Minor Irrigation Department
-
రెండో విడత ‘మిషన్’కు సర్వం సిద్ధం!
* సంక్రాంతి తర్వాత చెరువుల పనులు వేగవంతం * ఈసారి 10,355 చెరువుల పునరుద్ధరణ టార్గెట్ * ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి ఉమాభారతి రాక డౌటే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత చెరువుల పునరుద్ధరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువుల పనులను చేపట్టేందుకు చిన్న నీటి పారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న చెరువుల్లో సుమారు అరవై చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా.. ఈ నెల మూడో వారం ముగిసే నాటికి రెండు వేల చెరువులకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అనంతరం ప్రతి వారం 500కు పైగా చెరువులకు అనుమతులిస్తూ, అదే సమయంలో పనులు మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. మిగిలిపోయినవాటితో కలిపి.. గతేడాది ‘మిషన్ కాకతీయ’ తొలి విడతలో భాగంగా 9,586 చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకోగా... అందులో 8,817 చెరువుల పనులను మాత్రమే చేపట్టగలిగారు. మిగతా 769 పనులను రెండో విడతలో కలపాలని నిర్ణయించారు. ఈ లెక్కన రెండో విడతలో మొత్తంగా 10,355 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. అయితే తొలి విడత పనుల్లో చెరువుల పూడికతీత ముగిసినా, కాలువల మరమ్మతులు, వియర్ల నిర్మాణం వంటివి ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అధికారుల లెక్కల మేరకు మొత్తంగా రూ. 2,200 కోట్ల పనుల్లో రూ. 1,200 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో రూ.వెయ్యి కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులన్నింటినీ మార్చి నాటికి వంద శాతం పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక రెండో విడతలో చెరువుల పునరుద్ధరణకు రూ.2,083 కోట్లు ఖర్చు చేయనున్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏయే ప్రక్రియను ఎప్పట్లోగా పూర్తి చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించారు. వాస్తవానికి రెండో విడతలో 40 శాతం పనులను జనవరి 7 నాటికి ప్రారంభించాలని భావించినా... మొదటి విడత పనుల్లో అధికారులు బిజీగా ఉండటంతో రెండో విడతపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం తొలివిడత పనులు ముగింపు దశకు రావడం, రెండో విడత చెరువుల అంచనాలు సైతం జిల్లాల నుంచి సీఈ కార్యాలయాలకు చేరుతుండటంతో వాటి పరిశీలన జరుగుతోంది. ఉమాభారతి వచ్చేనా..? ఈ నెల 16న రెండో విడత మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో భాగంగా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి ఉమాభారతి వస్తానని ఇంతకుముందే హామీ ఇచ్చారు. కానీ ఆమె ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హడావుడి, అధికార టీఆర్ఎస్ ప్రధానంగా బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే తన పర్యటనను ఉమాభారతి రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇదేం ‘వరద’ రాజకీయం?
- ఒక టీఎంసీ నీటి కోసం రైతుల పొట్టకొడతారా - కుందూ పెన్నా వరద కాలువ పరిస్థితిపై మైనర్ ఇరిగేషన్ శాఖ ఈఈని ప్రశ్నించిన రైతులు ప్రొద్దుటూరు టౌన్ : మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజకీయ కుతంత్రాల కారణంగా కుందూ-పెన్నా వరద కాలువ అలైన్మెంట్ మార్చడంతోనే మధ్యలో నిలిచిపోయిందని, ఇప్పుడు మీరు ఆయన చెబితే వచ్చారా అంటూ మైనర్ ఇరిగేషన్ శాఖ ఈఈ వెంకటరామయ్యను రైతులు, ప్రొద్దుటూరు సమీపంలోని ప్లాట్ల యజమానులు ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో బుధవారం కుందూ-పెన్నా కాలువపై కోర్టుకు వెళ్లిన రైతులు, భూముల యజమానులతో కాలువ నిర్మాణ పనులు చేయిచేందుకు నియమించిన మైనర్ ఇరిగేషన్ శాఖ ఈఈ చర్చించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలంలోని పలువురు రైతులు వచ్చారు. కాలువ అలైన్మెంట్ మార్పుపై ఈఈ వారితో మాట్లాడారు. మొదట అలైన్మెంట్ మార్పు చేయడం వల్లనే కాలువ పనులు ఆగిపోయాయని ఈఈతో చెప్పారు. ఆనాడు అధికారంలో ఉన్న వరదరాజులరెడ్డి కక్షగట్టి తమ భూముల్లో ఊరికి దగ్గరలో కాలువను మార్పు చేశారన్నారు. ఒక టీఎంసీ నీటిని తీసుకొచ్చేందుకు వందల ఎకరాలు పంటలు పండే భూములను నాశనం చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. రెండవ అలైన్మెంట్ పోయి మూడవ అలైన్మెంటా... ఇప్పుడు రెండవ అలైన్మెంట్ పోయి మూడవ అలైన్మెంట్ అంటూ పట్టణం ఆనుకుని ఉన్న మా ప్లాట్లల్లో కాలువను తీసుకురావడం సమంజసమేనా అని కాంట్రాక్టర్ కృష్ణార్జునరెడ్డి ఈఈని ప్రశ్నించారు. ఎకరా రూ.75లక్షలు ప లుకుతున్న ఈ స్థలాల్లో కాలువ తీసుకురావడం కంటే రూ.6లక్షలు విలువ చేసే భూములకు మరింత ఎక్కువ డబ్బు అయినా ఇచ్చి కాలువను తీసుకెళితే సరిపోతుంది కదా అని అన్నారు. ఇంతలో అంకాల్‌రెడ్డి అనే రైతు మ్యాప్‌ను తెప్పించి కాలువ ఎ లా వెళితే తమ గ్రామాలకు దూరంగా వెళుతుందో అధికారులకు చూపిం చారు. మరో ఈఈ గిరిధర్ కాలువ వెళ్లే మార్గాన్ని చూపుతూ ఇలా వెళితే డబ్బు తగ్గుతుందని, మీరు చెప్పినట్లు వెళితే మరో రూ.10కోట్లు ఎక్కువ అవుతుందని వాదించారు. రైతులతో దశల వారిగా చర్చలు జరుపుతాం రైతులతో దశల వారిగా చర్చలు జరుపుతామని ఈఈ తెలిపారు. ఆ తర్వాతే ఆమోదయోగ్యమైన అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వం కాలువను పూర్తి చేయాలన్న ఆలోచనలోనే ఉందని, ఇందు కోసం రైతులతో ఒప్పించే ప్రయత్నం చేయమని తనను పంపిందని ఈఈ వివరించారు. అత్యవసరం అనుకున్న ప్రాంతాల్లో పైపులైన్ ఏర్పాటు చేసి అయినా కాలువను పూర్తి చేసేందుకు రైతులతో మాట్లాడుతామన్నారు. -
చెరువులకు మహర్దశ
రూ. 600 కోట్లతో అంచనాలు వచ్చే వేసవి నుంచే పనులు 17న మంత్రితో ఎస్ఈల సమావేశం గుంటూరు: రాష్ట్రంలోని చెరువులకు ప్రత్యేక మరమ్మతులు చేసేందుకు మైనర్ ఇరిగేషన్‌శాఖ చర్యలు తీసుకుంటోంది. శిధిలావస్థకు చేరిన చెరువుల మరమ్మతుకు రూ. 600 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ నెల 17వ తేదీన ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ఆ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సమావేశమై తుది నిర్ణయానికి రానున్నారు. వచ్చే వేసవిలోనే చెరువుల మరమ్మతులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40 వేలకుపైనే చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాల్లోపు ఆయకట్టు కలిగిన చెరువుల సంఖ్య 35,376 ఉంటే, అంతకంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన చెరువులు 6,361 ఉన్నాయి. వీటి ద్వారా 17.64 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా జరిగేది. కొంతకాలంగా ఈ చెరువులకు మరమ్మతులు లేకపోవడంతో మేట వేసుకుపోయి ఆయకట్టు విస్తీర్ణం సగానికి పడిపోయింది. స్థానిక సంస్థల అలక్ష్యం కారణంగా అనేక చెరువులు ఆక్రమణలపాలయ్యూరుు. కొన్ని ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణాలే జరిగాయి. ఈ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెరువులకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల రోజుల క్రితం వీటి అంచనాల రూపకల్పనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దాదాపు 10 సర్కిళ్ల ఇంజినీర్లు అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. వీటిపై ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ మహ్మద్ సాబ్జాన్ 12వ తేదీన సంబంధిత ఇంజినీర్లతో చర్చలు జరిపారు. 17 వ తేదీన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హైదరాబాద్ రావాలని ఆదేశించారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 300 కోట్లతో చెరువులకు మరమ్మతులు చేసింది. ఈ మరమ్మతుల్లో మేట వేసిన మట్టిని తవ్వడం మినహా ఇతర పనులు జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చెరువుల గట్లు పటిష్టం చేసేందుకు రివిట్మెంట్లు, పశువుల వినియోగానికి అనువుగా ర్యాంపుల నిర్మాణాలు, గ్రీనరీ అభివృద్ధి, పరిరక్షణకు ఫెన్సింగ్ వంటివి అంచనాల్లో చేర్చారు. -
చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తాం
కోలారు : రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వచ్చే చెరువులలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖా మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ చెరువులలో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆక్రమణ దారులు ఎంతటి స్థానంలో ఉన్నా ఉపేక్షించబోమని అన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి త్వరలో తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కోలారు జిల్లాలో ఆగిన చెరువుల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కోలారు చెరువులకు నీటిని తీసుకు వచ్చే విషయంపై డిపిఆర్ సిద్ధమవుతోందని, ఈ నెల 16వ తేదీ తరువాత ముఖ్యమంత్రితో సమావేశమై టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కోలారుకు చల్లఘట్ట, లేదా ఎలెమల్లప్ప చెరువు నుంచి నీరు తీసుకు రావాలా అనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బెంగుళూరు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కాంగ్రెస్ రహిత కర్ణాటకగా మారుస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ నాయకులు కలలు కంటున్నారని అది ఎప్పటికి సాధ్యం కాదన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తరువాత ఆరు నెలల్లో చేసిందేమి లేదని విమర్శించారు. -
ఇరిగేషన్లో భారీగా బదిలీలు
ఖమ్మం అర్బన్: మైనర్ ఇరిగేషన్ శాఖలో భారీగా బదిలీలు జరిగారు. ఖమ్మం ఐబీ సర్కిల్ పరిధిలోగల పది సబ్ డివిజన్లలో ఒకేసారి 49మంది ఏఈలు జేఈలను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఇప్పటివరకు ఐబీ సర్కిల్ పరిధిలో ఉన్నారు. కొత్తగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐబీ సర్కిల్ పరిధిలోకి కొందరు బదిలీ అయ్యూరు. మైనర్ ఇరిగేషన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని డివిజన్లు, సబ్ డివిజన్లను మార్పిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ ఏర్పాటైంది. కాకతీయ మిషన్ పథకం ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యాముల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. ఈ పనులను ఐదేళ్లలో పూర్తి చేయూలని నిర్ణరుచింది. ఈ నేపథ్యంలోనే ఇంజనీర్లను బదిలీ చేసింది. ఏజెన్సీకి బదిలీ అరున వారు, క్షేత్రస్థారులో అనుభవం లేని మహిళా ఇంజనీర్లు తమ బదిలీ నిలిపివేతకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖమ్మం ఐబీ సర్కిల్‌కు: ఎల్.వినయ్‌కుమార్, జి.సతీష్, జయలక్ష్మి, ఎస్.శైలజ. ఖమ్మం ఐబీ డివిజన్‌కు: పి.చంద్రశేఖర్. ఖమ్మం సబ్ డివిజన్‌కు: డి.ఆయూష, జి.రవికుమార్, ఎస్.మాధవి. సత్తుపల్లి సబ్ డివిజన్‌కు: ఇ.ప్రవీణ్‌కుమార్, జి.నర్సింహారావు, ఎస్.వెంకటేశ్వర రావు, కె.శ్రీకాంత్ (జేఈలు). వైరా సబ్ డివిజన్‌కు: భగీరథ్ బాబు, ఎస్.స్వాతి, డి.రాణి (ఏఈలు). మధిర సబ్ డివిజన్‌కు: జి.నరసింహారావు, ఝాన్సీ విజయలక్ష్మి, సిహెచ్.చంద్రమోహన్, వై.రాజేశ్వరరావు (జేఈలు). కొత్తగూడెం డివిజన్‌కు: జి.రమేష్. కొత్తగూడెం సబ్ డివిజన్‌కు: కె.గంగరాజు, దేవదాసు. ఇల్లెందు సబ్ డివిజన్‌కు: బి.శంకర్, ఎస్.నవీన్‌కుమార్, ఐ.సంపత్, ఎల్.రవికుమార్, ఎం.శ్రీకాంత్. పినపాక సబ్ డివిజన్‌కు: బి.సక్రు, బి.రమేష్‌బాబు, జె.దీలీప్‌కుమార్, వై.బాస్కర్‌రావు. అశ్వారావుపేట సబ్ డివిజన్‌కు: కె.శ్రీకుమార్, కె.నాగమల్లేశ్వరరావు, సిహెచ్.మూర్తి గోవిందం, పి.శ్రీనివాస్, షేక్ ఇస్మాయిల్. ఎంఐపీ సత్యనారాయణపురం డివిజన్‌కు: కె.రాజేష్. భద్రాచలం సబ్ డివిజన్లోని వెంకటాపురం: సిహెచ్.సుధాకర్, ఎల్.క్రిష్ణ, రామారావు, ఎం.సత్యవాసు. ఎంఐపీ సబ్ డివిజన్ నెంబర్-1కు: రాజేష్. ఎంఐపీ సబ్ డివిజన్-3 సత్యనారాయణపురం: టి.వెంకటేశ్వరరావు. ఎంఐపీ సబ్ డివిజన్ వెంకటాపురం: సిహెచ్.గోపాలరావు, రాజా రంజిత్‌కుమార్. ఎంఐపీ సబ్ డివిజన్-2 భద్రాచలం: బి.రాధాకిషన్, కె.మోహన్ వంశీ. గోదావరి బేసిన్ ప్యాకేజి-1: జి.రాము. గోదావరి బేసిన్ ప్యాకేజి-2,3: టి.నాగేశ్వరరావు. -
ఐదేళ్ళు కష్టపడితే చాలు..
-
మైనర్ ఇరిగేషన్‌కే అత్యధిక ప్రాధాన్యం:కేసీఆర్
హైదరాబాద్: మైనర్ ఇరిగేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఇరిగేషన్ ఇంజినీర్స్‌తో కేసీఆర్ సమావేశమైయారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి పారుదల వ్యవస్థను నాశనం చేశారని ఆయన సీమాంధ్ర పాలకులపై ధ్వజమేత్తారు. 1956లో తెలంగాణలో చెరువులు కుంటల ద్వారా 20 లక్షల ఎకరాలను నీరందేది అని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌లోనే అత్యధిక చెరువులు కుంటలున్నాయని... కానీ అన్ని అవకాశాలున్నా ఆ పట్టణం తీవ్ర వివక్షకు గురైందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్బంగా ఆ శాఖ ఉన్నతాధికారులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే నాలుగేళ్లలో ఆ రంగానికి 50 నుంచి 60 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. -
చిన్ననీటి పారుదల శాఖలో చిలక్కొట్టుడు
అధికారులు కళ్లు మూసుకుంటే.. అక్రమార్కులు ఎలా తెగిస్తారో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ప్రజాధనానికి కాపలా కాయాల్సిన వారే.. లూటీకి గేట్లు ఎత్తితే దుర్వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించే ఉదాహరణ ఇది.. జిల్లా చిన్ననీటి పారుదల శాఖలో జరిగిన అవినీతి వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా చిన్ననీటి పారుదల శాఖలో అంతా ముక్కున వేలేసుకునే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులకు ఎలాంటి సంబం ధం లేకుండా, వారినుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే కోట్ల రూపాయల విలువైన పనులకు పచ్చజెండా ఊపారు. అంతే కాదు ఆ పనులకు చెల్లింపులూ పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే... కడప, నల్లగొండ జిల్లాల్లో చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో 103 పనులను రూ. 10.30కోట్ల బడ్జెట్‌తో చేపట్టారు. ఒక్కో పనికి రూ.10లక్షల చొప్పున ఖర్చు చేయాల్సిన ఈ పనులకు సంబంధించి జిల్లాలో 58 పనులకు సీఈ ఆఫీసు నుంచి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. దేవరకొండ సబ్‌డివిజన్‌లో 23 పనులకు టెండర్లు నిర్వహించడం, అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చకాచకా పూర్తి చేశారు. అంతే కాదు, పనులకు మొదటి విడత పేమెంటులో భాగంగా ఏకంగా రూ.1.15కోట్లు చెల్లించేశారు. ఇంతవరకు అంతా సవ్యంగా జరిగినట్లే కనిపిస్తోంది. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఈ పనులన్నీ నకిలీ ప్రొసీడింగ్స్ ద్వారా జరిగినవి కావడం విశేషం. ఇదీ.... జరిగింది చిన్ననీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో కొందరు దళారులు పథకం ప్రకారం కడప, నల్లగొండ జిల్లాలకు రూ.10.30 కోట్లతో 103 పనుల మంజూరు చేస్తున్నట్లూ నకిలీ ఉత్తర్వులు సృష్టించారు. అయితే, క్షేత్రస్థాయిలోని అధికారులకు ఇవి నకిలీ ప్రొసీడింగ్స్ ద్వారా జరుగుతున్న పనులన్న సమాచారం ముందే ఇచ్చి, ఈ అక్రమంలో భాగ స్వామ్యం కల్పించారు. జిల్లాలో రూ.5.88కోట్ల బడ్జెట్‌తో 58 పనులకు ఇలాంటి నకిలీ ఉత్తర్వులే అందాయి. 2009 సంవత్సరంలో, అప్పటి ఇన్చార్జ్ ఈఈ హయాంలో జరిగిన ఈ పనులు జరిగాయని గుర్తించారు. కొన్ని పనులు జరిగాక కానీ, అధికారికంగా మంజూరైన పనులు కాదని గుర్తించి మిగిలిన పనులను నిలిపివేశారు. అయితే, అప్పటికే మొదటి విడత చెల్లింపులు పూర్తి చేశారు. పూర్తయిన పనులను విజిలెన్సు విభాగం తనిఖీ కూడా చేసింది. అప్పటి జిల్లా ఇన్చార్జ్ ఈఈకి ఇటీవలే క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈగా పదోన్నతి కూడా ఇచ్చారు. ఈలోగా ఈ నకిలీ ఉత్తర్వులతో ప్రభుత్వానికి శఠగోపం పెట్టిన ఉదంతం వెలుగు చూడడంతో ఆయన్ను సరెండర్ చేసినట్టు సమాచారం. ఈ అక్రమ వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరిపేందుకు, అసలు నకిలీ ప్రొసీడింగ్స్ తీయించిన పెద్ద తలకాయ ఎవరో తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. దీనికోసం ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరపమని ఈ కేసును సీబీసీఐడికి అప్పగిస్తూ గత నెల 26వ తేదీన ఉత్తర్వులు (జీఆర్టీ నం:ం55) జారీ చేసింది. మొత్తంగా రూ. 9కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ఈ ఉదంతంలో మరెన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. -
మైనర్ ఇరిగేషన్ శాఖలో వేటు
సాక్షి ప్రతినిధి, కడప : మైనర్ ఇరిగేషన్ శాఖలో అక్రమార్కులపై వేటు పడింది. నిబంధనలకు పాతర వేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తూ అడ్డగోలుగా కాంట్రాక్టు పనులు అప్పగించిన నేరానికి శిక్ష పడింది. ఇరువురు డీఈలు, నలుగురు ఏఈలు, నలుగురు జేటీఓలను సస్పెండ్ చేస్తూ శుక్రవారంసాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009-12 కాలంలో రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ పనులను ఇబ్బడిముబ్బడిగా, ఇష్టారాజ్యంగా చేపట్టారు. రైల్వేకోడూరు, చిట్వేలి మండలాలలో రూ. 4 కోట్లతో పలు చెక్‌డ్యామ్‌లు, కుంటలను అభివృద్ధి పరిచారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు అప్పగించడం, నాణ్యతగా పనులు నిర్వహించకపోవడం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వీటిపై అప్పట్లోనే ఆరోపణలు రావడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాయిరాంప్రసాద్ రెండు నెలల క్రితం సస్పెండ్‌కు గురయ్యారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 103 ఇరిగేషన్ పనులపై విచారణ చేపట్టారు. అందులో నల్గొండ జిల్లాలో 70 పనులు, వైఎస్సార్‌జిల్లాలో 30 పనుల్లో అవకతవకలకు జరిగినట్లు రూఢీ అయింది. ఈ మేరకే సస్పెన్షన్ ఉత్తర్వులు అందినట్లు సమాచారం. అనుకున్న వారికే కాంట్రాక్టు పనులు మైనర్ ఇరిగేషన్ శాఖలో టెండర్ల ప్రక్రియను తంతుగా నిర్వహించేవారు. అనుకున్న వారికి కాంట్రాక్టులు దక్కేలా పాత తేదీలతో టెండర్లను ఆహ్వానిస్తూ అప్పటికప్పుడు నోటీసు బోర్డులో పొందుపరుస్తూ వచ్చేవారు. ఇరిగేషన్ అధికారులతో టచ్‌లో ఉన్న వారికి మాత్రమే పనులు దక్కేలా, అలాంటి వారికే టెండరుషెడ్యూల్ అందేలా ముందస్తు వ్యూహంతో వ్యవహరించేవారు. అనుకున్న వారికి కాంట్రాక్టు పనులు అప్పగించడం, ఆపై పరస్పర సహకారంతో పనులు చేపట్టడంతో నాణ్యతకు తిలోదకాలకు ఇస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో మైనర్ ఇరిగేషన్‌శాఖ కార్యదర్శినాగిరెడ్డి, చీఫ్ ఇంజినీర్లకు రైల్వేకోడూరు వాసులు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాయిరాంప్రసాద్పై తొలుత వేటు పడింది. సమగ్ర విచారణ అనంతరం డీఈలు రాజా రవీంద్ర, చెంగల్రాయులు, ఏఈలు రెడ్డి సురేష్, లక్ష్మినరసయ్య, వెంకట సుబ్బయ్య, ప్రసాద్, టెక్నికల్ ఆఫీసర్లు సుదర్శన్‌రెడ్డి, నాయక్, వెంకట సుబ్బయ్యతో పాటు మరొకరిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. సీబీసీఐడీచే విచారణ రైల్వేకోడూరు, చిట్వేలి మండలాల్లో 2009-12 కాలంలో చేపట్టిన సుమారు రూ. 4 కోట్ల కాంట్రాక్టు పనులపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అందుకు నోడల్ ఆఫీసర్లుగా ప్రస్తుత ఈఈలు సుబ్బరామయ్య, మల్లికార్జునను నియమించారు. అప్పట్లో చోటుచేసుకున్న అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఆ మేరకు సుమారు 30 పనులపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మైనర్ ఇరిగేషన్లో 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. -
ఒకే టెండర్!
11 పనులను ఒక్కడికే కట్టబెట్టే పన్నాగం =మేడారం జాతర పనుల్లో రూ. 9.52 కోట్లకు ఎసరు =కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల కుమ్మక్కు =10 శాతం ఎక్సెస్‌కు దక్కేలా పావులు =ప్రొసీడింగ్స్ రాకముందే ఒప్పందం ఖరారు తిన్న పాణం ఊరుకోదుగా... అందుకే ఆనవాయితీని కొనసాగించేందుకు పెద్దలు రంగం సిద్ధం చేశారు. మేడారం జాతర నిధులను దిగమింగేందుకు కుమ్మక్కు తంత్రానికి తెరతీశారు. మైనర్ ఇరిగేషన్ శాఖలోరూ. 9.52 కోట్ల పనులకు టెండర్ వేశారు. చిన్న, పెద్ద పనులనే తేడా లేకుండా అన్నింటికీ ఒకే టెండర్ పిలిచేలా... ఆ ఒక్కడికే కట్టబెట్టేలా జిల్లా యంత్రాంగంపై ఒత్తిళ్లు మొదలుపెట్టారు. ఇదే అదునుగా కక్కుర్తి పడ్డారో... ఏమో గానీ అతగాడికి పది శాతం ఎక్సెస్‌కు టెండర్ కట్టబెట్టేలా అధికారులు పావులు కదుపుతున్నారు. ములుగు, న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరలో కక్కుర్తి పనులకు తెరతీశారు. కాంట్రాక్టర్లు.. ప్రజాప్రతినిధులు.. అధికారులు కుమ్మక్కై జాతరలో ప్రధాన భూమిక పోషించే స్నానఘట్టాల నిధులపై గురి పెట్టారు. సమయం ముంచుకొస్తుందనే సాకుతో మైనర్ ఇరిగేషన్ శాఖ పనుల్లో షార్ట్ టెండర్‌కు తెరలేపారు. ఈ శాఖ పరిధిలో చేపట్టే సుమారు 11 పనులకు ఒకే టెండర్ పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుండి 15వ తేదీ వరకు మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జాతరఅభివృద్ధి పనులకు రూ. 90 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మైనర్ ఇరిగేషన్ శాఖకు రూ. 9.52 కోట్లు కేటాయించింది. వీటితో జంపన్నవాగుపై స్నానఘట్టాల నిర్మాణం, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, తదితర పనులు చేపట్టాలి. నిబంధనల ప్రకారం రూ. ఐదు లక్షలకు పైబడి విలువైన పనులను టెండర్ పద్ధతిన కట్టబెట్టాలి. ఆ లోపు పనులను నామినేషన్ పద్ధతిన కేటాయించాలి. ఈ లెక్కన 11 పనులకు వేర్వేరుగా టెండర్ పిలవాల్సి ఉన్నప్పటికీ... అధికారులు ఒక్కడికే కట్టబెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. విడివిడిగా పనులు అప్పగిస్తే.. పనుల పర్యవేక్షణ సులువు కావడంతోపాటు త్వరగా పూర్తయ్యే అవకాశమున్నప్పటికీ... వారు ఒకే టెండర్ నిర్వహణకు నిర్ణయం తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి కలెక్టర్ చీవాట్లు పెట్టినా... గత జాతర సమయంలో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా వేర్వేరుగా టెండర్లు పిలవాలని మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) అధికారులను ఆదేశించారు. ఒకే టెండర్ నిర్వహణపై సమీక్ష సమావేశాల్లోఆయన చీవాట్లు పెట్టినా... వారు పట్టించుకోలేదు.. తీరా సమయం దగ్గరపడడంతో చేసేదేమీలేక ఒకే టెండర్‌కు రాహుల్ బొజ్జా అయిష్టంగా ఒప్పుకున్నారు. ఇప్పడు ఆయన బదిలీ కావడం... కొత్త కలెక్టర్ రావడంతో మళ్లీ పాత కథనే కొనసాగించేందుకు అధికారులు సమాయత్తమవడం విశేషం. కాంట్రాక్టర్ల రింగ్ జిల్లాలోని క్లాస్ వన్ కాంట్రాక్టర్లు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మాణంలో అనుభవమున్న వారు మాత్రమే టెండర్లో పాల్గొనేందుకు అర్హులు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రమే అర్హులుగా ఉన్నారు. పొరుగు జిల్లా కాంట్రాక్టర్లను స్థానికేతరులు అనే సాకుతో ఇక్కడ టెండర్ వేయనీయకుండా ‘పెద్దసార్ల’తో బెదిరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జిల్లాకు చెందిన వారు టెండర్లలో రింగ్ అయి ప్రతి జాతరలోనూ ఆ ఒక్కడికే కాంట్రాక్ట్ దక్కేలా సహకరిస్తున్నారు. ఈ సారీ కూడా ఆయనకే మళ్లీ పనులు దక్కేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇబ్బందులే.. జాతరలో మైనర్ ఇరిగేషన్ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. గత జాతరలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.. చిన్న.. పెద్ద పనులన్నీ ఒకే కాంట్రాక్టర్ చేయాల్సి రావడంతో జాతర రేపు మాపు వరకు కూడా కొనసాగాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాదు... పనులో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనబడింది. విడివిడిగా టెండర్లు పిలిస్తే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు రంగంలోకి దిగి.. లెస్‌కు పలికే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరనున్నప్పటికీ... అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అందుకేనేమో... మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 1,192 మీటర్ల మేర స్నాఘట్టాల నిర్మాణం, కొత్త బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు, పాత బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పాత ఇన్‌ఫిల్టరేషన్ బావుల మరమ్మతు, కొత్తవాటి ఏర్పాటు, ఇసుక తరలింపు, లెవలింగ్, జంపన్నవాగులో క్రాస్బండ్ల నిర్మాణం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదుల నిర్మాణం, స్నానఘట్టాల వద్ద బారికేడ్లు, క్లోరినేషన్ తదితర పనులు చేయనున్నారు. ఇవన్నీ ఒకరు చేస్తే.. అతడికి ఏమైనా మిగలడంతోపాటు తమకూ పెద్దమొత్తంలో అందే అవకాశముందని భావిస్తున్న అధికారులు ఒకే టెండర్ నిర్వహణకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు భక్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ పనులకు విడివిడిగా టెండర్లు పిలిచేలా చర్యలు చేపట్టాలని... నాసిరకం పనులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు. ఒకటే టెండర్... ఎంఐ శాఖ పరిధిలోని జాతర పనులన్నింటికీ ఒకే షార్ట్ టెండర్ పిలువనున్నాం. జాతరకు సమయం దగ్గరపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. పనులకు సంబంధించి ఇంకా ప్రొసీడింగ్స్ వెలువడలేదు. రేపోమాపో వెలువడగానే టెండర్ పిలిచేందుకు చర్యలు తీసుకుంటాం. - రామకృష్ణాచార్యులు, డీఈ, మైనర్ ఇరిగేషన్