చిన్ననీటి పారుదల శాఖలో చిలక్కొట్టుడు
అధికారులు కళ్లు మూసుకుంటే.. అక్రమార్కులు ఎలా తెగిస్తారో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ప్రజాధనానికి కాపలా కాయాల్సిన వారే.. లూటీకి గేట్లు ఎత్తితే దుర్వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించే ఉదాహరణ ఇది.. జిల్లా చిన్ననీటి పారుదల శాఖలో జరిగిన అవినీతి వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా చిన్ననీటి పారుదల శాఖలో అంతా ముక్కున వేలేసుకునే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులకు ఎలాంటి సంబం ధం లేకుండా, వారినుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే కోట్ల రూపాయల విలువైన పనులకు పచ్చజెండా ఊపారు. అంతే కాదు ఆ పనులకు చెల్లింపులూ పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే... కడప, నల్లగొండ జిల్లాల్లో చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో 103 పనులను రూ. 10.30కోట్ల బడ్జెట్‌తో చేపట్టారు. ఒక్కో పనికి రూ.10లక్షల చొప్పున ఖర్చు చేయాల్సిన ఈ పనులకు సంబంధించి జిల్లాలో 58 పనులకు సీఈ ఆఫీసు నుంచి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. దేవరకొండ సబ్‌డివిజన్‌లో 23 పనులకు టెండర్లు నిర్వహించడం, అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చకాచకా పూర్తి చేశారు. అంతే కాదు, పనులకు మొదటి విడత పేమెంటులో భాగంగా ఏకంగా రూ.1.15కోట్లు చెల్లించేశారు. ఇంతవరకు అంతా సవ్యంగా జరిగినట్లే కనిపిస్తోంది. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఈ పనులన్నీ నకిలీ ప్రొసీడింగ్స్ ద్వారా జరిగినవి కావడం విశేషం.
ఇదీ.... జరిగింది
చిన్ననీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో కొందరు దళారులు పథకం ప్రకారం కడప, నల్లగొండ జిల్లాలకు రూ.10.30 కోట్లతో 103 పనుల మంజూరు చేస్తున్నట్లూ నకిలీ ఉత్తర్వులు సృష్టించారు. అయితే, క్షేత్రస్థాయిలోని అధికారులకు ఇవి నకిలీ ప్రొసీడింగ్స్ ద్వారా జరుగుతున్న పనులన్న సమాచారం ముందే ఇచ్చి, ఈ అక్రమంలో భాగ స్వామ్యం కల్పించారు. జిల్లాలో రూ.5.88కోట్ల బడ్జెట్‌తో 58 పనులకు ఇలాంటి నకిలీ ఉత్తర్వులే అందాయి. 2009 సంవత్సరంలో, అప్పటి ఇన్‌చార్జ్ ఈఈ హయాంలో జరిగిన ఈ పనులు జరిగాయని గుర్తించారు. కొన్ని పనులు జరిగాక కానీ, అధికారికంగా మంజూరైన పనులు కాదని గుర్తించి మిగిలిన పనులను నిలిపివేశారు. అయితే, అప్పటికే మొదటి విడత చెల్లింపులు పూర్తి చేశారు. పూర్తయిన పనులను విజిలెన్సు విభాగం తనిఖీ కూడా చేసింది.
అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ ఈఈకి ఇటీవలే క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈగా పదోన్నతి కూడా ఇచ్చారు. ఈలోగా ఈ నకిలీ ఉత్తర్వులతో ప్రభుత్వానికి శఠగోపం పెట్టిన ఉదంతం వెలుగు చూడడంతో ఆయన్ను సరెండర్ చేసినట్టు సమాచారం. ఈ అక్రమ వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరిపేందుకు, అసలు నకిలీ ప్రొసీడింగ్స్ తీయించిన పెద్ద తలకాయ ఎవరో తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. దీనికోసం ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరపమని ఈ కేసును సీబీసీఐడికి అప్పగిస్తూ గత నెల 26వ తేదీన ఉత్తర్వులు (జీఆర్‌టీ నం:ం55) జారీ చేసింది. మొత్తంగా రూ. 9కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ఈ ఉదంతంలో మరెన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.