పా(హా)లాహలం | Irregulars of Milk Adulterated in Sadashivapeta | Sakshi
Sakshi News home page

పా(హా)లాహలం

Published Mon, Jul 4 2016 4:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

పా(హా)లాహలం

పా(హా)లాహలం

* పాలను విషతుల్యం చేస్తున్న అక్రమార్కులు
* రసాయనాలు కలుపుతూ యథేచ్ఛగా కల్తీ
* మినరల్ వాటర్.. ప్యాకెట్ల పాలు కలుపుతూ మరో రకం మోసం
* సదాశివపేటకు తరలింపు
* ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం

సదాశివపేట: పాల సముద్రం చిలికితే హాలాహలం వచ్చిందన్నది పురాణాల్లోని మాట.. కానీ పాలనే హాలాహలంగా మారుస్తున్నారు అక్రమార్కులు. డబ్బు జబ్బు పట్టిన అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

పాలల్లో నీళ్లు కలపడం పాత మాట.. కానీ పాలే అసలైనవా కాదా అనేట్టుగా రసాయనాలు కలిపి పాలను తయారు చేయడం నేటి మాట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగున్న ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కల్తీపాలు వేకువజామునే సదాశివపేట పట్టణానికి చేరుకుంటున్నాయి. ఆయా ప్రాంత పాల ఉత్పత్తి దారులు ఇక్కడ డీలర్లను నియమించుకుని ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. డీలర్లు సేల్స్ బాయ్‌లను నియమించుకుని ఇళ్లు హోటళ్లు, మండల పరిధిలోని వివిధ పరిశ్రమల్లోని క్యాంటిన్లకు కల్తీ పాలను అమ్ముతున్నారు.

కొన్ని కంపెనీలు పూర్తిగా కల్తీ పాలనే  సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలోని పాల ప్యాకెట్లను పాల డబ్బాల్లో అందరూ చూస్తుండగానే కలుపుతూ  గేదే పాలంటూ ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. పాల డబ్బాలో పాల కంటే ముందుగా మినరల్ వాటర్‌ను కలుపుతున్నారు. గ్రామాల నుంచి ఖాళీ డబ్బాల్లో మంచినీళ్లు పోసుకుని వేకువజామునే వ్యాపారుల వద్ద పాల ప్యాకెట్లను కొనుగొలు చేసి అందులో కలుపుకుని యాథేచ్ఛగా గేదే పాలని ప్రజలను నమ్మిస్తూ విక్రయిస్తున్నారు. సదాశివపేట పట్టణానికి గ్రామాల నుంచి వచ్చి  పాల ప్యాకెట్లను హోల్‌సేల్‌గా తీసుకువెళ్లి గ్రామాల్లో కిరాణా దుకాణాల వారు చిల్లరగా విక్రయిస్తున్నారు.
 
జనాభా ఎక్కువ.. ఉత్పత్తి తక్కువ
సదాశివపేట పట్టణ జనాభా దాదాపు 60 వేలుంటుంది. దానికి అనుగుణంగా పాల ఉత్పత్తి జరగకపోవడంతో కల్తీ పాల వ్యాపారం పెరిగిందని తెలుస్తోంది. పట్టణంలో రోజు లక్ష  లీటర్ల వరకు పాల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. స్థానికంగా లభించే పాలు కృత్రిమమైనవిగా నిరూపణ అవుతోంది. గ్రామాల్లో చాలా వరకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాంటప్పుడు రోజూ లక్ష లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన సదాశివపేటలో పాల అవసరాన్ని  గుర్తించిన కల్తీ వ్యాపారులు  ఇక్కడ పెద్ద ఎత్తున దృష్టి సారించి అమ్మకాలు జరుపుతున్నారు. హోటళ్లు, స్వీట్ హౌస్‌లలో కల్తీ పాలతో టీ, పెరుగు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రసాయనాలతో కల్తీ
పాల ఉత్పత్తి తక్కువ.. అమ్మకాలు ఎక్కువ కావడంతో కొన్ని కంపెనీలు పాలను కల్తీ చేస్తున్నాయి కృత్రిమంగా తయారు చేయడం లేదా పాలలో యూరియా, డిటర్జెంట్  పౌడర్, క్లాస్టిక్ సోడా పెయింట్లు వాడుతున్నారు. డిటర్జెంట్ పౌడర్ నురుగు రావడానికి, పెయింట్లను చిక్కదానికి వాడతారు. ఈ రకంగా వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కల్తీపాలు తాగడం వల్ల  వ్యాధులబారిన పడే ప్రమాదం ఉంది.
 
ఇలా తెలుసుకోవాలి
పాలలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి వినియోగదారులు ప్రయత్నించాలి. ముఖ్యంగా స్థానికంగా  లభించే పాలలో కంటే పాల ప్యాకెట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పాలను జాగ్రత్తగా  పరిశీలించాలి. ముందుగా పాల వాసన చూస్తే కల్తీవా? స్వచ్ఛమైనవా? అని  తెలిసిపోతుంది. కల్తీ పాలు పూర్తి తెల్లదనంతో కనిపిస్తాయి. చిక్కగా ఉంటాయి. పాలను వేడి చేయక ముందు మాత్రమే పాల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. వేడి చేసిన అనంతరం కల్తీ పాలను గుర్తించడం సాధ్యం కాదని హోటళ్ల వారు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement