంట్ పౌడర్ నురుగు రావడానికి, పెయింట్లను చిక్కదానికి వాడతారు. ఈ రకంగా వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కల్తీపాలు తాగడం వల్ల వ్యాధులబారిన పడే ప్రమాదం ఉంది. ఇలా తెలుసుకోవాలి పాలలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి వినియోగదారులు ప్రయత్నించాలి. ముఖ్యంగా స్థానికంగా లభించే పాలలో కంటే పాల ప్యాకెట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా పాల వాసన చూస్తే కల్తీవా? స్వచ్ఛమైనవా? అని తెలిసిపోతుంది. కల్తీ పాలు పూర్తి తెల్లదనంతో కనిపిస్తాయి. చిక్కగా ఉంటాయి. పాలను వేడి చేయక ముందు మాత్రమే పాల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. వేడి చేసిన అనంతరం కల్తీ పాలను గుర్తించడం సాధ్యం కాదని హోటళ్ల వారు తెలుపుతున్నారు. -
హడలెత్తిస్తున్న ఏసీబీ
సదాశివపేట, న్యూస్‌లైన్: ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతంపడుతున్నారు. మొన్న తూప్రాన్‌లో సబ్ రిజిస్ట్రార్, నిన్న వర్గల్లో వర్క ఇన్స్పెక్టర్, నేడు సదాశివపేటలో మున్సిపల్ ఇంజినీర్ అధికారులను పట్టుకున్నారు. సదాశివపేట మున్సిపల్ ఇంజినీర్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనుల బిల్లుల మంజూరు కోసం రూ. 30 వేలు తీసుకుంటూ శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన కుషిమా ఎలక్ట్రికల్ యజమాని ఆర్ఎస్ సుధాకర్ గత సంవత్సరం సదాశివపేటలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులకు రూ. 6,58,815 టెండర్ ద్వారా 20.4 శాతం లెస్‌కు దక్కించుకున్నారు. పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్ బిల్లు మంజూరుకు మున్సిపల్ ఇంజనీర్ భూమేశ్వర్ వద్దకు వచ్చి ఎంబీ రికార్డు చేసి బిల్లు ఇప్పించాలని కోరారు. దీంతో ఆ అధికారి ఎంబీ రికార్డు చేయడానికి రూ. 80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము లెస్‌కు టెండర్ వేసి పనులను దక్కించుకున్నామని పనులు చేసి నష్టపోయామని కాంట్రాక్టర్ సుధాకర్ అధికారిని కోరారు. అయినా అధికారి ససేమిరా అనడంతో రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది. పది రోజుల క్రితం సుధాకర్ సూపర్వైజర్ సమ్మాల్ ద్వారా రూ. 20 వేలను భూమేశ్వర్‌కు అందజేశారు. ఈ నెల 5న సమ్మాల్ మున్సిపల్ కార్యాలయంలో భూమేశ్వర్‌ను కలసి బిల్లు ఇప్పించాలని కోరారు. ఒప్పందం ప్రకారం మిగతా రూ. 30 వేలు ఇస్తేనే బిల్లు చేస్తానని ఖరాఖండిగా చెప్పడంతో సమ్మాల్ తన యజమాని సుధాకర్‌కు ఫోన్లో విషయం చెప్పారు. చేసేదిలేక ఈ నెల 6న సుధాకర్, సూపర్వైజర్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సమ్మాల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తన క్వార్టర్‌కు రావాలని సమ్మాల్కు సూచించి ఇంజనీర్ వెళ్ల్లిపోయారు. దీంతో క్వార్టర్‌కు వెళ్లి రూ. 30 వేలు ఇస్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు తన సిబ్బందితో దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టు పనికి సంబంధించిన రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపుతామని ఏసీబీ డీఎస్పీ విలేకరులకు వివరించారు. లంచం డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ అధికారుల గురించి తమకు 9440446155 ఫోన్‌కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు సూచించారు.