రెండో విడత ‘మిషన్’కు సర్వం సిద్ధం!
* సంక్రాంతి తర్వాత చెరువుల పనులు వేగవంతం
* ఈసారి 10,355 చెరువుల పునరుద్ధరణ టార్గెట్
* ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి ఉమాభారతి రాక డౌటే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత చెరువుల పునరుద్ధరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువుల పనులను చేపట్టేందుకు చిన్న నీటి పారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న చెరువుల్లో సుమారు అరవై చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా.. ఈ నెల మూడో వారం ముగిసే నాటికి రెండు వేల చెరువులకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అనంతరం ప్రతి వారం 500కు పైగా చెరువులకు అనుమతులిస్తూ, అదే సమయంలో పనులు మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది.
మిగిలిపోయినవాటితో కలిపి..
గతేడాది ‘మిషన్ కాకతీయ’ తొలి విడతలో భాగంగా 9,586 చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకోగా... అందులో 8,817 చెరువుల పనులను మాత్రమే చేపట్టగలిగారు. మిగతా 769 పనులను రెండో విడతలో కలపాలని నిర్ణయించారు. ఈ లెక్కన రెండో విడతలో మొత్తంగా 10,355 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. అయితే తొలి విడత పనుల్లో చెరువుల పూడికతీత ముగిసినా, కాలువల మరమ్మతులు, వియర్‌ల నిర్మాణం వంటివి ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
అధికారుల లెక్కల మేరకు మొత్తంగా రూ. 2,200 కోట్ల పనుల్లో రూ. 1,200 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో రూ.వెయ్యి కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులన్నింటినీ మార్చి నాటికి వంద శాతం పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక రెండో విడతలో చెరువుల పునరుద్ధరణకు రూ.2,083 కోట్లు ఖర్చు చేయనున్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏయే ప్రక్రియను ఎప్పట్లోగా పూర్తి చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించారు.
వాస్తవానికి రెండో విడతలో 40 శాతం పనులను జనవరి 7 నాటికి ప్రారంభించాలని భావించినా... మొదటి విడత పనుల్లో అధికారులు బిజీగా ఉండటంతో రెండో విడతపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం తొలివిడత పనులు ముగింపు దశకు రావడం, రెండో విడత చెరువుల అంచనాలు సైతం జిల్లాల నుంచి సీఈ కార్యాలయాలకు చేరుతుండటంతో వాటి పరిశీలన జరుగుతోంది.
ఉమాభారతి వచ్చేనా..?
ఈ నెల 16న రెండో విడత మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో భాగంగా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి ఉమాభారతి వస్తానని ఇంతకుముందే హామీ ఇచ్చారు. కానీ ఆమె ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హడావుడి, అధికార టీఆర్‌ఎస్ ప్రధానంగా బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే తన పర్యటనను ఉమాభారతి రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.