Irregulars
-
ఎస్ఈబీ నిఘా.. అక్రమార్కుల ఆటకట్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కుల ఆటకట్టించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) మెరుపుదాడులు నిర్వహించింది. రెండు రోజులపాటు నిర్వహించిన ఆపరేషన్ నిఘాలో 269 ఎస్ఈబీ బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, గుట్కా, గంజాయిలపై ఎస్ఈబీ బృందాలు ఉక్కుపాదం మోపాయి. అక్రమాలకు పాల్పడుతున్న 1,537 మందిపై 1,088 కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ మీడియాకు వెల్లడించారు. ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్న వివరాలివీ.. నమోదైన కేసులు: 1,088 అరెస్టయిన వారు: 1,537 సీజ్ చేసిన వాహనాలు: 192 సుంకం చెల్లించని మద్యం బాటిల్స్ (ఎన్డీపీఎల్): 3,652 అక్రమ మద్యం బాటిల్స్ (డీపీఎల్): 11,230 నాటుసారా (ఐడీ లిక్కర్): 6,016.7 లీటర్లు సారా తయారీ ఊట: 43,326 లీటర్లు అక్రమంగా తరలిస్తున్న ఇసుక: 349 టన్నులు గంజాయి: 530 కిలోలు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం: 140 కిలోలు గుట్కా: 4,45,000 ప్యాకెట్లు (రూ.45 లక్షలు విలువ) పేకాటలపై దాడుల్లో: రూ.11,76,678 నగదు, గేమింగ్ కాయిన్స్: రూ.8.35 లక్షల విలువైనవి ఎటువంటి ఆధారపత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర వెండి, రూ.13.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
దేవుని భూములూ మావే!
రైతు సమగ్ర సర్వేలో కొందరు అక్రమార్కుల ఇష్టారాజ్యం సాక్షి, హైదరాబాద్: ► ఖమ్మంలో కొన్ని చోట్ల దేవుడి మాన్యాలు తమ భూములంటూ రైతు సమగ్ర సర్వేలో కొందరు ధనిక రైతులు, ఇతర అక్రమార్కులు నమోదు చేసుకున్నారు. ►రంగారెడ్డి జిల్లాలో మరికొందరు ధనిక రైతులు చెరువు శిఖం భూములను తమ పేరుతో సర్వేలో నమోదు చేసుకున్నారు. ► వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, పోరంబోకు భూములు తమవంటూ కొందరు సర్వేలో నమోదు చేయించుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రైతు సమగ్ర సర్వేలో దేవుడి మాన్యాలు, చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు తమ పేరుతో నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఓ అంచనా ప్రకారం ఆయా రకాల భూములు దాదాపు 50 వేల ఎకరాల వరకు రైతు సమగ్ర సర్వేలో అక్రమంగా నమోదు చేయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా భూములు వారి స్వాధీనంలో ఉం డటం, సన్న, చిన్నకారు రైతులు సాగు చేసే భూములను కూడా తమ పేరుతో కొందరు నమోదు చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలో తేలినట్లు సమాచారం. కొన్ని చోట్ల అక్రమార్కుల నుంచి ఒత్తిడులు రావడంతో సరైన రికార్డులు చూపించకున్నా వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) నమోదు చేసినట్లు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల తప్పుడు పత్రాలు చూపించి నమోదు చేసుకున్నట్లు సమాచారం. అక్రమంగా నమోదు ప్రక్రియ జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘రైతులు ఏది చెబితే అదే నమోదు చేయడం మా పని. అది అక్రమమా? కాదా? అని తేల్చాల్సిన బాధ్యత మాది కాదు’అని ఓ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి అంటున్నారు. దేవుని మాన్యాలు 83 వేల ఎకరాలు రాష్ట్రంలో దేవుని మాన్యాలు 83,622 ఎకరాలున్నాయి. అలాగే చెరువు శిఖం భూములు 9 వేల ఎకరాలున్నాయి. ప్రభుత్వ భూములు దాదాపు 8 వేల ఎకరాలున్నాయి. దేవుని మాన్యం భూములు 14,530 ఎకరాలు పరాధీనంలో ఉన్నాయని దేవాదాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన భూమిని స్థానికంగా కొందరు రైతులు సాగు చేస్తున్నారు. దాదాపు 50 వేల ఎకరాల దేవుని మాన్యాలు, ప్రభుత్వ, చెరువు శిఖం భూములను సమగ్ర సర్వేలో నమోదు చేసినట్లు అంచనా వేసినట్లు సమాచారం. సమగ్ర సర్వే నివేదిక ప్రభుత్వానికి వచ్చాక ఇంకా కొంత స్పష్టత రానుందని చెబుతు న్నారు. ఇంకా సర్వేను పొడిగించినందున ఇప్పుడు మిగిలిన ఆయా భూములపైనా కొందరు కన్నేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందజేయాలని యోచిస్తోంది. కాబట్టి దేవుని మాన్యం, చెరువుశిఖం, ప్రభుత్వ భూములను తమ పేరున నమోదు చేయించుకున్న అక్రమార్కులు ఆ భూముల్లో ఏదో ఒక పంట వేసుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. సమగ్ర సర్వేలో నమోదు చేసుకోవడం వల్ల తమ పేరుతో ఏదో ఒక రికార్డు ఉంటుందన్న భావన కూడా ఉంది. దీంతో కబ్జాదారులకు సమగ్ర సర్వే ఒక అధికారిక రికార్డుగా మారనుంది. ‘పెట్టుబడి’పైసల కోసమే! వచ్చే ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్ నుంచి ఎరువులు, విత్తనాలు, ఇతరత్రా పెట్టుబడుల కోసం ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే యాసంగి సీజన్లోనూ రూ.4 వేలు ఇస్తారు. అందు కోసం ప్రభుత్వం రైతు సమగ్ర సర్వే నిర్వ హించింది. ఇప్పటి వరకు సర్వేలో 46.17 లక్షల మంది రైతుల సమాచారాన్ని సేకరిం చారు. మొత్తం 55.63 లక్షల మంది రైతులుండగా, సర్వే ముగిసిన ఈ నెల 15 నాటికి 83శాతం మంది నుంచి వివరాలు సేకరించినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ధనిక, పేద తేడా లేకుండా రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి పథకం కింద నగదు ఇస్తుండటంతో గ్రామాల్లో ప్రభుత్వ భూములు, దేవుని మాన్యాలు, చెరువు శిఖం భూములను కూడా కొందరు అక్రమార్కులు తమ పేరుతో సర్వేలో నమోదు చేయించుకున్నారు. దీంతో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.8 వేలు ఇస్తారు. పదెకరాలుంటే రూ.80 వేలు వస్తాయి. -
‘మిషన్ కాకతీయ’ అక్రమార్కులపై వేటు!
ఏడుగురు సస్పెన్షన్.. ఆరుగురిపై శాఖా పరమైన చర్యలు సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ ఇంజనీర్లపై వేటు పడింది. చెరువు పనుల్లో అక్రమాలు రుజువు కావడంతో ఏడుగురు ఇంజనీర్లపై సస్పెన్షన్ విధిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరుగురు ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. 36 మంది కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు, వారి నుంచి సొమ్ము రాబట్టాలని నిర్ణయించింది. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ డివిజన్లో మిషన్ కాకతీయ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. మట్టి పని చేయకుండానే చేసినట్లు, తక్కువ మట్టి తీసి ఎక్కువగా తీసినట్లు ఇంజనీర్లు రికార్డులు సృష్టించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరిశీలించకుండానే పని జరిగినట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీనిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు గతేడాది సెప్టెంబర్‌లో నిర్ధారించింది. దీనికి 13 మంది ఇంజనీర్లను బాధ్యులుగా తేల్చింది. వీరిలో నిర్మాణ విభాగం, నాణ్యతా విభాగానికి సంబంధించిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 8 మంది ఏఈలు ఉన్నారు. ఇందులో 12 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఒక డీఈఈపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. విజిలెన్స్ సూచనలకు అనుగుణంగా గురువారం నలుగురు ఏఈఈ, ఇద్దరు డీఈ, ఒక ఈఈపై సస్పెన్షన్ వేటు పడగా, క్వాలిటీ కంట్రోల్ ఈఈ, ఒక డీఈఈ, మరో నలుగురు ఏఈఈలపై శాఖా పరమైన చర్యలు తీసుకోనుంది. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కాంట్రాక్టర్ల నుంచి రూ.2కోట్ల వరకు రికవరీ చేయనున్నారు -
ఆ విగ్రహాల ‘ఇనుము’ అక్రమార్కుల పరం
సాక్షి, సిటీబ్యూరో: దేవుడి విగ్రహాల తుక్కునూ వదిలిపెట్టకుండా రూ.కోట్లు స్వాహా చేస్తున్న ఘనుల భాగోతమిది.. భక్తజన నీరాజనాలతో నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి విగ్రహాల తయారీలో వినియోగించే ఇనుము ఇపుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరంలో వినాయకనిమజ్జనం పూర్తయిన ప్రతిసారీ ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న తంతు ఇది. వీరికి కళ్లెం వేయడం తమ పరిధిలో లేదని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు పేర్కొంటున్నారు. విలువ రూ.5 కోట్లు..? ఈసారి హుస్సేన్‌సాగర్‌లో నవరాత్రుల సందర్భంగా సుమారు 56 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. సుమారు పదివేల టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ఇందులో ఇనుము(ఉక్కు) మూడువేల టన్నులు అంటే..30 లక్షల కిలోలు తుక్కుగా లభ్యమైందని అంచనా. దీనికి కిలో రూ.16 చొప్పున అక్రమార్కులు విక్రయించి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసినట్లు సమాచారం. నిమజ్జనం అనంతరం హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి హుస్సేన్‌సాగర్‌లో 56 వేల విగ్రహాలతోపాటు సాగర్‌లోకి చేరుకున్న ఎటువంటి వ్యర్థాలైనా తొలగించాల్సి ఉంది. ఇటీవల ఈ బాధ్యతను హెచ్ఎండీఏ తీసుకుంది. సాగర్ జలాశయం నుంచి తొలగించిన వ్యర్థాలన్నింటిని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డంపింగ్ యార్డులో వేస్తున్నారు. అక్కడి జీహెచ్ఎంసీ వాటిని తరలించాల్సి ఉంది. అయితే ఏటా నిమజ్జనం అవుతున్న విగ్రహాల నుంచి ఇనుమును కొందరు వ్యక్తులు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఈ సారి కూడా వీరు అదే పనిలో నిమగ్నమయ్యారు. వద్దని వారించే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్టీఆర్ మార్్గతోపాటు ట్యాంక్‌బండ్‌పై మొత్తం 23 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఆయా క్రేన్లు నిమజ్జనం చేసిన విగ్రహాల నుంచి ఇనుము తీసి అక్కడే పోగేస్తున్నారు. దీన్ని గంపగుత్తగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు చేతులు కలిపి పెద్ద ఎత్తున ఉక్కును సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున పోగుచేసి ఒకేసారి అమ్మి కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులే నేరుగా నిమజ్జన ప్రాంతాల నుంచి వాహనాల్లో ఉక్కును తీసుకెళ్తున్నారు. ఆదాయ వనరే అయినా.. సాధారణంగా ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. ఇందులో భాగంగా కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తాయి. కాని నగరంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వినాయక విగ్రహాల ద్వారా వచ్చే ఇనుము ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యే విగ్రహాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. అంతేస్థాయిలో విగ్రహాలకు వాడే స్టీల్ కూడా పెరుగుతున్నట్లే. అయితే ఏటా వేల టన్నుల ఇనుమును తుక్కుగా విక్రయించడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం తప్పక వస్తోంది. ఈ కాసుల రుచికి మరిగిన చాలా మంది ప్రైవేటు వ్యక్తులు ఏళ్లుగా ఇనుమును సేకరించి విక్రయిస్తున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా కోట్లు వెనకేసుకుంటున్నట్లు అధికారులే స్వయంగా చెబుతుండడం విషయం. ఇంత పెద్ద మొత్తంలో ఇనుము ద్వారా డబ్బులు అక్రమార్కుల జేబుల్లోకి పోతున్నా.. ఆదాయ వనరుగా మలచుకోవడంలో ప్రభుత్వ శాఖలు తీవ్రంగా విఫలమయ్యాయి. మొత్తం స్టీల్‌ని సేకరించి బహిరంగ వేలం వేస్తే.. అనుకున్న దానికంటే ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారులకు తెలియక కాదు. రాజకీయ అండదండలతో ఏమీ చేయలేకపోతున్నామని వారు నర్మగర్భంగా చెబుతున్నారు. టెండర్ వేస్తే బాగుంటుంది.. నిమజ్జమైన విగ్రహాల ఇనుమును సేకరించి వేలం వేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. వ్యర్థాల వెలికితీత పనుల్ని ప్రభుత్వం చేయిస్తుండగా.. దాన్ని ఫలితాన్ని మాత్రం వ్రైవేటు వ్యక్తులు అనుభవిస్తున్నారు. దినికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. స్థానిక వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి ఇనుమును తీసుకెళ్లి అమ్ముకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపులో భాగంగా వచ్చే ఇనుమును వేలం వేసే అంశాన్ని జీహెచ్ఎంసీ పరిశీలించాలి. – టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్ -
పా(హా)లాహలం
* పాలను విషతుల్యం చేస్తున్న అక్రమార్కులు * రసాయనాలు కలుపుతూ యథేచ్ఛగా కల్తీ * మినరల్ వాటర్.. ప్యాకెట్ల పాలు కలుపుతూ మరో రకం మోసం * సదాశివపేటకు తరలింపు * ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం సదాశివపేట: పాల సముద్రం చిలికితే హాలాహలం వచ్చిందన్నది పురాణాల్లోని మాట.. కానీ పాలనే హాలాహలంగా మారుస్తున్నారు అక్రమార్కులు. డబ్బు జబ్బు పట్టిన అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాలల్లో నీళ్లు కలపడం పాత మాట.. కానీ పాలే అసలైనవా కాదా అనేట్టుగా రసాయనాలు కలిపి పాలను తయారు చేయడం నేటి మాట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగున్న ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కల్తీపాలు వేకువజామునే సదాశివపేట పట్టణానికి చేరుకుంటున్నాయి. ఆయా ప్రాంత పాల ఉత్పత్తి దారులు ఇక్కడ డీలర్లను నియమించుకుని ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. డీలర్లు సేల్స్ బాయ్‌లను నియమించుకుని ఇళ్లు హోటళ్లు, మండల పరిధిలోని వివిధ పరిశ్రమల్లోని క్యాంటిన్లకు కల్తీ పాలను అమ్ముతున్నారు. కొన్ని కంపెనీలు పూర్తిగా కల్తీ పాలనే సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలోని పాల ప్యాకెట్లను పాల డబ్బాల్లో అందరూ చూస్తుండగానే కలుపుతూ గేదే పాలంటూ ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. పాల డబ్బాలో పాల కంటే ముందుగా మినరల్ వాటర్‌ను కలుపుతున్నారు. గ్రామాల నుంచి ఖాళీ డబ్బాల్లో మంచినీళ్లు పోసుకుని వేకువజామునే వ్యాపారుల వద్ద పాల ప్యాకెట్లను కొనుగొలు చేసి అందులో కలుపుకుని యాథేచ్ఛగా గేదే పాలని ప్రజలను నమ్మిస్తూ విక్రయిస్తున్నారు. సదాశివపేట పట్టణానికి గ్రామాల నుంచి వచ్చి పాల ప్యాకెట్లను హోల్‌సేల్‌గా తీసుకువెళ్లి గ్రామాల్లో కిరాణా దుకాణాల వారు చిల్లరగా విక్రయిస్తున్నారు. జనాభా ఎక్కువ.. ఉత్పత్తి తక్కువ సదాశివపేట పట్టణ జనాభా దాదాపు 60 వేలుంటుంది. దానికి అనుగుణంగా పాల ఉత్పత్తి జరగకపోవడంతో కల్తీ పాల వ్యాపారం పెరిగిందని తెలుస్తోంది. పట్టణంలో రోజు లక్ష లీటర్ల వరకు పాల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. స్థానికంగా లభించే పాలు కృత్రిమమైనవిగా నిరూపణ అవుతోంది. గ్రామాల్లో చాలా వరకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాంటప్పుడు రోజూ లక్ష లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన సదాశివపేటలో పాల అవసరాన్ని గుర్తించిన కల్తీ వ్యాపారులు ఇక్కడ పెద్ద ఎత్తున దృష్టి సారించి అమ్మకాలు జరుపుతున్నారు. హోటళ్లు, స్వీట్ హౌస్‌లలో కల్తీ పాలతో టీ, పెరుగు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రసాయనాలతో కల్తీ పాల ఉత్పత్తి తక్కువ.. అమ్మకాలు ఎక్కువ కావడంతో కొన్ని కంపెనీలు పాలను కల్తీ చేస్తున్నాయి కృత్రిమంగా తయారు చేయడం లేదా పాలలో యూరియా, డిటర్జెంట్ పౌడర్, క్లాస్టిక్ సోడా పెయింట్లు వాడుతున్నారు. డిటర్జెంట్ పౌడర్ నురుగు రావడానికి, పెయింట్లను చిక్కదానికి వాడతారు. ఈ రకంగా వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కల్తీపాలు తాగడం వల్ల వ్యాధులబారిన పడే ప్రమాదం ఉంది. ఇలా తెలుసుకోవాలి పాలలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి వినియోగదారులు ప్రయత్నించాలి. ముఖ్యంగా స్థానికంగా లభించే పాలలో కంటే పాల ప్యాకెట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా పాల వాసన చూస్తే కల్తీవా? స్వచ్ఛమైనవా? అని తెలిసిపోతుంది. కల్తీ పాలు పూర్తి తెల్లదనంతో కనిపిస్తాయి. చిక్కగా ఉంటాయి. పాలను వేడి చేయక ముందు మాత్రమే పాల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. వేడి చేసిన అనంతరం కల్తీ పాలను గుర్తించడం సాధ్యం కాదని హోటళ్ల వారు తెలుపుతున్నారు. -
ఆకేరులో.. ఇసుకాసురులు
యథేచ్ఛగా సాగుతున్న దందా పచ్చని చెట్లు నేలమట్టం బోసిపోతున్న ఆకేరు వాగు కన్నెత్తి చూడని అధికారులు అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో.. ఇసుకాసురుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా జలధారలతో కళకళలాడాల్సిన ఆకేరు వాగు బోసిపోతోంది. ట్రాక్టర్లు, జేసీబీలతో వాగు నుంచి నిత్యం ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయూడు. దీంతో వర్ధన్నపేట మండలంలోని వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు అడుగంటారుు. ప్రకృతి సంపదను అక్రమార్కులు దర్జాగా కొల్లగొడుతున్నా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకేరు వాగులో ఇసుక దొంగల హల్చల్పై పరిశీలనాత్మక కథనమిది. - వర్ధన్నపేట వర్ధన్నపేట మండలంలోని నందనం, వర్ధన్నపేట, ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల మీదుగా సుమారు 20 కిలోమీటర్ల పొడవునా ఆకేరు వాగు ప్రవహిస్తుంది. స్టేషన్ ఘన్పూర్ మండలం నష్కల్ నుంచి మొదలయ్యే ఆకేరు వాగు జఫర్‌గఢ్, వర్ధన్నపేట, పాలకుర్తి మహబూబాబాద్ , డోర్నకల్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తూ పాలేరు నదిలో కలుస్తుంది. ఆయూ పరివాహక ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి ఆకేరు ఎంతో దోహదం చేస్తోంది. అటువంటి వాగుపై అక్రమార్కుల కన్నుపడింది. జఫరగడ్ మండలం ఉప్పుగల్లులో మొదలుకొని కొత్తపల్లి, ల్యాబర్తి వరకు ఆకేరు వాగులో ఇసుక దందా సాగుతోంది. వాగు నుంచి ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఇసుకను వరంగల్ నగరానికి తరలించి విక్రరుుంచి జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నిలదీసే అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి.. నోళ్లు మూరుుస్తున్నారు. ‘ఇసుకను తరలించడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నారుు?’ అంటూ నిలదీసే రైతులపై దాడులు చేసేందుకు ఇసుకాసురులు వెనుకాడటం లేదు. ‘భారీ వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నందున మా ఊరిలోని రోడ్లన్నీ పాడవుతున్నారుు?’ అని ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యుడు ఇంటి పన్ను, విద్యుత్తు బిల్లు వంటి కట్టడంలో ఆలస్యం చేసినా నానా రభస చేసే అధికారులకు ఇటువంటి వ్యవహారాల్లో నిబంధనలు గుర్తుకు రావా? ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించడం రెవెన్యూ, మైనింగ్, పోలీసు విభాగాల బాధ్యత కాదా? ఇటువంటి అంశాలపై ప్రజాసంఘాలు ఉద్యమించాల్సిన అవసరముంది. రోడ్లు ఛిద్రం.. భూగర్భజలాలు మాయం భారీ వాహనాల్లో అక్రమంగా ఇసుకను తరలించే మార్గాల్లోని అంతర్గత రహదారులు అనతికాలంలోనే దెబ్బతింటున్నారుు. రూ.కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు దెబ్బతింటుంటే పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయని ప్రజలు పేర్కొంటున్నారు. నందనం, కిక్కిరాలపెల్లి, ఇల్లంద, కొత్తపెల్లి, ల్యాబర్తిలలోని రోడ్లు ఇసుకను తరలించే వాహనాల కారణంగా అధ్వానంగా తయూరయ్యూరుు. ఏళ్ల తరబడి వాగు పరివాహక ప్రాంతం నుంచి భారీగా ఇసుకను తరలించే క్రమంలో పరిసరాల్లోని పచ్చని చెట్లు నేలకూల్చారు. ఇవన్నీ వెరసి భూగర్భజలాలు పూర్తిగా అడుగంటారుు. బోరు, వ్యవసాయ బావులు వట్టిపోతున్నాయి. ఫలితంగా సస్యశ్యామలంగా ఉండాల్సిన ఆకేరు పరివాహక ప్రాంతాల్లో.. ప్రజానీకం దాహం కేకలు వినిపిస్తున్నారుు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు కరువు ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లరుునా లేదు. కొంతకాలం క్రితం ల్యాబర్తి గ్రామంలో ఇసుక తోడుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. కొత్తపెల్లిలోనూ ఇసుక తీస్తున్న ఓ కూలీ ప్రమాదంలో గాయూలపాలయ్యూడు. ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు విభాగాలు చూసీ చూడనట్లుగా వ్యవహరిసుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆకేరు పరివాహక ప్రాంతాల్లోని కొంతమంది కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ఇసుకాసురుల ఇచ్చే ఆమ్యామ్యాలతో లక్షలకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలున్నారుు. రానున్న రోజుల్లోనూ ఇసుక దందాను పట్టించుకోకుంటే.. ఆకేరు వాగు ఆనవాళ్లు కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నారుు. ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు ఇప్పటికైనా నడుం బిగించాలి. -
హాస్టళ్లపై ఏసీబీ పంజా
♦ యాలాల బీసీ బాలుర, కుల్కచర్ల మండలం ♦ ముజాహిద్పూర్ గిరిజన హాస్టళ్లలో తనిఖీలు ♦ బయటపడిన అవకతవకలు ♦ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్న ఏసీబీ అధికారులు ♦ జిల్లాలోని రెండు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు ♦ విద్యార్థుల హాజరు, మెనూ, వసతులపై ఆరా ♦ రికార్డుల నమోదులో వ్యత్యాసాల గుర్తింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా : పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాల్లో అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. మూడేళ్లుగా ఏసీబీ అధికారులు వసతిగృహాల్లో అకస్మిక తనిఖీలు చేపడుతుండడంతో ఈ వ్యవహారం క్రమంగా బట్టబయలవుతోంది. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతూ సర్కారు సొమ్ము స్వాహా చేస్తున్నారు. అంతేకాకుండా కాస్మోటిక్ చార్జీలు.. ఉపకార వేతనాలను అక్రమంగా డ్రా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వసతిగృహ సంక్షేమాధికారి మొదలు పైస్థాయి వరకు ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ పంజా విసిరింది. జిల్లాలోని యాలాల, కుల్కచర్లలోని వసతి గృహాలపై మంగళవారం దాడులు చేసింది. ఉదయం 9 గంటలకు దాడులు ప్రారంభించిన అధికారులు హాస్టళ్ల సిబ్బందిని హడలెత్తించారు. యాలాలలోని బీసీ బాలుర వసతి గృహంలో వసతులు, విద్యార్థుల హాజరుశాతం, ఆహార పదార్థాల నాణ్యత, మెనూ తదితర వివరాలు సేకరించారు. వసతిగృహంలో 96 మంది విద్యార్థులున్నట్టు రికార్డుల్లో ఉంది. కానీ అధికారుల తనిఖీలో సమయంలో 56 మందే ఉన్నారు. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గిరిజన హాస్టల్లోనూ ఉదయం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. ఇక్కడి హాస్టల్లో 273 మంది విద్యార్థులున్నట్లు రిజిస్టర్లో నమోదు చేశారు. కానీ 151 మందే ఉన్నారు. యాలాల/కుల్కచర్ల: యాలాల, కుల్కచర్లలోని ప్రభుత్వ వసతిగృహాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. యాలాలలోని బీసీ బాలుర హాస్టల్లోని వసతులు, విద్యార్థుల హాజరుశాతం, ఆహార పదార్థాల నాణ్యత, మెనూ వివరాల గురించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వివరాలు సేకరించారు. బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ సుందరమ్మ బాలుర వసతి గృహానికి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. వసతిగృహంలో మొత్తం 96 మంది విద్యార్థులున్నట్టు రికార్డుల్లో ఉండగా, ఏసీబీ అధికారుల తనిఖీలో 56 మందే ఉన్నట్లు గుర్తించారు. కూరగాయలు, బియ్యం తదితర స్టాకు వివరాలు సేకరించారు. వీటితో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు, మెనూ ప్రకారం భోజనం అందడం లేదనే విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీలు ఏసీబీ సీఐలు నాగేశ్వరరావు, రాజేష్ ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గిరిజన హాస్టల్లో కూడా మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ తనిఖీ లు కొనసాగాయి. ఏసీబీ సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 7 గంటలకు హాస్టల్‌కు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్ వసతులను పరిశీలించారు. వంటగది, విద్యార్థుల గదులను పరిశీలించారు. వార్డెన్ నాగలక్ష్మి స్థానికంగా లేకపోవడంతో ఆమెకోసం మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచిచూశారు. రెండు గంటలకు ఆమె రావడంతో రికార్డులు పరిశీలించారు. అనంతరం ఏసీబీ సీఐ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. హాస్టల్లో 273 మంది విద్యార్థులున్నట్లు రీజిస్టర్లో ఉన్నా.. హాస్టల్ మాత్రం 151 మందే ఉన్నారని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేద ని, నాణ్యత లేదని విద్యార్థులు చెప్పారన్నారు. రికార్డు ప్రకారం బియ్యం లేవన్నారు. విద్యార్ధులకు బట్టలు,నోట్ పుస్తకాలు, చాపలు ఇవ్వకుండా దాచి పెట్టినట్లు తెలిపారు. ఈ విషయంపై వార్డెన్ నాగలక్ష్మి, డీటీడబ్ల్యూఓ రామేవ్వర్లను విచారించామ ని.. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ లక్ష్మి పాల్గొన్నారు. ♦ మూడేళ్ల క్రితం మహేశ్వరం మండలం బీసీ సంక్షేమశాఖ వసతిగృహంపై దాడులు చేసిన అధికారులు పలు అక్రమాలను గుర్తించారు. అప్పట్లో ఉన్న వసతిగృహ సంక్షేమాధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ♦ గతేడాది ఘట్కేసర్లోని బీసీ సంక్షేమ వసతిగృహంపైనా ఆకస్మిక దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాలను వెలికితీశారు. ఈ క్రమంలో ఇటీవల ఆ వసతిగృహ సంక్షేమాధికారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ♦ మంగళవారం కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహం, యాలాల మండల కేంద్రంలోని వెనకబడిన తరగతులు సంక్షేమశాఖ వసతిగృహంలో ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ పలు అవకతవకలను గుర్తించింది. ♦ ఈ దాడుల్లో వెలుగులోకి వచ్చిన విషయాలను ఏసీబీ అధికారులు త్వరలో జిల్లా యంత్రాంగానికి నివేదిక పంపనున్నారు. -
వసూల్ రాజాలెవరు...?
వేములవాడ : భోళాశంకరుడి వద్దకు వస్తున్న భక్తులకు అక్రమార్కులు నిలువునా దోచుకుంటున్నారు. పార్కింగ్ ఫీజు పేరుతో ఒక్కో వాహనం వద్దనుంచి రూ. 150, రూ.100, రూ.50 చొప్పున బినామీ రశీదులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న వైనం సోమవారం వెలుగుచూసింది. అనుమతి లేకుండా పార్కింగ్ ఫీజులు వసూలు చేసే నాయకుడెవరూ..? ఎవరి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. పక్షం రోజులుగా ఈ దందా సాగుతున్నా... అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓ భక్తుడు సోమవారం స్థానిక విలేకరులకు సమాచారం అందించడంతో అక్రమార్కుల గుట్టురట్టయింది. దీంతో ఇందులో భాగస్వామ్యమైన వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. జేబులు నింపుకున్న అక్రమార్కులు.. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు రవాణా సౌకర్యర్థాం సొంత, అద్దె వాహనాల్లో కుటుంబసభ్యులతో కలిసి వస్తుంటారు. సమ్మక్క జాతర నేపథ్యంలో వచ్చే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు పార్కింగ్ ఫీజు దందాకు తెరలేపారు. భక్తుల సౌకర్యాల బిజీలో ఆలయ అధికారులు, బందోబస్తులో పోలీసులునిమగ్నం కావడంతో అక్రమార్కులకు మరింత కలిసొచ్చింది. వేలాదిగా వచ్చిన వాహ నదారుల నుంచి రూ.150, రూ.100, రూ.50 చొప్పున పార్కింగ్ ఫీజు పేరుతో వసూలు చేసి జేబులు నింపుకున్నారు. అధికారి సంతకం, ముద్రలు లేకుండానే నిలువుదోపిడీ చేశారు. టెంపుల్ కాంట్రాక్టు ఇదీ... టీటీడీ ధర్మశాల ప్రాంగణం, గుడి చెరువు కట్టవద్ద పార్కింగ్ స్థలాల వద్ద ఉన్న వాహనాలకు మాత్రమే ఫీజు వసూలు చేయాలని ఆలయ అధికారులు 2015- 17 రెండేళ్ల కోసం టెండర్ నిర్వహించారు. తిరుపతి అనే కాంట్రాక్టర్ రూ.10లక్షలకు ఈ టెండర్ దక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆటోలు రూ.20, కార్లకు రూ.50 చొప్పున తీసుకోవాలి. అయితే ఇందుకు భిన్నంగా జాత్రాగ్రౌండ్, బైపాస్‌రోడ్డు, గుడి చెరువు కట్ట కింద, ఇతర ప్రాంతంలో నిలుపుతున్న వాహనాలవద్ద బినామీ కాంట్రాక్టర్లు అధిక మొత్తం వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. ఇదంతా జరుగుతున్నా.. ఈ వ్యవహారం అధికారులకు చేరలేదా? లేక ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందా..? అన్న అంశం తేలాల్సి ఉంది. పోలీసుల విచారణ షురూ పార్కింగ్ పేరుతో అక్రమంగా వసూలు దందాకు తెరలేపిన వారెవరనేది పోలీసులు కూపీ లాగుతున్నారు. దేవస్థానంపక్షాన పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ వారికి సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఇదే చాన్స్
సాక్షి, సిటీబ్యూరో: అక్రమార్కుల చూపు మళ్లీ జీహెచ్ఎంసీ వైపు మళ్లింది. అవకతవకలకు... ఆమ్యామ్యాలకు అలవాటు పడిన వారు జీహెచ్ఎంసీకి క్యూ కడుతున్నారు. గతంలో ఇక్కడ పని చేస్తుండగా వచ్చిన అవినీతి ఆరోపణలు, పనుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో వెళ్లిపోయిన వారు తిరిగి జీహెచ్ఎంసీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు కోరుకున్న స్థానాల్లో చేరగా... మరికొందరు అతి త్వరలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బదిలీపై వెళ్లిన కమిషనర్ సోమేశ్ కుమార్ హయాంలోనే కాక... అంతకు ముందు కమిషనర్‌గా పని చేసిన కృష్ణబాబు హయాంలో మాతృ సంస్థలకు వెళ్లిన వారు కూడా తిరిగి జీహెచ్ఎంసీలో తిష్ట వేసేందుకు పెద్ద మొత్తాల్లోనే ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీలోనే ఉంటున్నప్పటికీ తాము కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు పావులు కదుపుతున్న వారు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులే కాక, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న అటెండర్లు, డ్రైవర్లు వంటి వారు కూడా కోరుకున్న స్థానాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో పనులు ఎక్కువగా ఉండటం.. బడ్జెట్ కూడా భారీగానే ఉండటం.. డబ్బులు చేతులు మారడం కూడా అదే దామాషాలో ఉండటంతో ఇక్కడ పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ఇటీవల బదిలీ అయిన సోమేశ్‌కుమార్ కచ్చితత్వంతో ఒక దశలో జీహెచ్ఎంసీలో పని చేసేందుకే భయపడిన పరిస్థితి ఏర్పడగా... ఆయన వెళ్లగానే మళ్లీ ఇటువైపు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారు భారీగా పెరుగుతున్నారు. ఇదీ వరుస * గతంలో ఒక ఉన్నతాధికారి ద్వారం వద్ద ఉంటూ.. సందర్శకులను గదిలోకి పంపించే ఓ ఔట్సోర్సింగ్ అటెండర్ పనితీరు అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అక్కడి నుంచి తప్పించారు. సోమేశ్ కుమార్‌కు బదిలీ అయిన మరుసటి రోజే పాత స్థానంలో ఆ అటెండర్ విధులు నిర్వహించడం విస్మయానికి గురి చేసింది. * అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఒక అధికారిని దాదాపు మూడేళ్ల క్రితం కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో అవసరం లేదని రిలీవ్ చేశారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి మంజూరు లేకుండానే బిల్లులు పాస్ చేయడం వంటి అంశాలు దృష్టికొచ్చి కృష్ణబాబు ఆయనను జీహెచ్ఎంసీ నుంచి పంపించినట్లు సమాచారం. ఆ అధికారి కొద్దికాలం క్రితం తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ అయినప్పటికీ విధుల్లో చేరలేకపోయారు. సోమేశ్ కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు విధుల్లో చేరలేకపోయిన ఆయన గతంలో కంటే పైస్థానంలో నేడో రేపో జీహెచ్ఎంసీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. * చాలా ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారిలో కొందరిని సోమేశ్ కుమార్ హయాంలో ఇతర స్థానాలకు పంపించారు. అలాంటి వారంతా తిరిగి పాత స్థానాల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దిశగా ఒకరిద్దరు సఫలీకృతులైనట్లు సమాచారం. * వీరి చర్యలతో గతంలో ఏ కారణం లేకుండా జీహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
దోచేస్తే ఓకే.. తప్పు చేస్తే వేటే!
డీఆర్డీఏ ఉన్నతాధికారుల తీరు - అక్రమార్కులను వదిలిపెట్టి చిరుద్యోగులపై చర్యలు - అవినీతిపరులకు అధికార పార్టీ అండదండలు అనంతపురం సెంట్రల్: డీఆర్డీఏ- వెలుగు ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు పాల్పడి లక్షలు దోచేస్తే చర్యలు తీసుకోరు కానీ, చిన్న తప్పిదాలు చేస్తే మాత్రం వేటు వేస్తారు. వివరాల్లోకి వెళితే, బుక్కపట్నం మండలంలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామాంజులు ఏకంగా ఓ బినామి ఖాతాను ప్రారంభించి రూ.22 లక్షలు అప్పనంగా భోంచేశాడు. ఈ విషయం బయటపడినా, ఆయనపై చర్యలు తీసుకోకుండా ప్రస్తుతమున్న ఓ మంత్రే నేరుగా రంగంలోకి దిగాడు. అయితే పత్రికలలో వరుస కథనాలు రావడంతో వేరే మండలానికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఉల్లికల్లు ఇసుకరీచ్‌లో రూ.44 లక్షలు అవినీతి జరిగిందని స్వయంగా ఆర్డీఓ హుస్సేన్‌సాహేబ్ తేల్చారు. అయితే ఇంత వరకూ ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. గతంలో అనంతపురం మండల సమాఖ్యలో మహిళల పేరుతో సీఐఎఫ్ రూ.2 లక్షలు, కూడేరు మండలంలో స్త్రీ నిధి నిధులు రూ. 6 లక్షలు, కళ్యాణదుర్గంలో స్త్రీనిధి రుణాలు రూ.1.80 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. కనీసం రికవరీ కూడా సరిగా చేయలేదు. అంతోఇంతో కట్టించుకొని ఫైల్స్ మూసేశారు. జిల్లా సమాఖ్యలో ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఆడిట్లో స్పష్టంగా తేలింది. కానీ నిధుల ఖర్చుపై కనీసం సమీక్ష కూడా లేదు. కానీ ఈ విషయం బయటకు ఎలా పొక్కిందని ఆరా తీస్తూ అక్రమార్కులను వ్యతిరేకించే ఓ అధికారిణి పేరు చెప్పారు. అంతే ఆమెను టర్మినేట్ చేయాలని పీడీ వెంకటేశ్వర్లు ఆదేశించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం బుక్కపట్నం సీసీ రామేశ్వరమ్మను సస్పెండ్ చేసి, స్థానిక ఏపీఎంకు షోకాజ్‌లు జారీ చేశారు. కారణమేమంటే టీడీపీ ప్రభుత్వంపై సానుభూతిని పెంచేందుకు నిర్వహిస్తున్న అనంత మహిళా వారోత్సవాలను సరిగా నిర్వహించకపోవడమే. అయితే జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఎంతమంది రాత్రిళ్లు గ్రామాల్లో బస చేస్తున్నారని ఆరా తీస్తే నామమాత్రమే. పనిచేసే చోటే నివాసముండాలనే నిబంధన ఉన్నా మారుమూల పని చేస్తున్న ఏపీఎంలు, ఏరియా కో ఆర్డినేటర్లు జిల్లా కేంద్రంలోనే నివాసముంటున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళుతూ మిగతా రోజులు ఫోన్లలోనే విధులు నిర్వహిస్తున్న అధికారులెవరో కూడా ఉన్నతాధికారులకు తెలుసు. కానీ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. చిన్న స్థాయి ఉద్యోగులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. -
అడవి బొగ్గుపాలు...
కలప టు కోల్ దందా - జోర్పూర్ శివారు కేంద్రంగా బాగోతం - కలపతో బట్టీల్లో బొగ్గు తయూరీ - 15 రోజులకు 7,500 క్వింటాళ్ల విక్రయం - రూ.1.50 కోట్ల మేర అక్రమ వ్యాపారం - అధికారులతో అక్రమార్కుల కుమ్మక్కు - ఇతర రాష్ట్రాలకు తరలింపు - పట్టించుకోని యంత్రాంగం - తగ్గుతున్న అటవీ సంపద నందిపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి గొడ్డలి పెట్టుగా మారి కొందరు అక్రమార్కులు వృక్ష సంపదను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలను నేలకూలుస్తూ.. కలపను వందలాది కిలోమీటర్లు తరలిస్తూ.. అక్రమంగా బొగ్గు తయారుచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు కర్మాగారపు కేంద్రాలను తలపిస్తున్నాయి. ఉత్పత్తి చేసిన బొగ్గును నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కరాష్ట్రాలైన మహా రాష్ర్ట, రాజ స్థాన్‌కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సిన అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జోర్పూర్ గ్రామ శివారులోని మారుమూల ప్రాంతంలో మూడో కంటికి కనిపించకుండా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న దందా ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని జోర్పూర్ శివారులో మారుమూల ప్రాంతంలో సుమారు 6 ఎకరాల స్థలంలో బొగ్గు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని గత మూడు నెలల నుండి వందలాది టన్నుల కలపను కాల్చి బొగ్గును తయారు చేస్తున్నారు. ఉత్పత్తిని చేసిన బొగ్గును జిల్లా కేంద్రానికి తరలించి అక్కడి నుండి మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్క జిల్లాల నుంచి కలప సరఫరా బొగ్గు ఉత్పత్తికి కావల్సిన కలపను నిజామాబాద్‌తోపాటు పక్క జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్‌లోని అటవీ ప్రాంతంలోని మహా వృక్షాలను నరికి వేస్తూ, కలప దుంపలుగా తయారు చేసి చెక్‌పోస్టులను దాటుకుంటూ జోర్పూర్ శివారుకు తీసుకువస్తున్నారు. అక్రమ కలప తరలింపులో ఫారెస్టుల వద్ద అధికారుల నిఘా కొరవడడం, చెక్‌పోస్టు అధికారులతో వ్యాపారులు కుమ్మక్కు కావడంతో యథేచ్ఛగా బొగ్గు ఉత్పత్తికి కావాల్సిన కలప నందిపేట మండలంలోని జోర్పూర్ శివారుకు చేరుకుంటోంది. వారంలో రోజుకోసారి లారీల్లో కలప జోర్పూర్ శివారుకు వస్తున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రాలకు వేల క్వింటాల్లో బొగ్గు బొగ్గు ఉత్పత్తికి ముడి సరుకైన రకరకాల కలప దుంపలను జోర్పూర్ శివారుకు దిగుమతి చేసుకుంటూ ఇటుక బట్టీలుగా పేర్చి నిప్పు పెడుతున్నారు. 15 రోజులుగా కాల్చుతూ బొగ్గు తయారు చేస్తున్నారు. ఇలా 15 రోజులకోసారి 5 బట్టీలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో బట్టి నుంచి సుమారు 1,500 క్వింటాళ్ల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నట్లు అక్కడ పనిచేసే కార్మికులు చెబుతున్నారు. ఇలా వేల క్వింటాళ్లుగా తయారు చేసిన బొగ్గును పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన 50 మంది కూలీలు తమ కుటుంబాలతో మూడు నెలలుగా బొగ్గు ఉత్పత్తి కేంద్రం వద్దే ఉంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గు నిల్వలు, ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే కార్మికుల గుడారాలు కర్మాగారాన్ని తలపిస్తున్నాయి. మాది రాజస్థాన్ రాష్ట్రం. మాతో పాటు మహారాష్ర్ట నుంచి పనిచేసేందుకు 50 మంది కూలీలం కుటుంబాలతో వచ్చాం. మాకు ప్రతి ఒక్కరికి రోజుకు రూ. 300 కూలి ఇస్తున్నారు. కలపను పేర్చి నిప్పుపెట్టి బొగ్గును తయారు చేసి సంచుల్లో నింపి లారీల్లో లోడు చేస్తాం. బొగ్గు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్తోంది. కలప ఎక్కడి నుంచి వస్తోందో మాకు తెలవదు. మూడు నెలలుగా పనిచేస్తున్నాం.’అని బట్టీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు చెబుతుండడాన్ని బట్టి ఈ దందా ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. అధికారికంగా అనధికార దందా... కుద్వాన్పూర్ పంచాయతీ.. జోర్పూర్ శివారు... సర్వే నంబర్ 55, 59 లోని అసైన్డ్ భూమిలో కలప టు కోల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. కలప కాల్చి బొగ్గును తయారు చేసేందుకు పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి వచ్చే ఏడాది ఈ సమయం వరకు కట్టెలు కాల్చి బొగ్గు తయూరు చేసుకునేలా ఆ భూమిని లీజుకు ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1184 ఫీజును సైతం సదరు వ్యక్తి నుంచి వసూలు చేశారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు చార్కోల్ డిపో పేరిట అనుమతులు ఇచ్చారు. ఇంకేముంది.. అధికారికం గా అనుమతులు పొందిన సదరు వ్యక్తి ఆరు ఎకరాల్లో అనధికార బాగోతానికి తెరలేపాడు. 15 రోజులకు సుమారు రూ.1.50 కోట్ల దందా సాగిస్తున్నాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకానికి గొడ్డలిపెట్టుగా మారి.. అటవీ సంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది. -
ఓవైపు పెంచుడు.. మరోవైపు నరుకుడు
- ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు - యథేచ్ఛగా చెట్లు నరికివేత - సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు - కలప లారీకి నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా బషీరాబాద్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించగా.. మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారు. సర్కార్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభిస్తే బషీరాబాద్‌లో రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో అక్రమార్కులు చెట్లను నరికి తరలించారు. అధికారులు మాత్రం నామమాత్రంగా రూ. 2 వేల జరిమానా విధించి కలప లారీని పంపించడం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. బషీరాబాద్‌లోని ఇందర్‌చెడ్ మార్గంలోని ఈద్గా వెనుకాల ఓ లారీలో కలపను లోడ్ చేస్తున్నారు. పలు గ్రామాల నుంచి చెట్లను నరికి ట్రాక్టర్లలో లారీ వద్దకు తీసుకువచ్చి లోడ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమార్కులు ఈ తతంగం నడిపించినా అధికారులకు తెలియకపోవడం గమనార్హం. బషీరాబాద్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్వోలు నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా వేసి త్వరగా లోడు తరలించాలని అక్రమార్కులకు సలహా ఇచ్చి వెళ్లడం గమనార్హం. శుక్రవారం ఉదయం మొక్కలు నాటాలని పాఠశాల నుంచి ర్యాలీ తీశామని, మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి తరలించుకుపోతే పట్టించుకునే వారేలేరని విద్యార్థులు అసహనానికి గురయ్యారు. అధికారులు అండదండలు! అక్రమార్కులు అధికారుల అండదండలతోనే చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ముండల పరిధిలోని పలు గ్రామాల నుంచి లారీల్లో కలప తరలించుకుపోతున్నా ఇటు అటవీశాఖ అధికారులు గాని, అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతరించి పోతున్న అడవి.. మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతం రోజురోజుకూ అంతరించుకుపోతోంది. ఫారెస్టు అధికారులు అడవులను పర్యవేక్షణ మరిచి తాండూరు రేంజ్ కార్యాలయంలోనే ఉంటూ టైమ్‌పాస్ చేస్తున్నారని మండలవాసులు ఆరోపిస్తున్నా రు. గతంలో మైల్వార్, నీళ్లపల్లి గ్రామా ల్లో కొందరు చెట్లను నరికి పొలం చదునుచేసి సాగుచేసుకోవడం.. ఫారెస్టు అధికారుల పనితీరుకు నిదర్శనం. రూ.2వేలు జరిమానా వేశాం బషీరాబాద్ శివారులో లారీలో కలపను తరలిస్తున్నారనే సమాచారంతో వీఆర్ఓలను పంపించాం. రూ. 2 వేల జరిమానా కూడా విధిం చాం. మా అధికారులే దగ్గరుండి కలప లోడ్‌ను పంపించారనే విషయం నా దృష్టికి రాలేదు. -భిక్షపతినాయక్, తహసీల్దార్, బషీరాబాద్ -
ఇసుకాసురులు
తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఇసుక మాఫియా ♦ అడ్డగోలు తవ్వకాలతో పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు ♦ అక్రమార్కులు చెలరేగిపోతున్నా కళ్లు మూసుకుంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడానికి, కరకట్టలు బలహీనమవడానికి మాత్రమే కాదు.. అనేక పర్యావరణ దుష్పరిణామాలకు కారణం ఒక్కటే.. ఇసుక మాఫియా! అడ్డూ అదుపు లేని ఇసుక తవ్వకాలు అటు పర్యావరణం, ఇటు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదీతీరాల్లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడంతో చినుకు నేలలోకి ఇంకడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు మరింత కిందకు జారిపోతున్నాయి. జలసిరితో కళకళలాడాల్సిన భూగర్భం తడారి ఎడారిగా మారుతోంది. నదీగర్భంలో సైతం నీటి జాడ కరువవుతోంది. నదిలో ఇసుక కరువవడంతో నీటి ప్రవాహవేగం పెరుగుతోంది. నదీజలాలు భూగర్భంలోకి ఇంకకుండానే వడివడిగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. నీటి గలగలలతో కళకళలాడాల్సిన నదులు సహజఅందాలకు దూరమై వట్టిపోతున్నాయి. ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతుండడంతో కృష్ణా, గోదావరి నదుల కరకట్టలు బలహీనమవుతున్నాయి. ఫలితంగా వరదల సమయంలో గండ్లు పడి సమీప ప్రాంతాలను ముంచెత్తడంతో భారీ నష్టాలు చవిచూడాల్సివస్తోంది. కంట్లో ఇసుక కొట్టారు.. 2009 అక్టోబర్ 2న వరదలతో తుంగభద్ర నది పోటెత్తడంతో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని తీర ప్రాంతాలన్నీ ఇసుకమయం అయ్యాయి. భారీ పరిమాణంలో ఇసుక కొట్టుకొచ్చింది. దీంతో ఇసుక మాఫియా కోరలు విప్పింది. ఈ రెండు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోజూ వందల లారీల ఇసుక అక్రమ రవాణా జరిగింది. మంత్రాలయం నుంచి జొహరాపురం వరకు తుంగభద్ర తీరంలోని గ్రామాల్లో వేల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు పుట్టుకొచ్చాయి. కళ్ల ఎదుటే ఇసుక లారీలు, ట్రాక్టర్లు తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. రెవెన్యూ, పోలీసు, గనుల శాఖల అధికారులకు మామూళ్లు ముట్టేవి. రెండేళ్లు గడిచేసరికి తుంగభద్ర నది గర్భం నుంచి ఇసుక కనుమరుగైపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నడుమ నుంచి తుంగభద్ర పారుతున్నా.. ఇసుక లేక భూగర్భంలోకి నీళ్లు ఇంకడం లేదు. భూగర్భ జలాలు లభించక రెండు జిల్లాల పరిధిలో నీటికి కటకట ఏర్పడింది. అంతేనా.. ఇసుక ట్రాక్టర్లు, లారీల రాకపోకల ఒత్తిడితో తీర ప్రాంత గ్రామాల రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. మం‘జీర’బోతోంది మంజీరా నది పరీవాహక ప్రాంతంలో అక్రమ తవ్వకాలతో ‘ఇసుకాసురులు’ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పట్టా భూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు తీసుకున్న మాఫియా ఏకంగా మంజీరానే తోడేసింది. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, పటాన్‌చెరుతో పాటు నిజామాబాద్‌లోని బిచ్కుంద, బీర్కూరు, కోటగిరి, మద్నూరు మండలాల్లోని పట్టాభూముల్లో జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇసుక మాఫియా ఈ పట్టా భూముల్లో అనుమతులకు మించి ఇసుకను తోడి.. రోజుకు 600 నుంచి 800 లారీల్లో హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు గడించింది. 2,14,500 క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు అనుమతులు పొంది.. ఐదు రెట్లు అదనంగా ఇసుక తవ్వుకెళ్లారన్న ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరపాలని నిర్ణయించినా.. ముందుకు సాగడం లేదు. తడారిన భూగర్భం ఇసుక తవ్వకాలు పేట్రేగడం, మరోవైపు భూగర్భ జలాల వినియోగం మితిమీరడంతో నీళ్లు పాతాళానికి వెళ్లిపోతున్నాయి. రెండేళ్లకోసారి భూగర్భ జల శాఖ నిర్వహించే అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల కింద జరిగిన అధ్యయనం నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే అందులోని కీలక సమాచారాన్ని ‘సాక్షి’ సేకరించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలోని 1,057 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు అత్యంత ప్రమాదకర (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) స్థాయికి దిగజారాయి. లభ్యతతో పోల్చితే భూగర్భ జలాల వినియోగం 100 శాతానికి మించడంతో ఆ గ్రామాల్లో భూగర్భం తడారిపోయింది. ఇక 214 గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి విషమం (క్రిటికల్)గా ఉంది. ఇక్కడ భూగర్భ జలాల వినియోగం 90-100 శాతం మధ్యలో ఉంది. 443 గ్రామాల్లో 70-90 శాతం మధ్య వినియోగంతో పరిస్థితి స్వల్ప విషమం (సెమీ క్రిటికల్)గా తయారైంది. పర్యావరణ ధ్యాసే లేదు నదీ తీరంలో 5 హెక్టార్లు, అంతకు మించి ఇసుక ఉన్న ‘రీచ్’లలో ఇసుక తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ఇసుక వేలం ప్రక్రియలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రీచ్‌లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కి జేసీబీలు, ప్రొక్లెయిన్లతో మితిమీరి ఇసుక తోడేస్తున్నారు. నదుల గర్భంలో రాళ్లు బయటపడే వరకు ఈ తవ్వకాలు జరిగినా అధికారులు ‘మామూళ్లు’గా కళ్లు మూసుకుంటున్నారు. హే కృష్ణా... కృష్ణా జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో లక్షల టన్నుల్లో ఇసుక తవ్వేస్తున్నారు. పదిహేనేళ్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన విచ్చలవిడిగా తవ్వకాలు జరపడం వల్ల భూగర్భ నీటి నిల్వలు పడిపోతున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో జూన్ నుంచి అక్టోబర్ మధ్య వరదలు వస్తాయి. ఇసుక మేటలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇసుక, మట్టి పొరలు సర్దుకుంటాయి. భారీ వరదలు వచ్చిపోయిన రెండు మూడు రోజులకు ప్రకాశం బ్యారేజీ వద్ద చిన్నపాటి ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. ఇసుక, మట్టి పొరలు సర్దుకునే క్రమంలో ఈ ప్రకంపనలు వస్తాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మోతాదుకు మించి ఇసుక తవ్వకాలు కూడా వీటికి కారణమని పేర్కొంటున్నారు. ♦ తుంగభద్ర నది.. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య నుంచి ప్రవహిస్తున్నా వందల గ్రామాలు, తండాలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి! గుక్కెడు మంచినీటి కోసం గొంతెండుతున్నాయి! ఎందుకు? తీరప్రాంతంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. నీటిచుక్క కరువైంది! ♦ కృష్ణా నది వరదలతో పోటెత్తితే చాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఎక్కడో ఓచోట కరకట్టలకు భారీ గండ్లు పడుతున్నాయి. పంటలు నీటిపాలవుతున్నాయి. ఊళ్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎందుకు? నదికి రక్షణగా నిలవాల్సిన కరకట్టలు ఏటేటా బలహీనమైపోతున్నాయి! వాల్టా చట్టం ఏం చెబుతోంది ♦ భూగర్భ జలాలు ప్రమాదకర (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) స్థితికి చేరుకున్నట్లు ప్రకటించిన ప్రాంతాల పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించాలి. ♦ నోటిఫైడ్ ప్రాంతాల్లో కేవలం స్థానిక గ్రామ/పట్టణ అవసరాలకు మాత్రమే తవ్వకాలు జరపాలి. ♦ డ్యాములు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దు. ♦ తీరంలో 8 మీటర్లు ఆపైలోతులో ఇసుక లభ్యత ఉంటే గరిష్టంగా 2 మీటర్ల లోతు వరకు తవ్వకాలకు అనుమతి ఇవ్వవచ్చు. కనీసం 3 మీటర్ల వరకు ఉంటే మీటర్ వరకు తవ్వకాలకు అనుమతిస్తారు. ♦ నది గర్భం నుంచి తీరం వరకు 15 మీటర్ల వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి జపాన్, చైనా తదితర దేశాలు ఇసుకకు ప్రత్యామ్నాయాలపై విసృ్తతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఉక్కు కర్మాగారాల్లోని శేష పదార్థాలు(స్లాగ్), థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తవుతున్న బూడిద (ఫై ్లయాష్), పాత భవనాల శిథిలాల నుంచి ఇసుకను తయారు చేసుకుని ప్రత్యామ్నాయంగా వినియోగించుకుంటున్నాయి. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాణ రంగ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు, మేధావులతో ఏర్పడిన ‘ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ (ఐసీఐ)’ సైతం ఇసుకకు ప్రత్యామ్నాయాలపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన పర్యావరణవేత్త, డాక్టర్ ఎల్.హెచ్ రావు ఉన్నారు. ఆ కమిటీ కూడా పైన చెప్పిన మూడు ప్రత్యామ్నాయాలను సూచించింది. రహదారుల నిర్మాణం కోసం ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఐరన్ ఓర్ స్లాగ్‌ను వినియోగించేందుకు ఇటీవల జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏ) అనుమతించింది. పాత భవనాల శిథిలాలను క్రషర్ ద్వారా ఇసుకగా మార్చి వినియోగించుకోవచ్చు. జపాన్, చైనా దేశాల్లో చిన్న చిన్న కట్టడాల నిర్మాణం కోసం ఇప్పటికే శిథిలాల ఇసుకను వినియోగిస్తున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి భారీగా ఫై ్లయాష్ ఉత్పత్తి అవుతోంది. 80 శాతం ఇసుకలో 20 శాతం ఫ్లై యాష్‌ను కలిపి వాడవచ్చు. ఉక్కు కర్మాగారాల్లో ఇనుప ఖనిజానికి సున్నపురాయి కలిపి 1,500 డిగ్రీల వద్ద వేడిచేస్తారు. దీంతో ఉక్కుతో విడిపోయిన మాలిన్యాలు పైకి తేలి ఇసుక పదార్థంలా ఏర్పడుతాయి. జపాన్, చైనా దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఐరన్ ఓర్ స్లాగ్ ఇసుకకు 100 శాతం ప్రత్యామ్నాయమని గుర్తించారు. దీనిపై అవగాహన లేక మన దేశంలో వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాల్లో ఐరన్‌ఓర్ స్లాగ్‌ను అనుమతిస్తే ప్రజల్లోనూ చైతన్యం వస్తుంది. దేశంలో ఏటా 70 మిలియన్ టన్నుల ఇనుముతో పాటు దాదాపు 30 మిలియన్ టన్నుల స్లాగ్ ఉత్పత్తి అవుతోంది. ఉక్కు కర్మాగారాలు సైతం ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. దానిని తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రత్యామ్నాయ సామగ్రితో నిర్మాణాలు చేసే వారికి జపాన్‌లో రాయితీలు కూడా ఇస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్తు ప్రశ్నార్థకమే మానవ జాతికి ఇదే చివరి తరం అన్నట్లు సహజ వనరులను లూటీ చేస్తున్నారు. ప్రకృతి విధ్వంసంతో భవిష్యత్తు తరాల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలు ఆపకపోతే విపరిణామాలు తప్పవు. ఇసుక కొరతను తీర్చుకోవడం కోసం రాక్ సాండ్ పేరుతో కొండలను ధ్వంసం చేయడం ఇంకా ప్రమాదకరం. ప్రత్యామ్నాయ ఇసుక వినియోగమే పరిష్కారం. - రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.పురుషోత్తం రెడ్డి పర్యావరణవేత్త ఆధునిక పరిజ్ఞానమే పరిష్కారం పూర్వం ప్రతి ఊరి శివారులో పుష్కలంగా ఇసుక ఉండేది. వాననీళ్లు ఎక్కడికక్కడే ఇంకి భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చేవి. మట్టి, సున్నం మిశ్రమంతోనే అన్ని రకాల నిర్మాణాలు చేసేవారు. కానీ సిమెంట్ పరిచయం తో ఇసుక తప్పనిసరైపోయింది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు పడిపోయాయి. ఇసుక తవ్వకాలపై నియంత్రణ కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగించుకోవాలి. ద్రోణ్లతో త్రీడీ మ్యాపింగ్ ఆధారంగా నదుల్లో ఇసుక లభ్యతపై సర్వే జరపాలి. అనుమతించిన పరిమితులకు లోబడే తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా? అని పరిశీలించేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. - డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి, పర్యావరణవేత్త రాళ్ల దిగుమతి తప్పదేమో.. భవిష్యత్తులో గ్రానైట్ చాలా అవసరం. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో ఈ రాళ్లు ఎంతో అవసరం. రాతి ఇసుక కోసం కొండలను కరిగించుకుంటూపోతే భవిష్యత్తులో రాళ్లను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తవచ్చు. - డాక్టర్ ఎల్.హెచ్ రావు, సాంకేతిక సలహాదారులు, జిందాల్ సిమెంట్ పరిశ్రమలు క్రమపద్ధతిలో జరగాలి ఇసుక తవ్వకాలు క్రమపద్ధతిలో జరగాలి. ఒకచోట ఎక్కువ తవ్వేసి మరొకచోట వదిలేయడం వల్ల నీరు సరిగా పారదు. ఎక్కువ తవ్విన ప్రాంతాల్లో భూమి కోతకు గురవుతుంది. ఎక్కువ ఇసుక ఉన్నచోట పైపొరను మాత్రమే తీయాలి. లోపలి పొరలు కూడా తవ్వితే నీటిస్థాయి పడిపోతుంది. - డాక్టర్ ఎంవీఎస్ రాజు, ప్రొఫెసర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడ -
నీరు-చెట్టు.. అధికారుల కనికట్టు
- అన్నీ కాకిలెక్కలే! - పూడికతీత మట్టితో పచ్చనేతలకు కాసులు సాక్షి, విశాఖపట్నం: నీరు-చెట్టు పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారుతోంది. జిల్లాలో వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న మీడియం ఇరిగేషన్ చెరువులు 236 ఉంటే వందలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 3111 ఉన్నాయి. ఏప్రిల్‌లో తొలిదశలో రూ.4.97 కోట్ల అంచనాలతో 23 చెరువులకు, ఇటీవలే రెండోదశలో రూ.18.30 కోట్లతో మరో 69 చెరువుల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది.తొలిదశలో తొమ్మిది చెరువుల్లో పనులు ప్రారంభించి వర్షాలు పడ్డాయనే సాకుతో పదిరోజుల పాటు నిలిపివేశారు. గత నెలాఖరు వరకు ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు. యలమంచిలి నియోజకవర్గంలో ఒక్క చెరువులో కూడా పనులు చేపట్టిన దాఖలాలు లేవు. బయ్యవరంలో ప్రారంభించి ఆ తర్వాత ఎక్స్‌వేటర్ మరమ్మతుకు గురైందనే సాకుతో పనులు నిలిపేశారు. ఇవి ఉదాహరణలు మాత్రమే.. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పనులు మొక్కుబడిగానే సాగుతున్నాయి. కొద్దిపాటి వర్షాలకే గత నెలలో వారం రోజుల పాటు పనులు నిలిపి వేశారు. ప్రస్తుతం 92 చెరువుల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే ఏకంగా 40 శాతం పూడికతీత పనులు పూర్తయ్యాయని అధికారులు లెక్కలు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. నామినేషన్ పద్ధతిలో ఈ పనులను అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుయాయులకు కట్టబెట్టారు. వీరు సమకూర్చిన 49 ఎక్సవేటర్స్ అప్పుడే 11వేల గంటలపాటు పూడికతీతపనులు చేశాయని లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎక్కడా పట్టుమని పదిహేను రోజులు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. మట్టి.. గ్రావెల్‌కు రెక్కలు చెరువుల్లోని మట్టి/గ్రావెల్‌కు రెక్కలొచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 3.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే వెలికితీసినట్టు లెక్కలుచూపుతున్నారు. 92 చెరువుల్లో 40 శాతం పనులు పూర్తయ్యాయంటే ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మట్టంతా ఏమైపోతుందని అడిగితే క్యూబిక్ మీటర్‌కు రూ.22 చొప్పున స్థానిక సంస్థలకు సీనరేజ్ కట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఈ మట్టి/గ్రావెల్ అమ్మకాల ద్వారా టీడీపీ నేతలు లబ్ధిపొందుతున్నారనే విమర్శలున్నాయి. వర్షాలు పడేలోగా పనులు పూర్తిచేసినట్టు రికార్డులు సృష్టించుకుని బిల్లులు డ్రా చేసుకోవాలన్నది ఎత్తుగడగా చెబుతున్నారు. మరో 30 నుంచి 40 శాతం పనులుండగానే పూర్తి చేసినట్టుగా చూపించి అందినకాడికి బొక్కేయాలన్న ఆలోచనతో అధికార పార్టీ నేతలున్నట్టు కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ఈ పనులపై నిఘా ఉంచకపోతే కోట్ల విలువైన మట్టి/గ్రావెలే కాదు.. కోట్లాదిరూపాయల ప్రజాధనం కూడా ఈ స్వాహారాయుళ్ల పరమయ్యే అవకాశం ఉంది. -
సర్కారీ జాగా.. అక్రమార్కుల పాగా!
వివిధ సంస్థలకు కట్టబెట్టిన సర్కారీ స్థలాల్లో వెలసిన కట్టడాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పారిశ్రామిక, అటవీ, విద్యా, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలాచోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ ఆక్రమణదారులంతా జీఓ 58 కింద తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీలున్నంత వరకు స్థలాల క్రమబద్ధీకరణపై ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేయడంతో.. చెరువులు, శ్మశానవాటిక, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములను కూడా రెగ్యులరైజ్చేసే కోణంలో రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ⇒ టీఐఐసీ, అటవీ స్థలాల క్రమబద్ధీకరణ ⇒ జంట జిల్లాల్లో 13 వేల దరఖాస్తుల పరిశీలన ⇒ ఆమోదానికి అత్యున్నతస్థాయి కమిటీ ⇒ శిఖం భూములపై ఆచీతూచీ అడుగు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరింత పట్టువిడుపుగా వ్యవహరించనుంది. వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాల్లో వెలిసిన నిర్మాణాలను కూడా ఆయా శాఖల సమ్మతితో క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలి స్తోంది. ఫలితంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 13,417 దరఖాస్తులకు మోక్షం కలిగించే అంశంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని కమిటీ కుస్తీ పడుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 6,692 దరఖాస్తులు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,725 దరఖాస్తులు ఉన్నాయి. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం ఆయా శాఖలకు ప్రభుత్వం స్థలాలను కేటాయియించింది. ఈ స్థలాల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కొన్నిచోట్ల అవసరానికి మించి స్థలం కట్టబెట్టడంతో ఆ జాగాలను పరిరక్షించడంలో ఆయా శాఖలు చేతులెత్తేశాయి. ఫలితంగా ఈ స్థలాలు కాస్తా బస్తీలుగా అవతరించాయి. ఈ బస్తీదారులంతా ఇప్పుడు ఉచితకేటగిరీ (58 జీఓ) కింద తమ ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుతానికి అర్జీలు పెట్టుకున్నారు. ఉదాహరణకు.. బాలానగర్ మండలం అల్లావుద్దీన్ కుట్టి కాలనీ స్థలాన్ని గతంలో టీఐఐసీకి బదలాయించారు. దశాబ్ధాల క్రితమే పారిశ్రామిక అవసరాల కోసం ఈ భూమని టీఐఐసీకి కేటాయించారు. అయితే, ఈ స్థలసేకరణలో ఆ సంస్థ నిర్లిప్తంగా వ్యవహరించింది. దీనికితోడు అప్పటికే ఆ ప్రాంతంలో కాలనీ ఉండడంతో వారిని ఖాళీ చేయించే సాహసం చే యలేకపోయింది. ఈ క్రమంలోనే అల్లావుద్దీన్ కుట్టీలో నివసిస్తున్న 355 మంది తమ ఇళ్లను రెగ్యులరైజ్ చేయమని రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగూ ఈ స్థలాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యంకాదు కనుక.. టీఐఐసీ సమ్మతితో ఈ స్థలాలను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇలా ప్రతి శాఖ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని స్థలాల క్రమబద్ధీకరణకు ముందడుగు వేయాలని భావిస్తోంది. శిఖం స్థలాలకు వెనుకడుగు! శిఖం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్థలాల క్రమబద్ధీకరణ జోలికి వెళితే న్యాయపరమైన చిక్కులు తప్పవని స్పష్టం కావడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉన్న చెరువులు నగరీకరణ నేపథ్యంలో కనుమరుగు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వరదనీటి ప్రవాహం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శిఖం/ఎఫ్టీఎల్లో వెలిసిన నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఇందులోభాగంగా జిల్లాలో దాదాపు 8,887 దరఖాస్తులకు మోక్షం కలిగించే దిశగా ఆలోచించింది. శిఖం భూములపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు స్పష్టం చేసిన అభిప్రాయాలను గమనంలోకి తీసుకున్న సర్కారు.. వీటిని పక్కనపెట్టడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. -
అక్రమాలకు రహదారి
రంగు మార్చి.. అడ్డంగా దోచేసి! దారి మళ్లుతున్న నీలి కిరోసిన్ అడ్డాగా మారిన జాతీయ రహదారులు కిరోసిన్ వినియోగం తగ్గడమే అక్రమార్కులకు వరం సాక్షి, కర్నూలు : ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందాల్సిన నీలి కిరోసిన్ దారి మల్లుతోంది. డీజిల్‌గా చెలామణి చేస్తూ అక్రమార్కులు అడ్డంగా దోచేస్తున్నారు. డీజిల్ ధరకు రెక్కలు రావడం.. కిరోసిన్ తక్కువ ధరకు లభిస్తుండటంతో కల్తీ వ్యాపారం జోరందుకుంది. జిల్లా మీదుగా వెళ్తున్న 251.5 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారి ఈ వ్యాపారానికి వేదికగా మారింది. ప్యాపిలి నుంచి తుంగభద్ర నది బ్రిడ్జి వరకు 119 కిలోమీటర్ల 44వ జాతీయ రహదారి ఉండగా.. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు నుంచి చాగలమర్రి మండలం వరకు 132.5 కిలోమీటర్ల పొడవున 18వ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారు ల్లోని నీలి కిరోసిన్ అడ్డాల్లో కల్తీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు ప్రతి నెలా 22వేల కిలో లీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీపం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కలిగిన వారికి ప్రతి నెలా లీటరు కిరోసిన్ ఇస్తుండగా.. గ్యాస్ లేని కుటుంబాలకు నాలుగు లీటర్లు పంపిణీ చేస్తోంది. అయితే కిరోసిన్ వినియోగం తగ్గడంతో రేషన్ దుకాణాల్లో విక్రయించే లీటరు రూ.15 కిరోసిన్.. బహిరంగ మార్కెట్లో రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. ప్రధానంగా కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నీలి కిరోసిన్ నల్ల బజారుకు తరలుతోంది. రూపు మారుతోందిలా.. అడ్డదారిలో సేకరించిన నీలి కిరోసిన్‌లో కాస్త కెమికల్ పౌడర్, యాసిడ్ కలిపి మోటార్ సాయంతో డ్రమ్ములో కలిపితే రెండు గంటల్లో డీజిల్ రంగులోకి మారుతుంది. ఇలా డీజిల్‌గా మార్చిన కిరోసిన్ అమ్మకాలు ఒక ఎత్తయితే.. కొందరు లారీ డ్రైవర్లు యాజమానులకు తెలియకుండా నేరుగా కిరోసిన్‌నే ట్యాంకుల్లో పోస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలు జిల్లాలో కోకొల్లలు. కల్తీ డీజిల్ వాడినా, నేరుగా కిరోసిన్ వాడినా వాహనాలు దెబ్బతినడంతో పాటు కాలుష్యం పెరుగుతుంది. చౌక దుకాణాల నుంచే కిరోసిన్ పక్కదారి పడుతుండటంతో అడ్డాల్లో అక్రమ వ్యాపారం మూడు లారీలు, ఆరు పీపాలుగా సాగిపోతోంది. ఇలా కలిసొస్తోంది.. లీటరు డీజిల్ ధరకు రెండు లీటర్ల కిరోసిన్ వస్తోంది. మైలేజీ ఒకేలా రావడంతో ఎక్కువ మంది కిరోసిన్ వైపు మొగ్గుచూపుతున్నారు. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో రోజుకు 1,500 లీటర్ల కిరోసిన్ ఇలా దారి మల్లుతున్నట్లు అనధికార అంచనా. ప్రస్తుతం ఇళ్లలో కిరోసిన్ వినియోగించే వారు తక్కువయ్యారు. పూరి గుడిసెలోనూ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ పరిస్థితి అక్రమాలకు ఊతమిస్తోంది. కిరోసిన్ ఇవ్వడమే తప్ప కార్డుదారులు సమర్థంగా వినియోగించుకునే పరిస్థితి కరువైంది. ఫలితంగా బ్లాక్ మార్కెట్ ఊపందుకుంటోంది. చర్యలు చేపడతాం : ప్రభాకర్‌రావు, డీఎస్ఓ పేదలకు చేరాల్సిన నీలి కిరోసిన్ బయటి మార్కెట్‌కు తరలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. కల్తీ చేసి వాహనాలకు వినియోగిస్తున్న విషయంపై సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తా. అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోం. -
ప్రజారోగ్యం.. ప‘రేషన్’
చౌకదుకాణాల్లో కాలం చెల్లిన గోధుమ పిండి సివిల్ సప్లయ్ గోడౌన్ నుంచి రేషన్ దుకాణానికి నెంటూరులో వెలుగు చూసిన బాగోతం సీఎం ఇలాఖాలో ఇదేమి చోద్యం వర్గల్ : రోజుకో రకమైన దందా వెలుగు చూస్తున్నాయి. అధికారుల ఉదాసీన వైఖరితో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రజారోగ్యాన్ని ప‘రేషన్’ చేస్తున్నారు. వారు చేసే ప్రయోగాలకు బీదోడే బలవుతున్నాడు. కాలం చెల్లిన గోధుమ పిండిని పేద ప్రజలకు అంటకడుతున్నా అధికారులు మొద్ద నిద్ర వీడడంలేదు. ఏకంగా సీఎం ఇలాఖాలో ఈ దందా సాగుతున్నా చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు చేపట్టడంలేదు. ప్రభుత్వం బియ్యం, చక్కెరతోపాటు గోధుమ పిండి, పప్పు తదితర నిత్యావసర సరుకులను చౌక ధరల దుకాణాలు (రేషన్ దుకాణాలు) ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నది. ఈ సరుకులను కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీ సివిల్ సప్లయ్ గోడౌన్‌కు చేరవేస్తోంది. వీటి నాణ్యతను అక్కడి గోడౌన్ ఇన్చార్జ్ పరిశీలించి డీలర్లకు అందజేస్తారు. అయితే వర్గల్ మండలానికి గజ్వేల్ సివిల్ సప్లయ్ గోడౌన్ ద్వారా రేషన్ సరుకులు సరఫరా అవుతాయి. ఇక్కడి గోడౌన్‌కు కాలం చెల్లిన గోధుమ పిండి ప్యాకెట్లు చేరాయి. అయితే ప్యాకెట్ల మీద పాత తేదీలు కనపడకుండా కొత్త తేదీలతో కూడిన స్టిక్కర్లు అంటేశారు. ఇదిలాఉండగా ఆ గోధుమ పిండి ప్యాకెట్లలో కొన్నింటిని నెంటూర్ రేషన్ డీలర్‌కు గత నెల ఏప్రిల్ 13న అంటగట్టారు. డీలర్ సైతం తేదీలను చూడకుండా గ్రామస్తులకు వాటిని పంపిణీ చేశారు. స్టిక్కర్లు అంటేసి ఉన్న గోధుమ పిండి ప్యాకెట్లు చూసి కొందరు గ్రామస్తులు అనుమానంతో పరిశీలించగా అసలు విషయం బయటపడింది. స్టిక్కర్ల కింద 2014 ప్రత్యక్షం కావడంతో సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. పేద ప్రజలను మోసగించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులకు నివేదిస్తాం నెంటూరు రేషన్ దుకాణం ద్వారా కాలం చెల్లిన గోధుమ పిండి విక్రయించిన వ్యవహారం నా దృష్టికి వచ్చింది. సరుకులు వెనక్కు తెప్పించి వినియోగదారులకు నాణ్యమైన గోధుమ పిండి ప్యాకెట్లు పంపిణి చేస్తాం. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అక్రమార్కులపై చర్యలు తప్పవు. - శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్, వర్గల్ స్టిక్కర్లు గమనించలేదు గోడౌన్‌లోకి సరుకులు వచ్చిన సందర్భంలో గోధుమ పిండి ప్యాకెట్ల మీద ఎక్స్పైరీ తేదీలు కనపడకుండా స్టిక్కర్లు అంటించి ఉన్న విషయం గమనించలేదు. ఇలాంటి సరుకులను వెనక్కి పంపించాలని నెంటూరు రేషన్ డీలర్‌కు సూచించా. ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉంటాం. - పద్మావతి, గజ్వేల్ సివిల్ సప్లయ్ గోడౌన్ ఇన్‌ఛార్జి స్టిక్కరింగ్ వ్యవహారంపై విచారణ నెంటూరు రేషన్ దుకాణం ద్వారా సరఫరా అయిన కాలం చెల్లిన గోధుమ పిండి ప్యాకెట్లు సీజ్ చేయిస్తా. ఘటనపై విచారణ చేపడతాం. పేదల సరుకుల విషయంలో అవకతవకలు సహించబోం. -గడా ఓఎస్డీ హన్మంతరావు -
సిమెంట్ బస్తాల్లో ఇసుక అక్రమరవాణా
రాత్రి వేళల్లో కొనసాగుతున్న దందా! యాలాల: కాగ్నానది నుంచి ఇసుక తరలించకుండా కళ్లెం వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజూ ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి రాత్రి సమయంలో ఆటోలు,జీపుల్లో అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ఇసుక అక్రమ రవాణా తగ్గిందని భావిస్తున్నప్పటికీ రాత్రివేళల్లో జోరుగా కొనసాగుతోంది. మండల పరిధిలోని కోకట్, విశ్వనాథ్‌పూర్, బెన్నూరు తదితర గ్రామాల శివారులో ఉన్న కాగ్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం అక్రమార్కులకు సహాయంగా ఆటో, జీపు డ్రైవర్ల యజమానులు కాగ్నానది నుంచి సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒక్కో ఆటోలో 10 నుంచి 20 బస్తాల్లో ఇసుక నింపి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ దందా కొనసాగుతోంది. ఒక్కో ఆటోకు రూ.600 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. విశ్వనాథ్‌పూర్ సమీపంలోని శివసాగర్ ప్రాజెక్టు దిగువన కాగ్నానదిలో ఇసుకను సిమెంట్ బస్తాల్లో నింపి రాత్రివేళల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అగ్గనూరు, సంగెం నుంచి కూడా ట్రాక్టర్లలో ఇసుక అక్రమ కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ వర్షిణి, తాండూరు ఏఎస్పీ చందనదీప్తి కఠిన చర్యలకు దిగుతున్నప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. -
మైనింగ్ మాయ!
కందుకూరు: అక్రమార్కుల కన్ను ప్రభుత్వ, అటవీ భూములపై పడింది. అనుమతులు తీసుకున్న చోట కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం ఫిర్యాదులు అందినప్పుడు హడావుడి చేస్తూ ఆ తర్వాత తమకేమీ పట్టనట్లుగా మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారీతీన తవ్వకాలు.. మండల పరిధిలో వివిధ గ్రామాల్లో క్వారీలు, క్రషర్లు, చెరువు శిఖాల్లో ఎర్రమట్టి, నల్లమట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పులిమామిడి, లేమూరు, మీర్కాన్‌పేట, కందుకూరు తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు ఇష్టారీతిన కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా చోట్ల అనుమతులు ఒక దగ్గర తీసుకుని తవ్వకాలు మరో చోట నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం లేమూరులో సర్వేనంబర్ 356లో 20 గుంటలకు అనుమతులు తీసుకుని కంకెల కుంట శిఖం భూమిలో తవ్వకాలు జరుపుతున్నారంటూ గ్రామస్తులు అక్కడికి చేరుకుని తవ్వకాలను నిలిపివేయించి ఆందోళన చేశారు. చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అటవీ భూముల్లో... మురళీనగర్ సమీపంలోని సర్వేనంబర్ 74, 75ల్లో 22.32 ఎకరాల భూమిపై క్వారీకి అనుమతులు తీసుకుని నాలుగేళ్లుగా తవ్వకాలు జరుపుతున్నారు. కాగా ఆ భూమికి ఆనుకుని చిప్పలపల్లి అటవీ భూమి సర్వే నంబర్185లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్లు ఇటీవల మురళీనగర్, చిప్పలపల్లి గ్రామస్తులు పలువురు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం క్వారీకి వెళ్లే మార్గంమధ్యలో తవ్వి వాహనాల రాకపోకలను నిలువరించారు. నిత్యం అటవీ భూముల నుంచే టన్నులకొద్దీ విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని, సర్వే చేయించి అటవీ భూములకు హద్దు రాళ్లను పాతాలని డిమాండ్ చేశారు. కటికపల్లి వద్ద నిర్వహిస్తున్న క్రషర్‌తో చుట్టు పక్కల పంటలు పండించలేకపోతున్నామని దుమ్మూధూళీ దట్టంగా కమ్ముకుని ఇబ్బందికరంగా మారుతోందంటూ గ్రామస్తులు ఇటీవల ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖ లాలు లేకుండాపోయాయి. మరోవైపు బేగంపేట పరిధి లో కొనసాగుతున్న మరో క్రషర్ నిర్వాహకులు రెండు నెలల క్రితం అటవీ భూముల నుంచి రోడ్డు వేసుకుని రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ అధికారులు లారీలకు చలానా విధించి రాకపోకలను నిలువరించారు. వివిధ గ్రామాల్లో ఇటుక బట్టీలు యథచ్ఛగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటల నుంచి మట్టిని అక్రమంగా తరలించి దందా నడుపుతున్నా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. ఫిర్యాదు చేస్తే గానీ స్పందించడంలేదని, కొన్ని సందర్భాల్లో తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టి మమ అనిపిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించి అటవీ, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఎవరినీ ఉపేక్షించడంలేదు. లేమూరులో కూడా ఫిర్యాదు అందగా తవ్వకాలను నిలిపివేయించాం. పరిశీలించిన తర్వాత అనుమతిస్తాం. - సుశీల, తహసీల్దార్, కందుకూరు -
‘ఉపాధి’.. అక్రమాల మాటేమిటి..?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉపాధి హామీ పథకంలో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. కూలీల సొమ్మును అక్రమార్కులు దిగమింగుతూనే ఉన్నారు. ప్రభుత్వం మారినా పనుల్లో అవినీతి ఏ మాత్రం తగ్గడం లేదు. సామాజిక తనిఖీల్లో పెద్దయెత్తున వెలుగు చూస్తున్న అవకతవకలే ఇందుకు నిదర్శనం. జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో పక్కదారి పట్టిన సొమ్ము ఏకంగా రూ.3.36 కోట్లకు చేరిందంటే.. ఇంకా వెలుగులోకి రాని అవకతవకలు ఏమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్రామీ ణ ప్రాంతాల్లో నిరుపేద కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై కూలీల సొమ్మును అప్పనంగా కాజేస్తున్నారు. అసలు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేయడం, బినామీ కూలీల పేర్లతో ప్రతినెలా వేలల్లో కూలీ మొత్తాన్ని కలిసి పంచుకోవడం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 52 మండలాల్లో 5వ విడత సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. 42 మండలాల్లో ఆరో విడత పూర్తయింది. 12 మండలాల్లో ఏడో విడత సామాజిక తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 7,824 అభ్యంతరాలు వ్యక్తం కాగా, వీటిలో సుమారు రూ.14.31 కోట్ల అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాల దృష్టికి వచ్చింది. ఈ అక్రమాలపై ప్రాథమిక విచారణ జరపగా రూ.3.36 కోట్లు పక్కదారి పట్టినట్లు రుజువైంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లే పెద్దయెత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. పక్కదారి పట్టిన సొమ్ములో వీరి అక్రమాలు రూ.2.31 కోట్లకు పైగా ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్లు రూ.అరకోటిపైగా జేబులు నింపుకున్నారు. మండల స్థాయిలో పనిచేసే ఏపీఓలు కూడా సుమారు రూ.20 లక్షలు వరకు దిగమింగినట్లు తేలింది. ఈ అక్రమాల్లో ఎంపీడీఓల పాత్ర కూడా ఉంది. రికవరీ కొండంత.. పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో రికవరీ చేయాల్సిన సొమ్ము కొండలా పేరుకుపోతోంది. జిల్లాలో పక్కదారి పట్టిన రూ.3.36 కోట్లలో ఇప్పటివరకు అక్రమార్కుల నుంచి వసూలు చేసింది రూ.99.16 లక్షలు మాత్రమే. ఇంకా రూ.2.37కోట్లు వసూలు చేయాల్సి ఉం ది. ఫీల్డ్ అసిస్టెంట్లు దుర్వినియోగానికి పాల్పడిన రూ. 2.31 కోట్లలో అధికారులు చేసిన రికవరీ రూ.41.38 లక్ష లు మాత్రమే. ఇంకా వీరి వద్ద సుమారు 1.90 కోట్ల మేర కు వసూలు చేయాల్సి ఉంది. ఈ వసూళ్ల విషయంలో ఒకరిద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యాయత్నాలకు పా ల్పడడంతో అధికారులు రికవరీపై అంతగా దృష్టి సారిం చడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి హా మీ పనుల్లో కొందరు ఎంపీడీవోలు కూడా పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవడం లో తీవ్ర జాప్యం జరగడం విమర్శలకు దారితీస్తోంది. రికవరీకి ప్రత్యేక చర్యలు - జాదవ్ గణేష్, డ్వామా పీడీ.. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారి వద్ద నిధులు రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఈ రికవరీ చర్యలు వివిధ స్థాయిలో ఉన్నాయి. వీటిని వేగవంతం చేస్తాం. -
మోనార్కులు
వీళ్లను ఏమీ చేయలేరు కర్నూలు(అగ్రికల్చర్) : అక్రమార్కులపై చర్యలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. నిధులు తినేసినా చర్యలు లేకపోవడంతో మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమా కలుగుతోంది. అక్రమార్కుల పట్ల కఠినంగా ఉండాల్సిన అధికారులు స్వాహా అయిన మొత్తాన్ని రికవరీ చేయించుకొని తిరిగి ఉద్యోగాలలో కొనసాగిస్తుండటం గమనార్హం. అటువంటివారు మరింత భారీగానే అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అమలులో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 2007 నుంచి ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ పథకం కింద దాదాపు రూ.2000 కోట్లు వ్యయం చేసినా అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనపడదు. రెక్కలు ముక్కలు చేసుకొని పనులు చేస్తున్నా కూలీలకు అందుతున్న వేతనం నామమాత్రమే. ఉపాధి పనులకు హాజరవుతున్న కూలీల్లో 20 శాతం మందికి రోజుకు లభిస్తున్న వేతనం రూ.50లోపే ఉంది. జిల్లా సగటు వేతనం రూ.109 మాత్రమే ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ను వ్యవసాయ కూలీలకే ఉద్దేశించినా, కూలీల నోట్లో మట్టి పడుతోంది. అక్రమార్కులు దర్జాగా నిధులను భోంచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రికవరీ చేయాల్సి ఉన్నా ఇవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణలు వేగవంతం చేసే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మూడేళ్ల క్రితమే నిర్ణయించినా ఇది కార్యరూపం దాల్చలేదు. మొబైల్ కోర్టుల జాడ లేకుండాపోయింది. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో దాదాపు రూ.600 కోట్లు నిధులు దుర్వినియోగం అయినట్లు సామాజిక తనిఖీలలో తేల్చినా అబ్బే... అదంతా అవినీతి కానే కాదంటూ అధికారులు దీనిని రూ.9.35 కోట్లుగా నిర్ధారించారు. ఇది అవినీతి అంటూ నిర్ధారించిన దానిని కూడా రికవరీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బండ్ ప్లాంటేషన్, పేరుతో ఏటా లక్షల కొలదీ మొక్కలు నాటుతున్నారు. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు. నాటినవాటిలో 50 శాతం బతికినా ఈ పాటికి జిల్లా పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. కానీ పచ్చదనం దాఖలాలు లేవు. కోట్లాది రూపాయలు నిధులు మాత్రం వ్యయం అయ్యాయి. ప్రతి ఏటా ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాల పనులు చేపడుతున్నారు. కానీ ఈ పనులు జాడ లేకుండాపోయాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద రూ.2 వేలు కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి మచ్చుకు కూడా లేకపోవడం గమనార్హం. ప్రతి ఏటా జిల్లా నుంచి ఉపాధి కోసం లక్షల మంది వలసబాట పడుతుండటంతో ఎక్కడికక్కడ ఉపాధి పనులు కల్పించి వలసలు అరికట్టాలనేది ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం దారి తప్పింది. ఉపాధి పనుల కింద ఏటా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్న వలసలు మాత్రం యథావిధిగానే జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు వ్యయం అవుతూనే ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కాసుల పంట పండించుకున్నది సిబ్బంది మాత్రమే. ఉపాధి పనులు కాసుల పంట పండించేవి కావడంతో కనీసం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు సంపాదించుకుంటే చాలుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమవారినే నియమించుకునేందుకు అధికార తెలుగుదేశం నేతలు అధికారులపై తెస్తున్న ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నెలలు అవుతున్నా ఇప్పటికే ఎన్ఆర్ఈజీఎస్లో తమవారిని అందలం ఎక్కించేందుకు ఇప్పటికే ఒత్తిళ్లు ఆగడం లేదు. నిధులు స్వాహా చేసినా రికవరీ చెల్లిస్తే... ఎన్ఆర్ఈజీఎస్లో ఏ-కేటగిరీలో అవినీతికి పాల్పడితే వారిని ఉద్యోగం నుంచి తొలగించి, మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడిగా నిధులు స్వాహా చేసినా వారిపైన చర్యలు లేవు. స్వాహా చేసిన మొత్తాన్ని రికవరీ చేయించుకొని అనేకమందిని ఉద్యోగాల్లో కొనసాగిస్తుండటం చూస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు తదితరులు ఏ-కేటగిరీలో అవినీతికి పాల్పడిన వారిలో పలువురు దుర్వినియోగం అయినట్లుగా నిర్ధారించిన మొత్తాన్ని రికవరీ చేయించుకొని యథావిధిగా కొనసాగిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 72 మందిపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు ఇచ్చినా... ఇటీవల జిల్లా కలెక్టర్ ఉపాధి అక్రమార్కులు 72 మందిపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు ఇచ్చారు. క్రిమినల్ కేసులు నమోదు చేసే బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు. కానీ ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు నమోదు చేసిన దాఖలాలు కూడా లేవు. అక్రమార్కులపై చర్యలు లేకపోవడంతో అవినీతికి లెసైన్స్ ఇచ్చినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ-కేటగిరీ కేసులు 10,608 మంది... ఏ-కేటగిరీలో అవినీతికి పాల్పడినవారు ఇప్పటివరకు 10,608 మంది ఉన్నారు. ఏపీఓలు, ఈసీ రూ.50 వేలు, టెక్నికల్ అసిస్టెంట్ రూ.25 వేలు, ఫీల్డ్ అసిస్టెంట్ రూ.10 వేలు, ఆపై స్వాహా చేస్తే ఏ-కేటగిరీలోకి వస్తారు. ఇలా ప్రతి ఒక్కరికీ నిర్ణీత మొత్తం ఆపైన తింటే ఏ-కేటగిరీలో వస్తారు. అటువంటివారు ఫీల్డ్ అసిస్టెంట్లు 1,836 మంది, టీఏలు 805, కంప్యూటర్ ఆపరేటర్లు 210, ఏపీఓలు 142, బీపీఎం 371, ఎంపీడీఓలు 10 మంది, ఏఈఈలు 39, ఈసీలు 149, మేట్లు 6,306 మంది, ఇతరులు 740 మంది ఉన్నారు. వీరందరూ క్రిమినల్ కేసులకు అర్హులే అయినప్పటికీ అతీగతీ లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి అక్రమాలను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. -
ఫీజు రాయితీలో ‘అక్రమార్కులు’
మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం జంగారెడ్డిపల్లికి చెందన ఓ విద్యార్థి ఇబ్రహీంపట్నం లోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్న ఆ విద్యార్థి రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఫీజు రాయితీతోపాటు ఉపకారవేతనం పొందుతున్నాడు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో ఉచితంగా వసతి పొందుతున్నాడు. అయితే ఆ విద్యార్థి తండ్రి ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగి. కేవలం ఒక విద్యార్థి మాత్రమే కాదు.. జిల్లాలో ఫీజురాయితీ పొందుతున్న మూడులక్షల మంది విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో ఇలాంటి సర్కారు ఉద్యోగం చేసే వారి పిల్లలు అక్రమంగా లబ్ధి పొందుతున్నారు. * సర్కారు కొలువులున్నా.. వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్! * జిల్లాలో పెద్దఎత్తున అనర్హులు * క్రిమినల్ కేసులకు సిద్ధమవుతున్న అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: పేదవిద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే సదుద్దేశం తో తలపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అక్రమార్కులు చొరబడ్డారు. రూ.లక్షల ప్రజాధనాన్ని అప్పనంగా స్వాహా చేస్తూ ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమార్కులు దర్జాగా లబ్ధిపొందుతుండగా.. అసలైన అర్హులు మాత్రం సీట్లు దొరక్క చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. సంక్షేమశాఖ అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్య, సాంకేతిక విద్య, పీజీ తదితర కేటగిరీలకు సంబంధించి 1,054 కాలేజీలున్నాయి. ఇందులో వసతులు, అనుమతులు, ఇతర కారణాలవల్ల కొన్ని కాలేజీలు మూతపడడంతో ప్రస్తుతం 935 కాలేజీలు కొనసాగుతున్నాయి. వాటిల్లో దాదాపు 3లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రస్తుత మొదటి సంవత్సరం విద్యార్థులను మినహాయిస్తే.. 1,45,992 మంది విద్యార్థులు ఇప్పటికే ఒక ఏడాదికిపైగా ఫీజు రాయితీ, ఉపకారవేతనాలు పొందారు. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, జిల్లాలో రికార్డుస్థాయిలో కాలేజీలుండడంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నత విద్యకోసం భారీగా నిధులు ఖర్చు చేస్తుండడం, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా అధికారులు సర్టిఫికెట్లు ఇస్తుండడం అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో తప్పుడు వివరాలు సమర్పించి ఫీజు రాయితీ పొందుతున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌లో పారదర్శకతకోసం చర్యలు చేపడుతోంది. మరోవైపు జిల్లాలో అక్రమార్కుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇద్దరిపై క్రిమినల్ కేసులు పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రాయితీ నిధుల్లో అక్రమాల తంతు భారీగానే ఉంది. అయితే అక్రమంగా ఫీజులు పొందేవారి వివరాలతో సంక్షేమశాఖకు ఫిర్యాదు వస్తేనే ఆయా అధికారులు స్పందిస్తున్నారు. గతేడాది ఇలా ఇద్దరు విద్యార్థుల అక్రమ భాగోతంపై అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో ఆ ఇద్దరి ఆర్థికస్థితిపై విచారణ చేపట్టిన బీసీ సంక్షేమశాఖ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. ప్రస్తుతం ఈ విషయంపై న్యాయ విచారణ సాగుతోంది. ఇటీవల మరికొన్ని ఫిర్యాదులు సైతం బీసీ సంక్షేమశాఖకు అందగా.. వాటిపై ప్రాథమిక విచారణ చేపడుతున్నట్లు సమాచారం. నిబధనలకు విరుద్ధంగా ఫీజురాయితీ పొందేవారి వివరాలు సమర్పిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఉప సంచాలకులు వి.వి.రమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ముడుపులు వాపస్
* మహిళా సంఘాలకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న ఆర్పీలు * తమపై విచారణ కమిటీకి ఫిర్యాదు చేయవద్దంటూ వినతులు * సీఓను కాపాడే ప్రయత్నంలో అధికారులు ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వరస కథనాలు ప్రచురితం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైనా తప్పించుకోవడానికి పలువురు ఆర్పీలు ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ఇన్ని రోజులుగా మహిళా సంఘాలను బెదిరించి, భయపెట్టి వసూలు చేసిన ముడుపులను ఆయా సం ఘాల సభ్యులకు తిరిగి ఇచ్చి వేస్తున్నారు. తమపై విచారణ జరపడానికి వచ్చిన అధికారులకు తమపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని మహిళా సంఘాల సభ్యులకు విన్నవించుకుంటున్నారు. ఎవరైనా సంఘం సభ్యులు అందుబాటులో లేకపోతే సదరు ఆర్పీలు ఫోన్లు చేసి మరీ సభ్యుల ఇంటికి వెళ్లిడబ్బులు అప్పజెప్పి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ముడుపుల వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో)ను విచారణ నుం చి తప్పించడానికి జిల్లా కేంద్రంలోని మెప్మా ఉద్యోగులతో పాటు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీవోతో కలిసి మహిళా సంఘాల నుంచి బల వంతపు వసూళ్లు చేసిన ఆర్పీలు తమ వంతుగా తీసుకున్న మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు. సీవో వాటాగా తీసుకున్న మొత్తానికి మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు. దీంతో మెప్మా పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్న కమిటీ సభ్యులు మహిళా సంఘాల సభ్యులందరినీ ఒకే చోట సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. మహిళా సంఘాల నుంచి మెప్మా ఉద్యోగుల బలవంతపు వసూళ్లపై మెప్మా ఎండీ అనితా రాంచంద్రన్‌తో పాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సీరియస్ అయ్యారు. విచారణ కోసం ఆర్మూర్‌కు వచ్చిన మెప్మా అర్బన్ పీడీ సత్యనారాయణ ముగ్గురితో కూడిన విచారణ కమిటీని వేసారు. ఆర్మూ ర్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎంసీ ఐబీ మాధురీలత, డీఎంసీ బ్యాం లింకేజీ విశ్రాంత ఉద్యోగి మోహన్‌రావు ఈ కమిటీలో సభ్యులు. అయితే ముడుపుల ఆరోపణలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా ఈ కమిటీ ఇప్పటికీ విచారణ ప్రారంభించకపోవడం కొసమెరుపు. మహిళా సంఘాల రికార్డుల్లో అక్రమార్కుల బాగోతం.. మహిళా సాధికారతలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి గత ప్రభుత్వాలు మహి ళా సంఘాలను ఏర్పాటు చేయిస్తూ బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలను అందజేయిస్తున్నారు. అయితే ఈ మహిళా సంఘాలు ఏర్పాటైన రోజు నుంచి ప్రతి సమావేశం, సమావేశంలో చర్చించిన అంశాలు, తీర్మానాలు, బ్యాంకుల నుంచి పొందిన రుణాలు, వడ్డీ, తిరిగి బ్యాంకులకు చెల్లించిన మొత్తం, సంఘం నిర్వహణకు, బ్యాంకు రుణాలు పొందే సమయంలో అయిన ఖర్చును రికార్డుల్లో విధిగా రాయాల్సి ఉంటుంది. ప్రతి సంఘంలో సుమారు పది నుంచి 12 మంది మహిళలు సంభ్యులుగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్ని ఆ సంఘంలో ఎంపిక చేసుకున్న లీడర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. సంఘం సభ్యులకు ఫోన్ చేసిన బిల్లును, ఆటో చార్జీలను మొదలుకొని ప్రతి పైసాకు ఆ సంఘం లీడర్లు బాధ్యులుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మెప్మా పరిధిలో మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి మాట్లాడి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత ఉన్న సీవోతో పాటు పలువురు ఆర్పీలు సంఘాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. రుణం ఇప్పించినందుకు బెది రింపులకు పాల్పడుతూ ప్రతి మహిళా సంఘం నుంచి రూ. 5,000 నుంచి రూ.10,000 వరకు బలవంతపు వసూళ్లు చేసారు. అయితే సీవో, ఆర్పీలు ఈ ముడుపుల వ్యవహారాన్ని ఆయా సంఘాల లీడర్ల ద్వారా కొనసాగిం చారు. ముందుగా సంఘం లీడర్‌ను పిలిపించి తాము బ్యాంకులో రుణం ఇప్పిస్తున్నందుకు మీ సంఘం నుంచి ఇంత మొత్తం విధిగా చెల్లించాలని డిమాండ్ చేసారు. ఆ లీడర్లు తమ సంఘం సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లి తలా ఇంత డబ్బులు వేసుకొని ముడుపులు జమ చేసి మెప్మా ఉద్యోగులకు అప్పగించారు. అయితే ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ మహిళా సంఘం లీడర్ తన సొంతానికి కూడా వాడుకొనే పరిస్థితులు ఉంటాయి. దీంతో అవినీతికి తావు లేకుండా లీడర్ తాము జమ చేసిన మొత్తాన్ని ఏ అధికారికి ఎంత ముడుపుల రూపంలో చెల్లించింది రికార్డులో విధిగా రాయాల్సి ఉం టుంది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని ఆ లీడరే కాజేసినట్లే అవుతుంది. విచారణ చేపట్టనున్న అధికారులు సైతం మహిళా సంఘాల సభ్యుల జమ ఖర్చులను వారి రికార్డుల్లో పరిశీలించి నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి విచారణ జరిపితే బాధ్యులైన అక్రమార్కుల బండారం బయటపడే అవకాశం ఉంటుంది. -
ఇదిగో ప్రభుత్వ భూమి!
యాచారం: అక్రమార్కులు చెరపట్టిన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ యంత్రాంగం నడుం కట్టింది. ప్రభుత్వానికి చెందిన స్థలాలను గుర్తించి వాటిలో హద్దురాళ్లు పాతారు. ఇందులోని ఆక్రమణలను వెంటనే తొలగించుకోవాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో సర్కారు స్థలాలను ఆక్రమించుకున్నవారి గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లూ మండలంలో సర్కారు స్థలాల వివరాలను రికార్డులకే పరిమితం చేసిన అప్పటి తహసీల్దార్లు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పించి కాలం వెళ్లదీశారు. నాటి అధికారుల అలసత్వం అక్రమార్కులకు వరంగా మారింది. హైదరాబాద్ మహా నగరానికి యాచారం చేరువలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రూ. కోట్లలో పలుకుతున్నాయి. దీంతో అక్రమార్కులు ఏదో ఒక రాజకీయ పార్టీ అండతో తహసీల్దార్లపై ఒత్తిడి చేయించి ఆ భూములను తమ గుప్పట్లో పెట్టుకుని కాలం వెల్లదీశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు తారమారవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం ప్రభుత్వ భూము లు ఎన్ని ఉన్నాయో.. వాటినన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్లకు తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక తహసీల్దార్ వసంత కుమారి రెవెన్యూ రికార్డుల్లో ప్రకారం సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఉపక్రమించారు. 20 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు పాతడానికి నిర్ణయించారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు వారం రోజులుగా సర్వేయర్ నరహరి రాజు, గ్రామ రెవెన్యూ కార్యదర్శి కృష్ణ యాచారంలో ప్రభుత్వ భూమిని గుర్తిం చారు. సోమవారం తహసీల్దార్ వసంతకుమారి ఆ భూముల్లో హద్దులు పాతిం చారు. రాళ్లపై, చెట్లపై ‘ఇది ప్రభుత్వ భూమి’ అని రాయించారు. యాచారం తూర్పు దిశలో సర్వే నంబరు 242లో 1-29 ఎకరాలు, 225లో 3 ఎకరాలు, 452లో 10 గుంటల భూమికి హద్దులు పాతించారు. మండల కేంద్రంలో ఉన్న ఈ భూమి దాదాపు రూ. 2 కోట్లకుపైగా విలువ ఉంటుంది. గతంలో అధికారుల రికార్డుల ప్రకారం ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. కానీ ఇవి ఆక్రమణకు గురయ్యాయి. రాజకీయ పక్షాల ఒత్తిళ్లతో వీటిని అధికారులు స్వాధీనం చేసుకోలేదు. ప్రస్తుతం ఈ భూముల్లో హద్దులు పాతడం, ప్రభుత్వ భూమిగా గుర్తించడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకొంది. ‘రికార్డుల్లో చూస్తే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఆ స్థలం వద్దకు వెళ్లి చూస్తే మాత్రం ఆక్రమణలు ఉన్నాయి. అందుకే రికార్డుల ప్రకారం సెంటు ప్రభుత్వ భూమినైనా వదిలే ప్రసక్తి లేదు. ప్రజావసరాలుంటే కలెక్టర్ అనుమతితో ఆ భూమిని కేటాయిస్తాం’ అని తహసీల్దార్ వసంతకుమారి పేర్కొన్నారు. -
అడ్డదారిలో ఆసరా
⇒ అనర్హుల జేబుల్లోకి పింఛన్ డబ్బులు ⇒జిల్లాలో పదివేల మంది ఉన్నట్టు అంచనా! ⇒వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ⇒రంగంలోకి దిగిన అధికారయంత్రాంగం ఏరివేతకూ దొరకని అక్రమార్కులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛన్ల పథకం(ఆసరా)లోకి అనర్హులు చొరబడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి పింఛన్లు దక్కించుకున్నారు. దశలవారీగా ఏరివేతచేపట్టినా.. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అధికారుల పొరపాట్ల కారణంగా లక్షల రూపాయ లు పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అక్రమాలను తేల్చేందుకు రంగంలోకి దిగింది. ఒకవైపు అర్హత ఉండి పింఛన్లు రాని వారి దరఖాస్తులను పరిశీలిస్తూనే.. మరోవైపు పింఛన్లు పొందిన వారి వివరాలతో ఉన్న అక్విటెన్సీలను తనిఖీచేసి అనర్హుల పేర్లను తొలగించేందుకు ఉపక్రమించింది. పది వేలకు పైమాటే.. గతంలో కంటే పింఛన్లను ఐదురెట్లు పెంచేస్తూ ప్రభుత్వం పంపిణీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 2,41,081 మందిని అర్హులుగా గుర్తించి ఇప్పటివరకు 2,14,116 మందికి రూ. 44.97కోట్లు పంపిణీ చేశారు. గతంలో ఇచ్చిన మొత్తం కంటే ఐదురెట్లు అదనంగా ఇవ్వడంతో అక్రమార్కులు ఈ డబ్బులపై కన్నేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను మాయచేసి జాబి తాలో పేరు వచ్చేలా చూసుకుని లక్షాధికారులైన పలువురు పింఛన్లు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉదంతాలపై యంత్రాం గానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అనర్హులను పట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయి లో రంగంలోకి దిగారు. ప్రస్తుతం జిల్లాలో పింఛన్లు పొందినవారిలో దాదాపు పదివేల మంది అనర్హులున్నట్లు అంచనా. సాఫ్ట్‌వేర్‌లో ఏరివేత.. ప్రస్తుతం పింఛన్లు పంపిణీచేసిన వారి వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు(ఆక్విటెన్సీలు)వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలి. అయితే పింఛన్ల పంపిణీ ఇప్పుడిప్పుడే పూర్తికావడం తో.. ఒకట్రెండు రోజుల్లో ఈ ఆక్విటెన్సీలు డీఆర్డీఏకు చేరతాయి. ఈ వివరాలు సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తంచేసే క్రమంలో అనర్హులుగా తేలితే వారి పేర్లు తొల గించనున్నట్లు డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల నుంచి అనర్హులకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
సర్కారు కళ్లలో ఇసుక
యరగాం.. సరుబుజ్జిలి మండలంలోని ఈ ఇసుక ర్యాంపు వద్ద 7 లారీలు, ఒక పొక్లెయిన్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంశధార తీరంలోని ఈ ర్యాంపును ప్రారంభించిన 20 రోజుల్లో రూ. 43 లక్షల ఆదాయం లభిస్తే.. అక్రమంగా తరలించిన ఇసుక ద్వారా అక్రమార్కులు సంపాదించిన ఆదాయం రూ.30 లక్షలని అధికారులు ప్రాథమికంగా గుర్తించడం విశేషం. తలవరం.. వీరఘట్టం మండలంలో నాగావళి తీరంలో ఉన్న ఈ ర్యాంపు తొలి నుంచి అక్రమాల పుట్టగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా నకిలీ మీ సేవ బిల్లులతో ఇసుక తరలింపు దందా గుట్టు బట్టబయలైంది. ఒకే నెంబరుతో ఉన్న మీ సేవ బిల్లులపై వేర్వేరు సంతకాలు ఉన్న విషయాన్ని గుర్తించిన అధికారులు తీగలాగితే డొంక కదిలింది. ఆరు రోజుల్లోనే ఇలాంటి 9 నకిలీ బిల్లులతో రూ.85,725 విలువైన ఇసుక తరలిపోయినట్లు వెల్లడైంది. ..ఈ రెండు సంఘటనలు జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలను కళ్లకు కడుతున్నాయి. మహిళా సంఘాల ఆర్థిక ఎదుగుదలకు, అవకతవకల నివారణకు సరికొత్త ఇసుక విధానమంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడిని.. జారీ చేసిన నిబంధనలను అక్రమార్కులు తమ ఎత్తులతో చిత్తు చేస్తున్నారు. నకిలీ బిల్లులు, రాజకీయ పలుకుబడితో సర్కారు కంట్లో ఇసుక కొట్టి లక్షల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. వీరఘట్టం: వీరఘట్టం మండలంలోని తలవరం ఇసుక ర్యాంపులో మరో అక్రమం చోటు చేసుకుంది. అక్రమం గా బిల్లులు తయారు చేసి లారీల్లో ఇసుక తరలిస్తున్న బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.35 లక్షల విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిం చి పట్టుబడిన వ్యవహరంపై ఇంకా దర్యాప్తులో సాగుతుండగానే నకిలి బిల్లులతో ఇసుక తరలిస్తున్న విషయం బయటపడింది. తలవరం ర్యాంపులో ఆదివారం ఉదయం పాలూరు బంగారునాయుడు పేరిట ఓ లారీకి 20 క్యూబిక్ మీటర్ల ఇసుకను లోడ్ చేసి పంపించారు. మరలా అదే ఆర్డర్‌పై పాలకొండ మండలం బెజ్జి గ్రామానికి చెందిన శివ్వాల రాంబాబుది ఓ లారీ వచ్చింది. ఈ లారీకి కూడా 20 క్యూబిక్ మీటర్లను ఇసుకను లోడ్ చేసి పంపించారు. మీసేవ నుంచి వచ్చిన బిల్లులను కమ్యూనిటీ సర్వేయర్ దుర్గారావు పరిశీలిస్తూ ఒకే బిల్లుపై రెండు లారీలకు ఇసుకను లోడ్ చేసినట్లు గుర్తించి అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై ఆర్.శ్రీనివాసరావు ఆదివారం రాత్రి ఏపీ31టీయూ 2456 నంబరు గల ఇసుక లారీను పట్టుకొని స్వాధీనం చేసుకుని డ్రైవర్ శంకరావును ప్రశ్నించారు. శివ్వాల రాంబాబు రూ.13,500 విలువ గల మీ-సేవ కేంద్రం వద్ద తీసిన ఎస్ఓపీ బిల్లు తన వద్ద ఉందని మరో రూ.500 అదనంగా ఇస్తే ఇస్తానని చెప్పడంతో ఆయన వద్ద ఈ బిల్లును రూ.14 వేలకు కొనుగోలు చేసినట్లు లారీ డ్రైవర్ తెలిపినట్లు సమాచారం. శివ్వాల రాంబాబును కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే ర్యాంపు నిర్వహకులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో అతనిని విడిచిపెట్టారు. కాగా.. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు విక్రయించిన ఇసుక లారీలో బిల్లులును ర్యాంప్ సిబ్బంది సోమవారం పరిశీలించగా తొమ్మిది బిల్లులతో రెండేసి సార్లు ఇసుక లోడ్లను విక్రయించినట్లు గుర్తించారు. ఈ బిల్లులన్నీ పాలకొండ మీ-సేవా కేంద్రం(02361) నుంచి వచ్చినవేనని తెలుసుకున్నారు. మహిళా సంఘాలు, ర్యాంపు సిబ్బంది సమాచారాన్ని ఎంఎంఎస్ అధ్యక్షురాలు కె.లలితకుమారి, జిల్లా ఉన్నతాధికారులకు తెలిపారు. రూ.85,725 విలువ గల 127 క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోయినట్లు గుర్తించారు. బాధ్యులను ఉపేక్షించం: ఇసుక ర్యాంపులో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని డీఆర్డీఏ పీడీ తనూజరాణి అన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆమె తలవరం ర్యాంపునకు చేరుకొని నకిలీ బిల్లులను పరిశీ లించారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా సంఘాలను, ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. మీ-సేవకేంద్రంపై ఫిర్యాదు తలవరం ర్యాంపులో ఇసుక కొనుగోలుకు పాలకొండకు చెందిన మీ సేవ కేంద్రం (02361)నకిలీ బిల్లులు ఇచ్చిందంటూ ర్యాంపు నిర్వహిస్తున్న మహిళా సంఘం సభ్యులు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఆర్.శ్రీనువాసరావు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతామన్నారు. -
అక్రమార్కులు బెదరాలి
పోలీసులు ఆ విధంగా పనిచేయాలి ముఖ్యమంత్రి పతకాల అందజేత కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : నేర స్తులు, అక్రమార్కులు చట్టాలను చూసి భయపడాలని, ఆ విధంగా పోలీసులు తమ విధులను నిర్వహించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి కేఎస్ఆర్పీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పతకానికి ఎంపికైన 75 మంది పోలీసు అధికారులకు పతకాలను అందజేసిన ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రజలంతా ప్రభుత్వం అంటే పోలీసు శాఖే అని భావిస్తుంటారని, పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల పోలీసు అధికారులు సాధారణ ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాల్సిన అవసరమందన్నారు. ఇక నేరస్తులకు కచ్చితంగా శిక్ష పడాలంటే పోలీసులు తమ విచారణలో సాక్ష్యాల సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పనితీరుకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. అయితే శాంతి, భద్రతల విషయమై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసులకు కావలసిన అన్ని విధాలైన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, అయితే అదే సందర్భంలో పోలీసులు సైతం తమ విధి నిర్వహణలో అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక అనేక సందర్భాల్లో తమ తప్పు లేకపోయినా పోలీసులు విమర్శలు ఎదుర్కొంటారని సిద్ధరామయ్య చెప్పారు. ఏటీఎంలలో భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత బ్యాంకులదని, అయితే ఏటీఎంలో బ్యాంకు ఉద్యోగిపై దాడి జరిగితే అందరూ పోలీసు శాఖను విమర్శించారని తెలిపారు. అంతేకాక పాఠశాలల్లో చిన్నారుల భద్రత ఆయా పాఠశాలల యాజమాన్యాలదే అయినప్పటికీ పాఠశాలల్లో చిన్నారులపై లైంగిక దాడులు జరిగితే అప్పుడు కూడా పోలీసులనే విమర్శించారని పేర్కొన్నారు. ఇక నేరాలు జరిగిన తర్వాత వాటిని ఛేదించేందుకు కష్టపడే కంటే నేరాలే జరగకుండా చూసుకోవడం ఉత్తమమని పోలీసులకు ఈ సందర్భంగా సూచించారు.కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ పాల్గొన్నారు. -
అక్రమార్కులకు ఇసు‘కాసుల’ పంట
జిల్లాలో అక్రమార్కులకు ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. సామాన్యుల పేరు చెప్పి కాంట్రాక్టర్లు, అధికారబలం ఉన్న నేతలు రీచ్‌లపై పడి అడ్డంగా సొమ్ము చేసుకుంటున్నారు. వే బిల్లులు రాయడానికి, నిర్వహణకే స్వయం సహాయక సంఘాలు పరిమితమవుతున్నాయి. వారి ముసుగులో అధికారపార్టీ పెద్దలు పెత్తనం చెలాయిస్తున్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ ఇసుకపై రోజు విడిచి రోజు సమావేశాలు పెడుతున్నా క్షేత్రస్థాయిలో మార్పు లేదు. రాజమండ్రి నుంచి కోనసీమలోని సోంపల్లి వరకు ఏ రీచ్‌ను పరిశీలించినా అడ్డగోలు వ్యవహారమే సాక్షాత్కరిస్తోంది. * మహిళా సంఘాల పాత్ర నిమిత్తమాత్రమే * రీచ్‌లలో పెత్తనమంతా టీడీపీ నేతలదే * నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, రవాణా * దండిగా సొమ్ములు దండుకుంటున్న వైనం * జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే దందా సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించడం ముందు అనుకున్నట్టే ఓ ప్రహసనంగా మారింది. రాజమండ్రి కుమారి టాకీస్ రీచ్ వద్ద అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్ బంధువు అన్నీ తానై మహిళా సంఘాలను ప్రేక్షకపాత్రకే పరిమితం చేశారు. ప్రభుత్వ పనులకోసం అంటూ బోర్డు పెట్టి ఇసుకను బిల్డర్లు, కాంట్రాక్టర్లకు తరలిస్తున్నారు. రీచ్‌ల్లోకి వ్యాన్లు, ట్రాక్టర్లకే అనుమతి ఉండగా 10 టైర్ల లారీలతో కూడా ఇసుక తరలిస్తున్నారు. రెండు యూనిట్ల ఇసుకకు రూ.4,000 డీడీ తీసి రీచ్‌లో కొనుగోలుచేసి బయట మార్కెట్లో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. అదే నాయకుడు స్థానికుల పేర్లతో డీడీలు తీసి పశ్చిమగోదావరి, ఖమ్మం, విశాఖ జిల్లాలకు తరలించుకు పోతున్నారు. ఈ రీచ్ నుంచి సుమారు 200 లారీల ఇసుక రవాణా జరుపుతున్నారు. వీటిలో 30 లారీల ఇసుక ఒకటి, రెండు పర్మిట్లపై తరలిపోతుండగా, సుమారు 40 లారీల ఇసుక పర్మిట్ లేకుండానే తరలిపోతోంది. రాజోలు మండలం సోంపల్లి, సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం రీచ్‌లు అక్రమాలకు చిరునామాగా మారాయి. ఈ రీచ్‌లలో 70 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారు. గత 20 రోజుల్లో సుమారు రూ.30 లక్షల మేర అక్రమార్కుల జేబుల్లోకి పోయింది. డ్వాక్రా సంఘాలు వే బిల్లు రాయకుండానే రీచ్‌లలో ట్రాక్టర్లకు లోడ్ చేసేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, స్థానిక సంస్థలకు చెందిన ఒక ముఖ్య ప్రజాప్రతినిధికి అక్రమార్కులు వాటాలు పంపేస్తున్నారు. సోంపల్లిలో వేబిల్లు ఒకటే ట్రిప్పులు ఐదారు అన్నట్టు ఇసుక తరలిపోతోంది. ఒక వే బిల్లు రాయించుకున్న ట్రాక్టరుతో రోజుకు 10 ట్రాక్టర్ల ఇసుక దొడ్డిదారిన తరలిస్తున్నారు. రాజోలు దీవి ఇసుక రీచ్‌లలో ప్రభుత్వానికి చెల్లించే రూ.2 వేల డీడీ కాక ట్రాక్టరు ఇసుకను లోడ్ చేశాక రూ.650 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ అధికారులకు తెలిసినా ఒత్తిళ్లతో మిన్నకుంటున్నారు. నదీగర్భంలోకి భారీ వాహనాలు.. ఇదే పరిస్థితి మందపల్లి, జొన్నాడ రీచ్‌లలో కనిపిస్తోంది. భారీ వాహనాలను నదీ గర్భంలోకి దింపి మరీ ఎగుమతి చేస్తున్నారు. నేతల కనుసన్నల్లోనే డ్వాక్రా సంఘాల నుంచి సభ్యులను ఎంపిక చేయడంతో వారు మాట్లాడలేకపోతున్నారు. క్వారీ లారీకి రెండు యూనిట్ల ఇసుక(ఆరు క్యూబిక్ మీటర్లు) మాత్రమే పడుతుంది. యూనిట్ రూ.2000 వంతున రెండు యూనిట్లకు రూ.4000 చెల్లించి వాహనాన్ని తీసుకువెళితే ఇసుక ఎగుమతి చేస్తున్నారు. క్వారీ లారీలో రవాణా 10 టన్నుల వరకు ఉంటుంది. అదే మార్కెట్ లారీ, 10 టైర్ల లారీ(పెద్ద టిప్పరు)లకి రవాణాశాఖ 17 టన్నుల పరిమితిని విధించింది. ఈ ర్యాంపుల్లో మార్కెట్ లారీలు, పెద్ద టిప్పర్లలో ఐదు యూనిట్ల ఇసుకను నింపుతున్నారు. అంటే ఒక లారీలో 30 టన్నుల సరుకు వెళుతోంది. కళ్లెదుటే ఈ తంతు జరుగుతున్నా కేసుల నమోదుకు వెనుకంజ వేయడంతో స్థానికులు విస్తుబోతున్నారు. అక్కమాలకు అధికారుల ఊతం మందపల్లి రీచ్‌పై కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేతల పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రీచ్‌లో రోజుకు సుమారు 50 మార్కెట్ లారీల్లో ఇసుక ఎగుమతవుతోంది. నిబంధనలకు భిన్నంగా నిత్యం 650 టన్నుల ఇసుక తరలిపోతోందని అంచనా. లారీకి రూ.4 వేల చొప్పున రూ.2.60 లక్షలు ఈ ఒక్క రీచ్‌లోనే ప్రతి రోజు ఇసుక తరలిపోతోందని అంచనా. పాత వే బిల్లులతో ఇసుక తరలించుకుపోతుండగా శుక్రవారం స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో మరో కొత్త వేబిల్లు తీసుకువచ్చి పొరపాటున పాత బిల్లు ఇచ్చారని సమర్థించేందుకు ప్రయత్నించడం, ఇందుకు అధికారులు కూడా వత్తాసు పలకడాన్ని బట్టి వారు ఏ రకంగా అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారో అర్థమవుతోంది. జొన్నాడ రీచ్‌లో ఒక బిల్లుపై నాలుగైదు ట్రిప్పులు తరలించేస్తున్నారు.ఆ రీచ్‌లో 10 టైర్ల లారీల్లో రోజుకు 20 ట్రిప్పుల ఇసుక ఎగుమతి అవుతోంది. లారీకి రూ.10 వేల వంతున రోజుకు రూ.2 లక్షల విలువైన ఇసుక దొడ్డిదారిన మళ్లించేస్తున్నారని అంచనా. అనధికారికంగానే ర్యాంపుల నిర్వహణ గోదావరి పరీవాహక ప్రాంతమైన కె.గంగవరం మండలం మసకపల్లి, పెదలంక, కోటిపల్లి వద్ద కోట గ్రామాలను అనుకుని అనధికార ర్యాంపులను తెలుగుతమ్ముళ్లు నిర్వహిస్తున్నారు. మసకపల్లి, పెదలంకల పరిధిలో గోదావరి తీరంలో కె.గంగవరం మండ లానికి చెందిన అధికారపార్టీ స్థానిక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ప్రజాప్రతినిధి దగ్గరుండి రాత్రి వేళల్లో ఇసుక తరలించి సొమ్ములు దండుకుంటున్నారు. కోట వద్ద కూడా ఇదే పరిస్థితి. ఆ రెండు ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక రీచ్ అనేదే లేనప్పుడు రూ.70 వేలు వెచ్చించి రాకపోకలకు అనువుగా ర్యాంపు నిర్మించడం, ఇసుక నిల్వ కోసం గోదావరిని అనుకుని 10 ఎకరాల లంక భూములను లీజుకు తీసుకోవడాన్ని పరిశీలిస్తే ఏ స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. నది కడుపులోని ఇసుకతో ఇలా అక్రమార్కులు లాభాలు పిండుకోవడమేనా.. సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవడం అన్న ప్రశ్నకు సర్కారే సమాధానం చెప్పాలి. -
‘తెల్ల’బోతున్న ‘బంగారం’
అక్రమార్కుల ధాటికి తెల్ల బంగారం తెల్లబోతోంది. ఇసుకాసురులు దీనినే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుని విచ్చలవిడిగా నదీమ తల్లి గర్భాన్ని తవ్వేస్తున్నారు. యథేచ్ఛగా ఇసుకను కర్ణాటక ప్రాంతానికి తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతం, పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆవేదన ప్రజలు, రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సైతం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఓవైపు ఇసుకను మహిళా సంఘాలకు అప్పగించాలన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. ఇసుకాసురులకు కళ్లెం వేసే వారే లేకుండా పోయూరు. రొద్దం మండలంలోని పెన్నానది పరీవాహిక ప్రాంతం నుంచి తరలి పోతున్న తెల్ల బంగారం కథాకమామిషు ఇది. * కర్ణాటకకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా * జేబులు నింపుకుంటున్న అక్రమార్కులు రొద్దం: గత నెల రోజులుగా కర్ణాటకకు ఇసుకను అక్రమార్జనపరులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. దీంతో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని రొద్దకంపల్లి గ్రామ సమీపాన పెన్నానది నుంచి పెద్ద ఎత్తున పావగడకు ఇసుకను రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతూ నదిలో వేసుకున్న ఫిల్టర్ బోర్లు ఎండి పోతున్నాయని రైతులు వాపోతున్నారు. నల్లూరు, కల్లుకుంట, నాగిరెడ్డిపల్లి, నారనాగేపల్లి, కందుకూర్లపల్లి, పెద్దమంతూరు, చిన్నకోడిపల్లి, కనుమర, ఆర్ కుర్లపల్లి, రొద్దం, చెరుకూరు, ఉప్పర్లపల్లి, సుబ్బరాయప్పగారి కొట్టాల, తదితర గ్రామాల్లో పెన్నానది ఒడ్డున వివిధ పూల తోటలను రైతులు సాగు చేశారు. వీటిపై ఆధారపడి దాదాపు 3 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇప్పటికే పెన్నా నుంచి అత్యధికంగా ఇసుకను అక్రమార్కులు తరలించడంతో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లాయి. దీంతో రైతులు అప్పులు చేసి ఫిల్టర్ బోర్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఇసుకాసురుల ఆగడాలు మితిమీరిపోవడంతో వాటి ల్లో కూడా నీటి మట్టం అడుగంటి పోరుుంది. దీంతో రైతుల కుటుంబాలు పంటల్ని కోల్పోరుు తీవ్రంగా నష్ట పోయి బజారున పడే దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇసుక రవాణా భారీగా సాగుతోందని పలువురు రైతులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడు ఇసుక ధర దాదాపుగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుందన్నారు. కేవలం ఇసుకను తరలించడానికే కొందరు కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చే శారని చెబుతున్నారు. రాత్రంతా ఇసుక తరలించడం.. పగలు మిన్నకుండిపోవడం అక్రమార్కులు పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. రొద్దంకపల్లి, రొద్దం, కర్ణాటక సరిహద్దులో ఉన్న చెరుకూరు, పెద్దమంత్తూరు, ఉప్పరపల్లి, తదితర గ్రామాల నుంచి ఇసుక భారీగా తరలుతోందని సమాచారం. అధికారులకు చెప్పినా స్పందించిన నాథుడే లేదని రైతులు వాపోతున్నారు. రాత్రి వేళలో లారీలకు ఇసుకను లోడు చేసి టార్పలిన్లతో కప్పి బెంగళూరుకు రవాణా చేస్తునట్లు తెలుస్తోంది. ఇలాగే ఇసుక తోడేస్తే కనీసం తాగేందుకు కూడా గుక్కెడు నీరు దొరకని పరిస్థితి దాపురిస్తుందని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నానదిలో బోర్లు లోతుగా వేస్తున్నా ప్రస్తుతం నీరు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి తమను కాపాడాలని రైతాంగం కోరుతోంది. -
మంత్రి పేరిట మట్టి అక్రమ తరలింపు!
అయినవిల్లి :డీప్యూటీ సీఎం, హో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేరుతో కొందరు అక్రమార్కులు లంక మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు తెలిసింది. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మద్దాల సుబ్బారావు అయినవిల్లిలంక వీఆర్ఓ పట్టెం నాగేశ్వరరావును సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తహశీల్దార్ కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో నిలదీయగా ఈ విషయం బయట పడింది. డీప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురంలోని తన నివాసంలో పూలమొక్కలు పెంచుకునేందుకు గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారని, అందుకోసం మట్టి కావాలని కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చారని వీఆర్ఓ బదులిచ్చారు. తొత్తరమూడికి చెందిన అమరా పెద్దబ్బులు పొక్లైయిన్, నాలుగు ట్రాక్టర్ల సాయంతో మట్టిని తరలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్పారు. మంత్రికి మట్టి కావాలనడంతో తాను పట్టించుకోలేదన్నారు. మంత్రి పేరిట పెద్దబ్బులు కొందరి ప్రోద్బలంతో లంక మట్టిని అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకున్నారని మద్దాల సుబ్బారావు ఆరోపించారు. రెండు రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. అయినవిల్లిలంక, మాగాం, ముక్తేశ్వరం తదితర గ్రామాల్లో సుమారు 50 ట్రాక్టర్ల మట్టిని ఇటుక బట్టీలకు, కొబ్బరి తోటల్లో తరలించారని తహశీల్దార్ కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘తాండవ’ గుండెకు తూట్లు
వేలాది ఎకరాలకు నీరందించే తాండవ గుండెకు ‘పచ్చదళం’ కోత పెడుతోంది. అర్థబలం, అంగబలం ఉందనే తెగింపుతో పగలు, రాత్రి తేడా లేకుండా నది నడుమ ఇసుకను తవ్వి లక్షలు గడిస్తున్నారు. ఆయకట్టు రైతులను నట్టేట ముంచేస్తున్నారు. ఒడ్డునున్న శ్మశానవాటిక నదిలో కలిసిపోతుందని తెలిసినా వారికి ఖాతరే లేదు. పంచాయతీల నుంచి ఒక రశీదు తీసుకుని, దాని మాటునే పది, పదిహేను ట్రాక్టర్ల ఇసుక తవ్వుకుపోతున్నారని తెలిసినా అధికారులు చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు. * యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు * ఒక రశీదు మాటున పదుల ట్రాక్టర్ల తరలింపు * అండగా నిలుస్తున్న అధికార పార్టీ నాయకులు * రోజూ లక్షలు దండుకుంటున్న తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ : యాభై వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ నది విశాఖ జిల్లానాతవరం నుంచి మొదలై తుని మీదుగా పెంటకోట వరకూ ప్రవహిస్తోంది. ఆ నది పరీవాహక ప్రాంతం ఇప్పుడు తెలుగుతమ్ముళ్లకు, వారి అనుచరులకు లక్షలు కురిపిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా తాండవలో ఇసుక తవ్వేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక తవ్వుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు అనుమతి ఇవ్వాలి. అదీ ఒక లబ్ధిదారుడికి ఒక ట్రాక్టర్ ఇసుక మాత్రమే. ఇంటి నిర్మాణం జరుగుతున్నట్టు గృహనిర్మాణశాఖ నుంచి అనుమతి పత్రం చూపి, రూ.120 జమచేస్తే పంచాయతీ నుంచి రశీదు ఇస్తారు. ఆ అనుమతి కూడా రెండు రోజులకు ఒకటి వంతున ఇంటి నిర్మాణానికి అవసరమైన మేరకు మాత్రమే విడుదల చేయాలి. కేవలం నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల కోసం ఈ వెసులుబాటు ఇచ్చారు. అది కూడా తాండవ నదీ గర్భంలో 3 నుంచి 4 మీటర్లు ఉండాలి. అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటే ఇసుక తీయకూడదనేది నిబంధన. కానీ ఆ నిబంధనలను తోసిరాజంటూ యథేచ్ఛగాా తవ్వకాలు జరిపించేస్తున్నారు. తెలుగుతమ్ముళ్ల బినామీలే.. తుని, కోటనందూరు మండల్లో తెలుగుతమ్ముళ్లు, వారి పేరుతో బినామీల కనుసన్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. పైసా పెట్టుబడి లేకుండా ఇసుక అడ్డగోలు రవాణాతో లక్షలు వెనకేసుకుంటున్నారు. విశాఖ జిల్లా నాతవరం నుంచి పాయకరావుపేట మండలం పెంటకోట వరకు తాండవ సుమారు 36 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. జిల్లా పరిధిలోకి వచ్చే అల్లిపూడి, కోటనందూరు, కేఓ అగ్రహారం, డి.పోలవరం, బొద్దవరం, కొలిమేరు, నందివంపు, మరువాడ, రేఖవానిపాలెం, కుమ్మరిలోవ, ఉప్పరగూడెం, రామభద్రపురం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వడం వల్ల నది ప్రవాహ గమనం మారి విలువైన పంటభూములు కోతకు గురవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం గోదావరి, కృష్ణావంటి జీవనదుల్లోనే ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. కానీ ఇక్కడ ఏ విధమైన అనుమతులు లేకుండానే యంత్రాలతో ఇసుక దర్జాగా తవ్వుకుపోతున్నారు. కాగా ఇసుకలపేటకు సమీపాన రోటరీ రూ.అరకోటి వెచ్చించి నిర్మించిన హిందూ శ్మశాన వాటిక ఇసుక తవ్వేస్తుండటంతో కిందకు దిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 1500 ట్రాక్టర్లకు పైమాటే.. ఇంటి నిర్మాణం పేరుతో ఒక ట్రాక్టర్ ఇసుక కోసం రూ.133, ఎడ్లబండికి రూ.46 చెల్లించి పంచాయతీల నుంచి రశీదు తీసుకుంటున్నారు. అధికారికంగా ఒకటి, రెండు రశీదులు తీసుకుంటున్న అక్రమార్కులు వాటిపైనే 10 నుంచి 25 లోడులను తరలించుకుపోయి దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.133 చెల్లిస్తున్న అక్రమార్కులు మార్కెట్లో రూ.1000కు విక్రయిస్తున్నారు. తాండవ పరీవాహక ప్రాంతంలో రోజూ 1500 ట్రాక్టర్ల పైబడే ఇసుకను తరలించుకుపోతున్నట్టు అంచనా. ఎడ్లబళ్లకు అయితే లెక్కేలేదంటున్నారు. మొత్తం మీద రోజుకు రూ.15 లక్షల చొప్పున అంటే నెలకు నాలుగున్నర కోట్లు తెలుగుతమ్ముళ్లు నొక్కేస్తున్నారు. తునిమండలంలో అధికారపక్షానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, కోటనందూరు మండలంలో ఒక ప్రజాప్రతినిధి ఇసుక అక్రమ తవ్వకంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. మండల రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా కొంత వాటా ముట్టచెప్పడం, ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డూఅదుపూ లేదు. అడపాదడపా గనులశాఖ అధికారులు దాడులు నిర్వహించినా మొక్కుబడి కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు. ఈ విషయమై తుని ఇన్చార్జి ఎంపీడీఓ శేషారత్నంను వివరణ కోరగా ట్రాక్టర్‌కు రూ.133 వంతున, ఎడ్లబండికి రూ.46 వంతున జమ చేసుకుని వే బిల్లు ఇచ్చిన తరువాతే ఇసుక తరలించేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. అనధికారికంగా ఇసుక తరలించే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
అవినీతి పురుగులు
- ఉద్యాన శాఖలో అక్రమార్కులు - రైతుల సబ్సిడీలు స్వాహా - లబ్ధిదారుల నుంచి బలవంతపు వసూళ్లు - ఫిర్యాదు చేస్తే బెదిరింపులు - అక్రమార్కులకు అండగా తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు :కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు అన్న చందంగా మారింది జిల్లాలో కొందరి ఉద్యాన శాఖ అధికారుల పనితీరు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి సబ్సిడీలను దిగమింగేస్తున్నారు. బోగస్ పేర్లలో అక్రమాల పంట పండిస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ నేతల అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులు.. పండ్లు, పూల తోటలను అభివృద్ధి చేసుకునేందుకు, అలాగే వ్యవసాయ పరికరాల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సబ్సిడీల కోసం రైతులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోగా వీరిలో కొంత మందికి మంజూరయ్యాయి. అయితే లబ్ధిదారులైన రైతులకు తెలియకుండానే వారికి మంజూరైన నిధులను కొందరు అధికారులు స్వాహా చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయలకుపైగా నిధులు పక్కదారిపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవీ ని‘దర్శనాలు’ ►డోన్ మండలం అలేబా తండాకు చెందిన 14 మంది ఎస్టీ రైతులు.. పసుపుతోటల అభివృద్ధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం రూ.72,600 మంజూరు చేసింది. మంజూరైన ఈ మొత్తం రైతులకు చేరలేదు. బ్యాంకుకు వచ్చిన నిధులు మాత్రం వారి పేరున వేరొక అకౌంట్ నుంచి డ్రా అయ్యాయి. ►కొత్తకోట గ్రామానికి చెందిన 17 మంది ఎస్సీ రైతులకు 2012-13లో ఒక్కొక్కరికి రూ.14వేలకుపైగా నిధులు మంజూరయ్యాయి. అందులో రూ.5 వేలు మెటీరియల్ పోను మిగిలిన మొత్తం నిధులు స్వాహా చేసినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ►ప్యాపిలి మండలంలో 79 మంది రైతులకు రూ.1,95,130 మొత్తం డీడీ నంబర్ 180963తో బ్యాంక్‌కు చేరింది. ఆ జాబితాలోని 17, 19, 35, 38, 40, 67 సీరియల్ నంబర్లలో ఉన్న రైతుల పేర్లతోపాటు ఎం కేశవరెడ్డి, ఆర్. క్రిష్ణన్న మరో 8 మంది రైతులు పేర్లు ఉండాల్సిన చోట బ్లాంక్ పెట్టి అక్కడ వేరొకరి అకౌంట్ నంబర్లు వేసి నిధులు మళ్లించుకున్నారు. ►టమాట రైతులకు బుట్టలు, కత్తెర్లు, రంపాలు వంటి పరికరాలు పంపిణీ చేస్తారు. వాటిని పంపిణీ చేసినందుకు సర్వీస్ చార్జ్ కింద 10 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ పరికరాలను ఆ కంపెనీ వారు పంపిణీ చేయటం లేదని తెలిసింది. అధికారులే పంపిణీ చేస్తూ ఆ 10 శాతం నిధులను నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ►ప్యాపిలి మండలం జక్కసానికుంట్ల గ్రామంలో అరటితోటల పెంపకానికి సంబంధించి 2012-13, 2013-14 ఏడాదికి సంబంధించి కూడా నిధులు పెద్ద ఎత్తున మంజూరైనట్లు సమాచారం. స్థానిక వీఆర్వో సంతకాలను ఫోర్జరీ చేసి నిధులు నొక్కేశారనే విమర్శలు ఉన్నాయి. బెదిరింపులు..: డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రాంబాబు పీజీ వరకు చదువుకున్నాడు. తండ్రి మరణించటంతో కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాడు. ఉన్న పొలంలో వ్యసాయం చేసేందుకు ట్రాక్టర్ కోసం సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సబ్సిడీ కింద నిధులు మంజూరయ్యాయని, అయితే ముందుగా రూ.3.83 లక్షల డీడీ కట్టాలని అధికారులు సూచించారు. దీంతో ఆ యువకుడు వడ్డీకి తెచ్చి డీడీ కట్టి అధికారిని కలిశారు. అయితే ఆ అధికారి సబ్సిడీ మంజూరు చేయాలంటే రూ.15 వేలు అడిగినట్లు రాంబాబు వెల్లడించారు. తన వద్ద లేదని చెప్పటంతో సబ్సిడీ ఇవ్వకుండా అడ్డుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై రాంబాబు గత ఏడాది డిసెంబర్లో, అలాగే గతనెల 19న ఉద్యానశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కమిషనరేట్ నుంచి అవినీతి అధికారులపై విచారణ జరపమని ఆదేశాలు ఇచ్చారు. అయితే విచారణ ముందుకు సాగలేదు. దీంతో రాంబాబు మరోసారి కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. స్పందించిన కలెక్టర్ ఏజేసీని విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయం అవినీతి అధికారులకు తెలియటంతో స్థానిక టీడీపీ నేతల ద్వారా పోలీసులకు చెప్పి, పోలీసులతో తనను తీవ్రస్థాయిలో హెచ్చరించారని రాంబాబు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయటంతో పాటు రక్షణ కల్పించాలని మరోసారి కలెక్టర్‌ను కలిసి విన్నవించటం గమనార్హం. ఇదిలా ఉండగా డోన్ నియోజక వర్గంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై తనకు ఫిర్యాదులు అందాయని ఉద్యాన శాఖ ఏడీ సాజానాయక్ తెలిపారు. విచారించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
అక్రమార్కులపై ప్రత్యేక నిఘా
సాక్షి, మహబూబ్‌నగర్ : కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మాగనూరు మండలంలోని పలు గ్రామాల కేంద్రంగా జరుగుతున్న అక్రమ దందాపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్టు స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ రామేశ్వర్ తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహ ద్దులోని భౌగోళిక పరిస్థితులను ఆసరా చేసుకొని కొందరు అక్రమార్కులు కల్లు, మట్కా, జూదం వంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై ‘సాక్షి’ శనివారం ‘నిఘా.. నిద్ర’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ వార్తపై శనివారం స్పెషల్‌బ్రాంచ్ పోలీ సులు ఆరా తీశారు. ఈ విషయంపై స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ సాక్షి’తో మాట్లాడుతూ మాగనూరు మండలంలోని సరిహ ద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా వేస్తున్నట్లు తెలిపారు. అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకృబందాలను ఏర్పాటు చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని రామేశ్వర్ స్పష్టం చేశారు. -
అక్రమార్కులకు అభయహస్తం
* శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో రూ.వంద కోట్లు మింగారని తేల్చిన విజిలెన్స్ * విజిలెన్స్ విభాగం నివేదికను బుట్టదాఖలు చేసిన టీటీడీ ఉన్నతాధికారులు * అక్రమాల గుట్టును రట్టుచేసిన విజిలెన్స్ అధికారిపై బదిలీ వేటు! శ్రీవారి పేరుతో రూ.వంద కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులకు టీటీడీ ఉన్నతాధికారులు దన్నుగా నిలుస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేశారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో అక్రమాల గుట్టు రట్టుచేసిన ఓ ఉన్నతాధికారిపై మంగళవారం బదిలీ వేటు వేయడం టీటీడీలో కలకలం రేపుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: నాలుగేళ్ల క్రితం లోక కల్యాణం కోసం దేశ, విదేశాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును టీటీడీ చేపట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును అక్రమార్జనకు అనువుగా మల్చుకోవడానికి అప్పటి ఓ ఉన్నతాధికారి పథకం వేశారు. ఆ క్రమంలోనే టీటీడీ సర్వీసు ఉన్న అధికారులను కాదని.. తనకు సమీప బంధువైన ఓ రిటైర్డ్ అధికారికి ఆ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. ఎక్కడైనా శ్రీనివాస కల్యాణం నిర్వహణకు స్థానికంగా 60 శాతం ఖర్చులు భరించడానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే.. తక్కిన 40 శాతం వ్యయాన్ని టీటీడీ భరించేలా రూపొందించారు. శ్రీవారి కల్యాణం పేరుతో టీటీడీ ముద్రవేసుకుని భక్తులకు టికెట్లు విక్రయించకూడదని..ఆ పేరుతో విరాళాలు సేకరించకూడదని ఈ ప్రాజెక్టు నిబంధనలు రూపొందించారు. కానీ.. ఆ నియమనిబంధనలను టీటీడీ ఉన్నతాధికారులు తుంగలో తొక్కారు. దేశంలో బెంగళూరు, భద్రావతి, కుముదం, ముంబయి, చెన్నై, పాండిచ్చేరి, కాంచీ పురం తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇంగ్ల్లండ్ వంటి విదేశాల్లోనూ 175ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలను నిర్వహించారు. శ్రీనివాసకల్యాణం ప్రాజెక్టుకు టీటీడీ నిధులను రూ.3కోట్ల మేర మాత్రమే వెచ్చించి నట్లు అధికారవర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కానీ.. ఆ ముసుగులో శ్రీవారి కల్యాణోత్సవం పేరుతో టీటీడీ లోగోను ముద్రించిన టికెట్లను విక్రయించి.. విరాళాలు సేకరించి.. శ్రీవారి విగ్రహాలను విక్రయించి రూ.వంద కోట్లకుపైగా కొల్లగొట్టారని టీటీడీ విజిలెన్స్ విభాగం తేల్చింది. ఏప్రిల్ 30, 2012న కర్ణాటకలో కుముదంలోని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో శ్రీనివాస కల్యాణోత్సవంలోనూ.. అక్టోబర్ 18, 2012న ముంబయిలో 3,500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఓ ప్రైవేటు ఆడిటోరియంలో నిర్వహించిన కల్యాణోత్సవంలోనూ టికెట్లను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ ఆధారాలను సేకరించింది. అమెరికాలో టెక్సాస్, న్యూజెర్సీ వంటి 20 నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణోత్సవాల్లోనూ టికెట్లను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. ఒక్కో కల్యాణోత్సవానికి సగటున రూ.మూడు కోట్ల వరకూ దోచుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. మే 27, 2012న అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో బాలాజీ ఆలయంలో కల్యాణోత్సవం పూర్తయిన తర్వాత శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలను రూ.1.50 కోట్లకు ఓ పారిశ్రామికవేత్తకు విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని రెండేళ్ల క్రితం విజిలెన్స్ విభాగం ప్రాథమిక నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు ఇచ్చింది. ఇటీవల తుది నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేసింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. అక్రమార్కులకు దన్నుగా నిలుస్తూ విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేశారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో అక్రమాల గుట్టు రట్టు చేసిన టీటీడీ వీజీవో హనుమంతుపై మంగళవారం బదిలీ వేటు వేశారు. తుది నివేదిక ఇచ్చిన కొద్ది రోజుల్లోనే టీటీడీ వీజీవోపై బదిలీ వేటు వేయడంపై టీటీడీ అధికారులు నివ్వెరపోతున్నారు. -
‘ఇందిరమ్మ’ అక్రమార్కుల్లో గుబులు..
అవకతవకలపై సీఐడీకి హౌసింగ్ పీడీ ఫిర్యాదు ప్రాథమిక స్థాయిలో వివరాల సేకరణ షురూ నేటి నుంచి వేగం పుంజుకోనున్న విచారణ రంగంలోకి క్షేత్రస్థాయి తనిఖీ బృందాలు వరంగల్: ఇందిరమ్మ పథకం ద్వారా చేపట్టిన గృహ నిర్మాణాల్లో అవకతవకలపై సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గృహ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను వెలికితీయూలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో గృహ నిర్మాణ శాఖ పీడీ ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదైంది. సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయిలో వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో సీఐడీ నిమగ్నమైంది. తనిఖీ బృందాలను రంగంలోకి దింపే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సోమవారం నుంచి కేసు దర్యాప్తు ముమ్మరమయ్యే అవకాశాలు ఉండడంతో అవినీతి అధికారులు, సిబ్బంది, దళారులు, బోగస్ లబ్ధిదారుల్లో గుండె దడ మొదలైంది. 2008 తర్వాత భారీగా అక్రమాలు 2004 నుంచి 2014 వరకు మంజూరైన గృహాలపై సీఐడీ బృందం దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా జిల్లాలో 2008 తర్వాత భారీగా అక్రమాలు జరిగాయనే అరోపణలున్నాయి. రేగొండ, పాలకుర్తి, నర్సింహుపేట, చిట్యాల, మొగుళ్లపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు థర్డ్ పార్టీ విచారణలో తేలింది. అప్పుడు ప్రాథమిక స్థాయిలో మాత్రమే వివరాలు సేకరించినట్లు సీఐడీ అధికారులు అంచనాకు వచ్చారు. 2008 తర్వాత మహిళా సంఘాల ద్వారా చెల్లింపులు చేపట్టిన సమయంలో భారీ కుంభకోణాలు జరిగాయని నిర్ధారించారు. ఈ మేరకు లోతుగా విచారణ జరిపేందుకు వారు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో 2007 నుంచి 2014 వరకు 4,75,567 గృహాలు మంజూరు చేశారు. ఇందులో 1,33,861 ఇళ్లు ఇప్పటివరకు ప్రారంభించలేదు. 75,663 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పునాది, బెడ్‌లెవల్, లెంటల్ లెవల్ తదితర స్థాయిల్లో ఈ ఇళ్లు ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. 2,66,043 ఇళ్లు మాత్రం ఇప్పటికే పూర్తయిన ట్లు పేర్కొన్నారు. మొత్తంగా రూ.1180,89,29,263 లబ్ధిరులకు చెల్లించనట్లు చెబుతున్నారు. ఇందులో 83,36,208 సిమెంట్ బస్తాలు, మెటీరియల్ చార్జీలు ఉన్నాయి. ఈ చెల్లింపుల్లో ఏ మేరకు లబ్ధిదారులకు అందాయో... అక్రమాల్లో ఎవరిపాత్ర ఎంతో విచారణలో తేలనుంది. -
ఉప్పుటేరునూ మింగేశారు
భీమవరం : ప్రభుత్వ భూములను కబ్జా చేయడంలో అక్రమార్కులకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. చివరికి ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలోని భూములనూ మింగేస్తున్నారు. భూములను కబ్జా చేసి దర్జాగా చెరువులు తవ్వి రొయ్యలను సాగుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మత్తు నిద్రను వీడడం లేదు. దొంగపిండి, లోసరిలో 100 ఎకరాల కబ్జా భీమవరం మండలంలోని కృష్ణాజిల్లా సరిహద్దు గ్రామాలైన దొంగపిండి, లోసరిలు ఉప్పుటేరును ఆనుకుని ఉన్నాయి. డ్రెయిన్ మధ్యలో గట్టు పక్కన 120 ఎకరాల బీడు భూములు ఉన్నాయి. వీటిలో 100 ఎకరాలను అక్రమార్కులు కబ్జా చేసేశారు. చెరువులు తవ్వేసి రొయ్యలను సాగు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. మిగిలిన భూమిపైనా కన్నేసి దాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. దొంగపిండి నుంచి లోసరి వరకు ఉన్న ఉప్పుటేరులో గట్టును ఆనుకుని కిక్కిస, మడ అడవులు, ఆల్చీ దుబ్బులతో కూడిన బీడు భూములు ఉన్నాయి. చెట్లను నరికివేసి చెరువులు తవ్వేయడంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు జిల్లాల మధ్య తగాదా ఉప్పుటేరు మధ్యలో ఉన్న బీడు భూముల్లో పాగా వేసేందుకు అటు కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, లక్ష్మీపురం గ్రామస్తులు ఇటు పశ్చిమలోని లోసరి, దొంగపిండి గ్రామాల మధ్య తగవు నడుస్తోంది. ఇటీవల పల్లిపాలెం గ్రామస్తులు లోసరి వైపు ఉన్న డ్రెయిన్ భూమిలోకి వచ్చి జెండాలు పాతి భూఆక్రమణ చేసేందుకు ప్రయత్నించగా ఇటువైపు గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరు జిల్లాలలోని గ్రామాల మధ్య ఆ భూములు మావంటే మావని వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు సర్వే చేయించి అధికభాగం లోసరిలోనే ఉన్నాయని తేల్చారు. జోరుగా పంపకాలు లోసరి సమీపంలో ఉప్పుటేరులో ఉన్న సుమారు 50 ఎకరాల బీడు భూములను గ్రామస్తులు కుటుంబాలలోని రేషన్‌కార్డుల వారీగా గుర్తించి పంపకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. పోరంబోకు భూమిలో పాగా వేసి వాటిలో కూడా రొయ్యల సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చిన్ననీటి పారుదల శాఖలో చిలక్కొట్టుడు
అధికారులు కళ్లు మూసుకుంటే.. అక్రమార్కులు ఎలా తెగిస్తారో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ప్రజాధనానికి కాపలా కాయాల్సిన వారే.. లూటీకి గేట్లు ఎత్తితే దుర్వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించే ఉదాహరణ ఇది.. జిల్లా చిన్ననీటి పారుదల శాఖలో జరిగిన అవినీతి వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా చిన్ననీటి పారుదల శాఖలో అంతా ముక్కున వేలేసుకునే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులకు ఎలాంటి సంబం ధం లేకుండా, వారినుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే కోట్ల రూపాయల విలువైన పనులకు పచ్చజెండా ఊపారు. అంతే కాదు ఆ పనులకు చెల్లింపులూ పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే... కడప, నల్లగొండ జిల్లాల్లో చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో 103 పనులను రూ. 10.30కోట్ల బడ్జెట్‌తో చేపట్టారు. ఒక్కో పనికి రూ.10లక్షల చొప్పున ఖర్చు చేయాల్సిన ఈ పనులకు సంబంధించి జిల్లాలో 58 పనులకు సీఈ ఆఫీసు నుంచి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. దేవరకొండ సబ్‌డివిజన్‌లో 23 పనులకు టెండర్లు నిర్వహించడం, అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చకాచకా పూర్తి చేశారు. అంతే కాదు, పనులకు మొదటి విడత పేమెంటులో భాగంగా ఏకంగా రూ.1.15కోట్లు చెల్లించేశారు. ఇంతవరకు అంతా సవ్యంగా జరిగినట్లే కనిపిస్తోంది. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఈ పనులన్నీ నకిలీ ప్రొసీడింగ్స్ ద్వారా జరిగినవి కావడం విశేషం. ఇదీ.... జరిగింది చిన్ననీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో కొందరు దళారులు పథకం ప్రకారం కడప, నల్లగొండ జిల్లాలకు రూ.10.30 కోట్లతో 103 పనుల మంజూరు చేస్తున్నట్లూ నకిలీ ఉత్తర్వులు సృష్టించారు. అయితే, క్షేత్రస్థాయిలోని అధికారులకు ఇవి నకిలీ ప్రొసీడింగ్స్ ద్వారా జరుగుతున్న పనులన్న సమాచారం ముందే ఇచ్చి, ఈ అక్రమంలో భాగ స్వామ్యం కల్పించారు. జిల్లాలో రూ.5.88కోట్ల బడ్జెట్‌తో 58 పనులకు ఇలాంటి నకిలీ ఉత్తర్వులే అందాయి. 2009 సంవత్సరంలో, అప్పటి ఇన్చార్జ్ ఈఈ హయాంలో జరిగిన ఈ పనులు జరిగాయని గుర్తించారు. కొన్ని పనులు జరిగాక కానీ, అధికారికంగా మంజూరైన పనులు కాదని గుర్తించి మిగిలిన పనులను నిలిపివేశారు. అయితే, అప్పటికే మొదటి విడత చెల్లింపులు పూర్తి చేశారు. పూర్తయిన పనులను విజిలెన్సు విభాగం తనిఖీ కూడా చేసింది. అప్పటి జిల్లా ఇన్చార్జ్ ఈఈకి ఇటీవలే క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈగా పదోన్నతి కూడా ఇచ్చారు. ఈలోగా ఈ నకిలీ ఉత్తర్వులతో ప్రభుత్వానికి శఠగోపం పెట్టిన ఉదంతం వెలుగు చూడడంతో ఆయన్ను సరెండర్ చేసినట్టు సమాచారం. ఈ అక్రమ వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరిపేందుకు, అసలు నకిలీ ప్రొసీడింగ్స్ తీయించిన పెద్ద తలకాయ ఎవరో తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. దీనికోసం ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరపమని ఈ కేసును సీబీసీఐడికి అప్పగిస్తూ గత నెల 26వ తేదీన ఉత్తర్వులు (జీఆర్టీ నం:ం55) జారీ చేసింది. మొత్తంగా రూ. 9కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ఈ ఉదంతంలో మరెన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. -
అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ..?
కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరు.. అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ జరగని వ్యాపారాలంటూ లేవు. కల్తీ కిరోసిన్, డీజిల్, పెట్రోల్, క్రూడాయిల్‌తో పాటు చివరకు ప్రాణాలను హరించే మిథేల్ వరకు అన్నీ అక్రమ వ్యాపారాలే. వీటి మాటున అక్రమార్కులు లక్షలు గడిస్తున్నారు. పాలేరుకే పరిమితం కాకుండా నల్గొండ జిల్లాకు కూడా విస్తరిస్తున్నారు. పాలేరులో గతంలో పలువురి ఇళ్లలో అక్రమంగా ఉంచిన డ్రమ్ముల కొద్దీ వైట్ పెట్రోల్, నీలి కిరోసిన్ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలుకు వెళ్లినా తిరిగి అదే వ్యాపారాలను ఎంచుకోవ టం చూస్తే ఎంత అక్రమార్జన ఉంటుందో అర్థమవుతుంది. పాలేరులో రాష్ట్రీయ రహదారి పక్కన హోటళ్లు ఉండడంతో అక్రమార్కులకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. వైజాగ్, కాకినాడ నుంచి హైదారాబాద్ వరకు నిత్యం ఈ రహదారి గుండా వివిధ నూనెలు, రసాయనాలతో ట్యాంకర్లు వెళుతుంటాయి. వారు ఇక్కడ ట్యాంకర్లను ఆపి భోజనాలు చేస్తుంటారు. దీంతో అక్రమార్కులు ట్యాంకర్ల డ్రైవర్లను మచ్చిక చేసుకుని క్రూడాయిల్, కిరోసిన్, ముడి పెట్రోల్, డీజిల్, రెక్టిఫైడ్ స్పిరిట్, మిథేల్ వంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని గోడౌన్లలో రహస్యంగా నిల్వ ఉంచి రాత్రి వేళల్లో ఇతర ప్రదేశాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. మరికొందరు పలు కెమికల్స్ ద్వారా కల్తీ డీజిల్, పెట్రోల్ కూడా తయారు చేసి అక్రమ వ్యాపారం నడుపుతున్నారు. క్రూడాయిల్‌ను వంట నూనెలులగా తయారు చేసి విక్రయిస్తుంటారు. కొందరు హోటళ్ల యజమానులు ఈ వ్యాపారాల్లో ఆరితేరారు. మరి కొందరు ఈ వ్యాపారం కోసమే హోటళ్లను తెరవడం గమనార్హం. స్పిరిట్‌తో మద్యం, సారా కల్తీ... కొందరు అక్రమార్కులు ట్యాంకర్ల ద్వారా స్పిరిట్ (ఆర్ఎస్ను) గత కొంత కాాలంగా సేకరిస్తూ దాన్ని సారా, మద్యం సీసాలలో కలిపి క ల్తీ చేసి అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా తక్కువ ఖర్చుతో మత్తు ఎక్కే మద్యం తయారు చేసి మార్కెట్ ధరకే రహస్యంగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా పాలేరులో కాకుండా సమీపంలోని తోటల్లో, గుట్టల్లో జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల పోచారం- బీరోలు గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో డ్రమ్ముల కొద్దీ స్పిరిట్‌ను నిలువ ఉంచగా పోలీసులు పట్టుకుని వదిలేసినట్లు తెలిసింది. కొంప ముంచిన మిథేల్.... గతంలో అక్రమార్కులు స్పిరిట్‌తో మద్యం, సారాను కల్తీ చేసి అమ్ముతున్నా అది పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. కాగా ఇటీవల పాలేరుకు చెందిన మృతుడు కుసులూరి రాజయ్య, అతని కుమారుడు స్పిరిట్, పలు రకాల ఆయిళ్లను ట్యాంకర్ల ద్వారా తీసుకుంటూ వాటిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో మద్యం, సారా కట్టడి కావటంతో మిథేల్ ఆల్కహాల్‌ను సారాగా అమ్మవచ్చని ట్యాంకర్ డ్రైవర్ చెప్పటంతో అతను అర లీటరు మిథేల్ తీసుకుని సారాగా తయారు చేసి ప్రయోగం చేశాడు. అది వికటించి ఆ వ్యాపారితో పాటు దాన్ని తాగిన మరో నలుగురు మృత్యువాత పడాల్సి వచ్చింది. మరో 27 మంది ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్రమ వ్యాపారాలను అదపు చేయలేక పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా స్పందించి ఈ అక్రమ వ్యాపారాలను అడ్డుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
మట్టిని మింగేస్తున్నారు..
సాక్షి, నరసరావుపేట: మట్టిని నమ్ముకున్న అన్నదాతలు అప్పులపాలవుతుంటూ అదే మట్టిని అమ్ముకుంటున్న అక్రమార్కులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.. అధికార పార్టీ అండదండలతో.. అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి ఇష్టానుసారంగా మట్టిని మింగేస్తున్నారు. బంజరు భూమి ఎక్కడ కనిపించినా అక్కడ వాలిపోతూ అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు పొక్లయిన్లు.. ఆరు టిప్పర్లు అన్న చందంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ మట్టి దందా కోటప్పకొండ ప్రాంతంలోని ఎర్రనేలల్లో అధికమైంది. నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ పరివాహక ప్రాంతంలో ఎర్రమట్టి భూములు అధికం. దీంతో అక్రమార్కుల కన్ను ఈ ప్రాంతంపై పడింది. రోడ్డు కాంట్రాక్ట్ పనులు, నర్సరీలు,ఇళ్లకు తోలే మట్టి అంతా ఈ ప్రాంతం నుంచే తరలిస్తుండటం గమనార్హం. ఇక్కడి నుంచి అక్రమంగా తరలించిన మట్టిని వ్యాపారులు బహిరంగ మార్కెట్లో వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు. కొందరైతే వ్యవసాయ భూములను సైతం మట్టి క్వారీలుగా మార్చి లోయలను తలపించే విధంగా గుంతలు తీస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆయా ప్రాంతాల్లోని గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి చిన్నారులు, పశువులు మృత్యువాతకు గురైన సంఘటనలూ లేకపోలేదు. సామాన్యులపైనే ప్రతాపం.. గ్రామీణ ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు రెండు, మూడు ట్రక్కుల మట్టిని మెరకకోసం తరలిస్తుంటారు. అదే పెద్ద నేరంగా భావించి అపరాధ రుసుం వసూలు చేయడం, ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసే రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమదందా సాగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మనకెందుకొచ్చిన గొడవలే అని మిన్నకుండే అధికారులు నెలవారీ మామూళ్ల తీసుకుని సంతృప్తి పడిపోతున్నారు. దీంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా యధేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. వ్యవసాయ భూముల మధ్య మట్టి క్వారీలను ఏర్పాటు చేయటంతో సమీపంలో పంటలు వేసుకునే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేకుండానే తవ్వకాలు.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, సొంత భూముల్లో సైతం మట్టి క్వారీయింగ్ జరపాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. ఫలానా భూమిలో క్వారీయింగ్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తొలుత రెవెన్యూ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మైనింగ్‌శాఖ నిబంధనల ప్రకారం ట్రక్కుకు రూ.50 చొప్పున చెల్లించి క్వారీయింగ్ నిర్వహించుకోవాలి. కొందరు వ్యాపారులు ఎకరాకు అనుమతులు పొంది దానిని అడ్డుపెట్టుకొని 10, 15 ఎకరాల వరకు క్వారీయింగ్ నిర్వహించడమే కాకుండా ఒక్కో బిల్లుపై కనీసం 50 నుంచి 100 ట్రక్కుల మట్టిని తరలిస్తున్నారు. ఇక్కడి ఎర్రమట్టిని నర్సరీలు, ఇళ్లల్లో మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగిస్తుండటంతో గిరాకీ పెరిగింది. ట్రక్కు ఎర్రమట్టి రూ.1800 పలుకుతుండగా టిప్పర్‌లారీ మట్టి రూ.3000కుపైగా అమ్మకాలు జరుపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. మట్టి క్వారీయింగ్ చేయాలంటే రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసీ పొందాలి. మైనింగ్ అధికారులకు సీనరేజ్ చెల్లించి ట్రక్కులకు ట్రిప్సీట్లు పొందాల్సి ఉంటుంది. ఒక్కో ట్రిప్ షీట్‌ను ఒక ట్రక్కు మట్టి రవాణా చేసేందుకు మాత్రమే వినియోగించాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్వారీయింగ్ జరిపే పొక్లయిన్, ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. - ఎం.శ్రీనివాసరావు, నరసరావుపేట ఆర్డీవో