Mission Kakatiya
-
‘మిషన్’ఇన్‌కంప్లీట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పల్లెకు ఆయువుపట్టు చెరువు. ఆ చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించి చేపట్టిన మిషన్ కాకతీయ మొదట్లో ఒక ఉద్యమంలా సాగినా... చివరకు వచ్చేసరికి నిధుల కొరతతో నీరసించింది. మొదటి రెండు విడతలుగా చేపట్టిన పనులు ఉధృతంగా సాగగా, చివరి రెండు విడతల పనులు పూర్తిగా చతికిలబడ్డాయి. ప్రభుత్వం నుంచి సమగ్రంగా నిధుల కేటాయింపు లేకపోవడం, పెండింగ్ బిల్లుల నేపథ్యంలో 5 వేలకు పైగా చెరువుల పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 22 వేల చెరువులకు తిరిగి జీవం పోసినా... ఆఖర్లో ప్రభుత్వం నుంచి మునుపటి చొరవ లేకపోవడంతో మిగిలిపోయిన 5 వేల చెరువుల పనులను ఎలా పూర్తిచేయాలో ఇరిగేషన్ శాఖకు పాలుపోవడం లేదు. బిల్లుల బకాయిలు500కోట్లు రాష్ట్రంలో నాలుగు విడతలుగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. ఇప్పటి వరకు 22 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా 2,040 చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వీటిని రెండేళ్ల కిందట జూన్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. ఇక 4వ విడతలో 4,214 చెరువుల పనుల్లో మరో 2,472 పనులు పూర్తి కాలేదు. ఇలా నాలుగు విడతల్లో కలిపి మొత్తం 5,553 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు జరగడంతో ఈ పనులకు అనుకున్న మేర నిధుల ఖర్చు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖకు పదేపదే విన్నవిస్తున్నా, అరకొర నిధులను విదిల్చి చేతులు దులుపుకుంటోంది. దీంతో ఇటీవలే కల్పించుకున్న ఇరిగేషన్ శాఖ రూ.25 లక్షల కన్నా తక్కువ బిల్లులున్న వాటికి నిధులు ఇప్పించడంలో చొరవ చూపడంతో 260 చెరువులకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ మరో రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయన్న దానిపై స్పష్టత లేదు. ఇరిగేషన్ పునర్ వ్యవస్థీకరణతో వీటిపై దృష్టి పెట్టేదెపుడో? ఇక శాఖ పునర్వ్యవస్థీకరణతో మైనర్ ఇరిగేషన్ విభాగం పూర్తిగా రద్దయింది. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవడంతో మైనర్ ఆయా డివిజన్ల సీఈల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఈ పునర్వ్యవస్థీకరణ మేరకు చెరువుల ఒప్పందాల పైళ్ల విభజన, పని విభజన జరగాల్సి ఉంది. అనంతరం డివిజన్ల వారీగా వీటి పురోగతిని సీఈలు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల టెండర్లు, వాటి ఒప్పందాలు, పనుల కొనసాగింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ తరుణంలో పెండింగ్ చెరువుల పనులపై వీరెంత దృష్టి సారిస్తారన్నది చూడాలి. -
‘మిషన్ కాకతీయ’...నిధులు లేవాయె..!
సాక్షి, హైదరాబాద్ : చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’పనులు చివరి దశలో చతి కిలపడ్డాయి. ఏడాదిగా నిధుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో మూడు, నాలుగో విడతలో చేపట్టిన 5,553 చెరువుల పనుల్లో స్తబ్దత ఏర్పడింది. నిధులు విడుదల చేస్తే తప్ప ముందుకు కదిలే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడివక్కడే... రాష్ట్రంలో 4 విడతలుగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. ఇప్పటి వరకు 21,436 పనులు పూర్తయ్యాయి. మొదటి, రెండో విడతలో చేసినంత వేగంగా మూడు, నాలుగో దశల్లో ముం దుకు కదలడం లేదు. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా 3,918 చెరువులే పూర్తయ్యాయి. మరో 2,040 చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వీటిని గతేడాది జూన్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. ఇక 4వ విడతలో 4,214 చెరువుల పనుల్లో ఇప్పటివరకు 1,742 పనులే పూర్తయ్యాయి. మరో 2,472 పనులు పూర్తి కాలేదు. భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు జరగడంతో ‘మిషన్ కాకతీయ’కు అనుకున్న మేర నిధుల ఖర్చు జరుగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖను సంప్రదించినప్పుడల్లా అరకొర నిధులను విదిల్చి చేతులు దులుపుకుంటోంది. పెండింగులో రూ.450 కోట్లు... ప్రస్తుతం రూ.450 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పనులు చేయాల్సిన సీజన్ అంతా వృథాగా పోతోంది. జూన్ నుంచి వర్షాలు మొదలైతే పనులు కొనసాగించే వీలుం డదు. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణను నీటిపారుదల శాఖ ఎలా ముగిస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ‘మిషన్ కాకతీయ’ప్రభావం ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై చూపనుంది. రూ.4 కోట్లకు పైగా అంచనాలతో చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలవనున్నారు. వీటి బిల్లుల చెల్లింపులో జాప్యం భయంతో నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా? అన్నది ప్రశ్నగా ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ దేశానికే ఆదర్శం
నాంపల్లి: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజన్ తెలంగాణ’ ఇంటరాక్టివ్ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన గుజరాత్, కేరళ రాష్ట్రాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను తీసుకువస్తామని మేనిఫెస్టోలో పార్టీలు పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. ఐదేళ్లలోనే కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలు గమనిస్తున్నారని, మిషన్ భగీరథ అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథం లో పయనింపజేస్తున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ కింద 1.70 లక్షల పైపులైన్లు వేసి ఇంటింటికి తాగేందుకు మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ప్రోత్సాహానికి మంత్రి కేటీఆర్ నిత్యం తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, పరిశ్రమల స్థాపనతో ఉపాధి, ఉత్పత్తులను పెంపొందించుకోవడానికి వీలుంటుందని పదే పదే చర్చిస్తున్నారని వివరించారు. భూసేకరణతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయ నున్న టెక్స్టైల్ పార్కు ఆలస్యమవుతోందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించి కొద్ది నెలల్లోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామన్నారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి ప్రభుత్వానికి పారిశ్రామిక వేత్తలు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్య క్షుడు కరుణేంద్ర జాస్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు రమకాంత్ ఇనానీ తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల్లో 265 టీఎంసీల నీళ్లు
తుంగతుర్తి: మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలో 46 వేల చెరువులు అభివృద్ధి చెందాయని, వీటి ద్వారా 265 టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన ‘పిట్టవాలిన చెట్టు’పుస్తకాన్ని ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి, దుబ్బాక ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికతో కలసి ఆవిష్కరించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు పిట్టవాలిన చెట్టు పుస్తకం అద్దం పడుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన అభివృద్ధి, గత, ప్రస్తుత పరిస్థితులను ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. చెరువుల అభివృద్ధి పూర్తయిందని, ప్రస్తుతం చిట్టచివరి ఎకరాకు నీళ్లందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయం దండగంటే సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపించారని పేర్కొన్నారు. కరువనేదే ఉండదు.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇక కరువనేదే ఉండదని, ఆ పదానికి డిక్షనరీలో అర్థం వెతుక్కోవాల్సి వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో బతుకదెరువు కోసం వలసలు వెళ్లిన ప్రజలు నేడు తిరిగి సొంతూళ్లకు వచ్చారని తెలిపారు. కాగా, కేసీఆర్ సీఎం కాకపోతే మరో వెయ్యి జన్మలెత్తినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తి భగీరథుడిగా మారారని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణపై కళ్లకు కట్టినట్లు పిట్టవాలిన చెట్టు పుస్తకంలో రాసిన రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోజ, జేసీ సంజీవరెడ్డి, వివిధ జిల్లాల జర్నలిస్టులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తటాక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో చెరువులకు పూర్వవైభవం తెచ్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిస్తోంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో రాష్ట్రం లో చాలా వరకు చెరువులు జలకళను సం తరించుకున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు చాలా చెరువులు అలుగుపారుతున్నా యి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 36% చెరువులు 100% నిండగా మరో 15%వరకు చెరువులు 75%, అదే స్థాయిలో చెరువులు 50%, మిగిలినవి 25% నిండాయి. దీంతో ఈ రబీ సీజన్లో చెరువుల కింద 18 లక్షలకుపైగా ఎకరాలు సాగులోకి వస్తాయని సాగునీటిశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితంగానే చెరువుల్లో జలకళ సాధ్యమైందని చెబుతున్నాయి. పదేళ్ల్ల తర్వాత నిండిన జగిత్యాల జిల్లా బండలింగాపూర్ చెరువు చెరువుల్లో నీళ్లే నీళ్లు... ఈ ఏడాది రాష్ట్రంలోని మొత్తం 43,855 చెరువులకుగాను 36%అంటే 15,689 చెరువులు 100% నిండాయి. ఈ చెరువుల కింద గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రబీలో వ్యవసాయ పనులు సాగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4,195 చెరువులు పూర్తిగా నిం డాయి. ఈ జిల్లాలో మొత్తం 6,052 చెరువులు ఉండగా అందులో 70% చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. మరో 10 శాతం చొప్పున చెరువుల్లో 25, 50, 75 శాతం నీరు చేరింది. అదే ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఏకంగా 76 శాతం చెరువులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. ఇక్కడ మొత్తం 2,702 చెరువులుండగా అందులో 2,050 చెరువులు ఎఫ్టీఎల్ స్థాయికి చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా వేల సంఖ్యలో చెరువులు 100 శాతం నిండగా మహబూబ్‌నగర్‌లో 599, నల్లగొండలో 431, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 64 చెరువుల్లో గరిష్టంగా నీరు చేరింది. ఇంకో విషయమేమిటంటే రాష్ట్రంలోని మొత్తం చెరువుల్లో 25 శాతమే నీరు చేరిన చెరువుల కంటే 100 శాతం నిండిన చెరువుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం 15,616 చెరువుల్లో 25 శాతం నీరు చేరగా 15,689 చెరువులు నీటితో పూర్తిగా నిండిపోయాయి. మిషన్ కాకతీయ ప్రస్థానం ఇదీ... రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణే ధ్యేయంగా 2015 మార్చి 12న సీఎం కేసీఆర్ అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి తక్కువ వ్యయంతో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా అధ్యయనం చేస్తున్న మిషిగాన్ యూనివర్సిటీ ఈ పథకం అమలు తీరును పరిశీలించింది. వర్సిటీ పరిధిలోని 8 విద్యాసంస్థలకు చెందిన 16 మంది విద్యార్థులు 2016–17 సంవత్సరంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాల్లో ఏడాదిపాటు ఈ పథకం అమలు తీరును పరిశీలించారు. షికాగో వర్సిటీ–టాటా డెవలప్మెంట్ సెంటర్ రెండేళ్ల సమగ్ర అధ్యయనానికి అప్పట్లో ముందుకొచి్చంది. ఈ పథకం అమలు తీరును పరిశీలించాలని నాబార్డు సంస్థ నాబ్కాన్స్కు సూచించగా ఆ సంస్థ 2017 చివర్లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయ అమల్లోకి వచ్చిన తర్వాత చెరువుల కింద 51 శాతం ఆయకట్టు పెరిగిందని, ఎండిపోయిన 17 శాతం బోర్లు మళ్లీ నీటిని పోస్తున్నాయని వెల్లడైంది. అలాగే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గడంతోపాటు భూగర్భ జలాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాయని, చేపల లభ్యత 39 శాతం పెరిగిందని తేలింది. -
ఇండోనేసియా సదస్సులో ‘మిషన్ కాకతీయ’
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితంగా తెలంగాణలో జరిగిన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ వృద్ధిపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. రాష్ట్ర ప్రగతికి, గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మల్లాంటి చిన్ననీటి వనరుల అభివృద్ధి ఇతర దేశాలకు ఆదర్శనీయంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో మూడేళ్లకోసారి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) నిర్వహించే సదస్సు ఈసారి ఇండోనేసియాలోని బాలిలో జరగగా, ఈ సదస్సుల్లో మిషన్ కాకతీయపై కీలక పత్రాలను సమర్పించే అవకాశం తెలంగాణకు దక్కింది. దీంతోపాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో నీటి వినియోగ సామర్థ్యం అంశాలపై పత్రాలు సమర్పించగా, వీటిపై చీఫ్ ఇంజనీర్లు హమీద్ ఖాన్, శంకర్, నర్సింహ, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరై రాష్ట్రం తీసుకున్న జల సంరక్షణ చర్యలపై మాట్లాడారు. రాష్ట్రంలోని సుమారు 40 వేలకు పైగా ఉన్న చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, ఆ మట్టిని పొలాలకు తరలింపు, నీటి సామర్థ్యం పెంపు చర్యలు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి ద్వారా నీటి సంరక్షణ తదితర అంశాలపై శ్రీధర్ దేశ్‌పాండే వివరించారు. చెరువుల పునరుద్ధరణతో ప్రస్తుతం 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగులోకి వచ్చిందని తెలిపారు. దీనిపై ఐసీఐడీ సదస్సు ప్రశంసలు కురిపించింది. ఇక సాగర్, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీటి వినియోగం, నీటి సరఫరాలో వ్యత్యాసాల తగ్గింపు, నీటి వృ«థాకు అడ్డుకట్ట ఎలా జరిగిందన్న అంశాలపై నరసింహ, శంకర్లు ఈ సదస్సులో వివరించారు. -
మట్టిని దోచేశారు
సాక్షి, పరకాల: మిషన్ కాకతీయ పనులను అడ్డం పెట్టుకొని సంబంధిత కాంట్రాక్టర్లు అడ్డగోలుగా చెరువు మట్టిని మాయం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్ పరకాల పెద్దచెరువు మట్టిని తరలిస్తు దర్జాగా అమ్మేసుకుంటున్నాడు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు కట్ట మరమతులు చేపట్టడంతో పాటు చెరువులోని నల్లమట్టిని రైతుల అవసరాలకు తరలించాల్సి ఉండగా కాంట్రాక్టర్ మొరం తవ్వకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒకవైపు అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండగా లక్షలాది రూపాయాల విలువ చేసే చెరువు మొరాన్ని మూడు నెలలుగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. తన అనుచరులకు చెందిన 5 జేసీబీ వాహనాలు, 50 ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు మొరం తరలిస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పుకు మొరం మట్టికి రూ.500 నుంచి రూ.600 వరకు, నల్లమట్టికి రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా చెరువు నుంచి వందలాది ట్రిప్పుల మొరం మాయమైంది. కట్ట మరమతులకు నాలుగైదు ట్రాక్టర్లను వినియోగించి మిగతాదంతా పట్టణ ప్రజల ఇళ్ల నిర్మాణ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది. పట్టణంలో ఖాళీ స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న ప్లాట్లు చెరువుమట్టితో దర్శనమిస్తున్నాయి.ఓ జేసీబీ యాజమాని ఇదే అదనుగా భావించి తనకు సంబంధించిన ఎకరం ప్లాటుకు 500 ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని తరలించడం చూస్తుంటే మట్టిదందా ఎంత జోరుగా సాగుతుందో స్పష్టం అవుతుంది. మిషన్ కాకతీయ పథకం పేరిట ఒకవైపు బిల్లులు తీసుకుంటూనే మరోవైపు చెరువు మట్టిని అమ్ముకుంటున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. చెరువు అంతా గుంతలమయం వాస్తవానికి మిషన్ కాకతీయలో భాగంగా చెరువులో ఒకే మాదిరిగా తవ్వకాలు చేయాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ తనకు మొరం లభించిన చోటల్లా జల్లెడ పట్టినట్లు తవ్వేస్తున్నాడు. దీంతో చెరువులో భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షకాలంలో చెరువులో నీరు ఎక్కడిక్కడే నిలిచిపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు, ప్రజలు ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎక్కువగోతులు ఉండడం వల్ల చెరువు నీరు తూము వద్దకు చెరుకోకుండా దూరంగానే నిలిచిపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు లేకపోలేదు. కట్టమరమతులో నాణ్యత లోపం చెరువు కట్ట పనుల్లో నాణ్యత కరువైంది. కట్టను వెడల్పు చేయడానికి కాంట్రాక్టర్ గతంలో ఉన్న కట్ట మట్టిని సగభాగం వరకు తొలగించి మళ్లీ చెరువు మొరం మట్టిని పోయిస్తున్నాడు. అయితే గట్టిపడిన కట్టను తొలగించి మళ్లీ పనులు చేపట్టడం వెనుక కాంట్రాక్టర్ కక్కుర్తి స్పష్టం అవుతుంది. ముఖ్యనేత పేరిట మట్టిదందా నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పుకుంటూ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నాడు. పరకాల మండలంలోని నాగారంతో పాటు ఇతర చెరువుల్లో నిబంధనలకు విరుద్దంగా మట్టి తవ్వకాలు కొనసాగుతోన్నాయి. ప్రతిపక్షపార్టీల నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తరలింపును ఆపేసినట్లు సమాచారం. నేడు మళ్లీ అదే బాటలో పెద్ద చెరువు కాంట్రాక్టర్ నియోజకవర్గ ముఖ్యనేతకు అనుచరుడిగా చెప్పుకుంటూ చెరువు మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న చెరువు మట్టిని అడ్డుకోవాలని లేనట్లయితే చెరువులో నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శిఖం చుట్టు కుట్ర
సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మోతె చెరువు శిఖం, ఎఫ్టీఎల్ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పదేళ్ల క్రితం వరకు నిండుకుండలా, వెడల్పాటి కాలువలతో చూడముచ్చటగా ఉన్న ఈ చెరువు క్రమంగా ఆనవాళ్లు కోల్పోతోంది. పెద్దకాలువలు పిల్లకాలువల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. కబ్జాలతో చెరువులో నీటి నిలువసామర్థ్యం తగ్గుతోంది. ఒకప్పుడు 8వేల ఎకరాలకు సాగునీరందించిన చెరువు ప్రస్తుతం 3వేల ఎకరాలకు నీరందించలేదని దైన్యస్థితికి చేరింది. అంతేకాదు.. జగిత్యాల మండ ల పరిధిలోని ముప్పాల, తిమ్మాపూర్, జాబితాపూర్, పొలాస తాళ్ల చెరువులకు ఏకైక నీటి వనరు ఈ చెరువే. చెరువు భూముల్లో కొనసాగుతున్న కబ్జాలతో భవిష్యత్‌లో నీరందించడం అనుమానమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటికే మూడు వందలకు పైగా ఇండ్ల నిర్మాణాలు చెరువును కప్పేశాయి. వాగుతో పాటు ముంపు ప్రాంతాలూ కబ్జా మోతె చెరువుకు ప్రవాహం వచ్చే వాగు అంతర్గాం శివారు నుంచి ధరూర్, నర్సింగాపూర్ మీదుగా మోతెచెరువులో కలుస్తుంది. ఈ ప్రాంతాలను కూడా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి వాగుతో పాటు ముంపు ప్రాంతాలను చదునుచేశారు. దీంతో వర్షాకాలంలో నీరు వాగునుంచి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పాటు చెరువు నీటిమట్టం తగ్గడంతో ముంపు ప్రాంతాల్లో ఉన్న భూముల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు చదునుచేసి ప్లాట్లు సిద్ధంచేశారు. కబ్జా వంద ఎకరాలపైనే... మోతె గ్రామంతో పాటు మున్సిపల్ పరిధిలోని 10, 16 వార్డులకు ఆనుకుని చెరువు ఉంది. సర్వే నంబరు 406లో ఉన్న చెరువు మొత్తం విస్తీర్ణం 90.23 ఎకరాలు. గత పదేళ్లకాలంలో 40ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రస్తుతం 50ఎకరాలకు మించి చెరువు విస్తీర్ణంలేదు. 269 నుంచి 319 సర్వే నంబర్లకు వరకు 790 ఎకరాల శిఖం భూమి, మరో 50ఎకరాల్లో ఎఫ్టీఎల్ (ఫుల్ బ్యాంక్ లెవల్) భూములున్నాయి. ఇందులో 50 ఎకరాల శిఖం, 20 ఎకరాల ఎఫ్టీఎల్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఆక్రమిత భూముల్లో 300లకు పైగా నివాస గృహాల నిర్మాణాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లా ఏర్పాటుకు ముందు అప్పటి సబ్‌కలెక్టర్ శశాంక ఈ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. శిఖం భూముల్లోని అక్రమాణాలను తొలగించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఆయన బదిలీ అయ్యారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న ఆక్రమణాదారులు శశాంక బదిలీ అయిన వెంటనే మళ్లీ ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు ప్రారంభించారు. కనీసం ఇప్పటికైనా అధికారులు సంప్రదించి చెరువు భూములను స్వాదీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతోనే... జిల్లా ఏర్పాటు ప్రకటనతోనే జగిత్యాల, పరిసర ప్రాంతాల్లో భూములకు భలే డిమాండ్ పెరిగింది. భూముల ధరలు ఒకేసారి 10 రేట్లు పెరిగాయి. దీంతో సామాన్యులు భూములు కొనలేని స్థితిలో చేరుకున్నారు. ఇదే క్రమంలో చెరువులు, కుంటలపై కన్నేసిన పలువురు వాటిని కబ్జా చేయడం మొదలుపెట్టారు. కబ్జాల పరంపర గత ఐదేళ్లలో నుంచే ఎక్కువైంది. ఇదే క్రమంలో పలువురు చెరువు భూములు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సీఎం ఆదేశాలు బేఖాతరు చెరువులు, వాటి భూముల ఆక్రమణల అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యల విషయంలో రాజీపడొద్దని, ఆక్రమిత చెరువు భూములను స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలని గతంలో కలెక్టర్ల సదస్సులో సూచించారు. అయినా జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువే కబ్జా కోరల్లో చిక్కుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతుంటే మరో పక్క క్షేత్రస్థాయిలో చెరువుల కబ్జా పరంపర కొనసాగుతుండటం గమనార్హం. చెరువును కాపాడాలి మోతె గ్రామ జగిత్యాల పట్టణానికి ఆనుకునే ఉంది. అయినా మోతె చెరువు భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. కాలువలు సైతం కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంట్నురు. దీంతో నీరుపారని పరిస్థితి ఉంది. చెరువు భూములు కబ్జాపై అప్పటి సబ్‌కలెక్టర్ శశాంక స్పందించి ఆక్రమణలను తొలగించారు. ఆయన బదిలీ తర్వాత మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోతె చెరువు, దాని పరిధిలోన భూములను కాపాడాలి. – మునీందర్‌రెడ్డి, రైతు, తిమ్మాపూర్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం మోతె చెరువు పరిధి భూములను ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో జాయింట్‌గా సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటుచేస్తాం. ఎవరైనా ఆక్రమించినట్లుగా గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో, జగిత్యాల అర్బన్ -
జల కట్టడికి మిషన్-2
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరివాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను చెరువులకు మళ్లించి వాటికి జలకళను సంతరించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ తొలి విడత ప్రయోగం విజయవంతం కావడంతో ప్రభుత్వం రెండో విడత ‘మిషన్’ను ప్రారంభించింది. ఈ దఫాలో ప్రాజెక్టుల కాల్వల నుంచి, ఇతర వాగులు, వంకల నుంచి పారే నీటిని వృథాగా పోనివ్వకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసేలా చెక్‌డ్యామ్‌లు, కాల్వల నీళ్లు చెరువుల్లోకి మళ్లేలా తూముల నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్రక్రియను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నీటిపారుదల శాఖ ప్రారంభించనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణానికి ఆయా జిల్లాల్లోనే సాంకేతిక అనుమతులు మంజూరు చేసి, టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనిపై ఇప్పటికే చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 8,350 చెరువులు, 1,200 చెక్‌డ్యామ్‌లు తొలి విడత మిషన్ కాకతీయ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,531 చెరువుల్లో 27వేలకు పైగా చెరువులను పునరుద్ధరించారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, వాటికి అనుబంధంగా తూముల నిర్మాణం, వీలైనన్ని ఎక్కువ చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి పరివాహకంలో చిన్న నీటి వనరుల కింద కేటాయించిన 265 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడంతోపాటే రాష్ట్ర పరివా హకంలో కురిసే వర్షపు ప్రతి నీటిబొట్టు ఎక్కడికక్కడే నిల్వచేసి నీటి లభ్యత పెంచాలని సూచనలు చేశారు. దీని ద్వారా గరిష్ట ఆయకట్టు పారేలా చూడాలని సూచించారు. దీనికి అనుగుణంగా చెక్‌డ్యామ్, తూముల నిర్మాణానికి రూ.4,200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా.. ముందుగా ప్రాజెక్టుల పరివాహకం పరిధిలోని 8,350 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ గుర్తించిన చెరువుల్లోకి నీటిని మళ్లించేలా 3వేల తూముల నిర్మాణం చేయనున్నారు. ఈ తూముల నిర్మాణానికి రూ.410 కోట్లు మేర ఖర్చు చేయనున్నారు. ఇక కృష్ణా పరివాహకంలో 400, గోదావరి పరివాహకంలో 800 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రాంతాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వీటికి రూ.3,790 కోట్లు ఖర్చు చేయనున్నారు. చెక్‌డ్యాంలకు కనిష్టంగా రూ.3కోట్ల నంచి గరిష్టంగా రూ.8కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణాలకు ఒక్కోదానికి ప్రభుత్వ పరంగా పరిపాలనా అనుమతులు ఇస్తే తీవ్ర జాప్యం జరిగే అవకాశాల దృష్ట్యా, నేరుగా ఆయా పరిధిలోని ఇంజనీర్లే సాంకేతిక అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం జిల్లా ఇంజనీర్లే వీటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలను పరిశీలించి అనుమతులిస్తారు. ఆవెంటనే టెండర్లు పిలుస్తారు. వారం రోజుల్లోనే టెండర్లు ముగించి పనులు ఆరంభిస్తారు. తూముల నిర్మాణ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని నిబంధన పెట్టగా, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 9 నెలల గడువు విధించారు. ఇప్పటికే అంచనాలు సిధ్దమైన చోట్ల జిల్లాల వారీగా సోమవారం నుంచి టెండర్ల ప్రక్రియ ఆరంభం కానుంది. టెండర్ల ప్రక్రియ ముగించి ఈ నెల 20 నుంచి అన్నిచోట్లా పనులు మొదలవ్వాలని ఇప్పటికే ఇంజనీర్లకు ఆదేశాలు వెళ్లాయి. కాళేశ్వరం నీళ్లతోనే 3,011 చెరువులు ఈ ఖరీఫ్‌లోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయనున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే ప్రాజెక్టు కాల్వలను చెరువులకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కాళేశ్వరం కాల్వల పరిధిలో మొత్తంగా 3,011 చెరువులను గోదావరి నీటితో నింపేలా ప్రస్తుతానికి ప్రణాళిక వేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం కడెం కింద 62 చెరువులు, ఎస్సారెస్పీ సరస్వతి కెనాల్ కింద 38, సదర్మట్ బ్యారేజీ కింద 7, ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 396, స్టేజ్–2 కింద 182, దేవాదుల కింద 286, ఎస్సారెస్పీ కింద నేరుగా 1,200, ఎల్లంపల్లి కింద 124, మిడ్‌మానేరు పరిధిలో 12, వరద కాల్వల కింద 17, అప్పర్ మానేరు కింద 22, కాళేశ్వరం పరిధిలో ఇతర ప్యాకేజీల కింద 266, నిజాంసాగర్ కింద 399 చెరువులను నింపేలా ఇప్పటికే ప్రణాళిక సిధ్ధం చేశారు. ఈ చెరువుల్లో చేరే నీటి సామర్థ్యం సుమారుగా 37.37 టీఎంసీలుగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ చెరువుల కింద మొత్తంగా 2,89,038 ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వస్తుందని గుర్తించారు. ఈ చెరువులను నింపేలా ఎక్కడెక్కడ తూముల నిర్మాణం చేయాలన్నది ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పరిధిలో 278 చెరువులను నింపేందుకు కొత్తగా 201 తూముల నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు. ఈ తూమల నిర్మాణానికి 7.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. -
'లక్ష'మేవ జయతే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా ఉన్న నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగం లోకి తేవడం, సుమారు రూ.2లక్షల కోట్ల ఖర్చుతో.. 1.25కోట్ల ఎకరాలకు పైగా సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఓ యజ్ఞంలా సాగుతోంది. నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు.. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమికి సాగు యోగ్యత కల్పించడం లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతోంది. రాష్ట్ర పరీవాహకంలో లభించే ప్రతి నీటిచుక్కనూ పరీవాహక ఆయ కట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం.. వరదలు వచ్చినపుడు గరిష్టంగా వీలైనంత నీటిని ఒడిసిపట్టు కునేందుకు చేస్తున్న భగీరథ యజ్ఞంలో ఇప్పటికే కొత్తగా 16.65లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మరో 10లక్షల ఎకరాలను సాగులోకి తేనుంది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై లక్ష కోట్ల ఖర్చు చేయగా.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏకంగా రూ.70వేల కోట్ల ఖర్చు చేసి కొత్త రికార్డులు నెలకొల్పింది. మరో లక్ష కోట్లు ఖర్చు చేసైనా.. కోటికిపైగా ఎకరాలకు నీరిందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డు స్థాయిలో ఖర్చు.. రుణాలే కీలకం! మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సాగునీటిపై ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. ఐదేళ్లలో సాగునీటికై రూ.70వేల కోట్ల మేర ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.20,040కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతానికి రూ.21,489కోట్లు ఖర్చు చేశారు. ఇది మార్చి నాటికి రూ.23వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.13,107కోట్లు మేర ఖర్చు చేయగా, కార్పొరేషన్ రుణాల ద్వారానే రూ.9,013కోట్లు ఖర్చుచేశారు. ఈ ఏడాది ఏకంగా రూ.15వేల కోట్ల మేర ఖర్చు చేయగా, ఇందులో రుణాల ద్వారా రూ.12,739కోట్లు ఖర్చుచేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయగా, వీటి ద్వారా మరో రూ.2,800 కోట్లు ఖర్చు చేశారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం ఈసారి రూ.17వేల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే మొత్తంగా ప్రభుత్వం తీసుకునే రుణాలు రూ.70వేల కోట్లను చేరనున్నాయి. నిర్వహణకే తడిసి మోపెడు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ మున్ముందు కత్తిమీద సాము కానుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రానుంది. 2020–21 నుంచి 2024–25 వరకు రానున్న ఐదేళ్ల కాలానికి ఏకంగా విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి ఏకంగా రూ.40,170కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో విద్యుత్ అవసరాల ఖర్చే ఏకంగా రూ.37,796కోట్లు ఉండగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374కోట్లు ఉండనుంది. ఈ ఏడాదికే కొత్తగా 4,689 మెగావాట్ల విద్యుత్ అదనంగా అవసరంగా ఉండగా, ఇప్పటికే ఉన్న అవసరంతోకలిపి అది 6,099 మెగావాట్లకు చేరనుంది. మొత్తంగా 2021–22 నాటికి మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,722 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం అవుతుంది. ఆయకట్టు.. పనిపట్టు! ఇక రాష్ట్రంలో మొత్తంగా 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.65లక్షల ఎకరాలమేర సాగులోకి రాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78లక్షల ఎకరాలను సాగులోకి తేగలిగింది. మరో 54లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది జూన్ ఖరీఫ్ నాటికి కనిష్టంగా 12లక్షల ఎకరాలకైనా కొత్తగా నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న ఆయకట్టు లక్ష్యాలను చేరాలంటే భూసేకరణ అత్యంత కీలకంగా మారనుంది. ప్రాజెక్టుల పరిధిలో మరో 58వేలకు పైగా భూమి సేకరించాల్సి ఉండటం ప్రభుత్వానికి పరీక్ష పెడుతోంది. ‘కాకతీయ’కు నిధుల కరువు చిన్న నీటివనరుల పునరుద్ధరణకై చేపట్టిన మిషన్ కాకతీయ అనుకున్న లక్ష్యాలని చేరింది. మొత్తం 4 విడతల ద్వారా చేపట్టిన పనులతో 8టీఎంసీల నీటి నిల్వ పెరగడంతో పాటు 13.8లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అయితే 3,4వ విడత పనుల పూర్తికి 800 కోట్ల మేర బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ పనులు పూర్తి జరగడం లేదు. కాళేశ్వరా.. కదిలిరా! ఈ ఏడాదిలో రైతుల ఆశలన్నీ కాళేశ్వరం ద్వారా మళ్లించే గోదావరి జలాలపైనే ఉన్నాయి. ఖరీఫ్ నాటికి కనిష్టంగా 100 టీఎంసీల నీటిని ఆయకట్టుకు మళ్లిస్తారని రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించగా, ఇందులో ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తయ్యాయి. బ్యారేజీల్లో గేట్ల బిగింపు పూర్తవుతుండగా, పంప్‌హౌజ్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియలో వేగం పెరిగింది. ఎట్టిపరిస్థితుల్లో మార్చి, ఏప్రిల్ నాటికి మిడ్‌మానేరు వరకు పనులు పూర్తిచేసి కనిష్టంగా 90–100 టీఎంసీల నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇక మిడ్‌మానేరు కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్పనులు జరుగకున్నా, ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్ ఛానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడం ద్వారా 8–9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఏర్పడనుంది. -
చెరువులన్నీ కళకళలాడాలి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయతో కాకతీయుల నాటి చెరువులకు పునర్వైభవం రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. చెరువులన్నీ నిండి కళకళలాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి వారం రోజు ల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో మిషన్ కాకతీయ, చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, నీటి పారుదల ఈఎన్సీ మురళీధర్ రావు, కాడా కమిషన్ మల్సూర్, సీఈ శ్యాంసుందర్, కాడా డీడీ స్నేహ, రిటైర్డ్ ఈఎన్సీ విజయ్ ప్రకాశ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఫీడర్ చానల్స్ సిద్ధం చేయాలి... ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు తెలంగాణలో చిన్ననీటి వనరుల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండేది. కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు పండేవి. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగతా చెరువులకు నీరందేది. చెరువులకు నీళ్లు పారేందుకు కాలువలు ఉండేవి. జాలువారు నీళ్లతో చెరువులు నిండేవి. 1974లో నే అప్పటి బచావత్ అవార్డు ప్రకారం.. తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టీఎంసీల నీళ్ల కేటాయింపు ఉంది. ఈ చెరువులు నాశనమయ్యాయి. తెలంగాణ బతుకు నాశనం అయింది. పంటలకు నీరివ్వడానికి రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్లు వేసుకు న్నారు. అయినా పంటలు కూడా పండలేదు. వ్యవసాయం దెబ్బతిన్నది’అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకొచ్చాం. చెరువులను బాగు చేసుకున్నాం. ఆ చెరువులు నీటితో కళకళలాడితేనే ఈ పథకానికి సార్థకత. ప్రస్తుతం నిర్మి స్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్ల తో చెరువులు నింపాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల్లో 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరు అందిస్తే, దాని ద్వారా మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్ కెనాల్స్ సిద్ధం చేయాలి. ఒకప్పుడు జాలువారు ఉండేది. బోర్లు ఎక్కువ వేయడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఇప్పుడు జాలువారు లేదు. చెరువులు నిండితే, మళ్లీ భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్లీ జాలువారును చూడవచ్చు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు అందుతుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంజనీ రింగ్ అధికారులతో వర్క్ షాపు నిర్వహించి, దీని కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. చెరువులను పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రంలో చెరువుల్లో, చెక్ డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్క తీయాలని అధికారులకు సూచించారు. -
పాతాళం నుంచి పైపైకి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయి. పాతాళం నుంచి పైపైకి వచ్చాయి. ఆగస్టులో కురిసిన వర్షాలు భూగర్భజలానికి ఊపిరులూదాయి. గడచిన రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలు.. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పెరిగిన జల ప్రవాహాల కారణంగా పైపైకి వచ్చాయి. ఒక్క ఆగస్టులో కురిసిన వర్షాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.39 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో వర్షపునీరు సంతృప్తికరంగా భూమిలోకి ఇంకిందని భూగర్భ జలవనరుల విభాగం పేర్కొంటోంది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కాలంలో అరకొర వానలే పడటంతో తెలంగాణవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అంతేకాకుండా భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి పాతాళానికి చేరుకున్నాయి. గత ఏడాది ఆగస్టులో నీటిమట్టం 10.13 మీటర్లకు పడిపోయింది. భూగర్భ నీటి వినియోగం పెరడగడంతో ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 12.78 మీటర్ల గరిష్టానికి చేరింది. మొత్తం 44,706 చెరువులకుగానూ 15,800 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 200లకు పైగా చెరువులను నింపారు. జూరాల, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా చెరువులకు నీటిని విడుదల చేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పెరిగింది. గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర సరాసరి నీటిమట్టం 10.13 మీటర్లు ఉండగా అది ప్రస్తుతం 9.74 మీటర్లకు చేరింది. 0.39 మీటర్ల మేర భూగర్భజలం పెరగ్గా, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఏకంగా 3.04 మీటర్ల మేర భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. మేడ్చల్ జిల్లాలో గత ఏడాది ఆగస్టులో నీటి మట్టం 16.48 మీటర్ల లోతున మట్టం ఉండగా అది ప్రస్తుతం 12.71 మీటర్లుగా నమోదైంది. ఏకంగా 3.77 మీటర్ల మేర భూగర్భజలాలు మెరుగయ్యాయి. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ 3 మీటర్లకుపైగా భూగర్భమట్టం పెరిగింది. అయితే, మంచిర్యాల జిల్లాలో గత ఏడాది కంటే భిన్నంగా 3.80 మీటర్ల మేర నీటి మట్టం పడిపోగా, సిద్దిపేట, గద్వాల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోనూ భూగర్భమట్టాలు గత ఏడాది కంటే పడిపోయాయి. సరైన వర్షాలు లేని కారణంగా ఆయా జిల్లాల్లో భూగర్భ మట్టాల్లో పెరుగుదల లేదని భూగర్భ జల విభాగం వర్గాలు వెల్లడించాయి. -
కాకతీయ, భగీరథలతో వివక్ష దూరం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతాలు తాగునీటికి ఇబ్బందులు పడుతూనే ఉండేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథలతో ఈ పరిస్థితిలో మార్పు వస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు పథకాల వల్ల సాగునీటి సమర్థ నిర్వహణతోపాటు కుల, మత, లింగ వివక్షలు లేకుండా అన్ని ఇళ్లకు తాగునీటిని అందించడం సాధ్యమైందని అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ట్రయినింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)లో సోమవారం జరిగిన వర్క్‌షాప్‌నకు సీఎస్ ఎస్.కె.జోషి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీటి యాజమాన్య పద్ధతులు, లింగ వివక్ష లేమి అన్న అంశాలపై సాగునీటి ఇంజనీర్ల కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ.. నీటి యాజమాన్యం విషయంలో మహిళల హక్కులను కాపాడటం ఎంతైనా అవసరమని అన్నారు. ప్రతీ ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ పనులు చేపడుతున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువుల్లో పూడికతీసే బృహత్తర కార్యక్రమం చేపట్టామని వివరించారు. భవిష్యత్ అంతా నీటి మీదే ఆధారపడి ఉందని జెండర్, వాటర్ మేనేజ్మెంట్పై టెరీ, ఈపీటీఆర్ఐ కలసి పనిచేస్తాయని తెలిపారు. అనంతరం ఈపీటీఆర్ఐలో సీఎస్ మొక్కలు నాటారు. మహిళలకు ప్రాధాన్యం.. తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ‘ద ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రాజీవ్‌సేథ్ మాట్లాడుతూ.. నీటి యాజమాన్యం విషయంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించడం అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడో మొదలైందని, దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతోందన్నారు. తెలంగాణలో ఏర్పాటైన ఈ రెండు రోజుల వర్క్‌షాప్ ఆ దిశగా వేసిన తొలి అడుగు అని తెలిపారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ బి.కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ నీటి సమస్యల పరిష్కారానికి ఇంజనీర్లు వినూత్నమైన పరిష్కారాలను ఆవిష్కరించాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల వారినీ కలుపుకుపోవడం ద్వారా లింగ వివక్షను అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఈ డబ్ల్యూఆర్ఎం వార్మ్ చీఫ్ అకడమిక్ ఆఫీసర్ ఐయాన్ రీడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ నరేన్, ప్రొఫెసర్ సుచిత్రాసేన్, సోల్ ఫౌండర్ డాక్టర్ జస్వీన్ జైరత్, ఇరిగేషన్ అండ్ క్యాడ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
‘కాకతీయ’పై ఇక్రిశాట్ అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: ఐదు దశల ‘మిషన్ కాకతీయ’ ఫలితాలు, ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో నీటిపారుదల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలోని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో ఈ మేరకు శుక్రవారం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంత్రి హరీశ్ సమక్షంలో ప్రభుత్వం తరఫున కాడా కమిషనర్ మల్సూర్, ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిరణ్ శర్మ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద రెండేళ్ల పాటు మిషన్ కాకతీయ ఫలితాలు– వాటి ప్రభావంపై ఇక్రిశాట్ అధ్యయనం చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. చెరువు మట్టి ద్వారా రైతులు ఎలాంటి లాభాలు పొందారు, పంట దిగుబడి ఎంత పెరిగిందన్న అంశాలను ఈ అధ్యయనంలో పరిశీలించనున్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగిన ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు జరిగిన తీరును ఇక్రిశాట్ అధ్యయనం చేయనుంది. చెరువు మట్టి ద్వారా పంట దిగుబడి మాత్రమే కాకుండా రైతుకు ఆర్థికంగా చేకూర్చిన లాభాలను ఇక్రిశాట్ పరిశీలనలోకి తీసుకోనుంది. ఇక్రిశాట్‌తో ఒప్పందం సంతోషకరం ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలతో సాగునీటి శాఖ కలసి పని చేస్తోందన్నారు. ఇరిగేషన్ సమాచార వ్యవస్థను రూపొందించడానికి గతంలో ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నామని, వారు రూపొందించిన సమాచార వ్యవస్థ ఆధారంగా ప్రభుత్వం గొలుసు కట్టు చెరువులను మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తున్నామని అన్నారు. వర్షాభావ సంవత్సరాల్లో కూడా చెరువులను నింపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సమగ్ర అధ్యయనం అనంతరం సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నీహాల్ చదువుకు ఆర్థిక సాయం నీటిపారుదల శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన నీహాల్కు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సచివాయంలో రూ.35 వేల చెక్‌ను అందజేశారు. మాస్టర్ నీహాల్ను సాగునీటి శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి, ఆయన డిగ్రీ చదువు వరకు అయ్యే ఖర్చును సాగునీటి శాఖ భరిస్తుందని మంత్రి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘పెద్ద చెరువు’ను చూసి పిల్లనిచ్చేటోళ్లు
సాక్షి, హైదరాబాద్: పెళ్లీడొచ్చిన పోతారెడ్డిపేట పోరగాడుంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అటు వైపే మొగ్గు చూపేటోళ్లు. పోతారెడ్డిపేట రైతంటే షావుకార్లు తాకట్టు లేకుండా కాయితం మీదనే అప్పులిచ్చేటోళ్లు. ఎందుకంటే ఆ ఊరు వెనుక ఓ చెరువు ఉంది. ఆ చెరువును చూసి ఊరికి పిల్లనిచ్చేటోళ్లు. అప్పులిచ్చేటోళ్లు. అంత నమ్మకం ఆ చెరువంటే. ఒక్కసారి చెరువు నిండితే ఐదేళ్ల వరకు ముక్కారు పంటలకు ఢోకా ఉండదు. ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలు మోస్తూ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఊరు బతుకుదెరువంతా ఆ చెరువు మీదే. ఇదంతా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామంలో ఉన్న పెద్ద చెరువు గురించే. అయితే ఇదంతా గతం. ఏళ్లకేళ్ల నిర్లక్ష్యంతో చెరువు రూపం కోల్పోయింది. 25 ఏళ్లుగా చెరువు నిండక వరుస కరువుతో పల్లె అల్లాడింది. ఎండిన చెరువు నిండేలా మంత్రి హరీశ్‌రావు పునరుజ్జీవం పోశారు. ‘మిషన్ కాకతీయ’కింద రూ.3.79 కోట్లు ఖర్చు చేసి పూర్వ వైభవాన్ని తెచ్చారు. ఇప్పుడా చెరువు కళకళలాడుతోంది. ఒక్కసారి నిండితే.. సిద్దిపేట జిల్లాలోనే రెండో ‘పెద్ద చెరువు’. పోతారెడ్డిపేట గ్రామంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఫీడర్ చానల్ లేని ఏకైక చెరువు. చుట్టూత 12 గ్రామాల నుంచి దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో క్యాచ్‌మెంటు ఏరియా ఉంది. చెరువు పరిసర గ్రామాలైన పోతారెడ్డిపేట, తాళ్లపల్లి, నగరం, చిన్ననిజాంపేట, రామేశ్వరంపల్లి, మిరుదొడ్డి మండలం, మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని ఏ గ్రామంలో పెద్ద వర్షం కురిసినా.. నీళ్లు పెద్ద చెరువులోకే జారేవి. చెరువు కింద 862 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్కసారి చెరువు నిండితే ఐదేళ్ల వరకు భూగర్భ జలాలకు ఢోకా ఉండదు. సమీప గ్రామా ల్లోని బావులు, బోరు బావుల్లోకి నీళ్లు దిగుతాయి. ఒక్క చెరువు నీళ్ల మీద ఆధారపడి చుట్టూ గ్రామాల్లో 2,500 ఎకరాలకు పైగా పంట సాగయ్యేది. ‘ఉమ్మడి’ నిర్లక్ష్యం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. విశాలమైన చెరువు క్యాచ్‌మెంటు ఏరియాను కబ్జాదారులు చెరబట్టారు. నీటి ప్రవాహపు దారులన్నీ మూసుకునిపోవటంతో చెరువు జలకళ కోల్పోయింది. 1989 తర్వాత చెరువు ఒక్కసారి కూడా నిండలేదు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత పెద్ద చెరువుకు మళ్లీ జలకళ వచ్చింది. మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం పెద్ద చెరువు పునరుద్ధరణ కోసం రూ.3.79 కోట్లు ఖర్చు చేస్తోంది. చెరువులో పూడిక తీశారు. క్యాచ్‌మెంటు ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఫీడర్ చానల్ నిర్మాణం చేసి కల్వకుంట చిన్న వాగుతో అనుసంధానం చేస్తున్నారు. చెరువు పునరుద్ధరణ పనులను రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. క్యాచ్మెంట్ ఏరియా పునరుద్ధరణతో గతేడాది చెరువు నిండి మత్తడి పోసింది. పొలాలు పచ్చబడ్డాయి. చెరువు నిండితేనే.. పెండ్లీడొచ్చిన యువకులకు బయటి గ్రామాల నుంచి ఆడ పిల్లలను ఇవ్వాలంటే ముందు పెద్ద చెరువు నిండిందా లేదా అని అడిగేటోళ్లు. చెరువు నిండితే కనీసం ఐదేళ్ల వరకు కరువు, కాటకాలు ఉండవని వేరే గ్రామాల ప్రజలకు నమ్మకం. – పేరుడి దయాకర్‌రెడ్డి, రైతు, పోతారెడ్డిపేట 2,500 ఎకరాలకు నీళ్లు ఫీడర్ చానల్ లేని ఏకైక చెరువు ఇది. ఇప్పుడు ఫీడర్ చానల్ కడుతున్నాం. దాన్ని చిన్నవాగుతో అనుసంధానం చేసి మల్లన్న సాగర్ కాల్వలకు కలిపి వర్షంతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లతో నింపే ప్రయత్నం జరుగుతుంది. దసరాకు చెరువు కింద 2,500 ఎకరాలను సాగులోకి తెస్తాం. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే -
స్వయంపాలనతో స్వర్ణయుగం
2014, జూన్ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన సాగిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తున్నారు. ఈ నాలుగేళ్లలో అందరి మన్ననలు అందుకున్నారు. అందుకే ఇప్పుడు యావత్ భారతదేశం తెలంగాణవైపు చూస్తోంది. స్వయం పాలనతో స్వర్ణయుగం / ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో / ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగెనో / శరవెట్టినట్టి 60 ఏళ్ల బలిమి ఓడెనో / కల నిజమాయెనని నేల తనను తడుముకున్నదో / వేరువడ్డ తెలంగాణ పేరు మోగగా / ఎగసిపారే గోదావరి మురిపెమంపెనో / తనువార నీళ్లనిస్తనని అభయమొసగెనో / అణువణువున తరుమడుల సిరులు దొర్లనున్నయో /పరుగూల రాణి కృష్ణవేణి దారి మళ్లగా / కరువన్నదింక నిఘంటువుల దాగనున్నదో / ఐదేండ్లలో అటుఇటై ఇడుములొచ్చినా / పదేండ్లలో జపానోలే ప్రగతి విరుయునో.... ఇదీ ప్రజాకవి గోరటి వెంకన్న స్వరాష్ట్రంలో స్వయం పాలనపై రాసిన పాట. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికీ ఓ కథ ఉంటుంది. కానీ కొన్నింటికి మాత్రమే చరిత్రలో స్థానం దక్కుతుంది. దశాబ్దాల తరబడి పరాయిపాలనలో మగ్గి, శాంతియుత ఉద్యమంతో స్వరాష్ట్రాన్ని సాధించుకుని, అద్భుతరీతిలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ కథ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగినది. సవాళ్లను ఎదుర్కొంటూ, అవాంతరాలను అధిగమిస్తూ ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్తున్న ఆయన పాలనలో తమమార్కు చూపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 2014 జూన్ 2. తెలంగాణ చరిత్రలో మైలు రాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోసపడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి... నేటి రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి కాబోతోంది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలకు కొదవ లేదు. వాటి గురించి రాస్తే రామాయణం చెబితే భారతం. పాలకుల శీతకన్ను తెలంగాణకు శాపంగా మారింది. వ్యవసాయం కుంటుపడింది. రైతులు కూలీలయ్యారు. కూలీలు రోడ్డున పడ్డారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టిన ఈ 4 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 6 దశాబ్దాల సమైక్య పాలనలో అభివృద్ధి అందనంత దూరంలో నిలిచిన తెలంగాణ నాలుగేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్రం విడిపోతే తెలం గాణ అంధకారమవుతుంది. నీళ్లు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించిన వారి నోళ్లు మూయించింది. చిమ్మ చీకట్లు అలముకున్న దుస్థితి నుంచి నాలుగేళ్లలో వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. విద్యుత్ లోటుతో అల్లాడుతున్న రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది. ఇప్పుడు కరెంటు కోతలు లేవు. పవర్ హాలిడేలను నిరసిస్తూ పారిశ్రామికవేత్తల ఆందోళనలు లేవు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. పరాయి పాలనలో బీడువారిన భూములకు కృష్ణా, గోదావరి నీళ్లు పారించేందుకు కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారు. ఆ నదుల్లో తెలంగాణ వాటా 1330 టీఎంసీల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం, ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్‌లో ఎస్సారెస్పీకి నీళ్లు తరలించే బృహత్తర కార్యక్రమంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో నదీజలాల పంపిణీ విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాలు– కేరళ, తమిళనాడు మధ్య ముళ్ల పెరియార్ డ్యాం వివాదాలే ఇందుకు ఉదాహరణ. అయితే గోదావరి జలాల విషయంలో కేసీఆర్ చూపిన చొరవతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య చారిత్రక ఒప్పందం సాధ్యమైంది. ఈ మహా ఒప్పందం కేసీఆర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. దేశంలో ఇతరులకు ఆదర్శం. నీటి పారుదల శాఖకు ప్రతి సంవత్సరం దాదాపు 25వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వ తపనను ప్రపంచం గమనిస్తోంది. మిషన్ కాకతీయ పేరుతో 46 వేల చెరువుల్లో పూడికతీసే బృహత్తర కార్యాన్ని నాలుగు దశల్లో అమలుచేస్తోంది. చెరువులకు జీవం పోసే ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ పథకాన్ని నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థితో పాటు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ ప్రశంసించారు. వ్యవసాయం దండగ కాదు పండగలా మార్చాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ సర్కారు రైతు సంక్షేమమే థ్యేయంగా పనిచేస్తోంది. దాదాపు 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేసింది. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన కరెంటును అందిస్తోంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తోంది. దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించింది. మద్దతు ధర కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసించని పథకానికి శ్రీకారం చుట్టింది. రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏటా 12 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ పథకం ద్వారా 58 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో బృహత్తర పథకాన్ని అమలుచేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి ప్రతి రైతుకు 5 లక్షల రూ‘‘ల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పిం చారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న ఈ కార్యక్రమాలను చూసి దేశం అబ్బురపడుతోంది. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే కాదు కిసాన్ చంద్రశేఖర్ రావు అని యావత్ దేశం కీర్తిస్తోంది. 42,300 కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచినీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావించిన సర్కారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించేందుకు సమాయత్తమైంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను ప్రధానమంత్రి, నీతి ఆయోగ్, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల అధికారులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సమాజంలో 91 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు– కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, భూపంపిణీ, ఆసరా పెన్షన్లు, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్సీ–ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి చట్టం, రిజర్వేషన్ల పెంపుకై అసెంబ్లీ తీర్మానం, హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు (125 అడుగులు), గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, నవీన క్షౌరశాలలు, చేనేతలకు చేయూత లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ పాడుకున్న జనం ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల ఫలితంగా సర్కారు దవాఖానాల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోంది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందిస్తుండటంతో భ్రూణహత్యలు తగ్గాయి. జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, ఐసీయూలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగేళ్లలో కొత్తగా 577 రెసిడెన్షియల్ పాఠశాలు ప్రారంభించిన ఘనత కేసీఆర్ సొంతం. ఆనాడు ఒక విద్యార్థిపై సం‘‘నికి 20వేలు ఖర్చు చేస్తే ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున అధికార వికేంద్రీకరణ జరగాలని కొత్తగా 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఏర్పాటు చేసి ప్రజల చెంతకు పాలన తీసుకుపోయింది. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సహకారంతో భూరికార్డుల ప్రక్షాళన సహా అనేక రకాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తోంది. విశ్వనగరంగా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా పలువురు పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. శాంతి భద్రతలు, సులభతరమైన అనుమతులు, వాతావరణ పరిస్థితులు, అవినీతిరహిత పారదర్శక పాలన కారణంగా సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తుండటంతో పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. బడా కంపెనీలు సైతం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్ ఇమేజ్ పెరగడంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో అనేక ప్రపంచస్థాయి సదస్సులకు హైదరాబాద్ వేదిక కావడంలో అద్భుతమైన విజన్, డెడికేషన్, కమిట్మెంట్ ఉన్న మంత్రి కేటీఆర్ పాత్ర ప్రశంసనీయం. నాలుగేళ్ల పాలనలో అందరి మన్ననలు అందుకునే రీతిలో పాలన సాగిస్తున్నారు సీఎం కేసీఆర్. అందుకే దేశంలో నంబర్‌వన్ సీఎం ఎవరంటే ఆయన పేరే వినిపిస్తోంది. ఉద్యమనేతగా.. రాజకీయవేత్తగా.. పలు అంశాలపై పట్టున్న మేధావిగా... సమస్యలకు పరిష్కారం చూపే దార్శనికుడిగా కేసీఆర్ సేవలు అనన్యసామాన్యం. కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రానికి తొలి సీఎంగా ఎన్నికైన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలతో బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆయన చేస్తున్న ప్రయత్నం అమూల్యం. దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధితో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్న కేసీఆర్ అంతర్జాతీయ యువనికపై తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. స్వరాష్ట్రంలో స్వర్ణయుగానికి బాటలు పరుస్తున్నారు. నిజంగా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ విప్లవం నడుస్తోంది. దేశవ్యాప్తంగా కేసీఆర్ విప్లవం అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తే భారతదేశ స్వరూపమే మారిపోతుంది. దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంది. బాల్క సుమన్, వ్యాసకర్త పార్లమెంట్ సభ్యులు, పెద్దపల్లి, (జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా) -
వలసలు ఆగినయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ ప్రజోద్యమంగా సాగిందని.. దాని ద్వారా హరిత తెలంగాణ సాధ్యమైందని నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకురాగలిగామని, రైతుల ఆదాయాన్ని పెంచగలిగామని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో ‘మిషన్ కాకతీయ’అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 2017 ఏడాదికి సంబంధించి మిషన్ కాకతీయపై ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు మంత్రి హరీశ్‌రావు అవార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయపై సానుకూలంగా రాసిన కథనాలకే కాకుండా, తప్పులు ఎత్తి చూపుతూ రాసిన వార్తలనూ పరిగణనలోకి తీసుకుని అవార్డులు ప్రకటించినట్టు చెప్పారు. పారదర్శకంగా మిషన్ కాకతీయ పనులు జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదనంగా పది లక్షల ఎకరాలకు నీరు.. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల కాలం నాటి చెరువులకు జల కళ వచ్చిందని, పక్షుల కిలకిలలతో చెరువులు చూడచక్కగా ఉన్నాయని, చెరువుల పునరుజ్జీవం ద్వారా రైతుల ఉత్పాదకత పెరిగిందని, వలసలు తగ్గాయని.. ఇలా ఎన్నో కథనాలు వెలువడటంపై హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ వంటి జిల్లాల నుంచి వలస వెళ్లినవారు తిరిగి వెనక్కి వస్తుండటం మిషన్ కాకతీయ విజయానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘మిషన్ కాకతీయ’ద్వారా మూడేళ్లలో 12 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని, పదిలక్షల ఆయకట్టుకు అదనంగా నీళ్లిచ్చామని చెప్పారు. ఇప్పటివరకు 18 వేల చెరువులను పునరుద్ధరించామని, ఈ ఏడాది ఐదో విడత పనులు చేపడతామన్నారు. కోటి ఎకరాల లక్ష్యంలో భాగస్వాములు కండి నీటి పారుదలశాఖలో కొత్తగా ఎంపికైన 298 మంది ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు ఈ కార్యక్రమంలోనే మంత్రి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. విధుల్లోకి వచ్చిన ఇంజనీర్లలో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వారు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్ద పనిచేస్తామని కోరడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమయ్యేందుకు అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘సాక్షి’ జర్నలిస్టులకు అవార్డులు ‘సాక్షి’పత్రిక, టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా మిషన్ కాకతీయ అవార్డులు అందుకున్నారు. సంగారెడ్డి జిల్లా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్‌గా ఉన్న కల్వల మల్లికార్జునరెడ్డికి ప్రింట్ మీడియా విభాగంలో, హైదరాబాద్ బ్యూరోలో సీనియర్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న కొత్తకాపు విక్రమ్‌రెడ్డికి ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో అవార్డు వచ్చింది. పురస్కారం కింద ప్రత్యేక మెమెంటో, రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. -
మిషన్ కాకతీయ: సాక్షికి మీడియాకు రెండు అవార్డులు
-
ఆయకట్టుకు ఆయువు!
సాక్షి, హైదరాబాద్: చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది. చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి లభ్యత పెరగడంతో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయంలో గణనీయ పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. సాగునీరు అందని 63 శాతం గ్యాప్ ఆయకట్టుకు చెరువుల ద్వారా నీటి లభ్యత పెరిగిందని, ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు నీటి సంరక్షణ కోసం చేపడుతున్న పథకాలను సమీక్షించిన నీతి ఆయోగ్.. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల పథకాలను పేర్కొంటూ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల్లో మిషన్ కాకతీయ ఒకటని కీర్తించింది. గత రబీలో 16 లక్షల ఎకరాలకు నీళ్లు 2017 ఆగస్టులో రాష్ట్రంలో పలు చెరువులను పరిశీలించిన అనంతరం తాము గుర్తించిన అంశాలను నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. పూడికతీత వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగిందని, తద్వారా సాగును ప్రోత్సహించినట్లయిందని తెలిపింది. భూమిలో నీటి సాంద్రత పెరిగిందని, మెజార్టీ ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని వెల్లడించింది. చిన్న నీటి వనరుల కింద 265 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఎన్నడూ 10 లక్షల ఎకరాలకు మించి అందిందిలేదు. అయితే చెరువుల పునరుద్ధరణ తర్వాత గత రబీలో ఏకంగా 16 లక్షల ఎకరాల ఆయకట్టు చెరువుల కింద పంట సాగైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాప్ ఆయకట్టులో 63 శాతం ఆయకట్టుకు మిషన్ కాకతీయ నీరందించగలిగిందని నీతి ఆయోగ్ తెలిపింది. గణనీయంగా పెరిగిన దిగుబడి రైతులు పూడిక మట్టిని తమ పొలాల్లో వినియోగించుకోవడంతో ప్రధానంగా రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గిందని, పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఎండిన బోరు బావులకు కాకతీయ ప్రాణం పోసిందని, చెరువుల ఆయకట్టు కింద 17 శాతం ఎండిన బావులు, బోరు బావులు పునరుజ్జీవం పొందాయని తెలిపింది. చేపల ఉత్పత్తి 62 శాతం పెరిగిందని వెల్లడించింది. గతంలో మిషన్ కాకతీయ చెరువులపై అధ్యయనం చేసిన నాబ్కాన్స్ సంస్థ కూడా పూడిక మట్టితో రసాయన ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గిందని, రైతుకు ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గిందని తన అధ్యయనంలో తేల్చిందని చిన్న నీటి పారుదల వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ పరిశీలనలో అవే వెల్లడయ్యాయని చెప్పాయి. పంటల దిగుబడి పరంగా చూసినా, వరి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల మేర పెరిగాయని తెలిపాయి. -
‘సప్త సముద్రాలకు’ పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: ఆకలి చావులు.. వలసలకు నిలయం.. సాగుకు నీళ్లు లేక గోసటిల్లిన నేల. పసిపిల్లలను, పండుటాకులను వదిలేసి ఎందరో వలసలు పోగా పల్లెలు పడావు పడిన ప్రాంతం. తరతరాలుగా కరువు కాళనాగై పగబట్టినట్టు వెంటబడి తరుముతుంటే సాగు చేయలేక, జోడెద్దులను సాకలేక కబేళాలకు అమ్ముకున్న రైతన్నల కన్నీళ్లతో నిండిన నేల పాలమూరు జిల్లా. ఇప్పుడు అదే బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వాగులు.. వంకలు.. గొలుసుకట్టు చెరువులు.. పాడుబడ్డ కుంటలు.. సకల జల స్థావరాలను నింపుతూ నెర్రెలు బాసిన భూముల్లో జీవం నింపుతోంది. పాడుబడిన పాలమూరు జిల్లా మిషన్ కాకతీయ తొలి ఫలాలతో పచ్చని పంట చేనుగా మారింది. 45 వేల ఎకరాలు.. 60 గ్రామాలు గొలుసుకట్టు చెరువులు అంటే మొదటగా గుర్తొచ్చేది వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే సప్త సముద్రాలు. రంగ సముద్రం, రాయ సముద్రం, కృష్ణ సముద్రం, వీర సముద్రం, గోపాల సముద్రం, మహభూపాల సముద్రం, శంకరమ్మ సముద్రం.. సప్త సముద్రాలుగా పేరెన్నికగన్నాయి. వనపర్తిని కేం ద్రంగా చేసుకుని పరిపాలనను సాగించిన నాటి రాజులు వీటిని నిర్మించారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ చెరువులకు గతంలో ఆదరణ కరువైంది. పాడుబడిన పాలమూరులో నీళ్లు పారిస్తామని ఉద్య మ సమయంలోనే హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే మిషన్ కాకతీయ కింద సప్త సముద్రాలను మరమ్మతు చేయించారు. 45 వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు. తొలుత బీమా ఎత్తిపోతల నుంచి నీళ్లను తోడి కొత్తకోట మండలంలోని కానాయిపల్లిలో 160 ఏళ్ల కిందట రాణీ శంకరమ్మ పాలనలో నిర్మించిన శంకర సముద్రాన్ని నింపారు. అటు నుంచి కృష్ణ సముద్రానికి, తర్వాత పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్‌లోని రంగ సముద్రంలోకి నీళ్లు మళ్లాయి. తర్వాత కొత్తకోట మండలం రాయణిపేట వద్ద వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన రాయ సముద్రాన్ని నింపారు. అటు నుంచి వనపర్తి రాజు రాజారామేశ్వరరావు వంశీయులు నిర్మించిన మహభూపాల సముద్రం చెరువును.. తర్వాత పెబ్బేరు మండలంలోని వీర సముద్రం చెరువు, పెద్దమందడి మండలంలోని గోపాల సముద్రం చెరువును నింపి 45 వేల ఎకరాలకు సాగునీరుతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. గూటికి చేరిన వలస పక్షులు వనపర్తి జిల్లా వలసలకు నిలయం. భూమిని పడావు పెట్టి ఊరు ఊరంతా వలస వెళ్లటం అక్కడ సర్వ సాధారణం. మిషన్ కాకతీయ, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో ఇప్పుడీ గ్రామాలకు నీళ్లు వచ్చాయి. ఊళ్లలోనే పని దొరుకుతుండటంతో వలసపోయిన కుటుంబాలు తిరిగి వచ్చాయి. సాగు పనుల్లో నిమగ్నమయ్యాయి. 30 ఏళ్లుగా బోసినట్లు కన్పించిన ఖానాపురం ఇప్పుడు పల్లె రూపం సంతరించుకుంది. వలస పోయేటోన్ని శంకర సముద్రం నిండింది. మూడు పంటలకు నీరు పుష్కలంగా అందుతోంది. గతంలో ఏడాదిలో 10 నెలలు వలస పోయేటోన్ని. ఇప్పుడు ఊరిలోనే పొలం పనులు చేసుకుం టున్నాం. – నారాయణ, శ్రీరంగాపురం కళ్లెదుటే సుందర స్వప్నం ఉమ్మడి రాష్ట్రంలో ‘సప్త సముద్రాలు’ ఉనికి కోల్పోయాయి. వీటిని పునరుద్ధరిస్తే వనపర్తి జిల్లాలో కరువును రూపుమాపొచ్చని కేసీఆర్ నాతో చెప్పారు. రికార్డు సమయంలో మరమ్మతు పూర్తి చేశాం. ఇప్పుడు ఈ సుందర స్వప్నం ఆవిష్కృతమైంది. రైతన్నల మోముల్లో చిరునవ్వు ఆనందం కలిగిస్తోంది. – మంత్రి హరీశ్‌రావు -
అక్కర్లేని చెరువులకూ తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ అమలులో లోపాలున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఎత్తిచూపింది. తొలి రెండుదశల్లో ప్రాధాన్యంలేని చెరువులను కూడా చేపట్టారని ఆక్షేపించింది. ప్రాధాన్య చెరువుల జాబితాలో మినీ ట్యాంక్బండ్లు లేకున్నా వాటికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.31 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. మినీ ట్యాంక్‌బండ్‌లను ఆహ్లాదం కోసం చేపట్టినందున వాటిని ప్రాధాన్యం గల పనులుగా పరిగణించలేమని పేర్కొంది. గురువారం ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికల్లో మిషన్ కాకతీయ తప్పిదాలు వెలుగు చూశాయి. గతంలో కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద 186 చెరువులు, ట్రిపుల్ కింద మరో 116 చెరువులను చేపట్టగా, వాటినే తిరిగి మిషన్ కాకతీయలోనూ రూ.120.41 కోట్లతో చేపట్టారని పేర్కొంది. గత పథకాల్లో పూడికతీయనంత మాత్రాన ఈ పనులు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని, గత పథకాల్లో కొన్ని అంశాలు లేనందున మళ్లీ చేపట్టేందుకు మార్గదర్శకాలు అనుమతించవని తెలిపింది. 27 చెరువుల పూడికతీత పనులు తనిఖీ చేయగా, అంచనా వేసిన పరిమాణం కన్నా తక్కువగా పనులు జరిగాయని వెల్లడించింది. 27 చెరువుల పనుల్లో 12.01 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాలని అంచనా వేసి కేవలం 8.08 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీశారని పేర్కొంది. పూడికతీత తగ్గుదల కారణంగా ఆశించిన విధంగా చెరువుల నిల్వ సామర్థ్యం పునరుద్ధరించబడినట్లు ధ్రువీకరించలేమని స్పష్టం చేసింది. వ్యవసాయ భూములకు పనికి రానందునే పూడికమట్టిని తీసుకెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపలేదన్న ప్రభుత్వ సమాధానం అంగీకారం కాదని స్పష్టం చేసింది. మిషన్ కాకతీయలో 10 లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టును తిరిగి సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే పనుల అంచనాల్లో ఎక్కడా గ్యాప్ ఆయకట్టు వివరాలు లేవని తెలిపింది. మెదక్, వికారాబాద్‌లో రెండో దశలో 100 % ఆయకట్టును సాధించామని ప్రకటించారని, అయితే అక్కడ 936 చెరువులకుగానూ 446 చెరువుల పనులు మాత్రమే పూర్తి అయ్యాయని కాగ్ నివేదిక తెలిపింది. -
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం
ఆత్మకూరు(పరకాల) : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరిస్తున్న చెరువుపనులతోపాటు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఏప్రిల్ 15 నాటికి ఇంటింటికీ గోదావరి జలాలు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఆత్మకూరు మండలంలో 98శాతం భూప్రక్షాళన పూర్తయిందని, త్వరలోనే ఈపాస్బుక్కులు అందించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. అర్హులందరికీ డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా ఉన్నామని పేర్కొన్నారు. గత పాలకులు అవినీతికి పాల్పడి సొంత పార్టీల వారికే లబ్ధిచేకూర్చారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపు మల్లికార్జున్, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ నర్మద, టీఆర్ఎస్ నాయకులు కానుగంటి సంపత్‌కుమార్, కేశవరెడ్డి, జాకీర్‌అలీ, మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ, ఎన్కతాల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటా... మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల భిక్షపతి, వార్డుసభ్యుడు నరహరి, ఎస్ఎంసీ చైర్మన్ వేణుతోపాటు పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషిచేయాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ మండలకేంద్రంలో తెలంగాణ జానపద కళాకారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తున్నదని చెప్పారు. కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోల్కొండ వెంకన్న, గౌరవ సలహదారుడు బుచ్చిరెడ్డి, భిక్షపతి, కుమార్, రమేష్ పాల్గొన్నారు. -
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కృషి
మోటకొండూర్ (ఆలేరు) : తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని అమ్మనబోలులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. కేసీఆర్ ముందుచూపుతో మిషన్ కాకతీయ, భగీరథ, పెట్టుబడి సాయం, సాగునీటి ప్రాజెక్ట్‌లు, మహిళా సంక్షేమ పథకాలు, పలు పథకాలతో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. అంతకు ముందు గ్రామపంచాయతీ, మహిళా భవనం ప్రారంభం, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి 30మంది టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ క్యాసగల్ల అనసూయ, జెడ్పీటీసీ బొట్ల పరమేష్, ఎంపీడీఓ చిలుకూరి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్, ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాయిని రాంచంద్రారెడ్డి, గ్రామసర్పంచ్ శీల స్వరూపయాదయ్య, ఉపసర్పంచ్ కృష్టయ్య, ఎంపీటీసీ ఆనంద్, సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, రమేష్, భాస్కర్, నరహరి, బాలయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సాగునీరు అందేదెట్టా..?
కారేపల్లి : కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్లుంది.. కోటిలింగాల చెక్‌డ్యాం ఆయకట్టు రైతుల పరిస్థితి. మిషన్ కాకతీయ పనులతో చెక్‌డ్యాంకు మరమ్మతులు చేస్తున్నారని, వాగులో ఉన్న పూడికను తొలగిస్తున్నారని ఆనందపడాలో.. లేక ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వేసుకున్న పొలాలు, మిర్చి తోటలు ఎండిపోతాయని బాధపడాలో.. అర్థం కాని పరిస్థితుల్లో ఆయకట్టు రైతులు ఉండిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పేరుపల్లి, ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న బుగ్గవాగుపై కోటిలింగాల దేవాలయం వద్ద చెక్‌డ్యాంను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం ఆయకట్టులో సుమారు 100 ఎకరాల్లో బుగ్గవాగు నీటిని వినియోగించుకుంటున్నారు. మిర్చి తోటలు, వరి పంట లను సాగు చేస్తున్నారు. పేరుపల్లి రైతులతోపాటు, జమాళ్లపల్లి, పోలంపల్లి, దుబ్బతండా, మోకాళ్లవారి గుంపు, పోలంపల్లి గేటుతండా గ్రామాలకు చెందిన సుమారు 45 మంది రైతులు.. బుగ్గవాగులో నీరు సంవృద్ధిగా ఉండటంతో ఈ ఏడాది రబీలో వరి సాగు చేస్తున్నారు. అయితే మిషన్ కాకతీయలో చెక్‌డ్యాం మరమ్మలకు రూ.37.44లక్షలు మంజూరు అయ్యాయి. ఇదిలా ఉండగా మరమ్మతులు చేపట్టాలంటే.. బుగ్గవాగులో నీటిని తొలగించాల్సి ఉంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చెక్‌డ్యాం వద్ద తూమ్ గేట్లను పగలకొట్టి బుగ్గవాగు నీళ్లను ఖాళీ చేస్తున్నారని ఆయకట్టు రైతులు ధరావత్ గోపాల్, వర్స రామయ్య, మాలోతు శంకర్, గుగులోతు బాల, వాంకుడోతు హర్జ్య, ఈసం ఎర్రయ్య చెబుతున్నారు. డీజిల్ ఇంజన్లతో పంటలకు కాపాడుకుంటున్నామని, వాగు నీళ్లను ఖాళీ చేస్తే తీవ్రంగా నష్ట పోతామంటున్నారు. దీనికి అధికారులే ప్రత్యామ్నాయం చూపాలని, లేదంటే పైర్లు నాశనం అవుతాయని మొరపెట్టుకుంటున్నారు. పంటలు ఎండిపోక తప్పదు.. మరమ్మతుల పేరుతో బుగ్గవాగు నీళ్లు ఖాళీ చేస్తే పంటలు ఎండిపోక తప్పదు. మా కుటుంబం వీధిన పడుతుంది. నాకున్న 3 ఎకరాల్లో వరి పంట, ఎకరంలో మిర్చి సాగు చేశా. వీటికి బుగ్గవాగు నీళ్లే దిక్కు. పెద్ద సార్లు ఆలోచించి పైర్లు ఎండిపోకుండా చూడాలి. – ధరావత్ గోపాల్, పోలంపల్లి -
చెరువు పనుల్లో.. చిలక్కొట్టుడు
మిషన్ కాకతీయ.. చెరువులను పునరుద్ధరించే గొప్ప పథకం. ప్రతి వర్షపు చుక్క నీటిని నిల్వ చేసుకోవడం.. రైతుల మోములో ఆనందం నింపడం దీని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల అవినీతి, బాధ్యతా రాహిత్యంతో మిషన్ కాకతీయ అభాసుపాలవుతోంది. చాలా చోట్ల చెరువులు ఆక్రమణలకు గురైనా అధికారులు రికార్డుల్లో ఉన్న పూర్తి విస్తీర్ణానికి టెండర్లు పిలుస్తున్నారు. అలా కొద్దిమొత్తంలో పనులకే ఎక్కువ సొమ్ము ముట్టజెబుతున్నారు.. దీనికితోడు సగం సగం పనులే చేసినా.. నాసిరకంగా చేసినా కూడా మొత్తం బిల్లు మంజూరు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పుచ్చుకుంటున్నారు. మరోవైపు పలు చోట్ల చేసిన పనులకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదు. అలాంటి చోట్ల కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. అప్పులు తెచ్చి పనులు చేసినా బిల్లులు రావడం లేదంటూ వాపోతున్నారు. మొత్తంగా చెరువుల పునరుద్ధరణ లక్ష్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయలో క్షేత్రస్థాయి పరిస్థితిపై ఈ వారం ‘ఫోకస్’.. – సాక్షి నెట్వర్క్ నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీరు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘మిషన్ కాకతీయ’పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 45 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించి.. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఒక్కో విడతలో సుమారు 9 వేల చెరువుల చొప్పున ఎంపిక చేస్తూ.. పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రభుత్వ లక్ష్యం ఇంత ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికే చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కానీ రికార్డుల్లో మాత్రం పూర్తి విస్తీర్ణం నమోదై ఉంది. అయితే అధికారులు ఇలా ఆక్రమణలకు గురైన మేర భూమి విస్తీర్ణాన్ని తగ్గించకుండా... పూర్తి విస్తీర్ణాన్ని లెక్కించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. దీంతో కాంట్రాక్టర్లు కొంతమేరకే పనులు చేశారు. అధికారులు వారితో కుమ్మక్కై పూర్తి మొత్తానికి బిల్లులు మంజూరు చేశారు. ఇక ఉన్నమేరౖనా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకపోయినా, నాసిరకంగా చేసినా కూడా పట్టించుకోలేదు. దీంతో చాలా చోట్ల చెరువుల తూములకు గండ్లు పడ్డాయి. కట్ట, మత్తడి దెబ్బతిన్నాయి. కాలువలు కనిపించకుండానే పోయాయి. మరోవైపు బిల్లుల జాప్యం.. రెండు, మూడు విడతల పనుల్లో కేవలం కట్టను చదును చేయడం, మట్టిని నేర్పడం, తూముల మరమ్మతు వంటి పనులు మాత్రమే జరిగాయి. కొన్నిచోట్ల మొదటి విడతలో మంజూరైన పనులే ఇప్పటివరకు పూర్తికాకపోవడం గమనార్హం. పలుచోట్ల చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులను నిలిపివేశారు. బిల్లుల చెల్లింపుల జాప్యంతో ఈసారి పాత కాంట్రాక్టర్లలో చాలా వరకు నాలుగో దశకు టెండర్ వేయలేదు కూడా. వాస్తవానికి నిధుల సమస్య కారణంగానే నాలుగో విడతలో ప్రతిపాదించిన చెరువుల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుల పాలవుతున్నామంటున్న కాంట్రాక్టర్లు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పోమాల్‌పల్లి–కొండారెడ్డిపల్లి గ్రామశివారులో ఉన్న పెద్ద చెరువు 68 ఎకరాల్లో ఉంది. కాంట్రాక్టర్ రూ.14.25 లక్షలకు ఈ చెరువు పునరుద్ధరణ పనులు దక్కించుకున్నారు. ఏడాది క్రితమే పనులు పూర్తిచేసినా.. ఇప్పటివరకు రూ.6 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారు. అప్పులు చేసి పనులు పూర్తి చేశానని, బిల్లులు చెల్లించక నానా అవస్థలు పడుతున్నానని కాంట్రాక్టర్ వాపోతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని నాయిని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసే పనులు చేస్తున్న కాంట్రాక్టర్దీ ఇదే తరహా పరిస్థితి. రూ.2.4 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పనుల్లో రూ. కోటికిపైగా విలువైన పనులు పూర్తయినా.. కాంట్రాక్టర్‌కు ఇప్పటివరకు రూ.30 వేల మేర మాత్రమే బిల్లులు చేతికందినట్లు చెబుతున్నారు. ఈ రెండు చోట్ల మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కూడా పనులు పూర్తయినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బిల్లు రాదు పని కాదు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ చెరువును మిషన్ కాకతీయ మూడో దశలో ఎంపిక చేశారు. 16 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు పునరుద్ధరణకు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్ చెరువు కట్టకు మాత్రమే మరమ్మతు పనులు చేశారు. ఇందుకోసం రెండెకరాల్లో మాత్రమే మట్టిని తీశారు. చెరువు తూము, మత్తడి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. రెండు కాలువల్లో ఒక కాలువ మాత్రమే చేపట్టారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా.. చేసిన పనులకు సంబంధించి గతేడాది సెప్టెంబర్ 18న రూ.7 లక్షల బిల్లు పెట్టినప్పటికీ ఇప్పటికీ సొమ్ము రాలేదని, దాంతో పనులు నిలిపేశామని చెప్పారు. చిన్న నీటి పారుదల శాఖ జేఈ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా.. బిల్లులు విడుదల కాలేదని, మంజూరైన వెంటనే పనులను పునః ప్రారంభింపజేస్తామని తెలిపారు. పనులు చేయకపోయినా బిల్లులు.. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ శివారులోని రాయిని చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు. ఈ చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.62 లక్షలు మంజూరు చేసింది. మొత్తం చెరువులో పూడికతీయాల్సి ఉండగా.. కేవలం చెరువు కట్టకు అవసరమైన మేర మాత్రమే మట్టి తవ్వారు. సుమారు 20 శాతం పనులే పూర్తయినా.. 60 శాతం పనులు పూర్తయినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఇక కాంట్రాక్టర్ చెరువు తూములను నాసిరకంగా నిర్మించడంతో గ్రామ రైతులు పలుమార్లు ఆందోళన చేశారు. గతేడాది అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. లేని భూమికి టెండర్లు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరులోని రామయ్య చెరువు 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. మిషన్ కాకతీయ రెండో విడతలో ఈ చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.40.5 లక్షల అంచనాతో టెండర్లు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్ 22 శాతం తక్కువ (లెస్)కు ఈ పనులను దక్కించుకున్నారు. అయితే చెరువులో సుమారు పదెకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. ఈ మేరకు విస్తీర్ణం, టెండర్ ధరను తగ్గించాల్సి ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. దీంతో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరింది. పనుల్లో తొండి.. తూముకు గండి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం కొల్లంపల్లిలోని గౌని చెరువును మిషన్ కాకతీయ తొలి విడతలో పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రికార్డుల ప్రకారం చెరువు విస్తీర్ణం 81.18 ఎకరాలు. కానీ అందులో 21 ఎకరాలకుపైగా ఆక్రమణలకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. కానీ మొత్తం విస్తీర్ణాన్ని లెక్కించి.. రూ.35 లక్షలకు పనులు అప్పగించారు. ఇక కాంట్రాక్టర్ ఏదో పైపైన పనులే చేశారు. తూము, కట్ట నిర్మాణం నాసిరకంగా చేశారు. ముళ్ల పొదలను కూడా తొలగించలేదు. ఈ అరకొర పనులకు కూడా అధికారులతో కుమ్మక్కై రూ.10 లక్షలు బిల్లు తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది కురిసిన కొద్దిపాటి వర్షాలకే తూముకు గండిపడింది. ఆయకట్టు రైతులంతా కలసి ఆ తూమును మూసివేశారు. ఇక చెరువంతా ముళ్ల చెట్లతో నిండిపోయింది. ఇక ఉపాధి హామీ పథకం కింద మరో రూ.24 లక్షలు వెచ్చించి చెరువులో ఒండ్రు మట్టి తవ్వకాలు చేపట్టారు. అయినా చెరువు పూడికతీత పూర్తి కాలేదు. మొరం పోసి.. కానిచ్చేశారు..! జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మిషన్ కాకతీయ తొలివిడతలో ఈ చెరువును పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రూ.1.33 కోట్లకు కాంట్రాక్టుకు ఇచ్చారు. పూడికతీతతోపాటు తూముల నిర్మాణం, పంట కాలువ పనులు, మత్తడి నిర్మాణం చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేసి, బిల్లు తీసేసుకున్నారు. తూముల నిర్మాణం, చెరువుకట్ట, పంట కాల్వల పనుల్లో నాణ్యత లేదని రైతులు మొత్తుకుంటున్నారు. రాయికల్ నుంచి చెర్లకొండాపూర్కు వెళ్లే ప్రజలు ఈ చెరువు మత్తడిపై నుంచే ప్రయాణిస్తారు. ఈ మేరకు మత్తడిని పటిష్టం చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ గతంలో ఉన్న మత్తడిపైనే కాస్త మొరం పోసి వదిలేశారు. -
కాళేశ్వరం భేష్!
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. కోటి ఎకరాల సాగు దిశలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్య క్రమాలు, చేపట్టిన పథకాలపై 19 దేశాల ప్రతినిధులు నీటిపారుదల శాఖను అభినందనలతో ముంచెత్తారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తిచేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఇథియోపియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, బ్రూనై, అల్జీరియా, మాల్దీవులు, మారిషస్ వంటి 19 దేశాలకు చెందిన ప్రతినిధులు 4 వారాల పర్యటన నిమిత్తం శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) విదేశీ ప్రతినిధుల పర్యటనను సమన్వయపరచగా, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి శనివారం ఇక్కడ జలసౌధలో వారికి సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గొలుసుకట్టు చెరువులతో పాటు మొత్తం చిన్న నీటి వనరులను పరిరక్షించేందుకు, వాటి పునరుద్ధరణకుగానూ మిషన్ కాకతీయ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని, దీని ద్వారా 46వేల చెరువులను దశలవారీగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు ఈ పథకం విజయవంతానికి ప్రతివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని, నిరంతర పర్యవేక్షణతో సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు. చెరువు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతుతో పాటు, ఆ చెరువును నమ్ముకున్న రజక, బెస్త, ముదిరాజులకు జీవన భృతి దొరుకుతోందని వివరించారు. ఈ ప్రజెంటేషన్ పట్ల విదేశీ ప్రతినిధులంతా నివ్వెరపోయారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇరిగేషన్లో సాధించిన ప్రగతి అద్భుతమని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు, రైతుల జీవితాన్ని మార్చబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విదేశీ ప్రతినిధులకు జోషి వివరించినప్పుడు ఆయా ప్రతినిధులు విస్తుబోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాడుతున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను తెలుసుకుని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, ఇతర రంగాల వారికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు వంటి అంశాలపై ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. -
ఆ రాష్ట్రాలకు చేయూతనివ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు నిదర్శనంగా, సహకార సమాఖ్య స్ఫూర్తికి అద్దంపట్టేలా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఈటల అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు రూ.40 వేల కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రూ.85 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోందని పేర్కొన్నారు. భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించడమే కాకుండా ఈ పథకానికి రూ.19,205 కోట్ల నిధులు ఇవ్వాలని, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకానికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరామని చెప్పారు. గొప్ప ఆవిష్కరణలతో పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలకు సహకారం ఇచ్చేలా కేంద్రం బడ్జెట్ రూపొందించాలని సూచించారు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐరన్ ఓర్ పరిశ్రమ, గిరిజన, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణకు ప్రకటించిన ఎయిమ్స్‌కు నిధులు, వ్యవసాయ పెట్టుబడి పథకానికి నిధులివ్వాలని కోరామని వివరించారు. డ్రిప్ ఇరిగేషన్‌పై పన్ను తగ్గింపు.. జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశంలో వివిధ వస్తువులపై పన్ను తగ్గింపునకు ఫిట్మెంట్ కమిటీ అంగీకరించింది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న డ్రిప్ ఇరిగేషన్‌పై గతంలో విధించిన 18 శాతం పన్నును 12 శాతానికి తగ్గించింది. బీడీలపై పన్ను తగ్గింపును మాత్రం ఫిట్మెంట్ కమిటీ పట్టించుకోలేదు. ఈవే బిల్లుల విషయంలో పాత విధానాన్ని అమలు చేసుకొనే అధికారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు కోరాయని ఈటల తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదు నెలలు పూర్తయిన నేపథ్యంలో పేద ప్రజలకు భారంగా పరిణమించిన వివిధ వస్తువులపై పన్ను స్లాబ్‌లను పున:సమీక్షించాలని కోరినట్లు చెప్పారు. పన్ను ఎగవేతలకు ఆస్కారం ఇవ్వకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని, అందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సూచించామన్నారు. ఇక తెలంగాణకు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్)లో కేంద్రం సభ్యత్వం ఇచ్చింది. అది కామన్‌సెన్స్‌కు సంబంధించిన విషయం.. హైదరాబాద్‌లో పన్ను చెల్లిస్తున్న 40 శాతం మంది ఆంధ్రా ప్రజలే అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఈటలను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందింస్తూ.. ‘అమెరికాలో ఉన్న వారు అమెరికాలో పన్ను చెల్లిస్తారు. ఢిల్లీలో ఉన్న వారు ఢిల్లీలో కడతారు. హైదరాబాద్‌లో ఉన్న వారు హైదరాబాద్‌లోనే చెల్లిస్తారు. ఆయన వ్యాఖ్యలు కామన్ సెన్స్‌కు సంబంధించినవి. అంత ఉన్నత వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై మనం ఏం మాట్లాడతాం’అని వ్యాఖ్యానించారు. -
కాస్త తగ్గినా.. రబీ ఆశలు సజీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న నీటి వనరులుగా ఉన్న చెరువుల కింద సాగు విస్తీర్ణం గత ఏడాది రబీతో పోలిస్తే కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రబీలో గత ఏడాది చెరువుల కింద సాగు 7.25 లక్షల ఎకరాలు దాటగా, ఈ ఏడాది 5.16 లక్షల ఎకరాల వరకు ఉండనుంది. మిషన్ కాకతీయ కింద మూడు విడతల్లో 22,895 చెరువులను పునరుద్ధరించినా, లోటు వర్షపాతం కారణంగా చెరువుల్లో నీరు చేరకపోవడం ఆయకట్టును ప్రభావితం చేయనుంది. పదేళ్లతో పోలిస్తే.. ఆశాజనకమే.. రాష్ట్రంలో మొత్తంగా 46,531 చెరువులు ఉండగా, వాటి కింద 24,39,515 ఎకరాల మేర సాగు విస్తీర్ణం ఉంది. కృష్ణా, గోదావరిలో కలిపి 255 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరగకపోవడంతో గరిష్టంగా 10 లక్షలకు మించి ఆయకట్టుకు నీరందించిన సందర్భాలు లేవు. 2008–09 ఏడాది నుంచి ప్రస్తుతం వరకు ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా చూస్తే గరిష్టంగా 2013–14 ఖరీఫ్‌లో 9,04,752 ఎకరాల్లో సాగు జరిగింది. గత సంవత్సరం కంటే ముందు 2008–09లో గరిష్టంగా 2.38 లక్షల ఎకరాల్గో రబీ సాగు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది 2016–17లో విస్తారంగా వర్షాలు కురవడం, చెరువుల పునరుద్ధరణ రబీ సాగుకు ఊపిరి పోసింది. దీంతో గత ఏడాది రబీలో గరిష్టంగా 7.25 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈ ఏడాది మొత్తం చెరువుల్లో 14,418 చెరువుల్లో 25శాతం కన్నా తక్కువగా నిండగా, మరో 9,289 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు మాత్రమే నిండాయి. రంగారెడ్డి జిల్లాలో 2,019 చెరువులు ఉండగా ఏకంగా 1,635 చెరువులు నీటి కరువు ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలోనూ 1,185 చెరువులకు గానూ 1,070 చెరువుల్లో నీరు చేరలేదు. కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి పెద్దగా నీరు చేరని కారణంగా కూడా చెరువులను నింపడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ మూడు విడతల్లో పునరుద్ధరించాలని తలపెట్టిన 22,895 చెరువుల్లో ప్రస్తుతం వరకు 15,649 చెరువుల పనులు పూర్తి కావడంతో వర్షాలు మెరుగ్గా ఉన్న చోట్ల నీటి లభ్యత కొంత పెరిగింది. దీంతో ఈ ఏడాది 5,16,097 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఆయకట్టు తగ్గినా.. పదేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ప్రస్తుతం చెరువుల ద్వారా సాగయ్యే ఆయకట్టు గణనీయంగా ఉండటం ఆయకట్టు ఆశలను సజీవం చేస్తోంది. -
కాంట్రాక్టు పనుల్లో ‘కంగాళీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేప డుతోన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీ య, గృహాలు, ప్రాజెక్టుల నిర్మా ణం తది తర కాంట్రాక్టు పనులకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వర్తింపజేసే విధానంలో గందరగోళం నెలకొంది. ఈ కాంట్రాక్టు పనులపై తొలుత 18 % జీఎస్టీ విధించగా, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు దానిని 12 శాతానికి తగ్గించారు. అయినా 12% జీఎ స్టీ కూడా భారం అవుతోందనే ఆలోచన తో దాన్ని 5 శాతానికి తగ్గించాలని కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేసే అన్ని కాంట్రాక్టు పనులకు, మట్టిపని 60 శాతానికి మించి ఉండే ప్రైవేటు వర్కులకు మాత్రమే 5% వర్తింపజేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. అయితే ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఇంతవరకు విడుదల చేయకపోవడం గందరగోళానికి కారణమవుతోంది. అడ్వాన్సులిచ్చేస్తున్నారు ఇంతవరకు కేంద్రం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు 5 శాతం జీఎస్టీని కలిపి బిల్లులు చెల్లిస్తోంది. కాంట్రాక్టర్లపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నోటిఫికేష న్ రాకపోవడంతో తమకు 12 శాతం అడ్వాన్సులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కో రుతున్నారని సమాచారం. లేదంటే తొలు త నిర్ణయించిన విధంగా 10 శాతమైనా చెల్లించాలని ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీఎ స్టీని కలుపుకుని అడ్వాన్సులు తీసుకుం టున్న కాంట్రాక్టర్లు ఆ మేరకు జీఎస్టీ చెల్లింపులు చేయడం లేదని, ప్రతి నెలా చెల్లించాల్సిన దాంట్లో జీఎస్టీ చూపించ కుండా, చివరి బిల్లు వరకు వాయిదా వేస్తున్నారని పన్నుల శాఖ అధికారులంటు న్నారు. ఓవైపు పన్ను భారం పడకుండా ముందే ప్రభుత్వం నుంచి అడ్వాన్సులు తీసుకోవడం, మరోవైపు చివరి వరకు పన్ను చెల్లించకుండా వాయిదా వేయడం ద్వారా వందల కోట్ల రూపాయలను మా ర్కెట్లో కాంట్రాక్టర్లు చలామణి చేస్తూండ టం గమనార్హం. మరోవైపు మొత్తం పనులపై జీఎస్టీ 12 శాతమైనా, 5 శాతౖ మెనా, ఆ పనులకు వినియోగించే ముడి సరుకులపై మాత్రం 18 నుంచి 28 శాతం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కూడా తీసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్లకు లభిస్తోందని పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. మొత్తం పనులపై 5% జీఎస్టీ చెల్లించి, ఐటీసీ 18 నుంచి 28 శాతానికి తీసుకుంటే ప్రభుత్వమే కాంట్రా క్టర్లకు అదనంగా బిల్లులు చెల్లించాల్సి వ స్తుందని, దీనివల్ల వందల కోట్ల రూపాయల భారం పడుతుందని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఏదీ తేలకుండా, పన్ను కట్టకుండా ఉంటే చివర్లో ఈ కాంట్రాక్టు పనులకు జీఎస్టీ లెక్కలు తేల్చడం కూడా తమకు తలకు మించిన భారమవుతుందంటున్నారు. -
మిషన్ కాకతీయ’పై కథనాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జన జీవనంపై ‘మిషన్ కాకతీయ’ప్రభావంపై కథనాలు పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే కోరారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచురితమైన, ప్రసారమైన కథనాలు ఎంట్రీలుగా స్వీకరిస్తామని బుధవారం తెలిపారు. వచ్చే జనవరి 31 వరకు పంపొచ్చన్నారు. పంటల దిగుబడులు, రసాయనిక ఎరువుల వాడకం, వలసలు, చెరువుల చరిత్రపై పరిశోధన, విశ్లేషణ, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఉపాధి కల్పన, ఫ్లోరోసిస్ నివారణ, భూగర్భజలాలు, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు, సాంస్కృతిక విధానం వికాసం అంశాలపై పంపాలని తెలిపారు. వీటిని సచివాలయం ‘డి’బ్లాక్‌లోని ఓఎస్డీ కార్యాలయంలో ఇవ్వొచ్చని.. లేదంటే శ్రీధర్‌రావు దేశ్ పాండే, ఓఎస్డీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డి బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, సెక్రటేరియట్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపాలని సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో మూడేసి చొప్పున బహుమతులు ఉంటాయని, మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో బహుమతి కింద రూ.75 వేలు, మూడో బహుమతి కింద రూ.50 వేలు అందజేస్తారని తెలిపారు. ‘భగీరథ’ ఆలస్యంపై ఈఎన్సీ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మిషన్ భగీరథ పనులను సమీక్షించారు. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆర్డబ్ల్యూఎస్ విభాగం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విశ్వసనీయతకు భంగం కలిగించే ఏ వర్క్ ఏజెన్సీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఓ వైపు డిసెంబర్ 31 వస్తున్నా కాంట్రాక్టర్లు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పైప్‌లైన్ గ్యాప్‌లను పూడ్చడం ద్వారా చాలా గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయవచ్చని, ఆ చిన్న పనులను కూడా ఏజెన్సీలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. డిసెంబర్ 31 నాటికి గ్రామాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఏజెన్సీలు తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కోదండపూర్ డబ్ల్యూటీపీలో ఎలక్ట్రో మెకానికల్ పనులు చేస్తున్న ఏజెన్సీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మిషన్ కాకతీయ అనుమతుల ప్రక్రియ వేగం
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయ కింద చేపట్టదలచుకున్న చెరువుల అనుమతులు, పునరుద్ధరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఒకేసారి 149 చెరువుల పునరుద్ధరణకు రూ.45 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మరో 10 కొత్త చెరువుల నిర్మాణానికి గాను రూ.15.59 కోట్లు మంజూరు చేసింది. ఈ కొత్త చెరువుల్లో సంగారెడ్డి జిల్లాలోనే 8 ఉండగా వాటికి రూ.13 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 2 కొత్త చెరువుల నిర్మాణానికి రూ.2.59 కోట్లు కేటాయించింది. ఇక పునరుద్ధరణకు సంబంధించి నిర్మల్, మంచిర్యాల జిల్లాలో 18 చెరువులకు రూ. 5.4 కోట్లు, ఖమ్మం జిల్లాలో 11 చెరువులకు రూ.2.18 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 చెరువులకు రూ.4.82 కోట్లు, మహబూబాబాద్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చెరువుల పునరుద్ధరణకు రూ.5.3 కోట్ల మేర ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులకు సత్వరమే టెండర్లు పిలిచి పనుల్ని ఆరంభించాలని నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఓ ప్రకటనలతో అధికారులను కోరారు. -
5,703 చెరువుల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయ కింద 5,703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ పనులకు గాను ఈ నెలాఖరులోగా పరిపాలనాపరమైన అనుమతి పొందాలని.. జనవరి నుంచి పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్లో హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగో విడత పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సంబంధిత సాగునీటి వనరుల ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని హరీశ్ ఆదేశించారు. పాలనా అనుమతులు లభించిన పనులకు సాంకేతిక అనుమతులిచ్చి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలన్నారు. మిషన్ కాకతీయ నాలుగోదశ టైం లైన్లను విధిగా పాటించాలని స్పష్టంచేశారు. ఈ నెల 15కల్లా పాలనాపరమైన అనుమతి కోసం అంచనాలు పంపి.. నెలాఖరు వరకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయ రెండు, మూడు దశలలో ప్రారంభించి పూర్తికాకుండా మిగిలిపోయిన చెరువులను కూడా పూర్తిచేసి తుది బిల్లులు చెల్లించాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని హెచ్చరించారు. పునరుద్ధరించే చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందున పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలన్నారు. పూడికతీత మట్టిపై అవగాహన కల్పించాలి గతంలో రాష్ట్రంలో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందని హరీశ్ అన్నారు. పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామపంచాయతీల ఎదుట పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలని కోరారు. వ్యవసాయ, ఇరిగేషన్శాఖల కింది స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ కాకతీయ నాలుగోదశ పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను సహకారం తీసుకోవాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ కింద 147 చెరువుల పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం రూ.162 కోట్లు మంజూరు చేసిందని.. ఈ పనులను సైతం వెంటనే ప్రారంభించాలని హరీశ్ ఆదేశించారు. దేశానికే ఆదర్శంగా పంచాయతీరాజ్ చట్టం-మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఉం డాలని, ఆ దిశగా పకడ్బందీగా చట్టానికి రూపకల్పన జరపాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్ట రూపకల్పనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు తుది దశకు చేరిన సందర్భంగా మంగళ వారం జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చట్టంలో పొందుపర్చేందుకు సిద్ధం చేసిన పలు అంశాలపై కూలంకశంగా చర్చించి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా, తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేలా చట్టం ఉండాలన్నారు. -
సాగునీరు పుష్కలం..ఆయకట్టు సస్యశ్యామలం
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలసముద్రం చెరువు ఆయకట్టు విస్తీర్ణం 600 ఎకరాలు. మూడేళ్ల నుంచి చెరువులో నీరు లేక ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులలో భాగంగా చెరువు ఆధునికీకరణకు రూ.5 కోట్లు మంజూరు చేసింది. శరవేగంగా పనులు చేపట్టడంతో చాలా వరకు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండింది. దీంతో ఆయకట్టు రైతులు వరినాట్లు వేశారు. వరి పంట కోతకు వచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండా తూటికాడ, నాచు, పేరుకుపోయిన పూడిక.. చెరువులో నీరు నిల్వక.. ఆయకట్టు భూములకు నీరందక.. పంటలు చేతికొచ్చేవి కావు. ఈ క్రమంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువును ఆధునికీకరించారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి పంటలకు పుష్కలంగా నీరందుతోంది. రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. శాశ్వత పనులతో రైతుకు ప్రయోజనం బాలసముద్రం చెరువు అభివృద్ధి పనులతో రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కట్టను బలోపేతం చేశారు. మిషన్ కాకతీయతో అలుగుకు శాశ్వత మరమ్మతులు చేపట్టంతో చుక్క నీరు కూడా వృథాగా పోవడంలేదు. జలకళతో చెరువు నిండు కుండలా కనిపిస్తోంది. రెండు పంటలకు సాగునీరు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆయకట్టు పరిధి మొత్తం వరిసాగు చేశారు. -
చెరువు నవ్వింది
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితాలు తొలి దశలోనే అందాయి. నీటి వనరులు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయం పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. మిషన్ కాకతీయ తొలి దశలో పునరుద్ధరించిన చెరువుల పరిధిలో.. సాగు, పంటల విస్తీర్ణం, దిగుబడి, రసాయన ఎరువుల వినియోగం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై నాబార్డ్ పరిధిలోని ‘నాబ్కాన్’ సంస్థ అధ్యయనం చేసింది. 42 పేజీల నివేదికను రూపొందించింది. మిషన్ కాకతీయతో విప్లవాత్మక మార్పు వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఇది ఎంతగానో దోహదపడినట్టు అధ్యయనంలో తేలింది. రసాయన ఎరువుల వినియోగం కూడా తగ్గినట్టు నాబ్కాన్ వెల్లడించింది. ఆదివారమిక్కడ జలసౌధలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తమ నివేదికను విడుదల చేసింది. అనంతరం ఈ అధ్యయనం తీరుపై ‘నాబ్కాన్’ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధ్యయనం ఇలా.. మిషన్ కాకతీయ మొదటి దశ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అధ్యయనం చేశారు. చెరువుల కింద ఆయకట్టు రైతు కుటుంబాలు, వారితో చర్చలు, ఉపగ్రహ చిత్రాల పరిశీలన, విశ్లేషణ, కొన్ని చెరువులపై కేస్‌స్టడీ ఇతరత్రా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా మిషన్ కాకతీయ ప్రభావాలపై మదింపు చేశారు. మిషన్ కాకతీయకు ముందు 2013–14లో పరిస్థితులు, కాకతీయ అమలు తర్వాత 2016–17 ఏడాదిలో ఉన్న పరిస్థితులను పోల్చుతూ ఈ అధ్యయనం సాగింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో 400 చెరువుల పరిధిలోని 12 వేల కుటుంబాలను సర్వే కోసం ఎంపిక చేసి అధ్యయనం చేశారు. సర్వే కోసం ఎంపిక చేసిన అన్ని జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, ఆశాజనకంగా లేకపోవడంతో ఖరీఫ్ పంట దెబ్బతింది. దీని ప్రభావం ముఖ్యంగా మెదక్, నల్లగొండ జిల్లాపై అధికంగా ఉన్నట్లు తేలింది. పెరిగిన సాగు విస్తీర్ణం.. 2016 ఖరీఫ్‌లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోయినా.. మిషన్ కాకతీయ కారణంగా పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5% సాగు విస్తీర్ణం పెరిగింది. 2016 సెప్టెంబర్ మూడో వారంలో కురిసిన వర్షాలకు చెరువులు నిండటంతో రబీ విస్తీర్ణం ఎక్కువగా నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 10.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఖరీఫ్, రబీ కలిపి సాగు విస్తీర్ణంలో పెరుగుదలను చూస్తే.. కరీంనగర్లో అత్యధికంగా 62.5%, అతి ఎక్కువగా నల్లగొండలో 22.5% నమోదైంది. 2013–14 గ్యాప్ ఆయకట్టు 42.4 శాతంగా ఉండగా, 2016–17లో అది 23.2 శాతానికి తగ్గింది. నీటి వనరుల లభ్యత పెరగడంతో 2013తో పోలిస్తే 2016 ఖరీఫ్‌లో వరి సాగు 11.1 శాతం పెరిగింది. రబీ నాటికి అది 23.7 శాతానికి చేరింది. వరి దిగుబడిపరంగా చూస్తే ఖరీఫ్‌లో 4.4 శాతం, రబీలో 19.6 శాతం అధికంగా వచ్చింది. ఆదాయం పెరిగింది.. సర్వే కోసం ఎంపిక చేసిన ఆయకట్టు రైతు కుటుంబాల్లో 8.5% పూడిక మట్టిని తమ చెలకల్లో, పొలాల్లో చల్లుకున్నారు. పూడిక మట్టి వాడటంతో రైతులకు ప్రధానంగా రసాయనిక, పురుగు మందుల కొనుగోలు ఖర్చు తగ్గింది. పంట దిగుబడి ద్వారా ఆదాయం పెరిగింది. పూడిక మట్టితో రసాయనిక ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గింది. రైతుకు రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గింది. పంటల దిగుబడిపరంగా చూస్తే.. వరి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు పెరిగింది. చెరువు ఆయకట్టు పరిధిలోని కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం పెరగ్గా.. వ్యవసాయ ఆదాయం 47.4 శాతం పెరిగింది. బోరు బావులకు పునరుజ్జీవం ఎండిపోయిన బోరుబావులకు మిషన్ కాకతీయ ప్రాణం పోసింది. చెరువుల ఆయకట్టు కింద.. 17 శాతం ఎండిపోయిన బావులు, బోరు బావులు పునర్జీవం పొందాయి. ఆయకట్టు బయట కూడా ఇలాంటి బావులు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. భూగర్భ జల మట్టాల్లో సరాసరి పెరుగుదల 2013–14లో 6.91 మీటర్లు ఉంటే.. 2016–17లో అది 9.02 మీటర్లకు పెరిగింది. చెరువుల్లో చేపల ఉత్పత్తి 2013–14తో పోలిస్తే 2016–17లో 36 నుంచి 39 శాతానికి పెరిగింది. మారిన చెరువుల రూపురేఖలు మిషన్ కాకతీయ అమలుకు ముందు 63% మంది చెరువులు బాగా లేవని చెప్పారు. మరో 3 శాతం మంది చెరువుల పరిస్థితి దారుణంగా ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ మొదటి దశ తర్వాత 46.7 శాతం మంది చెరువులు చాలా బాగున్నాయన్నారు. 38 శాతం చెరువులు బాగు పడ్డాయని ,11.2 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. 4.1 శాతం మంది చెరువులు బాగా లేవని అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ అమలు తర్వాత చెరువుల నిర్వహణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. చెరువుల బలోపేతం విషయంలోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. 2016–17 సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా చెరువులు తెగిపోవడం వంటి ఘటనలు గణనీయంగా తగ్గాయి. భారీ వర్షాలకు 2009లో 1,107, 2010లో 4,251, 2013లో 1,868, చెరువులు దెబ్బతినగా... 2016లో 571 మాత్రమే దెబ్బతిన్నాయి. మిషన్ కాకతీయలో చెరువు కట్టలను బలోపేతం చేసినందు వల్లే ఇది సాధ్యమైందని నాబ్కాన్ తెలిపింది. చెరువుల పరిరక్షణ చట్టం తెస్తాం: మంత్రి హరీశ్‌రావు మిషన్ కాకతీయకు ప్రజల మద్దతు లభించింది. వారి మన్ననలు పొందింది. ప్రజా ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రభుత్వం ఆశించిన మేర మొదటి దశ చెరువుల ఫలితాలొచ్చాయి. మున్ముందు రెండు, మూడో దశ ఫలితాలపైనా అధ్యయనం చేయిస్తాం. ఆయా సంస్థలు ఇచ్చిన సూచనలు, సలహాలు తీసుకొని మిషన్ కాకతీయను మరింత సమర్థంగా చేపడతాం. చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. చట్టం రూపకల్పన బాధ్యతను నల్సార్ యూనివర్సిటీకి అప్పగించాం. -
కమీషన్ల కాకతీయగా మార్చేశారు
తలకొండపల్లి(కల్వకుర్తి): మిషన్ కాకతీయ.. కమీషన్ల కాకతీయగా మారిందని, కల్వకుర్తి ప్రాజెక్టు వలన ప్రజలకు ఒరిగిందేమీలేదని, నల్లగొండకు నీళ్లు, కల్వకుర్తికి కన్నీళ్లే మిగిలాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ధ్వజమెత్తారు. మంగళవారం మండల పరిధిలోని చంద్రధనలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారించేందుకు మలిదశ ఉద్యమం చేపడతామన్నారు. లక్ష్మీదేవి రిజర్వాయర్ పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కనీసం రైతు కుటుంబాలను పరామర్శించలేదు ఇటీవల కురిసిన భారీ వర్షానికి నిండిన చెరువులు, తెగిన కుంటలను ఆచారి పరిశీలించారు. నల్లచెరువుతో పాటు, తెగిన గొల్లకుంట, మోత్కుకుంట, సాయిరెడ్డికుంట, మోదోనికుంట, పెద్దకుంటలను ఆచారి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం కనీసం వారిని పలుకరించిన పాపాన పోలేదని.. పైగా ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు రైతులే కాదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ. 790 కోట్లు అందజేస్తే నయాపైపా కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. సకాలంలో బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట పొలాలకు సాగునీరందించేందుకు రూపొందించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం చెరువులు నింపే పథకంగా మార్చిందని ఎద్దేవా చేశారు. 1993లో ఎడ్లబండి ద్వారా ఉద్యమాలు చేపట్టామని.. అదేవిధంగా జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు సాగునీరు పారించేందుకు మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన చెప్పారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తయితే కల్వకుర్తి, చేవెళ్ల, షాద్‌నగర్, పరిగి మండలాలకు సాగునీరు వచ్చే అవకాశముందని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టుల పనులు చేట్టలేదని దుయ్యబట్టారు. లక్ష్మీదేవి ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపాదికన చేపట్టి ఈ ప్రాంత రైతంగానికి మేలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, సూర్యనాయక్, రమేష్, మహేష్, హరికృష్ణ, శ్రీకాంత్, చంటి, తిరుపతి, రాజు, శ్రీశైలం, ఉదయ్, శేఖర్, నర్సింహగౌడ్, మనోహర్, హరికాంత్, తదితరులు పాల్గొన్నారు. -
రెండు దసరాలు పాయె..‘డబుల్’ ఇళ్లు పూర్తి కాలేదాయె..
-
రెండు దసరాలు పాయె..
సాక్షి, హైదరాబాద్: రెండు దసరా పండుగలు దాటినా డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో గృహ ప్రవేశాల బాజాలు మోగడం లేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సహా ఇతర పథకాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నా.. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేదు. ఇసుకను ఉచి తంగా.. సిమెంటు, స్టీల్‌ను తక్కువ ధరలకే ప్రభుత్వం ఇస్తున్నా ముందుకు రావట్లేదు. యూనిట్ కాస్ట్– నిర్మాణ వ్యయం మధ్య పెద్దగా తేడా లేక పనులు గిట్టుబాటు కావని వెనుకంజ వేస్తుండటంతో డబుల్ బెడ్రూం పనులు శంకుస్థాపన దశలోనే ఉన్నాయి. 2015లో అన్ని జిల్లాల్లో ఒకేసారి.. 2015 దసరా నాడు అన్ని జిల్లాల్లో ఒకేసారి డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల యినా 18 జిల్లాల్లో ఇప్పటికీ ఒక్క ఇంటి గృహ ప్రవే శం జరగలేదు. కొందరు మంత్రులు కాంట్రాక్టర్లతో సమావేశమై వారిని ఒప్పించేందుకు చేస్తున్న యత్నా లు ఫలిస్తుండటంతో ఆ జిల్లాల్లో పనులు జరుగు తున్నాయి. మిగతా చోట్ల మాత్రం ఎక్కడ వేసిన గొం గళి అక్కడే అన్న చందంగా ఉంది. ‘డబుల్’ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ తాజాగా సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. మెరుగైన పనితీరు, సాధారణ పురోగతి, తక్కువ పురోగతి కేటగిరీలుగా జిల్లాలను విభజించి నివేదిక రూపొందించింది. అనుమతులు ఇచ్చిన, టెండర్లు ఫైనల్ చేసిన ఇళ్ల సంఖ్యను ప్రాతిపదికగా చేసుకుని పనితీరును మదించింది. జీహెచ్ఎంసీలో 40,362 ఇళ్ల పనులు మొదలు తాజా నివేదికలో సిద్దిపేట జిల్లా తొలి స్థానంలో, జీహెచ్ఎంసీ రెండో స్థానంలో ఉన్నాయి. సిద్దిపేటకు ప్రభుత్వం 11,960 ఇళ్లు కేటాయించగా.. 10,647 ఇళ్లకు అనుమతులిచ్చింది. వీటిలో 9,330 ఇళ్లకు గానూ 9,035 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఇందు లో 8,137 ఇళ్ల పనులు మొదలయ్యాయి. జీహెచ్ ఎంసీలో లక్ష ఇళ్లకుగాను 90,104 ఇళ్లకు పరిపాలన అనుమతులిస్తే.. 69,564 ఇళ్లకు టెండర్లు ఖరారవగా, 40,362 ఇళ్ల పనులు మొదలయ్యాయి. తర్వాతి స్థానాల్లో కరీంనగర్, కామారెడ్డి జిల్లాలున్నాయి. సగం కంటే ఎక్కువ జిల్లాల్లో సున్నా.. టెండర్లు ఖరారు కావటమే పనితీరుకు గీటురాయిగా భావిస్తూ జాబితా రూపొందించిన అధికారులు.. 18 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా సిద్ధమవని విషయం విస్మరించారు. రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని పేర్కొన్న అధికారులు.. టెండర్లు ఖరారైన ఇళ్ల సంఖ్య మెరుగ్గా ఉందని మెరుగైన పనితీరున్న జిల్లాల జాబితాలో చూపారు. రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, వరంగల్ అర్బన్, మెదక్, మహబూ బాబాద్, సంగారెడ్డి, జనగామ, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, వరంగల్ రూరల్, నాగర్ కర్నూలు, వనపర్తి, నిర్మల్, మంచిర్యాల, రంగారెడ్డి, వికారాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క ఇల్లూ సిద్ధం కాలేదన్నారు. వచ్చే దసరాకైనా.. కొత్తగా శంకుస్థాపన చేసిన కలెక్టరేట్ భవనాలు వచ్చే దసరా లోపు పూర్తవుతాయని అధికారులు గట్టిగా చెబుతున్నారు. కానీ.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో మాత్రం వారి నుంచి ఆ భరోసా రావటం లేదు. ఇళ్లకు శంకుస్థాపనల తర్వాత ఇప్పటికే రెండు దసరాలు వెళ్లిపోయాయి. కనీసం వచ్చే దసరా నాటికైనా సింహభాగం ఇళ్లు సిద్ధమవుతాయని అధికారులు చెప్పలేకపోతున్నారు. సీఎం దత్తత గ్రామాల్లో సిద్ధం.. గజ్వేల్ నియోజకవర్గంలో.. సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఇప్పటికే పూర్తి ఇళ్లను సిద్ధం చేయటం, సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్ చొరవ తీసుకోవడంతో పనులు మెరుగ్గా జరుగుతున్నాయి. దుబ్బాక పనితీరులో ముందంజలో ఉంది. జీహెచ్ఎంసీలోనూ మంచి స్పందన వస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్లలో జోగుళాంబ గద్వాల జిల్లా వెనుకబడి ఉంది. జిల్లాకు 2,800 ఇళ్లు మంజూరైతే 600 ఇళ్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో అన్ని ఇళ్లకు టెండర్లు పిలిస్తే 40కి మాత్రమే ఖరారయ్యాయి. అందులోనూ 20 ఇళ్ల పనులే మొదలయ్యాయి. కుమురం భీం, వికారాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, వనపర్తి, జగిత్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాలు చివరి కేటగిరీలో నిలిచాయి. ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లు : 2,68,245 పరిపాలన అనుమతులు జారీ అయినవి : 2,06,518 టెండర్లు పిలిచినవి: 1,78,913 ఖరారైనవి : 1,19,422 పనులు మొదలైనవి: 68,564 పూర్తయినవి: 2,771 విడుదల / వ్యయం అయిన నిధులు : రూ.529 కోట్లు -
‘రైతులు బాగుపడటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు’
సాక్షి, హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ రైతులు బాగుపడటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. రైతులు సంతోషంగా ఉండటాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే. మిషన్ కాకతీయతో 5 లక్షల ఎకరాలకు ఆయకట్టు సృష్టించాం. ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం. 40 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని పనులు మేము చేస్తున్నాం. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దు. కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది.’ అని అన్నారు. -
‘మిషన్ కాకతీయ’ భేష్: ఏఎఫ్ఎంఐ
చికాగో సదస్సులో పాల్గొనాలని హరీశ్‌రావుకు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’కు మరో ఖండాంతర ఖ్యాతి దక్కింది. మిషన్ కాకతీయతో తెలంగాణ దేశానికే దిక్సూచి అవుతోందని భారత సంతతికి చెందిన ముస్లింల అమెరికా సమాఖ్య (ఏఎఫ్ఎంఐ) కొనియాడింది. ఈ మేరకు ఏఎఫ్ఎంఐ అధ్యక్షుడు రజియా అహ్మద్ బుధవారం నీటిపారుదల మంత్రి టి.హరీశ్ రావుకు లేఖ రాశారు. ‘భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ళు, లౌకికవాదం – బహుళత్వం’అనే అంశంపై అక్టోబర్7న చికాగోలో నిర్వహిస్తున్న సదస్సులో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని కోరారు. మిషన్ కాకతీయతో 17 వేల చెరువులను పునరుద్ధరించి 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుతో పాటు మొత్తం 15 లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద సాగునీరందించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. మిషన్ కాకతీయతో తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో అనూహ్యమైన మార్పు వచ్చిందన్నారు. మంత్రి హరీశ్ రావును దూరదృష్టి ఉన్న నేతగా కొనియాడారు. అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ప్రజల్లో హరీశ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. -
‘కట్ట’గట్టి దోపిడీ!
చెరువు కట్టల అభివృద్ధి పనుల్లో భారీగా అంచనాల పెంపు ► సిద్దిపేటలోని ‘కోమటి చెరువు’ను సాకుగా చూపుతూ... ► మినీ ట్యాంక్బండ్లుగా చెరువుల అభివృద్ధికి సర్కారు నిర్ణయం ► మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికో చెరువు ఎంపిక ► ఇప్పటివరకు రూ.517 కోట్ల అంచనాతో 85 చెరువులకు అనుమతి ► జోక్యం చేసుకుని భారీగా అంచనాలు పెంచేస్తున్న ప్రజాప్రతినిధులు ► ఒక్కో చెరువు పనులు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుదల ► సవరించిన పలు అంచనాలకు ఇప్పటికే ఆమోదం సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా అభివృద్ధి చేసే పనులు అవకతవకలకు నిలయంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల జోక్యంతో పనుల అంచనా వ్యయాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. చెరువుల స్థాయిని, సుందరీకరణ అవసరాన్ని బట్టి చేయాల్సిన పనులే గాకుండా.. అవసరం లేకున్నా మరిన్ని పనులు ప్రతిపాదనల్లో వచ్చి చేరు తున్నాయి. ఎందుకలా అని ప్రశ్నిస్తే మాత్రం సిద్దిపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న కోమటి చెరువు తరహాలో అభివృద్ధి చేస్తామంటూ సాకులు తెరపైకి వస్తున్నాయి. ఆ చెరువు ఆదర్శమంటూ.. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీ య’లో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు మినీ ట్యాంక్‌బండ్‌గా అభి వృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువు నీటి నిల్వ, కట్ట ఎత్తు, పొడవు, వెడల్పులను ఆధారం చేసుకుని.. ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. అయితే చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు సిద్దిపేటలో అభివృద్ధి చేసిన కోమటి చెరువును చూపుతూ... ఆ తరహా నిర్మాణా లు, ఏర్పాట్లను కోరుతున్నారు. వ్యయ అంచనాలను పెంచేలా ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి కోమటి చెరువు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ కాకపోవడం గమనార్హం. చాలా చోట్ల ఇదే తీరు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చిన 85 మినీ ట్యాంక్‌బండ్‌లలో రెండు మూడు మినహా మిగతా వాటన్నింటికీ అంచనాలు పెరుగుతు న్నాయి. ఈ 85 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణం కోసం మొత్తంగా రూ.517 కోట్లు అవసరమని తొలుత అంచనా వేయగా... తాజాగా మరో రూ.200 కోట్ల మేర పెరిగే అవకాశముందని చెబుతున్నారు. నిబంధనలివీ.. మినీ ట్యాంక్ బండ్ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్ల వరకు ఉండాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. అడ్డగోలుగా పెంచేస్తున్నారు.. ప్రస్తుతం కట్ట వెడల్పు అంశం వద్దే చెరువు పనుల్లో అంచనాల పెంపు జరుగుతోంది. చెరువు కట్ట నిర్మాణం పూర్తిగా మట్టిపనితో ముడిపడి ఉంటుంది. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగిస్తున్నారు. కానీ ఆ మట్టిని దూర ప్రాంతం నుంచి తెచ్చినట్లుగా చూపిస్తుంటారు. దీంతో ఇటు చెరువు పూడికతీత, అటు కట్ట నిర్మాణంతో రెండు బిల్లులు పొందే అవకాశ«ం కాంట్రాక్టర్లకు లభిస్తోంది. ఇక చాలా చెరువుల కట్టలను ఇప్పటికే వివిధ పథకాల కింద పలుసార్లు పునరుద్ధరించారు. అంటే ప్రస్తుతం ఆయా చెరువు కట్టల పునరుద్ధరణ పనులు తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు చెరువు కట్టల పనులపై మక్కువ చూపుతుంటారు. ప్రస్తుతం చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేల బినామీలు లేదా అనుచరులే కాంట్రాక్టర్లుగా ఉండటంతో... అంచనాల పెంపు కోసం ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కట్ట వెడల్పును కొన్ని చోట్ల 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు పెంచుతుండటం గమనార్హం. ఒకటిరెండు చోట్ల ఏకంగా 25 మీటర్ల వరకు కూడా పెంచారని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏమిటీ కోమటి చెరువు? సిద్దిపేటలోని కోమటి చెరువును 2010 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. చెరువుకట్టపై సేద తీరేలా ఏర్పాట్లు, పిల్లల కోసం మినీ పార్కు, చెరువులో బోటింగ్ వంటివి ఏర్పాటు చేశారు. రెయిలింగ్ వంటివాటితో సుందరీకరించారు. ఇందుకోసం మూడు ప్రభుత్వ శాఖలు కలసి వివిధ దశల్లో రూ.15 కోట్లకుపైగా ఖర్చుపెట్టాయి. ఇందులో రూ.9.3 కోట్లతో నీటి పారుదల శాఖ, రూ.2.5 కోట్లతో పర్యాటక శాఖ, మరో రూ.3 కోట్లతో మున్సిపల్ శాఖ పనులు చేశాయి. ఇన్ని సౌకర్యాలు ఉండటంతో రోజూ సాయంత్రాలు సిద్దిపేట, సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. రెండు మూడు రెట్లు పెంపు! మహబూబాబాద్‌లోని అనంతారంలో ఉన్న మైసమ్మ చెరువు పనుల అంచనాను స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు రూ.83.80 లక్షల నుంచి రూ.3.04 కోట్లకు పెంచారు. మళ్లీ రూ.4.50 కోట్లతో కొత్త అంచనాలు వేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలోని చౌదరి చెరువు మినీ ట్యాంక్‌బండ్ పనుల వ్యయాన్ని రూ.10 కోట్ల నుంచి ఏకంగా రూ.18.78 కోట్లుగా ప్రతిపాదించారు. కానీ అధికారులు ఆ స్థాయిలో పెంచలేమని రూ.16.32 కోట్లకు సవరించారు. ఖమ్మంలోని లాకారం చెరువు తొలి అంచనా రూ.7.78 కోట్లుకాగా.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల జోక్యంతో కొత్తగా మరిన్ని నిర్మాణాలు చేరి రూ.13.50 కోట్లకు చేరింది. దీనికి అధికారిక ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. జనగాంలోని ధర్మవాణి కుంట, బెల్లంపల్లిలోని పోచమ్మచెరువు, ములుగులోని తోపుకుంట చెరువు, ఖానాపూర్లోని గోపయ్య చెరువు, మేడ్చల్ పరిధిలోని ఏదులాబాద్ మినీ ట్యాంక్ బండ్ల అంచనాలకు కూడా వ్యయం పెంపు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. మొత్తంగా చాలా చోట్ల నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పలు చోట్ల అధికారులు ఆ ప్రతిపాదనలను పక్కనపెడుతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఒత్తిడికి తలొగ్గి అంచనాలు పెంచేస్తున్నారు. పలు చోట్ల పెంచిన అంచనా వ్యయాలు (రూ.కోట్లలో) నియోజకవర్గం చెరువు పేరు తొలి అంచనా తాజా అంచనా నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం 8 12 సూర్యాపేట చౌదరి చెరువు 10.57 16.32 మహబూబాబాద్ మైసమ్మ చెరువు 3 4.50 ఖమ్మం లాకారం 7.78 13.50 చొప్పదండి కడిచెరువు 1.07 2.23 ఆదిలాబాద్ ధర్మసాగర్ 4.03 5.60 పరకాల దామరచెరువు 3 5 నిజామాబాద్ అర్బన్ రఘునాథచెరువు 6.50 8 డోర్నకల్ కొండ సముద్రం 2.50 3.50 పెద్దపల్లి ఎల్లమ్మగుండం 5.88 7.20 మినీ ట్యాంక్బండ్ల ప్రతిపాదనలివీ.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 98 ప్రతిపాదనలు అందినవి 92 అనుమతులు మంజూరైనవి 85 అనుమతుల విలువ 517 కోట్లు (రూపాయల్లో) -
ఆదిలాబాద్‌లో 3.2 లక్షల ఎకరాలకు నీరు
► మిషన్ కాకతీయ ద్వారా సాగులోకి తెచ్చాం: మంత్రి హరీశ్ ► జిల్లా ప్రాజెక్టులపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది మిషన్ కాకతీయ, జైకా నిధులతో చేపట్టిన పనులతో 3.2 లక్షల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించి నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టక ముందు చెరువుల కింద ఆయకట్టు లక్ష్యాలలో 30 శాతమే సాగునీరందేదని, ప్రస్తుతం 90 నుంచి 100 శాతం ఆయకట్టుకు నీరు అందుతోందని చెప్పారు. సోమవార మిక్కడ జలసౌధలో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పథకాలను ఆయన సమీక్షించారు. జిల్లాలో గడచిన పదేళ్లుగా భూసేకరణ, అటవీ అనుమతుల వంటి సమస్యల కారణం గా పెండింగ్‌లో ఉన్న 57 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి వాటి కింద సుమారు 40 వేల ఎకరాలను సాగులోనికి తెచ్చినట్టు మంత్రి చెప్పారు. జపాన్ ఆర్థిక సహకారంతో ప్రారంభమైన 47 ప్రాజెక్టుల్లో 40 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి 39 వేల ఎకరాలు సాగులోకి తెచ్చినట్టు వివరించారు. మిషన్ కాకతీయలో బోథ్ ప్రాజెక్టు కింద 5,000 ఎకరాలు, బజార్ హత్నూర్ ప్రాజెక్టు కింద 4,500 ఎకరాలు, చింతల్బోరి ప్రాజెక్టు కింద 1500 ఎకరాలు ఈ ఏడాది సాగులోకి తెచ్చామన్నారు. గడ్డెన్నవాగు డ్యామ్ నిర్మా ణం పూర్తి చేయడంతోపాటు కాలువలను ఆధునీకరించడంతో 10వేల ఎకరాలకు నీరం దిందన్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నాటికి 45,500 ఎకరాలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు. సాత్నాలా, స్వర్ణ, వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టులతోపాటు కడెం, సరస్వతి, సదర్మట్ కాల్వల కింద గ్యాప్ ఆయకట్టును పూరించ డానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చనాఖా–కొరటా పనులను వచ్చే ఏడాది జనవరికి పూర్తి చేసి 10 వేల ఎకరాలకు నీరం దించాలని అధికారులకు సూచించారు. -
మిషన్ కాకతీయపై చర్చకు సిద్ధం-పొన్నం
సిద్దిపేట: మిషన్ కాకతీయపై బహిరంగ చర్చకు సిద్ధమని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాల పేర్లు ఆకర్షణీయంగా ఉన్నా ఆచరణలో అత్యంత దారుణంగా మారాయన్నారు. అలాగే మిషన్ కాకతీయ అమలులో ప్రభుత్వం చెబుతున్నదానికి, వాస్తవానికి పూడ్చలేని వ్యత్యాసం ఉందన్నారు. చెరువుల పూడికతీత నేతిబీరలో నెయ్యి చందంగా మారిందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆయన పేర్కొన్నారు. -
అందరి భాగస్వామ్యంతోనే ఉపాధి హామీ
- ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి జూపల్లి - ఉపాధి పనుల్లో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం సాక్షి, హైదరాబాద్: అందరి భాగస్వామ్యంతో ఉపాధిహామీని ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జూపల్లి అధ్యక్షతన శనివారం రాజేంద్రనగర్‌లోని సిపార్డ్లో రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ రెండో సమావేశం జరిగిం ది. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, నాయి ని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చందూలాల్ పాల్గొన్నారు. ఉపాధిహామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని జూపల్లి తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.3 వేల కోట్ల విలువైన పనులను చేపట్టేలా టార్గెట్ పెట్టుకున్నామని, జాబ్ కార్డులున్న 60% మంది కూలీ లకు 100 రోజుల పని కల్పించే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. మిషన్ కాకతీయ చెరువుల పూడికతీతను చేపడుతున్నామని, పాఠశాలల్లో మరుగుదొడ్డు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. రూ.13 లక్షలతో పంచాయ తీ భవనాలు, రూ.10 లక్షలతో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నామని చెప్పారు. 2018 అక్టోబర్ 2 నాటి కి స్వచ్ఛ తెలంగాణగా మార్చేందుకు ఇంకుడు గుంతలు, పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 2.63 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 34,088 మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.200 కోట్లను మహిళా సంఘాలకు అడ్వాన్స్ రూపంలో అందజేస్తున్నామని వివరించారు. 1,000 మంది జనాభాకు ఇద్దరు ఉపాధి కూలీలను ఏడాది పొడవునా పారిశుధ్య కార్మికులుగా వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని ఇటీవల భోపాల్‌లో కేంద్ర మంత్రి తోమర్‌ను కోరామన్నారు. ఉపాధి హామీ సిబ్బందికి హరీశ్ ప్రశంసలు.. ఇటీవల జాతీయస్థాయిలో 5 అవార్డులు దక్కిం చుకున్న ఉపాధి హామీ సిబ్బందిని, అధికారులను హరీశ్‌రావు అభినందించారు. వాటర్ స్టోరేజీ పాండ్‌కు ప్లాస్టిక్ కవర్ బదులుగా బ్రిక్స్‌తో నిర్మించుకునే అవకాశమివ్వాలని కోరారు. మొక్కలకు నీరు పోసే ట్యాంకర్‌కు రూ.482 ఇస్తున్నారని, దీనిని పెంచాలని కోరారు. శ్మశానవాటికల కోసం సిద్దిపేటలో ఒక డిజైన్‌ను రూపొందించామని, దీనిని ఇతర ప్రాంతాల్లోనూ టైప్–2గా నిర్మించుకునే వెసులుబాటు ఇవ్వాలన్నారు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారికోసం షెడ్డులను నిర్మించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, టీఏ ఇవ్వాలని సభ్యులు కోరగా జూపల్లి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ మిశ్రా, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాశ్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, కౌన్సిల్ సభ్యులైన కరీంనగర్, వరంగల్ జెడ్పీ చైర్మన్లు తుల ఉమ పాల్గొన్నారు. -
రాష్ట్రానికి అన్యాయమే!
⇔ జీఎస్టీతో ఏటా రూ.4,000 కోట్ల లోటు ⇔ ఇలా పన్నుల సొమ్ము తగ్గినా పరిహారం దక్కే చాన్స్ లేదు ⇔ తమ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోకపోవడంపై రాష్ట్రం కినుక ⇔ రాజకీయంగా ఆఖరి ఒత్తిడికి ప్రభుత్వ యత్నం ⇔ కేంద్రంతో రాజీ పడే ప్రసక్తి లేదన్న మంత్రి ఈటల ⇔ ఢిల్లీలో జీఎస్టీ వేడుకలకు హాజరుకానున్న ఆర్థిక మంత్రి సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ అమలుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్నుల రాబడిలోనే ఏటా సుమారు రూ.4,000 కోట్ల లోటు ఏర్పడు తుందని లెక్కలు వేసింది. అంతేగాకుండా రాష్ట్రం తరఫున పంపిన ప్రతిపాదనలపై కేంద్రం నుంచి స్పందన రాకపోవటంతో.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటివాటిపై పన్ను రూపేణా వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రతిపాదనలపై కేంద్రాన్ని ఒప్పించేందుకు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఏటా రూ.4,000 కోట్లు లోటు! జీఎస్టీ అమలుతో రాష్ట్ర ఖజానాకు పన్నుల రాబడిలో రూ.4,000 కోట్ల మేర లోటు తప్పదని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఇలా జీఎస్టీ అమలుతో వచ్చే లోటును కేంద్రం పరిహారం రూపంలో తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 14.5 శాతం కంటే తక్కువ ఆదాయ వృద్ధి ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనని మెలిక పెట్టింది. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కావడం, ఆదాయ వృద్ధి 17.9 శాతంగా ఉండడంతో రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం దక్కే అవకాశం తక్కువని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలపై జీఎస్టీ కారణంగా రూ.19,200 కోట్ల మేరకు అదనపు పన్ను భారం పడుతుందని లెక్కలు వేశారు. ఇక జీఎస్టీ శ్లాబ్‌ల ఖరారు సమయంలో తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయాలున్నాయి. దాంతో చేనేత, బీడీ పరిశ్రమపై పెరిగిన పన్ను భారంతో రాష్ట్రంలోని లక్షలాది మంది బీడీ, చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని గ్రానైట్ పరిశ్రమకు సైతం పన్నుపోటు తగలనుంది. వీటన్నింటికి కొంత మేర మినహాయింపులు ఇవ్వాలని, జీఎస్టీ స్లాబ్‌ను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం: ఈటల జీఎస్టీకి సంబంధించి రాష్ట్రం చేసిన కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నా.. మరికొన్నింటిని తోసిపుచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు అంశాలపై కేంద్రానికి లేఖ రాశారని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, బీడీ, చేనేత, సాగునీటి రంగాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారని వెల్లడించారు. ఫిర్యాదులుంటే కాల్ చేయండి జీఎస్టీ అమలును సాకుగా చూపి ధరలు పెంచొద్దని వ్యాపార, వాణిజ్య వర్గాలకు మంత్రి ఈటల సూచించారు. అనుమానాలు, అపోహలు వద్దని.. ప్రస్తుతమున్న వ్యాట్ తరహాలోనే పారదర్శకంగా పన్నులు, పన్నుల చెల్లింపు విధానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్ పరిధిలో 2.25 లక్షల మంది ఉన్నారని, జీఎస్టీతో డీలర్ల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. జీఎస్టీ అమలుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దేశంలో అత్యధి కంగా వాణిజ్య పన్నుల రాబడి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, అందుకే రాష్ట్ర ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానా లుంటే 18004253787 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎక్సైజ్‌పై ప్రభావం లేకుండా.. జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఎక్సైజ్ ఆదాయంలో కోత పడకుండా ఉండేందుకు ఎక్సైజ్ చట్టం– 1968కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ పరిధిలోకి వచ్చే అంశాలను జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండేలా ఈ సవరణ లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పడ టంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టును ఎక్సైజ్ ఆఫీసర్‌గా మారుస్తూ సవరణ చేసింది. -
ఉన్న భూములు గుంజుకున్నారు
- మూడెకరాలు ఇస్తామని మభ్యపెట్టారు - ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు - ‘మిషన్ కాకతీయ’తో దళితులకు అన్యాయం - వీధిన పడిన 22 దళిత కుటుంబాలు అల్లాదుర్గం (మెదక్): ‘‘దళితుల అభ్యున్నతి కోసం ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని సర్కారు చెబుతోంది. కానీ, మేము సాగు చేసుకుంటున్న భూములను తీసుకుని మాకు అన్యాయం చేస్తోంది’’ అంటూ వాపోతున్నారు మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన దళితులు. తమకు న్యాయం చేసి వెంటనే భూములు ఇప్పించాలని కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారు. బుధ వారం కూడా వారు అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మొర పెట్టుకున్నారు. ముప్పారం గ్రామానికి చెందిన 22 దళిత కుటుంబాలు 2000 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ అందించిన రుణ సహాయంతో నల్లకుంట చెరువులోని సర్వే నంబర్ 25, 26లో ఎకరం చొప్పున వ్యవసాయ భూము లను కొనుగోలు చేసుకున్నాయి. వ్యవసా యం చేసుకుంటున్నారు. రుణాలను సైతం తిరిగి చెల్లించారు. ప్రభుత్వం వారికి పట్టాల ను కూడా అందజేసింది. మొదటి విడత మిషన్ కాకతీయలో భాగంగా కాంట్రాక్టర్ వెం టనే చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. దళితులు సాగు చేసుకుంటున్న భూములు చెరువు పరిధిలోనే ఉన్నాయి. పూడికతీతతో ఆ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో దళిత కుటుం బాలన్నీ కలసి మిషన్ కాకతీయ పనులను అడ్డుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నేతలు, ఆర్డీఓ అక్కడికి చేరుకున్నారు. కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నా యం గా ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పు న వేరే చోట భూములు ఇస్తామని నచ్చ జెప్పారు. వారి మాటలను విశ్వసించిన దళితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏం జరిగింది? చెరువు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మూడేళ్లు గడిచిపోయాయి. 22 దళిత కుటుం బాలు భూములు కోల్పో యాయి. ‘ఎస్సీ కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్లం. ఆ భూమి చెరువు పనిలో పోవ డంతో ఆధా రం పోయింది. అప్పులు చేసు కుంటూ బతకాల్సి వస్తోంది’ అని దేవమ్మ అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
చెరువులే జీవనాధారం
⇒ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్‌రూరల్: గ్రామాలకు చెరువులే జీవనాధారామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం బొమ్మకల్‌లో మిషన్ కాకతీయలో భాగంగా మల్లయ్య చెరువులో రూ.29.60 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లయ్య చెరువు ఆయకట్టు 65 ఎకరాల్లో ఉందన్నారు. మిషన్ కాకతీయ 1, 2వ విడుతల్లో చేపట్టిన చెరువుల అభివృద్ధితో నీళ్లు నిండి పంటల దిగుబడి పెరిగిందన్నారు. మూడోదశలో మండలంలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.4 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.ఎంపీపీ వి.రమేశ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జె.రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ సభ్యులు డి.శ్రీనివాస్, వజ్రమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, స్థానిక నాయకులు రమేశ్, దాది సుధాకర్, ర్యాకం మోహన్, శ్రీనివాస్, జె.శంకర్, కాల్వ నర్సయ్య, గౌతమ్‌రెడ్డి, ఆనందరావు, కె.సంపత్, తహసీల్దారు రాజ్‌కుమార్, ఆర్ఐ విజయ్, రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘సాగునీటి’ పరుగులు
- ఏడాదికాలంగా అందివస్తున్న ఫలాలు - శరవేగంగా ప్రాజెక్టుల పనులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండేళ్లు సాగునీటి విషయంగా కొంత ఇబ్బంది ఎదురైనా.. గత ఏడాది కాలంగా మాత్రం బాగా కలిసొచ్చింది. నిర్మాణంలోని ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి రావడం, గతేడాది చివర్లో కురిసిన వర్షాలకు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాం సాగర్ వంటి ప్రాజెక్టులు నిండడం సాగునీటి రంగానికి కొత్త ఊపిరిలూదింది. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులన్నీ జలకళను సంతరించు కోవడంతో రబీ సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. అయితే భూసేకరణ సమస్యల కారణంగా పలు ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరుగుతోంది. పొరుగు రాష్ట్రంతో జల జగడాలు కొంత తగ్గినా ఇబ్బందులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న వాటికే ప్రాధాన్యం కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకన్నా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ప్రాధాన్యమిస్తోంది. గత మూడేళ్లుగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు వేగంగా పనుల పూర్తికి చర్యలు చేపట్టింది. పాలమూ రు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద కొత్తగా 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. 350 చెరువులు నింపారు. మెదక్ జిల్లా సింగూరు కాలువలను పూర్తి చేసి 30 వేల ఎకరాలకు నీరందించారు. కరీంనగర్లో ఎల్లంపల్లి ఎత్తిపోతల నుంచి 25వేల ఎకరాలు, చెరువులు నింపి మరో 37,000ఎకరాలను స్థిరీకరించారు. ఎస్సారెస్పీ కాలువలు తవ్విన తరువాత ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టి మొదటిసారిగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీటిని తరలించి.. వందలాది చెరువులు నింపారు. ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి చెరువులను నింపడంతో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగారు. ఈ ప్రాజెక్టులో మిగతా పనులను వేగంగా పూర్తిచేసి ఈ ఖరీఫ్‌లోనే 58,958 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో గత పదేళ్లుగా భూసేకరణ కారణంగా నిలిచిపోయిన 57 చెరువు పనులను ఈ సారి పూర్తి చేయగలిగారు. కొలిక్కి వచ్చిన రీడిజైనింగ్ కాళేశ్వరం, ప్రాణహిత, తుపాకులగూడెం, దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, డిండి ఎత్తిపోతల పథకాల్లో కేసీఆర్ సర్కారు చేపట్టిన రీడిజైనింగ్ కొలిక్కి వచ్చింది. కొత్తగా చేపట్టిన వాటిలో కాళేశ్వరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మల్లన్నసాగర్తోపాటు దానికింద ఉన్న రిజర్వాయర్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలైనా.. ఆ ప్రాజెక్టుకు కేసుల బెడద వెంటాడుతోంది. -
జేసీబీ నడిపి.. సాధారణ కూలీగా డిప్యూటీ స్పీకర్
మెదక్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి శుక్రవారం మెదక్ పట్టణంలో పర్యటించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పట్టణంలోని నాయకుని చెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా మహిళా నేత పద్మాదేవేందర్ రెడ్డి స్వయంగా జేసీబీ నడిపి పనులకు శ్రీకారం చుట్టడం విశేషం. పలుగు, పార చేతపట్టి సాధారణ కూలీగా మారిపోయి మట్టిని ఎత్తి పోశారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటలవరకు పట్టణంలోని బంగ్లా చెరువు, మల్లంచెరువులను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలెక్టరేట్ లో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మెదక్ పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. -
ధాన్యం దండెత్తింది
- ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులు - అంచనా 29.5 లక్షల మెట్రిక్ టన్నులు..చేతికొచ్చింది 41 లక్షల మెట్రిక్ టన్నులు - రంగంలోకి దిగిన మంత్రి హరీశ్‌రావు - మిల్లర్లు, లారీ యజమానులతో యుద్ధ ప్రాతిపదికన చర్చలు సాక్షి, సిద్దిపేట: అన్నదాత పంట పండింది. దండిగా ధాన్యం మార్కెట్ మీదకు దండెత్తి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువులు నిండి, బావులు, బోర్లు ఊట పట్టడం.. దానికి నిరంతరాయ విద్యుత్ తోడు కావటం యాసంగికి కలిసొచ్చింది. పుట్ల కొద్దీ ధాన్యం పోటెత్తడంతో మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. అదే సమయంలో ఖమ్మం మిర్చి యార్డుకు రైతులు నిప్పు పెట్టడం.. అక్కడక్కడా రైతాంగం నిరసనలకు దిగటంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు రంగంలో దిగారు. పోటెత్తుతున్న ధాన్యానికి ధీటుగా అధికారులను మానసికంగా సిద్ధం చేశారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ ఏడాది రబీ సీజన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 31.5 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. రబీలో ఇంత విస్తీర్ణంలో వరిసాగు చేయడం వ్యవసాయశాఖ చరిత్రలోనే ఇది తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 41.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 29.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి రావచ్చని అధి కారులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. మార్కెట్‌కు తరలివస్తున్న ధాన్యం తీరును చూస్తే 41.67 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రావచ్చని భావిస్తు న్నారు. అయితే, మార్కెట్లో ధాన్యం పోయడానికి జాగ లేదు. నింపటానికి బస్తాలు, తూకం వేయడానికి హమాలీలు, తరలించడానికి లారీలు లేవు. దీనికి తోడుగా మార్కెట్లోకి బతుకమ్మ వడ్ల రాశులు వస్తున్నాయి. ఈ రకం వడ్లకు మార్కెటింగ్ శాఖ గుర్తింపు లేక అదో గందరగోళం. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు స్పందించి వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయిస్ అధికారులను ఏకతాటి మీదకు తెచ్చారు. లారీల కొరత ఒప్పందం చేసుకున్నంతగా ఏజెన్సీలు లారీలను పంపలేకపోయాయి. ఒక్కో జిల్లాకు రోజుకు సగటున 400 లారీలు అవసరం. 31 జిల్లాలకు కనీసం 12,400 లారీలు అవసరం. వీటికోసం అధికారులు రోడ్డెక్కారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల లారీలను మినహాయించి, మిగిలిన లారీలను మార్కెట్ వైపు మళ్లించారు. ధాన్యం లోడ్ చేసి మార్కెట్ ఖాళీ చేయించారు. లారీల్లోనైతే ధాన్యం ఎత్తారు, కానీ వాటిని నిల్వ చేయడానికి గోదాములు ఖాళీ లేవు. గోదాముల సమస్య రాష్ట్రంలో పాతవి 4.14 లక్షల మెట్రిక్ టన్నులు సామర్థ్యం, కొత్తవి 17.85 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయి. మొత్తం కలిపి 21.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయొచ్చు. కానీ పంట దిగుబడి వచ్చిందేమో 41.67 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ కొరత నుంచి గట్టెక్కేందుకు హరీశ్‌రావు రైస్ మిల్లర్ల సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఒక్కో మిల్లుకు 4000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. దానికి అదనంగా మరో 1000 మెట్రిక్ టన్నులను చేర్చారు. మొత్తం 16.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లులు నిర్విరామంగా పనిచేయాలని ఒప్పించారు. ఇక ధాన్యానికి వచ్చిన డబ్బును రైతు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. . ఇప్పటివరకు 4.02 లక్షల మందిS రైతుల వద్ద నుంచి 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రూ.3598 కోట్లు రైతులు ఆర్జించారు. ఇందులో రూ.2300 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మంత్రి ఇప్పుడు ఈ లావాదేవీలపై దృష్టి పెట్టారు. చివరి గింజ వరకు కొంటాం.. చెరువులు నిండినయ్, రైతన్నలు కష్టపడ్డారు. కష్టానికి తగిన ఫలితం వచ్చింది. గతంలో ఎప్పుడూ చూడనంతగా దిగుబడులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్, రవాణా శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. కొనుగోళ్లకు ఇబ్బంది లేదు. రైతన్న కష్టానికి నాది భరోసా. మార్కెట్‌కు వచ్చే చివరి గింజను కూడా కొనుగోలు చేస్తాం. బతుకమ్మ వడ్లకు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్టిఫికెట్ ఇచ్చింది. సమస్య లేదు. మీ ప్రతి రూపాయి లెక్కగట్టి మీ ఖాతాల్లో జమ చేస్తాం. – టి.హరీశ్‌రావు, మార్కెటింగ్ శాఖ మంత్రి -
ఎమ్మెల్యే బాబు బాగా బిజీ!
► మిషన్ కాకతీయ పనుల ప్రారంభంలో జాప్యం చేస్తున్న ఎమ్మెల్యేలు ► 3,712 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తి ► 2,617 చెరువుల్లోనే పనులు ప్రారంభం ► సహకరించాలని ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: చెరువుల మరమ్మతు పనుల విషయంలో ఎమ్మెల్యేల వైఖరిపై పలు విమర్శలు వస్తున్నాయి. పనులను తామే ప్రారంభిస్తామని గతంలో పట్టుబట్టి, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే తీరిక లేనట్టుగా తప్పించుకు తిరుగుతున్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకోసం చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ పనులను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని ప్రభుత్వం ఓ వైపు పదే పదే చెబుతున్నా!.. క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. వర్షాకాలం మొదలయ్యే నాటికి చెరువుల మరమ్మతులకు సంబంధించి ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సిన దృష్ట్యా, టెండర్లు, ఒప్పందాలు పూర్తయిన చెరువుల పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం పురమాయిస్తున్నా, వారు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. పనులను తమ చేతుల మీదుగానే ఆరంభించాలంటూనే ఎమ్మెల్యేలు సమయమివ్వకపోవడంతో చాలా చోట్ల చెరువుల పనులు ప్రారంభం కావడంలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు 3,712 చెరువులకు ఒప్పందాలు కుదిరినా, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా కేవలం 2,617 చెరువుల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. రాజకీయాలతో తంటా... వర్షాలు రావడానికి మరో పదిహేను, ఇరవై రోజుల గడువు మాత్రమే ఉన్నా, 1,095 చెరువుల్లో ఇంకా పనుల ఆరంభమే జరగలేదు. దీనికి ప్రధానంగా ఆయా చెరువుల పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయాలే కారణమని తెలుస్తోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు తామే స్వయంగా పనులకు శంకుస్థాపన చేస్తామని పట్టుబట్టడమే కారణంగా తెలుస్తోంది. స్థానిక నేతలు ఎవరైనా పనుల ఆరంభానికి చొరవ చూపినా స్థానిక ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రారంభానికి అడ్డు చెప్పడంతో పనులు మొదలవలేదు. పూర్వపు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఒప్పందాలు పూర్తయినా కరీంనగర్లో 403 చెరువులకు గానూ 195 చెరువులు, నిజామాబాద్‌లో 1,741 చెరువులకు గానూ 1,288 చెరువులు, నల్లగొండలో 2,023 చెరువులకు గానూ 1,509 చెరువుల పనులు మాత్రమే ఆరంభమయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చాలా చోట్ల పనుల ఆరంభం నత్తనడకన సాగుతోంది. దీంతో రాజకీయ జోక్యాన్ని తగ్గించి పనులను మొదలుపెట్టే దిశగా మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొదటి దశలో మాదిరే త్వరగా పనులు ప్రారంభించి వర్షాలు కురిసే నాటికి పూడికతీత, అలుగు, తూముల పనులు పూర్తి చేసేలా సహకరించాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. -
మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్య
వర్ని: ఆర్థిక ఇబ్బందులతో మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి(36) ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర్ రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా చర్లోపల్లి గ్రామం. రెండు నెలల క్రితం నుంచి కోటగిరి మండలం పొతంగల్ ప్రాంతంలో మిషన్ భగీరథ పనులు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నాం లాడ్జీకి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
15 రోజుల్లో ‘కాకతీయ’ పనులు మొదలవ్వాలి
► చెరువుల పనులపై అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు ► ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంలో పనులు చేపట్టాలి ► సీఈ, ఎస్ఈలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మూడో విడత మిషన్ కాకతీయ పనులు సంతృప్తిగా లేవని, రానున్న 15 రోజుల్లో 90 శాతం పనులు ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇంకా పూర్తికాని ఒకటి, రెండో విడత మిషన్ కాకతీయ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని సూచించారు. మూడో విడత మిషన్ కాకతీయ పనులపై మంత్రి మంగళవారం సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రెండు విడతల్లో మిగిలిపోయిన పనులతో పాటు మిషన్ కాకతీయ 3లో మంజూరైన పనులు, వాటి పురోగతిని హరీశ్ సమీక్షించారు. మిషన్ కాకతీయ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. మిషన్ కాకతీయ 1లో జరిగిన పనుల్లో ఎక్కడైనా చిన్న, చిన్న మరమ్మతులు అవసరమైతే వాటిని వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజలను భాగస్వాములను చేయాలి.. చెరువు పనుల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేసి ఘనంగా ఉత్సవాలు జరిపి పనులు గ్రౌండింగ్ చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు హాజరైనా, కాకపోయినా పనులు ప్రారంభించడానికి వెంటనే చర్యలు తీసుకో వాలని అధికారులకు సూచించారు. మూడో విడత పనుల గ్రౌండింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నందుకు ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ అభినందించా రు. మైనర్ ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలు, జిల్లాల ఇంచార్జి సీఈలు క్షేత్ర స్థాయిలో పర్యటిం చాలని, ఆకస్మికంగా తనిఖీలు చేయాలని, స్థానిక ఇంజనీర్లకు, సిబ్బందికి తగిన సూచన లు, సలహాలు ఇవ్వాలని సూచించారు. పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో సమీక్షిం చాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఈఎన్సీ మురళీధరరావు, భగవంతరావు, శ్యామసుందర్, మధుసూదనరావు, లింగరాజు, శ్యాంసుందర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయం
► మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ► మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన ముథోల్: రైతులను రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని దేవాదాయ, గృహ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముథోల్ మండలంలోని చించాల గ్రామంలో మిషన్ కాకతీయ మూడో విడత కింద పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ఆదివారం చేపట్టారు. రూ.32లక్షల42వేలు మంజూరు కావడంతో ఈ పనులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. చెరువులో మంత్రి ,ఎమ్మెల్యే మట్టిని తవ్వి ట్రాక్టర్లలో వేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత మిషన్ కాకతీయ చెరువు మరమ్మతు పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మూడో విడతలో 26 చెరువులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. చెరువులో నీరు ఉంటేనే భూగర్భ జలాలు తరిగిపోకుండా ఉంటాయన్నారు. మిషన్ కాకతీయ వల్ల బోరుబావుల నీళ్లు తగ్గిపోకుండా ఉంటాయని వివరించారు. బాసర గోదావరి నదిలో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గోదావరి నీరు ఉండడం వల్లే చెక్‌డ్యాం పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో సామాన్యులందరికి త్వరగా పనులు జరుగుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో 17 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి హామీ ఇచ్చారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. బాసర ఆలయానికి త్వరలో ముఖ్యమంత్రి రానున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, కోఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు అఫ్రోజ్‌ఖాన్, ఇరిగేషన్ ఈఈ ఒ.రమేశ్, ఈఈ నవీన్‌కుమార్, ఆర్డీవో రాజు, తహసీల్దార్ లోకేశ్వర్‌రావు, ఎంపీపీ అనూషసాయిబాబా, ఎంపీడీవో నూర్‌మహ్మద్, సర్పంచ్ ఉమాసత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. -
హరీశ్‌పై యావత్ తెలంగాణ ఆశలు
సిద్దిపేట సభలో మంత్రులు నాయిని, ఈటల కితాబు ► హరీశ్ దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం ► బీడు భూములను తడపాలన్నది ఆయన ఆకాంక్ష ► పల్లెల పచ్చదనానికి ‘మిషన్ కాకతీయే’ కారణమని వెల్లడి ► ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో సీఎం కేసీఆర్‌కు తెలుసని వ్యాఖ్య సాక్షి, సిద్దిపేట: ‘‘యావత్ తెలంగాణ జాతికి మీ మీద ఆశలు ఉన్నాయి. మీ శ్రమ ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలె.. మీ శ్రమ కరువుబట్టిన భూముల్లోకి నీళ్లు పారించాలె. నాడి పట్టుకొని ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసు. ఇయ్యాల తెలంగాణకు మంచి పేరు వస్తున్నదంటే, పల్లెలు పచ్చగా నిలబడ్డయంటే అది మిషన్ కాకతీయతోనే. నువ్వు దొరకడం ప్రజల, మా అదృష్టం’’ అంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును కొనియాడారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న భారీ బహిరంగ సభకు నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. దీనికి మంత్రులు నాయిని, ఈటల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హరీశ్ ఎక్కడ అడుగుపెట్టినా విజయమే ముందుగా నాయిని మాట్లాడుతూ 2004లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్... ఉద్యమ నిర్మాణం కోసం సిద్దిపేటను వదిలి కరీంనగర్ ఎంపీగా వెళ్లాల్సి వచ్చినప్పుడు హరీశ్‌రావు లాంటి తెలివిగల నేతను సిద్దిపేటకు ఇచ్చి వెళ్లారన్నారు. తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా æఅక్కడికి హరీశ్‌రావును కేసీఆర్ పంపుతారని, హరీశ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేనని కీర్తించారు. కేసీఆర్‌కు నాడి పట్టుకొని ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో తెలుసని, తనకు హోంమంత్రి పదవి వస్తుందని ఏనాడూ అనుకోలేదన్నారు. హరీశ్‌రావు శ్రమతో పార్టీకి గౌరవం తెచ్చారని, గ్రామ సీమలు కళకళలాడుతున్నాయంటే ఆయన పట్టుదలే కారణమన్నారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిన రోజే ఒడిశాలో ప్రధాని మాట్లాడుతూ వెనుకబడిన ముస్లింలను ఆదుకోవాలని పేర్కొనడంతో రాష్ట్రంలోని బీçజేపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదని నాయిని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుకు దేశమంతా భయపడినా... ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు దేశమంతా భయపడిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే ఎదురీది నోట్ల రద్దును ఆహ్వానిస్తే...నగదురహిత విధానాన్ని సిద్దిపేటలో అమలు చేసి చూపించిన నాయకుడు హరీశ్‌రావు అని కొనియాడారు. యావత్ తెలంగాణ జాతి హరీశ్‌రావు మీద ఆశలు పెట్టుకుందని, ఆయన శ్రమ ఒక్క ప్రాంతానికే పరిమితం కావొద్దన్నారు. ఆయన శ్రమ తెలంగాణ బీడు భూములను తడపాలని, రైతు ఆత్మహత్యలను నివారించాలన్నారు. తెలంగాణ వస్తే ఏమి చేయాలో కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పేవారని, రాష్ట్రం వస్తే భారీ నీటిపారుదల శాఖను హరీశ్‌రావుకు ఇస్తానని 2004లోనే కేసీఆర్ చెప్పినట్లు ఈటల చెప్పారు. భవిష్యత్తుపై రైతులకు కేసీఆర్ భరోసా: హరీశ్ ఏడాదికి రెండు పంటలకు రూ. 4 వేల చొప్పున రైతుకు ఆర్థిక సాయం అందిస్తామనడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కోర్టుల్లో రోజుకో కేసు వేస్తూ అడ్డుకోవాలని చూస్తూన్నారని విమర్శించారు. 60 ఏళ్లుగా వ్యవసాయాన్ని ఆగం చేసి రైతు ఆత్మహత్యలకు కారణమైనవాళ్లే ఇయ్యాల రైతు బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని మొసలికన్నీళ్లు కారుస్తూ పరామర్శలకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ముఖచిత్రం మారుతోంది
► మిషన్ కాకతీయ’తో సాగు, దిగుబడి ఎన్నడూ లేనంత పెరిగింది ► మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్‌రావు ► స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న ‘సాక్షి’ జర్నలిస్టు రాజశేఖర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్ర ముఖచిత్రం మారుతోందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణతో గతంలో ఎన్నడూ లేని విధంగా రబీలో సాగు ఏకంగా 17లక్షల ఎక రాలకు పెరిగిందని వెల్లడించారు. పంటల దిగుబడి సైతం మునుపెన్నడూ లేని స్థాయి లో 30 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండ నుందని స్పష్టం చేశారు. బుధవారం ఎర్ర మంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో ‘మిషన్ కాకతీయ మీడియా అవార్డులు– 2016’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరుకాగా, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, అవార్డుల ఎంపిక కమిటీ జ్యూరీ సభ్యులు.. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, చింతల ప్రశాంత్‌రెడ్డి, కట్టా శేఖర్‌రెడ్డితోపాటు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఈఎన్సీలు మురళీ ధర్, విజయ్‌ప్రకాశ్, కాడా కమిషనర్ మల్సూర్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండేలు హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లా డుతూ ఇప్పటికే ఈ కార్య్రక్రమంపై నీతి అయోగ్, హైకోర్టు, కేంద్ర మంత్రి ఉమా భారతి, కేంద్ర జలసంఘం నుంచి ప్రశంసలు దక్కాయని, వివిధ రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయని తెలిపారు. ఇకపై వీడియో, కెమెరా జర్నలి స్టులకు సైతం మిషన్ కాకతీయ అవార్డులు అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రం సస్య శ్యామలం కావాలంటే చెరువులన్నింటినీ పున రుద్ధరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ‘సాక్షి’కి స్పెషల్ జ్యూరీ అవార్డు.. మిషన్ కాకతీయ పురస్కారాల్లో స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైన ‘సాక్షి’జర్నలిస్టు సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, అల్లం నారాయణ తదితరులు అవార్డు ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.25 వేల నగదుతోపాటు మిషన్ కాకతీయ ప్రత్యేక మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు. ఇక ప్రింట్, ఎలక్ట్రానిక్ విభాగాల్లో ప్రథమ బహుమతి పొందిన వారికి రూ.లక్ష, ద్వితీయ బహుమతి పొందిన వారికి రూ.75వేలు, తృతీయ బహుమతి పొందిన వారికి రూ.50 వేల నగదు, ప్రత్యేక మెమెంటోలను అంద జేశారు. అవార్డులు పొందిన వారిలో ప్రింట్ మీడియా నుంచి గుండాల కృష్ణ (నమస్తే తెలంగాణ) గొల్లపూడి శ్రీనివాస్– (దిహిందూ), ఇ.గంగన్న (ఆంధ్రజ్యోతి), స్పెషల్ జ్యూరీ అవార్డు పొందినవారిలో దామ రాజు సూర్యకుమార్–(తెలంగాణ మ్యాగజైన్), సంగనభట్ల నర్సయ్య (తెలంగాణ మ్యాగజైన్), బి.రాజేందర్ (ఈనాడు) ఉన్నారు. ఇక ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో గోర్ల బుచ్చన్న– వీ6, యం.మాణికేశ్వర్– ఈటీవీ, బి.శివకుమార్– టీన్యూస్, స్పెషల్ జ్యూరీ అవార్డులు పొందినవారిలో దొంతు రమేశ్– టీవీ–9, బి.నరేందర్–టీవీ–5, స్పెషల్ కేటగిరీలో కంది రామచంద్రారెడ్డి (వీడియో ఫిలిం), తైదల అంజయ్య (వీడియో సాంగ్) ఉన్నారు. వీరితో పాటే ప్రోత్సాహక బహుమతి కింద బాసర ఆర్జీయూకేటీ విద్యార్థిని తేజస్వినికి రూ.10 వేల ప్రత్యేక బహుమతి అందజేశారు. -
‘మిషన్’ 3ని విజయవంతం చేయండి
⇒ మిషన్ కాకతీయ పనులపై ఎమ్మెల్యేలకు మంత్రి హరీశ్‌రావు లేఖ ⇒ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని సూచన ⇒ మూడో విడతలో 6,635 చెరువుల ఎంపిక సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మూడో దశను సైతం విజయవంతం చేయాలని రాష్ట్రంలోని శాసనసభ్యులను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. మిషన్ కాకతీయ పథకంకింద కొనసాగుతున్న రెండో విడత పనుల పూర్తికి, మూడో విడత పనులు జయప్రదం కావడానికి సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఎమ్మెల్యేలకు విడివిడిగా లేఖలు రాశారు. మిషన్ కాకతీయ రెండు విడతల ఫలితాలను మంత్రి తన లేఖలో సంక్షిప్తంగా తెలియజేస్తూ, తదుపరి విడతలో చేపట్టే పనులను వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం 17 వేల చెరువుల పునరుద్ధరణ పనులకు రూ.5,660 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు. పూడిక తీత, చెరువులకు నీటిని తరలించే ఫీడర్ కాలువల పునరుద్ధరణ, పంట కాలువల పునరుద్ధరణ, తూము, మత్తడి, ఇతర కట్టడాల మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి నిర్మించడం, చెరువుకట్టలను వెడల్పు చేసి బలోపేతం చేయడం, చెరువుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు, గుర్రపు డెక్క, మొదలైన వాటి నిర్మూలన, చెరువు శిఖంని గుర్తించి రాళ్ళు పాతడం, చెరువుకట్ట చుట్టూ హరితహారంలో భాగంగా చెట్లునాటడం తదితర పనులను చేపట్టినట్టు మంత్రి వివరించారు. సాగులోకి 15 లక్షల ఎకరాలు.. మిషన్ కాకతీయ పథకం ప్రారంభించటానికి ముందు రాష్ట్రంలో చెరువుల కింద అత్యధికంగా సాగు అయిన భూమి 10.7 లక్షల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది ఏకంగా 15లక్షల భూమి సాగులోకి వచ్చిందని మంత్రి హరీశ్ తెలిపారు. త్వరలో మూడో విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడానికి అన్ని విధాలుగా సాగునీటి శాఖ సిద్ధమయిందన్నారు. ఈ నేపథ్యంలో మూడో విడత విజయవంతానికి ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు. అన్ని జిల్లాల్లో కలిపి మూడో విడతలో మొత్తం 6,635 చెరువులను ఎంపిక చేశామని, ఇందులో 4 వేల చెరువులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని చెప్పారు. మూడో విడత పనులకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను మొదలు పెట్టాలని, నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రతీ సందర్భంలో చెరువుల పనులను తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలను కోరారు. ప్రజల భాగస్వామ్యంతో, అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. -
వేగంగా ‘ కాకతీయ’ మూడో విడత!
6,250 చెరువుల పునరుద్ధరణే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మూడో విడత పనుల్లో చిన్న నీటి పారుదల శాఖ వేగం పెంచింది. ఓవైపు పరిపాలనా అనుమతులు, మరోవైపు టెండర్లు, ఇంకోవైపు పనుల ఆరం భాన్ని వేగంగా పూర్తి చేస్తోంది. ఈ విడతలో 6,250 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్న శాఖ ఇప్పటికే రూ.1,959.82 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చింది. మొత్తంగా 46,531 చెరువులను లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 8,045 పనులను ఆరంభించింది. ఇందులో రూ.1,632 కోట్ల తో 8,022 చెరువుల పనులను శాఖ పూర్తి చేసింది. ఇక రెండో విడతలో 9,016 చెరు వులకు అనుమతులివ్వగా ఇందులో రూ.1,966.78 కోట్ల వ్యయంతో కూడిన 8,887 చెరువుల పనులను ఆరంభించారు. రెండో విడత పనులకు జూన్ డెడ్ లైన్ ఇక గతేడాది రెండో విడత ఆరంభ సమ యానికే మొదటి విడత చెరువులే భారీగా పెండింగ్ ఉండటంతో రెండో విడత చెరు వుల పునరుద్ధరణ మార్చిలో ఆరంభమైంది. దీంతో పనులు చేసేందుకు జూన్, జూలై వరకు కేవలం 3 నెలల సమయమే దొరి కింది. అనంతరం భారీ వర్షాల వల్ల చాలా చెరువుల్లో నీరు చేరడంతో పనులు ఆలస్య మయ్యాయి. తిరిగి జనవరి నుంచి పనులు ఆరంభించినా ఇప్పటివరకు కేవలం 3,500 చెరువులను మాత్రమే పూర్తి చేయగలిగారు. మరో 6,500 చెరువులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి పూర్తికి ఈ ఏడాది జూన్ టార్గెట్‌గా నిర్ణయించారు. ఇక రెండో విడత పనుల జాప్యం కారణంగా మూడో విడతలో కేవలం 6,250 చెరువులకు మాత్రమే శాఖ పరిమితం అయింది. ఇందులోనూ వర్షాలు తక్కువగా కురిసిన మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల చెరువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక గతేడాది వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను మూడో విడతలో ప్రాధాన్యం కల్పించారు. ప్రస్తుతం వరకు రూ.1,959.82 కోట్లతో 6,250 చెరువులకు అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా, అందులో రూ.1,079.48 కోట్లతో 3,889 చెరువులకు ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు వచ్చాయి. ఇందులోనూ 2వేల చెరువులకు టెండర్లు పిలవగా, సుమారు వెయ్యి పనులు మొదలయ్యాయి. ఈ వారం లోనే మరో 2వేల చెరువులు ఆరంభించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మూడో విడత చెరువుల్లో వీలైనన్ని ఎక్కువ చెరువు లను పూడికతీత ద్వారా జూలై నాటికి సిద్ధం చేయాలని మిగతా పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. -
ప్రజా భాగస్వామ్యంతోనే ‘మిషన్’ సక్సెస్
⇒ చెరువుల పునరుద్ధరణపై కేంద్ర బృందానికి వివరించిన హరీశ్ ⇒ పథకం దేశానికే ఆదర్శమన్న కేంద్ర బృందం సాక్షి, హైదరాబాద్: ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ పథకం విజయవంతమవుతోందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెరువుల పునరుద్ధరణను ప్రభుత్వ కార్య క్రమంలా కాకుండా ప్రజలను భాగస్వాములు చేయడంతో ఇది ప్రజా ఉద్యమంగా రూపొందిందన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం మంగళవారం హరీశ్‌రావుతో జలసౌధలో సమావేశమైంది. కేంద్ర బృందంలోని వివిధ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు మిషన్ కాకతీయ కార్యక్రమం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో చెరువుల మరమ్మతు పనులు గ్రామస్తులకు కూడా తెలిసేవి కావని... ఇప్పుడు ప్రజల సమక్షంలో ఉత్సవంలా పనులు జరుగుతున్నాయన్నారు. మైనర్ ఇరిగేషన్ పనుల్లో గతంలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేదని, దాన్ని తాము సమూలంగా నిర్మూలించామన్నారు. పథకం ప్రారంభించే ముందు సీఎం కేసీఆర్ నెలల తరబడి, వేలాది గంటలు మేధో మథనం చేశారని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకొని మిషన్ కాకతీయను రూపొందించారన్నారు. ఆన్లైన్లోనే పనుల టెండర్లు, బిల్లుల చెల్లింపులు జరుపుతున్నందున అవినీతికి అవకాశం లేకుండా చేశామని, ప్రతి అడుగులోనూ పారదర్శకత పాటిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. పలు సంస్కరణల ద్వారా పనుల అంచనాలు, అనుమతులు, టెండర్ల ప్రక్రియ, బిల్లుల చెల్లింపు వంటి వాటిని సులభతరం చేశామన్నారు. ఎన్ఆర్ఐలు, పోలీసులు, జర్నలిస్టులు ఇతర అధికారులు కూడా తమ ప్రాంతాల్లో ఒక్కో చెరువును దత్తత తీసుకొని పనులు చేపట్టారని హరీశ్‌రావు కేంద్ర బృందానికి వివరించారు. చెరువుల పూడికతీతకు ముందే మట్టి నమూనా పరీక్షలు చేస్తున్నామని, పూడిక మట్టిని రైతులు పొలాల్లో వాడుతుండటంతో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి పంటల దిగుబడి పెరిగిందన్నారు. ‘మిషన్’ అద్భుతం: కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ సమావేశం అనంతరం కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ సి.కె.ఎల్.దాస్ మీడియాతో మాట్లాడుతూ సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే లక్ష్యంతో సాగుతున్న మిషన్ కాకతీయ అద్భుతమని ప్రశంసించారు. దీన్ని దేశమంతా అమలు చేసేందుకు అధ్యయనం చేయాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి తమను తెలంగాణకు పంపారన్నారు. ఈ పథకం పనుల అనుభవాలు, సమాజంపై వాటి ప్రభావం గురించి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తామని భోపాల్ సీడబ్ల్యూసీ సీఈ ఎస్.కె.హల్దర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్.కె.జోషీ, ఇరిగేషన్ కార్యదర్శి వికాశ్‌రాజ్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, సీఈలు కె.సురేష్, శ్యామ్‌సుందర్, లిఫ్ట్ పథకాల సలహాదారు పెంటారెడ్డి, శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయలో మాయ
► అవినీతి కాంట్రాక్టర్లకు వత్తాసు ► బ్లాక్ లిస్ట్‌పై జాప్యం ► జాబితా రాకముందే మూడోదశ టెండర్లు ► పనుల కోసం అక్రమ కాంట్రాక్టర్ల యత్నాలు ► సాగునీటి శాఖ తీరుపై విమర్శలు మిషన్ కాకతీయలో మళ్లీ మాయ జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి దశ పనుల్లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు తాజాగా పనుల కోసం టెండర్లు వేస్తున్నారు. అక్రమార్కుల నుంచి నిధులను రికవరీ చేయాల్సి ఉండగా... టెండర్లలో మళ్లీ వారికే కొత్త పనులు వచ్చే పరిస్థితి ఉండడం సాగునీటి శాఖలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి, వరంగల్ : చిన్న నీటి వనరుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో... ఉమ్మడి వరంగల్‌లో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం గత సంవత్సరం నవంబర్‌లో నిర్ధారించింది. సాగునీటి శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ప్రభుత్వ నిధులను స్వాహా చేశారని విచారణలో గుర్తించింది. అక్రమాలకు బాధ్యులైన 13 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉమ్మడి జిల్లాలో 19 మంది కాంట్రాక్టర్లు మిషన్ కాకతీయలో పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని, కొన్నిచోట్ల తక్కువగా పనులు చేసి ఎక్కువ నిధులు తీసుకున్నారని విజిలెన్స్ విభాగం గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన వి.సోమేశ్వరరావు, ఇ.ఐలయ్య, కె.నాగరాజు, కె.వెంకటేశ్వరరెడ్డి, ఎస్.కొమురుమల్లు, ఎన్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎస్.కె.మహమ్మద్, జి.జగదీష్‌రెడ్డి, ఎ.రాజేందర్, బి.మహేందర్, పి.శ్రీనివాసరెడ్డి, ఎ.క్రిష్ణారెడ్డి, ఎం.రాజు, ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, జి.నర్సయ్య, సి.హెచ్.శ్రీనివాస్, సె.బిజామ్, జి.సంపత్‌రావు, ఎన్.వెంకన్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని సూచించింది. వీరి నుంచి రూ.1.70 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్లపై చర్యల విషయంలో సాగునీటి శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. మరోవైపు మిషన్ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ దశలో 630 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 330 చెరువుల పనుల కోసం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు మూడో దశ పనులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాంకేతికంగా వీరిని బ్లాక్ లిస్టులో చేర్చకపోవడంతో వీరికీ పనులు దక్కించుకునే అవకాశం ఉంటోంది. ఈ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన విచారణ నివేదికను, ప్రతిపాదలను 2016 నవంబరులో ప్రభుత్వానికి సమర్పించింది. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, సాగునీటి శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. సాగునీటి శాఖ అధికారులు నింపాదిగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పందించింది. విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై 13 మంది అధికారులపై చర్యలు తీసుకున్నది. ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. మరో ఆరుగురు అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకున్నది. ఇంకా ఆదేశాలు రాలేదు మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విబాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా సాగునీటి శాఖ ఉన్నత స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకున్నది. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చే విషయంలో ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారమూ లేదు. ఉన్నతస్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు ఇక్కడ నిబంధనలు అమలు చేస్తాం. -ఎ.శ్రీనివాస్‌రెడ్డి, సాగునీటి శాఖ జిల్లా అధికారి -
మిషన్ కాకతీయకు సీడబ్ల్యూసీ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం ప్రశంసలు కురిపించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేలా ఈ కార్యక్రమం ఉందని కితాబిచ్చింది. కరువు పీడిత ప్రాంతాలకు చెరువుల పునరుద్ధరణకు మించిన ఆయుధం మరొకటి లేదని అభిప్రాయపడింది. ఆదివారం నగరానికి వచ్చిన సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని 30 మంది ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయింది. సమావేశం అనంతరం ఈ బృందం పూర్వ మెదక్ జిల్లాలోని పలు చెరువులను పరిశీలించింది. -
యాసంగిలో 19 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం
⇒ అద్భుతమైన ఫలితాలు వస్తాయి: హరీశ్‌రావు ⇒ పూడిక మట్టితో ఖరీఫ్ పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది ⇒ మిషన్ కాకతీయ, సాగునీటి పనులపై అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత యాసంగిలో దాదాపు 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి నట్టు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. మిషన్ కాకతీయలో తీసిన పూడిక మట్టితో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఐదేళ్లలో రాని రీతిలో గణనీయంగా పంటల దిగుబడి వచ్చిందని, ఈ యాసంగిలోను అద్భుతమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. శుక్ర వారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మొదటి, రెండో విడత మిషన్ కాకతీయతోపాటు మూడో విడత కింద చేపట్టనున్న పనులను సమీక్షించారు. దీంతో పాటు భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. మూడో విడత మిషన్ కాకతీయలో మంజూరైన చెరువుల మట్టిని సాయిల్ టెస్టు చేయించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేసి ఘనంగా ఉత్సవాలు జరిపి మూడో విడత పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఏడాది కుమ్రం భీం ప్రాజెక్టును పూర్తి చేసి 45 వేల ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగునీరందించనున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ–2 ను ఈ ఏడాది ఖరీఫ్ కల్లా పూర్తి చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. దీంతో సూర్యాపేట జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ ఇతర మధ్య తరహా ప్రాజెక్టుల కింద గ్యాప్ ఆయకట్టును పూడ్చాల్సి ఉందన్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా సాగునీటి వనరుల కింద వాస్తవ ఆయకట్టు నిర్ధారించాలని, ఇందుకు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. గ్యాప్ ఆయకట్టును పూడ్చేందుకు ‘ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, సాగునీటి నిర్వహణ’ (క్యాడ్ వామ్) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకోవాలని పేర్కొన్నారు. 7న ఢిల్లీలో సమావేశం.. గ్యాప్ ఆయకట్టుపై ఏప్రిల్ 7న కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు హరీశ్ చెప్పారు. ఇరిగేషన్ అధికారులు క్యాడ్‌వామ్ కింద ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం క్యాడ్‌వామ్‌ను అమలు చేయనుందని తెలిపారు. మిషన్ కాకతీయ–2 పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. మత్తడివాగు, సాత్నాల వంటి ప్రాజెక్టుల పనుల పురోగతిని స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను కోరారు. శనిగరం చెరువు ఆధునీకరణ పనులు వెంటనే ప్రారంభించాలని సిద్దిపేట జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. -
సామాజిక ఒత్తిడి పెరగాలి
⇒ ప్రాజెక్టులకు అడ్డుపడే శక్తులపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య ⇒ మిషన్ కాకతీయతో మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడి ⇒ ‘జల సంరక్షణ –సామాజిక బాధ్యత’ అంశంపై సెమినార్ సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలో కొన్ని చట్టాలతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ చట్టాలను అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ శక్తులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి. ప్రాజెక్టులు ఆలస్యమైతే వాటి నిర్మాణ భారం పెరుగుతోందని, అంతిమంగా ఆ భారం ప్రజలపైనే పడుతోంది. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరిగి నిర్దేశించిన ఫలితాలు ఆలస్యమై ప్రజలకు అందాల్సిన ఫలాలు వేగంగా దక్కడం లేదు. ఈ దృష్ట్యా రాజకీయ కారణాలతో నీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న శక్తులపై సామాజిక ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు సాగుతాయి’ అని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయ పడ్డారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట్ లోని హరిత ప్లాజాలో ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ ఆధ్వర్యంలో ‘జల సంరక్షణ–సామాజిక బాధ్యత’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్‌కు మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర సాగునీటి పారుదల అభివృధ్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీపాటిల్, నీటి పారుదల రంగ నిపుణులు హాజరయ్యారు. కాకతీయతో 15.80 లక్షల ఎకరాలు సాగులోకి.. హరీశ్ మాట్లాడుతూ ‘మన నిర్లక్ష్యం వల్లే నీటి కష్టాలు, తాగునీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు సముద్రంపాలు కాకుండా భద్ర పరుచుకోవలసిన బాధ్యతను గుర్తించే ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చేపట్టింది. మిషన్ కాకతీయతో 15.80 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం. మొన్నటి వర్షాల వల్ల చాలా చెరువుల్లో నీళ్లు ఉన్నందున ఈసారి ఫీడర్ల మీద దృష్టి పెడుతున్నాం’ అని వివరించారు. సమృద్ధిగా వర్షాలు కురవడానికి ఆటవీ ప్రాంతాన్ని 30% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని కోసం 200 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ఇక రాష్ట్రంలో అవసరానికి మించి వరి పండుతోందని, కిలో బియ్యానికి 4 వేల లీటర్ల నీళ్లు అవసరం అవుతున్నాయని చెప్పారు. కూలీల అవసరం తక్కువ కాబట్టి చాలా మంది వరి పండిస్తున్నారని, దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో కూరగాయలు, ఇతర పంటలు పండించే అవకాశం ఉందని, ఈ విషయంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. -
అడ్డగోలు ఆరోపణలు చేస్తే..!
♦ చట్టపరంగా చర్యలు: సీఎం కేసీఆర్ ♦ అందుకోసం ‘ప్రూవ్ ఆర్ పెరిష్’ చట్టం తెస్తాం ♦ రాష్ట్రం అభివృద్ధి చెందితే వారికి మనుగడ ఉండదని ప్రతిపక్షాల భయం ♦ అందుకే ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం ♦ ప్రాణాన్ని పణంగా పెట్టి తెచ్చిన రాష్ట్రానికి నేను నష్టం చేస్తానా? ♦ గవర్నర్ ప్రసంగంలో ఒక్క అబద్ధం కూడా లేదు.. ♦ ఉన్నాయని నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తా ♦ ప్రతిపక్షాలకు ఓపిక లేకపోతే ఎలాగని నిలదీత ♦ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం సాక్షి, హైదరాబాద్: కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని.. అనవసరపు ఆరోపణలతో ప్రజలను తప్పు దారి పట్టించే యత్నం చేస్తున్నాయని ముఖ్య మంత్రి కేసీఆర్ మండిపడ్డారు. దీన్ని ఇక సహిం చబోమని.. రుజువులు చూపకుండా ఆరోప ణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేలా ‘ఫ్రూవ్ ఆర్ పెరిష్’చట్టాన్ని తీసుకొస్తామని హెచ్చరించారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా కేసీఆర్ సుదీ ర్ఘంగా ప్రసంగించారు. శుక్రవారం నాటి గవ ర్నర్ ప్రసంగం సందర్భంగా విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. అక్కసు వెళ్లగక్కుతున్నారు తెలంగాణ సత్వర అభివృద్ధి కోసం చెరువులను బాగు చేసే పని చేపట్టామని.. నాటి కాకతీయ రాజుల ఆశయాలకు తగ్గట్టుగా మిషన్ కాక తీయ పేరు పెట్టామని కేసీఆర్ చెప్పారు. కానీ ప్రతిపక్షాలు దాన్ని కమీషన్ కాకతీయగా అభి వర్ణిస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండి పడ్డారు. ‘‘ముగ్గురు సభ్యులుండే పార్టీ కూడా అసెంబ్లీలో తాను చెప్పినట్టే జరగాలంటే.. 90 మంది సభ్యులముండే అధికారపక్షం ఏమనుకోవాలి. వాటి ఆటలు సాగనివ్వం. నిరాధారంగా నిందలేస్తే ఇకపడం. అందుకే ‘ప్రూవ్ ఆర్ పెరిష్’చట్టం తెస్తాం. రుజువులు చూపకుండా ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం..’’అని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను హెచ్చరించారు. టెన్షన్లు లేని జీవితాన్ని బలిపెట్టి వచ్చా తన ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడి, ఎలాంటి టెన్షన్లు లేని జీవితాన్ని కాదనుకుని తెలంగాణ సాధన కోసం పోరాటం ప్రారంభించానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఓ దశలో రాష్ట్రం కోసం ప్రాణాన్నే బలిపెట్టేందుకు సిద్ధపడ్డ తాను తెలంగాణకు నష్టం చేస్తానని ప్రతిపక్షాలు ఎలా అంటాయని ప్రశ్నించారు. ‘‘మంచి చేయకపోయినా పర్వా లేదు. రాష్ట్రానికి చెడు చేసే అధికారం నాకు లేదు. అందుకే పరిస్థితిని గమనిం చేందుకు ఏడాదిన్నర పాటు వేచి చూసి 2016–17లో ప్రణాళికలను పట్టాలెక్కించాం. సుపరిపాలన వల్ల వృద్ధి రేటు 21 శాతానికి చేరుకుంది. ఇది గుజరాత్లో తనవల్ల సాధ్యం కాని వేగమంటూ స్వయంగా ప్రధాని మోదీ భుజాలు తట్టి అభినందించారు. ఇక తెలంగాణ ప్రగతి వేగాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కోర్టు కేసులు, స్టేలతో కాంగ్రెస్ నేతలు వేస్తున్న అడ్డుపుల్లలు కేవలం స్పీడ్ బ్రేకర్ల లాంటివే. అవి వేగాన్ని కొంత తగ్గిం చగలవు, కానీ నిలువ రించలేవు..’’అని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసేందుకు వ్యవ సాయం, చేపలు, గొర్రెల పెంపకం వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. నా రాజకీయ జీవితంలో తొలిసారి గతంలో అసెంబ్లీ సమావేశాలనగానే ఎండిన పైర్లు, ఖాళీ బిందెలు, వెలుగు లేని కందిళ్లు తెచ్చి ప్రదర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా ఉండేదని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక తన రాజకీయ జీవితంలో తొలిసారిగా అలాంటివేవీ లేకుండా సభలు జరగటం చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘‘విశేష అనుభవం, సేవాభావం ఉన్న అధికారులకు కరెంటు కష్టాలు తీర్చే బాధ్యత అప్పగించా. వారు అద్భుతాలు చేశారు. కరెంటు సమస్య లేకుండా రైతు కళ్లలో ఆనందం నింపటమే కాకుండా పరిశ్రమలు తెలంగాణకు క్యూ కట్టేందుకు కారణమయ్యారు. ఇందుకు కారణమైన ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు సభ సాక్షిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..’’అని పేర్కొన్నారు. నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తా.. గవర్నర్ ప్రసంగంలో ఒక్క వాక్యం తప్పు లేదని... అబద్ధం చెప్పాల్సిన అవసరం తమకు లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘మేం చెప్పినట్లుగానే 2019 కల్లా లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 20–24 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి మీరు (కాంగ్రెస్ సభ్యులు) గవర్నర్ మాట్లాడితే అపహాస్యం చేస్తారా? ఇదేనా సంస్కారం? నేను చాలెంజ్ చేస్తున్నా. గవర్నర్ ప్రసంగంలో ఒక్క వాక్యం తప్పు ఉన్నా, అతిశయోక్తి ఉన్నట్టు నిరూపించినా.. ఐదు నిమిషాల్లో రాజీనామా చేసి ఇంటికి వెళతా..’’అని సవాల్ చేశారు. వెకిలిగా ప్రవర్తించినందుకే చర్యలు గవర్నర్ ప్రసంగించే సమయంలో టీడీపీ సభ్యులు వెకిలిగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం వల్లే చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ వాకౌట్ చేసి వెళ్లిందని.. ప్రతిపక్షాలకు ఓపిక లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. గతంలో మైకులు విరగగొట్టలేదా? గవర్నర్‌పై పేపర్లు చించి వేయలేదా అని సభ్యులు మాట్లాడుతున్నారని.. అది ఏపీ శాసనసభ, అప్పుడు పరిస్థితి వేరని చెప్పారు. ఇప్పుడు కూడా అలా జరగాలనడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత సమావేశాల్లోనే ముస్లిం రిజర్వేషన్ బిల్లు ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల హామీకి కట్టుబడి ఉన్నామని, ఈ సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. సుధీర్ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ముస్లింల వెనుకబాటును అం చనా వేసేందుకు బీసీ కమిషన్ వివరాలు సేకరిస్తోందని, త్వరలోనే నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, కాంట్రాక్టు సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ, వీఆర్ఏల జీతం పెంపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ, కొత్త జిల్లాల ఆవిర్భావం, లక్ష ఉద్యోగాల కల్పన తది తర అంశాలపైనా కేసీఆర్ ప్రసంగించారు. హోంగార్డుల క్రమబద్ధీకరణ అంశంపై ఈ సమావేశాల్లోనే ప్రకటన ఉంటుందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని కేసీఆర్ పేర్కొన్నారు. -
మిషన్ కాకతీయ అవార్డులివే..
‘సాక్షి’ రిపోర్టర్ సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డికి స్పెషల్ జ్యూరీ అవార్డు సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ రెండో దశ(2016) అవార్డులను నీటిపారుదల శాఖ సోమవారం ప్రకటించింది. ఇందులో ‘సాక్షి’ సీనియర్ రిపోర్టర్ సోమన్నగారి రాజశేఖర్ రెడ్డికి స్పెష ల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద రూ.25 వేల ప్రైజ్ మనీతోపాటు నీటి పారుదల శాఖ ప్రత్యేక మెమొంటో ఇవ్వనుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ విభాగాల్లో ప్రథమ బహుమతి పొందిన వారికి రూ.లక్ష, ద్వితీయ బహుమతి పొందిన వారికి రూ.75 వేలు, తృతీయ బహుమతి పొందిన వారికి రూ.50 వేల ప్రైజ్‌మనీ, ప్రత్యేక మెమొంటో ఇవ్వ నున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు పొందిన వారికి రూ.25 వేల నగదు బహుమతి ఇస్తారు. స్పెషల్ కేటగిరీ కింద రెండు అవార్డులను ప్రకటించారు. వారికి రూ. లక్ష ప్రైజ్‌మనీ ఇవ్వను న్నారు. వివిధ వర్గాలు, వృత్తులు, ప్రజలపై చెరువు ల పునరుద్ధరణ ప్రభావం అంశంపై పత్రికల్లో వచ్చిన విశ్లేషణాత్మక కథనాలను ఎంట్రీలుగా స్వీకరించారు. వాటిని ప్రభుత్వం నియమించిన న్యాయ నిర్ణేతల కమిటీ క్షుణ్నంగా పరిశీలించింది. అవార్డులు వీరికే.. ప్రింట్ మీడియా: గుండాల కృష్ణ–నమస్తే తెలంగాణ (ప్రథమ), గొల్లపూడి శ్రీనివాస్–ది హిందూ (ద్వితీయ), ఇ.గంగన్న–ఆంధ్రజ్యోతి (తృతీయ) స్పెషల్ జ్యూరీ అవార్డులు: దామరాజు సూర్యకుమార్ (చరిత్ర పరిశోధన)–తెలంగాణ మ్యాగజైన్, సంగనభట్ల నర్సయ్య–తెలంగాణ మ్యాగజైన్, సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి–సాక్షి దినపత్రిక, బి.రాజేందర్–ఈనాడు. ఎలక్ట్రానిక్ మీడియా: గోర్ల బుచ్చన్న– వీ6 (ప్రథమ), యం.మాని కేశ్వర్–ఈటీవీ (ద్వితీయ), బి.శివకుమార్– టీన్యూస్ (తృతీయ) స్పెషల్ జ్యూరీ అవార్డులు: దొంతు రమేశ్–టీవీ–9, బి.నరేందర్–టీవీ–5. స్పెషల్ కేటగిరీ: కంది రామచంద్రారెడ్డి (వీడియో ఫిలిం), తైదల అంజయ్య(వీడియో సాంగ్)లు ఉన్నా రు. ప్రోత్సాహక బహుమతి కింద బాసర ఆర్జీయూ కేటీ విద్యార్థిణి తేజస్వినికి 10 వేల ప్రత్యేక బహుమతి ప్రకటించారు. జ్యూరీలో చైర్మన్‌గా అల్లం నారా యణ, సభ్యులుగా చింతల ప్రశాంత్‌రెడ్డి –రెసిడెంట్ ఎడిటర్ (ది హిందూ), కట్టా శేఖర్ రెడ్డి–ఎడిటర్ (నమస్తే తెలంగాణ), ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఉన్నారు. అవార్డులు పొందిన జర్నలిస్టులకు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. -
‘మిషన్ కాకతీయ’ అక్రమార్కులపై వేటు!
ఏడుగురు సస్పెన్షన్.. ఆరుగురిపై శాఖా పరమైన చర్యలు సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ ఇంజనీర్లపై వేటు పడింది. చెరువు పనుల్లో అక్రమాలు రుజువు కావడంతో ఏడుగురు ఇంజనీర్లపై సస్పెన్షన్ విధిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరుగురు ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. 36 మంది కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు, వారి నుంచి సొమ్ము రాబట్టాలని నిర్ణయించింది. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ డివిజన్లో మిషన్ కాకతీయ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. మట్టి పని చేయకుండానే చేసినట్లు, తక్కువ మట్టి తీసి ఎక్కువగా తీసినట్లు ఇంజనీర్లు రికార్డులు సృష్టించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరిశీలించకుండానే పని జరిగినట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీనిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు గతేడాది సెప్టెంబర్‌లో నిర్ధారించింది. దీనికి 13 మంది ఇంజనీర్లను బాధ్యులుగా తేల్చింది. వీరిలో నిర్మాణ విభాగం, నాణ్యతా విభాగానికి సంబంధించిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 8 మంది ఏఈలు ఉన్నారు. ఇందులో 12 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఒక డీఈఈపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. విజిలెన్స్ సూచనలకు అనుగుణంగా గురువారం నలుగురు ఏఈఈ, ఇద్దరు డీఈ, ఒక ఈఈపై సస్పెన్షన్ వేటు పడగా, క్వాలిటీ కంట్రోల్ ఈఈ, ఒక డీఈఈ, మరో నలుగురు ఏఈఈలపై శాఖా పరమైన చర్యలు తీసుకోనుంది. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కాంట్రాక్టర్ల నుంచి రూ.2కోట్ల వరకు రికవరీ చేయనున్నారు -
రాష్ట్రానికి మహారాష్ట్ర బృందం
మిషన్ కాకతీయపై అధ్యయనానికి మూడు రోజుల పర్యటన సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ అమలు తీరును అధ్యయనం చేసేందుకు ఈ నెల 13న ఐదుగురు సభ్యులతో కూడిన మహారాష్ట్ర బృందం హైదరాబాద్ రానుంది. మూడు రోజులపాటు ఈ బృందం క్షేత్ర స్థాయి పర్యటనలు చేయడంతోపాటు సాగు నీటి పారుదల అధికారులతో సమావేశం కానుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర బృందానికి వసతితోపాటు క్షేత్రస్థాయి పర్య టనలకు అవసరమైన ఏర్పాట్ల కోసం ఒక లైజన్ అధికారిని నియమించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు శని వారం ఆదేశించారు. కాకతీయను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశం సించడమే కాకుండా దీనిపై అధ్యయనం చేసి అమలు చేయాలని తమిళనాడుకి సూచించారని హరీశ్ తెలిపారు. తమిళనాడు బృందం కూడా రానున్నట్లు కొద్దిరోజుల క్రితం సమా చారం వచ్చిందన్నారు. తెలంగాణవ్యాప్తంగా 46,531 చిన్న నీటి వనరుల పునరుద్ధరణ లో భాగంగా దశల వారీగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 11 వేల చెరువులకు పునర్జన్మ లభించిందని, రూ.5,700 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులతో మిషన్ కాకతీయ–1, మిషన్ కాకతీయ–2 కింద 17 వేల చెరువుల పనులను ప్రభుత్వం చేపట్టిం దని వివరించారు. ఇప్పటివరకు రూ.1,800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ రెండు విడతలలో దాదాపు 15లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని, ఇప్పటివరకు దాదాపు 5 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అంచ నా వేస్తున్నట్టు మైనర్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మిషన్ కాకతీయ తొలిదశలో 4 కోట్ల 74 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత జరిగిందని, రెండు విడతలలో కలిపి 8 కోట్ల 27 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్టు సీఈ బి.నాగేందర్ రావు తెలిపారు. -
నెలాఖరులోగా పంపండి
‘మిషన్ కాకతీయ’మూడో విడత ప్రతిపాదనలపై మంత్రి హరీశ్ • మూడో విడత పనులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మూడో విడత ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా పంపాలని, తర్వాత ఎలాంటి ప్రతిపాదనలకు మంజూరు ఉండదని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. మార్చిలో వచ్చే ప్రతిపాదనలను నాలుగో విడతకు మళ్లిస్తామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మిషన్ కాకతీయపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో విడతలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పంపడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యకమంలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం తగదని సూచించారు. మూడో విడత పనుల ప్రతిపాదనల్లో పాత మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పిన మంత్రి.. ఆ జిల్లా ఎస్ఈ పద్మారావు, ఇతర అధికారులను అభినందించారు. త్వరగా ముగించండి. మిషన్ కాకతీయ మొదటి, రెండో విడతల్లో చేపట్టిన పనులు, పురోగతి, కొన్ని చోట్ల పూర్తి కాకుండా ఇంకా మిగిలిపోవడానికి గల కారణాలు, ఇతర అంశాలను సైతం మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. మిషన్ కాకతీయ తొలి విడత కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరులోగా ముగించాలని.. ఇప్పటికే రెండో విడతలో ప్రారంభించిన పనులను జూన్ చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని సూచించారు. తెలంగాణ అంతటా ప్రతి సాగునీటి వనరు కింద వాస్తవ ఆయకట్టును నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఆయకట్టు రీ లోకలైజేషన్ కోసం వీలైనంత త్వరగా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని హరీశ్ ఆదేశించారు. ‘మిషన్ కాకతీయ’ అవార్డుల కమిటీ భేటీ మిషన్ కాకతీయ–2 మీడియా అవా ర్డుల న్యాయనిర్ణేతల కమిటీ తొలి సమా వేశం శుక్రవారం సచివాలయంలో జరిగిం ది. జ్యూరీ చైర్మన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సభ్యులు చింతల ప్రశాంత్‌రెడ్డి (రెసిడెంట్ ఎడిటర్, హిందూ), కట్టా శేఖర్‌రెడ్డి(ఎడిటర్, నమస్తే తెలంగాణ) తదితరులు సమావేశమై అవార్డుల ఎంట్రీల ను పరిశీలించారు. దీనిపై వచ్చే వారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. అనం తరం వారు మంత్రి హరీశ్‌రావుతో సమావే శమై.. అవార్డుల ఎంపిక విధివిధానాలపై చర్చించారు. అవార్డుల ఎంపికను త్వరగా పూర్తిచేస్తే.. మార్చిలో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి వారికి తెలిపారు. ఇక మిషన్ కాకతీయతో వస్తున్న ఫలితాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పెనుమార్పులపై సాగునీటి శాఖ రూపొం దించిన డాక్యుమెంటరీని అవార్డుల కమిటీ తిలకించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపే తానికి ‘మిషన్’ అద్భుతంగా పనిచేస్తున్న దని మంత్రి వివరించారు. పూర్వ మహబూ బ్‌నగర్ జిల్లాలో కూలీల వలసలు ఆగిపో తుండడం గొప్ప మార్పన్నారు. -
'కాకతీయ’తో వలసలు వెనక్కు!
మంత్రి హరీశ్‌కు అధికారుల వివరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులన్నీ కళకళలాడుతుండటంతో గ్రామాల నుంచి వలస వెళ్లిన రైతు కూలీలు, వివిధ వృత్తుల వారు తిరిగి గ్రామాలకు వస్తున్నారని నీటి పారుదల శాఖ అధికారులు మంత్రి హరీశ్ రావుకు వివరించారు. సోమవారం మిషన్ కాకతీయ 1, 2, 3వ విడత పనుల పురో గతిని సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరీశ్ సమీక్షించారు. ఈ సంద ర్భంగా జిల్లాల అధికారుల నుంచి పనుల తీరుపై ప్రజా స్పందనను అడిగి తెలుసు కున్నారు. కొన్ని చెరువుల్లో వేసిన చేప పిల్లలు ఇప్పటికే 500 గ్రాములకు పైగా పెరిగాయని పేర్కొన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన హరీశ్.. నీరు అత్యంత విలువైన సహజ సంపదగా రైతుల్లో అవగాహన తీసుకు రావాలని సూచించారు. మూడో విడత పనులపై అసంతృప్తి.. మిషన్ కాకతీయ మూడో విడతలో చేపట్టే పనుల కోసం ఇప్పటివరకు 20 శాతం కూడా ప్రతిపాదనలు పంపకపోవడంపై హరీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 లోపు ప్రతిపాదనలు పంపించిన జిల్లాల ఇరిగేషన్ అధికారులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. పనిచేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులలో జాప్యాన్ని సహించబోనన్నారు. బిల్లుల చెల్లింపులపై ఫిర్యాదులు వస్తున్నా యని.. ఇంజనీర్లు తమ ధోరణి మార్చుకోవా లని హెచ్చరించారు. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, ఆ పనులను ఇతర కాంట్రాక్టర్లతో పూర్తి చేయాలని ఆదేశించారు. -
నత్తనడకన చెరువుల పునరుద్ధరణ పనులు
-
మిషన్.. పరేషాన్..!
నత్తనడకన చెరువుల పునరుద్ధరణ పనులు అధికారుల అక్రమాలతో మసకబారుతున్న ‘మిషన్ కాకతీయ’ ప్రభ ఇప్పటికే ఐదుగురు సస్పెన్షన్, నలుగురు ఏసీబీ కేసులో తాజాగా టేకులపల్లిలో ఈఈని అరెస్ట్ చేసిన సీబీసీఐడీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం నత్తనడక నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ మందకొడిగా సాగుతోంది. రెండేళ్ల కింద ప్రారంభించిన తొలి విడత పనుల్లోనే వెయ్యికి పైగా చెరువుల పనులు ఇంకా సాగుతుండగా... రెండో విడత చేపట్టిన వాటిలో కేవలం పది శాతం చెరువులే పూర్త య్యాయి. ఇక ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మూడో విడతకు అతీగతీ కనిపించడం లేదు. పనుల్లో తీవ్ర జాప్యానికి తోడు అధికారుల అక్రమాలతో ‘మిషన్ కాకతీయ’ ప్రభ మసక బారుతోంది. ఇంత మందకొడిగానా: మిషన్ కాకతీయ పథకంలో రెండేళ్ల కింద తొలి విడతగా 9,586 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 8,120 చెరువుల పనులను రూ.2,596 కోట్లతో చేపట్టారు. ఇందులోనూ 8,043 చెరువు పనులనే ప్రారంభించగా.. ఇప్పటివరకు 6,939 చెరువులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,104 చెరువుల పను లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక రెండో విడతలో 10,193 చెరువులను లక్ష్యంగా పెట్టు కోగా... 9,030 చెరువులకు పరిపాలనా అను మతులు మంజూరు చేసి, రూ.1,744 కోట్లతో 8,701 చెరువుల పనులను మొదలు పెట్టారు. వీటిలో ఇప్పటివరకు రూ.272 కోట్ల విలువైన 1,536 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 7,165 చెరువుల పనులు సాగుతూనే ఉన్నాయి. వీటి పూర్తికి ఈ ఏడాది మార్చిని తుది గడువుగా విధించినా.. అప్పటికి పూర్త య్యే అవకాశాలు కానరావడం లేదు. చెరు వుల పనులకు సరైన అనుభవం లేని కాంట్రా క్టర్లు ఇష్టారీతిన లెస్‌లకు టెండర్లు దాఖలు చేయడం, పని మొదలు పెట్టాక ఆ ధరలు సర్దుబాటు కాక పనులు చేయకుండా వదిలే యడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు బిల్లులు పాస్ కావాలంటే వివిధ స్థాయి ల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కమీష న్లు చెల్లించాల్సి రావడం, ఆ మొత్తాలు తడిసి మోపెడు కావడం సైతం పనులకు అడ్డుపడుతోంది. భారీగా బిల్లులు పెండింగ్.. మిషన్ కాకతీయ తొలి విడతకు సంబంధించి రూ.200 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రెండో విడత కింద రూ.2వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోవడం, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, పీఏవోల్లో వస్తున్న ఇబ్బందులతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపివేసినట్లుగా నీటిపా రుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడో విడత కింద ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, వర్షాలు సరిగా కురవని మహబూ బ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని చెరువులు కలిపి 3వేల చెరువులను పునరు ద్ధరించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నా వాటి అతీగతీ లేదు. జనవరి నాటికే చెరువుల ప్రతిపాదనలు సీఈ కార్యాలయానికి చేరాల్సి ఉన్నా ఆ ప్రక్రియే మొదలు కాలేదు. అధికారుల అక్రమాలతో.. ఇప్పటికే వేగం తగ్గిన పనులకు తోడు అధికారుల అక్రమాలు మిషన్ కాకతీయ ప్రతిష్టను మసకబారుస్తు న్నాయి. ఇప్పటికే కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటూ నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కగా... అంచనాల తయారీలో ఇష్టారాజ్యం, చేయని పనిని చేసినట్లుగా చూపడం, తక్కువ పనులను ఎక్కువ చేసి చూపడం వంటి కారణాలతో ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 12 మంది అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సులు కూడా వచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో అవక తవకలపై విజిలెన్స్ విచారణ జరుగు తుండగా, సోమవారం సత్తుపల్లి నియో జకవర్గ పరిధిలోని టేకులపల్లి సర్కిల్లో జరిగిన అవకతవకలకు బాధ్యుడిని చేస్తూ ఒక ఈఈని అరెస్ట్ చేయడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మిషన్ కాకతీయపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి తిరిగి పనులను వేగిరం చేయాల్సిన అవసరముంది. -
నాణ్యత లోపం
మిషన్ కాకతీయలో నాసిరకం పనులు నాణ్యతకు తిలోదకాలిచ్చిన కాంట్రాక్టర్లు చిన్నపాటి వర్షాలకే కోతకు గురవుతున్న కట్టలు పలు చెరువులకు గండ్లు బిల్లులు మాత్రం వేగంగా చెల్లింపు నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ సర్కారు గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు జలకళను సంతరింపజేయడం కోసం చేపట్టిన పథకం పనులు నాసిరకంగా ఉంటున్నాయి. మొదటి, రెండో విడతల్లో చేపట్టిన చెరువు కట్టలు చిన్నపాటి వర్షాలకే కోతకు గురవుతున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రెండో దశ పనులు మార్చి 31, 2017 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో మిషన్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిమెంట్ కాంక్రీట్ పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో పనులు నాసిరకంగా తయారయ్యాయి. చాలా చోట్ల రివిట్మెంట్ పనులు జరగక సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు కట్టలపై పగుళ్లు ఏర్పడ్డాయి. నూతన తూముల నుంచి లీకేజీలు ఏర్పడ్డాయి. నీటి పారుదల శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో పనులు నాసిరకంగా సాగుతున్నాయి. చెరువుల పనుల తీరు.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 3,251 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో మొదటి విడత కింద 671 చెరువులు ఎంపిక చేయగా.. 657 చెరువుల్లో మాత్రమే అగ్రిమెంట్ జరిపి పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 649 చెరువులు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది చెరువుల పనులు పూర్తికాలేదు. 657 చెరువులకు రూ.233.64 కోట్లు మంజూరు కాగా.. పనులు పూర్తయిన 649 చెరువులకు రూ.1.50 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా బిల్లులు పనుల పరిశీలన తర్వాత చెల్లించనున్నారు. ఇక రెండో విడతలో 646 చెరువులు ఎంపిక చేశారు. వీటి మరమ్మతుకు రూ.227.59 కోట్లు మంజూరయ్యాయి. పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నాసిరకం పనులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మూడు డివిజన్ల పరిధిలోని మిషన్ కాకతీయ మొదటి, రెండో విడతల్లో చేపట్టిన చెరువు పనులు నాసిరకంగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు దాదాపుగా పది చెరువులకు గండ్లు పడ్డాయి. రెండు చెరువుల కట్టలు పూర్తిగా తెగాయి. కట్టల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో రెండు విడతల్లో చేపట్టిన 70 శాతం చెరువు కట్టలకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల చెరువు మట్టిని కట్టబలోపేతం కోసం వాడారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉపాధిహామీ పథకం కింద ఉపాధి కూలీలు తీసిన మట్టిగుంతలను అధికారులకు చూపి పూడికతీత పేరిట బిల్లులు లేపారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అలాగే తూముల నిర్మాణం చేపట్టిన చాలా చెరువుల్లో షట్టర్లు బిగించక వర్షాకాలంలో నీరు వృథాగా పోయింది. షట్టర్లు బిగించిన చోట నీరు ఇప్పటికీ లీకేజీ అవుతోంది. మొరం తవ్వకాలతో చాలా చెరువుల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలకు ప్రాణసంకటంగా మా రింది. అలాగే చాలా చెరువుల్లో హద్దులు నిర్ణయించి క బ్జాలు బయటకు తీయకపోవడం వల్ల ఉమ్మడి జిల్లాల్లో 1,500 ఎకరాల శిఖం భూమి పరుల అధీనంలో ఉంది. రివిట్మెంట్మెంట్ పనులు ఈ చెరువుల్లో ఇప్పటివరకు ప్రారంభించకపోవడంలో కట్టలు పగుళ్లు పడ్డాయి. నాసిరకం పనులకు నిదర్శనం.. జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాకలోని మిషన్ కాకతీయ రెండో విడతలో కేటాయించిన దాదాలాయికుంట పనులు సగం పూర్తయిన తరువాత సెప్టెంబర్ కురిసిన భారీ వర్షానికి గండి పడి వరద నీరంతా వెళ్లిపోయింది.మిషన్ కాకతీయ పనుల్లో డొల్లతనం వల్ల పిట్లం మండలం రాంపూర్ రామసముద్రానికి గండిపడింది.కామారెడ్డి డివిజన్లో పెద్ద చెరువుగా పేరున్న బీబీపేట చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపం వల్ల తూముల నుంచి నీరు లీకేజీ అవుతోంది. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్ మండలం తడపకాల్ చెరువు కోతకు గురైంది. బాన్సువాడ మండలం హన్మాజీపేట పాత చెరువుకు మిషన్ కాకతీయ కింద రూ.36 లక్షలతో పనులు చేసిన కట్టబలోపేతంలో నాణ్యత లేకపోవడం వల్ల కోతకు గురైనది.భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలోని దొడ్డి చెరువు తూముకు గండిపడింది. -
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
• మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్ • పనులపై నిర్లక్ష్యం తగదు • ఫిబ్రవరి 15నాటికి 288 గ్రామాలకు నల్లా నీరు ఇవ్వాలి • మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అధికారుల తడబాటు, ప్రణాళిక లేకుండా పొంతనలేని సమాధానాలిచ్చిన మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ అధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్బెడ్రూమ్ ఇళ్లు, హరితహారం కార్యక్రమాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సమావేశానికి వివరాలు లేకుండా హాజరుకావడంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం కింద మూడో విడతకు జిల్లాలో 800 చెరువులు గుర్తించాలన్నారు. మిషన్ కాకతీయ మూడో విడతకు చెరువుల ఎంపికకు ఆయకట్టు సమస్య వస్తోందని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో స్పందించిన మంత్రి పొంతన లేని సమాధానాలు చెప్పవద్దన్నారు. 20 ఎకరాల కంటే ఎక్కువున్న చెరువుల లిస్టు చెప్పాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులను కోరడంతో వివరాలు తమ వెంట తీసుకురాలేదని వారు సమాధానం చెప్పారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమానికి సంబందించిన పనుల పురోగతిపై మంత్రి వివరాలడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పనుల నిర్వహణలో జాప్యాన్ని తెలుసుకున్న మంత్రి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని నిలదీశారు. నిర్ణీత గడువు ఫిబ్రవరి 15 వరకు 288 గ్రామాలకు తాగునీరు అందించే విధంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసుకొని వర్షాలు రాగానే మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించుకోవాలని డీఎఫ్ఓ గంగారెడ్డికు మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి : కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మిషన్ కాకతీయ మొదటి, రెండో విడత పనుల ను చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ల ను బ్లాక్ లిస్టులో పెట్టాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. 20 ఎకరాలకు పైగా ఆయకట్టున్న చెరువులు, కుంటలను మూడో విడతకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పాత పాలమూర్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ 100 గజాలు స్థలం కలిగిన లబ్ధిదారులకు ముందు గా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని హౌజింగ్ పీడీ రమణారావును ఆదేశించారు. స మావేశంలో ట్రైనీ ఐఏఎస్ గౌతం, ఆర్డీఓ లక్ష్మీ నారాయణ, చిన్ననీటి పారుదల, ఆర్డబ్ల్యూఎస్, హౌజింగ్, పంచాయతీరాజ్, ఫారెస్టు, గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికీ లబ్ధి...
ఆ మేరకు పాడి, మత్స్య, పశుసంవర్ధక నిధులు: తలసాని సాక్షి, హైదరాబాద్: ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరేలా పాడి, మత్స్య, పశుసంవర్ధక విభా గాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించను న్నట్లు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాల యంలో ఆ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేష్‌చందా, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మత్స్య శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పశుసంవర్ధక, పాడి, మత్స్య, గొర్రెలకు సంబంధించి వచ్చే బడ్జెట్లో ఏవిధమైన కార్యక్రమాలు చేపట్టాలి, అవసరమైన నిధులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఆ వివరాలను మీడియాకు వివరించారు. ప్రతి జిల్లాలో ఐదు మత్స్య మార్కెట్ల ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశామని తలసాని చెప్పారు. త్వరలో రెండు ఫిషరీస్ కళాశాలలు రాష్ట్రంలో రెండు ఫిషరీస్ కళాశాలలను త్వర లో ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే కాలం లో గ్రామాల్లోని చిన్న చెరువులు, రిజర్వాయ ర్లు, మిషన్ కాకతీయ చెరువులలో పెద్దఎత్తున చేప పిల్లలను పెంచాలని కార్యాచరణ ప్రణా ళిక రూపొందించామన్నారు. మత్స్యశాఖలో ఖాళీల భర్తీతో పాటు అదనపు పోస్టుల మంజూరు, కొత్త మార్కెట్ల ఏర్పాటు, ఆధునీ కరణ చేపట్టి రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతా లకు చేపలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాదులో చేపల మోడల్ మార్కెట్ల ఏర్పాటుకు సంబం ధించి సంక్రాంతి అనంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామన్నారు. గతంలో మత్స్య శాఖకు రూ.5కోట్లు కేటాయిస్తే రూ.కోటి కూడా ఖర్చు చేసేవారు కారని, ప్రస్తుతం రూ.101 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. పశు సం వర్ధక శాఖ ద్వారా 100 మొబైల్ వాహనాలను మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తామన్నారు. విజయ డెయిరీ తెలంగాణ అవుట్లెట్లను పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, హైవేల వద్ద పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. గోపాల మిత్ర సర్వీసులను విస్తృతంగా వినియోగిం చుకుంటామని తలసాని వెల్లడించారు. -
మిషన్.. సాగుతోంది!
నెమ్మదిగా మిషన్ కాకతీయ పనులు మొదటి దశలోనే 27 చెరువులు అసంపూర్తి రెండో దశలో 348 మాత్రమే పూర్తి మూడో దశ చెరువుల ఎంపికపై అస్పష్టత వరంగల్ : చిన్న నీటివనరుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆశించిన రీతిలో సాగడంలేదు. రెండేళ్ల క్రితం చేపట్టిన మొదటి దశ పనులే ఇంకా పూర్తి కావడం లేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5839 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలో 3,55,187 ఎకరాల ఆయకట్టు ఉంది. 5839 చెరువులను ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించారు. ప్రతి ఏటా 20 శాతం చొప్పున ఐదేళ్లలో అన్ని చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మిషన్ కాకతీయ మొదటి దశ కింద 2015లో 1059 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి ఏటా 20 శాతం చొప్పున చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఈ ఏడాది నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలతో అన్ని చెరువుల్లోనూ నీళ్లు ఉన్నాయి. దీంతో మిషన్ కాకతీయ పనులు చేపట్టే పరిస్థితి లేదు. మొదటి రెండు దశల్లో చేపట్టిన పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. మొదటి దశలో 1059 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అన్ని చెరువుల పనులు మొదలయ్యాయి. అందులో 1032 చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇంకా 27 చెరువుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన మొదటి దశ పనులు ఇప్పటికీ కొన్ని చెరువుల్లో పూర్తి కాలేదు. రెండో దశలో అభివృద్ధి చేసేందుకు సాగునీటి శాఖ అధికారులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1248 చెరువులను గుర్తించారు. అందులో 1085 చెరువులను మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సాగునీటి శాఖ అధికారులు 1075 చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. 1074 చెరువుల పనుల చేసేందుకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికి 323 చెరువుల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. -
నేతల మాటలు.. నీటిమూటలే..
► అభివృద్ధికి నోచుకోని అనంతారం ప్రాజెక్టు ►ఆనవాళ్లు కోల్పోతున్న కుడి, ఎడమ కాలువలు ►మిషన్ కాకతీయ’లో చేర్చని సర్కారు ఇల్లంతకుంట: ఎకరం పారకం లేని కుంటలు, చెరువులను మిషన్ కాకతీయ ద్వారా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం దాదాపు 10వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరందించే అనంతారం ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండలంలోని అనంతారంలో నిజాం రాజుల కాలంలో నిర్మించిన అనంతారం ప్రాజెక్టు పూడికతో పేరుకుపోవడంతో పాటు ఆనకట్ట పగుళ్లు వచ్చి భారీ వర్షాలు కురిసినప్పుడు నీరంతా వృథాగానే లీకైపోతుంది. మత్తడి నిర్మాణం, తూములు పాడైపోవడంతో గత మూడు నెలల క్రితం కురిసిన వర్షాలలకు ప్రాజెక్టు నిండింది. మూడు నెలలకే ప్రాజెక్టులోని నీళ్లన్నీ ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిండితే రహీంఖాన్ పేట, అనంతారం, తిప్పాపూర్, నారెడ్డిపల్లి, జంగంరెడ్డిపల్లి, గాలిపల్లి, ముస్కాన్ పేట, గాలిపల్లి, వంతడ్పుల, వల్లంపట్ల, కందికట్కూర్ గ్రామాల్లోని చెరువులకు నీళ్లు వెళ్లి 10వేల ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి రానున్నాయి. ఆనవాళ్లు కోల్పోతున్న కుడి,ఎడమ కాలువలు ప్రాజెక్టు నుంచి ఏర్పాటు చేసిన కుడి, ఎడమ కాలువల ద్వారా 8 వందల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేయగా అవి కాస్త ముళ్లపొదలు, చెట్లతో నిండుకుపోయాయి. ఒక్క ఎకరానికి కూడా నీరందించే పరిస్థితి లేదు.సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టించుకోని సర్కారు చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి పొలాలకు నీరందించడమే లక్ష్యమంటున్న ప్రభుత్వం ఒక్క ఎకరానికి సాగు నీరందించని చెరువులు, కుంటలు అభివృద్ధి చేస్తోంది, కానీ వేల ఎకరాలకు నీరందించే అనంతారం ప్రాజెక్టుపై నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రజలంటున్నారు. పలుమార్లు మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ నీటిపారుదల శాఖమంత్రికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు స్పందించి ప్రాజెక్టును మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. త్రిబులార్‌లో పెట్టామని ఏడాదిన్నర.. ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు త్రిబులార్ పథకంలో పెట్టామని నిధుల మంజూరవ్వగానే అభివృద్ధి చేస్తామని స్థానిక నాయకులు ఏడాదిన్నర నుంచి చెప్పుతున్నారు తప్ప ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. చిన్న చిన్న చెరువులు, కుంటలకు నిధులు మంజూరవుతున్నాయే తప్ప ప్రాజెక్టు కోసం నయాపైసా కూడా మంజూరు కావడం లేదు. -
రాష్ట్రంలో 30 వెనుకబడిన జిల్లాలు
♦ రూ.900 కోట్ల గ్రాంటు కేటాయించండి ♦ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చే వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధిని రెండింతలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో 30 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించాలని కోరింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను ఈ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గత రెండేళ్లుగా ఇస్తున్న రూ.450 కోట్ల నిధిని రూ.900 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు రాష్ట్రంలో పది జిల్లాలున్నాయి. అందులో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కు చేరిందని.. గతంలో ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలో ఏర్పడిన 30 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రతిపాదిం చింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కొత్త రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2015–16లో రాష్ట్రంలోని వెనుక బడిన జిల్లాల్లో అభివృద్ధి పనులకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేం ద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో రెండో విడత రూ.450 కోట్లు గత నెలలోనే కేటాయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పను లను మరింతగా విస్తరించాల్సిన అవసరమేర్ప డిందని, ఈ నేపథ్యంలో 2017–18లో వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే గ్రాంటును రూ.900 కోట్లకు పెంచాలని కోరింది. రూ.24,205 కోట్లకు కొర్రీ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెర్వుల పునరుద్ధరణకు కేం ద్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయిం చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మేరకు మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు కేటాయించాలని గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులు దీర్ఘకాలికమైనవని, ఎప్పుడో పూర్తవుతాయో తెలియదంటూ కేంద్ర ఆర్థిక శాఖ నిధులివ్వకుండా కొర్రీ వేసింది. వచ్చే రెండు మూడేళ్ల వ్యవధిలో వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖలో వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర బడ్జెట్లో నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మేరకు నిధుల కోటాను కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. స్థానిక సంస్థల కోటా ఏమైంది.. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను విధిగా విడుదల చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాని కి గుర్తు చేసింది. 2015–16లో పదమూడో ఆర్థిక సంఘం నిర్ధేశించిన మేరకు ఈ గ్రాంట్లు విడుదలయ్యాయి. ఆ ఏడాది రావాల్సిన రూ.778.73 కోట్లను కేంద్రం చివర్లో నిలిపేసింది. వాటిని ఆపేయడం సరైంది కాదని, వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
మిషన్ కాకతీయ.. అంతా మాయ l
నందిపేట మండలం గాదెపల్లి గ్రామంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గిలకమ్మ చెరువును మిషన్ కాకతీయ కింద చేర్చి రూ.17.20 లక్షలు కేటాయించారు. వర్ని మండలం జాకోర గ్రామంలో బ్రాహ్మణకుంట, అక్బర్‌నగర్‌లో ఎర్రకుంటలు 10 ఎకరాల విస్తీర్ణం లేకున్నా మిషన్‌కాకతీయ కింద తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎక్కలవినికుంటకు ఆయకట్టు లేకున్నా మిషన్ కాకతీయ కింద ఎంపికచేసారు. గాంధారి మండల కేంద్రంలో ఒక చెరువుకు ఆయకట్టు లేకున్నా ఆయకట్టును ఎక్కువ చూపుతూ మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ : సాగుభూములకు జీవనాడులుగా ఉన్న చెరువులు, కుంటలకు జలకళతో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం లక్ష్యం అధికారుల ఇష్టారాజ్యంతో నీరుగారుతోంది. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను వదిలి తక్కువ ఆయకట్టు ఉన్న కుంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆసలు ఆయకట్టు లేని కుంటలను, ఐదు నుంచి 20 ఎకరాల లోపు ఆయకట్టు గల కుంటలను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు ఎంపిక చేశారు. పలు మండలాల్లో అసలు తూములు, ఆలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపునకు గురైన చెరువులు, కుంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, నవీపేట మండలాల్లో ఇలాంటి చెరువులనే ఎంపిక చేసారు. ఇప్పటికే జిల్లాలో అత్యధిక కుంటల్లో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు, కట్టబలోపేతం పనులు చేయించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద ఖర్చుపెట్టిన రూ. 233.80 కోట్లలో సింహభాగం చెరువు పనులకే కేటాయించారు. దీంతో గుత్తెదారులు పూడికతీత కట్ట బలోపేతం పనులు వదిలి మిగతా పనులు చేస్తున్నారు. నామమాత్రంగా తూములు నిర్మించడం, మత్తడికి పై పూతలు పూసి మమ అనిపించేస్తున్నారు. పనులకు మంజూరైన నిధుల్లో పాతిక శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధులను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్ద చెరువులను వదిలేశారు.. జిల్లాలో ఆయకట్టు లేని కుంటలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇంజనీర్లు వందల ఆయకట్టు ఉన్న చెరువులను వదిలేసారు.పెద్ద చెరువులను మిషన్ కాకతీయ కింద తీసుకుంటూ లక్ష్యం నెరవేర్చడంలో విఫలం కావడం, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రాకపోవడం వంటి కారణాలతో ఇంజనీర్లు చిన్నకుంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో వదిలేసిన పెద్ద చెరువులు 40 వరకు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. Mission Kakatiya, sriransagar project, -
ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాసిపేట: ప్రభుత్వం ఓపెన్‌కాస్టుల(ఓసీ) పేరుతో భూములు స్వాధీనం చేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని, ఓసీలకు వ్యతిరేకంగా ప్రజలతో కలసి ఉద్యమి స్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం పాదయాత్ర బుధవారం మంచిర్యాల జిల్లా కాసిపేట, మందమర్రి మండలాల్లో సాగింది. ఈ సందర్భం గా వీరభద్రం మాట్లాడుతూ మిషన్ కాకతీయ ఎక్కడా రైతులకు ఉపయోగపడడం లేదని, కేసీఆర్ చెప్పినట్లు చెరువు గట్ల మీద రైతులు మేకలు కోసుకోవడం లేదని, కాంట్రాక్టర్లు మేకలు కోసుకుని విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. ఓపెన్ కాస్టు గనుల ఏర్పాటు, కేకే 2 ఓసీపీని వెంటనే ఉపసంహరించుకోవాలని, కొత్తగా ఏర్పాటు చేసే ఓపెన్ కాస్ట్‌ల స్థానంలో భూగర్భగనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలని సూచించారు. -
‘మిషన్ భగీరథ’ అక్రమాల పుట్ట!
టెండర్లన్నీ ముందస్తు ఒప్పందంపై జరిగాయంటూ కాంగ్రెస్ ఫైర్ ► సభా సంఘం లేదా సీవీసీతో విచారణ జరిపించాలి: భట్టి ► నీళ్ల కోసం పైపులా.. పైపుల కోసం నీళ్లా ► టెండర్లు అంత తక్కువ లెస్‌కు ఎందుకు వచ్చాయి? ► ఇందులో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోంది ► అంచనాలు, టెండర్లను సభ ముందుంచాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్న ‘మిషన్ భగీరథ’ పథకం అక్రమాల పుట్ట అని.. టెండర్ల ప్రక్రియ అంతా ముందస్తు ఒప్పందంపై జరిగినట్లుగా సందే హాలున్నాయని శాసనసభలో విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సభా సంఘం వేయా లని లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు ఈ పథకం డీపీఆర్‌పైనే అనేక అనుమానాలు ఉన్నాయని.. పనుల అంచనాలను రెండు మూడు రెట్లు పెంచి టెండర్లు పిలిచారనే ఆరో పణలున్నాయని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్ర మార్క పేర్కొన్నారు. స్థానిక వనరులను విని యోగించుకోకుండా ఎక్కడో రిజర్వాయర్లు నిర్మించి.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేసి నీళ్లివ్వడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఇలా కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీళ్లివ్వడం ద్వారా ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్ల పరిధిలోనే రూ.110 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. చెరువులను ఎందుకు వినియోగించుకోరు? రాష్ట్రవ్యాప్తంగా చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తున్నప్పుడు.. వాటి ల్లో పెద్ద వాటిని రిజర్వాయర్లుగా మార్చి నీటిని సరఫరా చేయవచ్చు కదా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు ఖర్చు పెడుతు న్నారని.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు లకు రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా రని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు రూ.1.4 లక్షల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ మొత్తం నీటిని పారిస్తామంటున్న ప్రభుత్వం... మళ్లీ రూ.45 వేల కోట్లతో ‘మిషన్ భగీరథ’ను ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు. చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయని ప్రభుత్వం భావించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఒకవేళ నీళ్లు వస్తాయనుకుంటే ఈ 45 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. అసలు వైఎస్సార్ హయాంలో నిర్మించిన శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్‌లైన్ నుంచే నీటిని తీసుకుని ‘మిషన్ భగీరథ’గా చెబుతూ గజ్వేల్ నియోజకవర్గానికి మళ్లించారన్నారు. పైగా దానిని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించి, తమ ఘనతేనని చెప్పుకొంటున్నారని భట్టి ఎద్దేవా చేశారు. టెండర్లలో గోల్మాల్ మిషన్ భగీరథ టెండర్లలోనే గోల్మాల్ జరిగిందని, ముందస్తు అవగాహనతో ఇంటి దగ్గర కూర్చుని టెండర్లు రాసుకున్నట్టు ఉందని భట్టి ఆరోపించారు. మిషన్ కాకతీయకు 20–35 శాతం వరకు లెస్‌కు టెండర్లు వస్తే.. ‘భగీరథ’కు కేవలం 0.2 – 0.5 శాతం వరకు మాత్రమే లెస్ టెండర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పైనే తమకు అనుమానాలు ఉన్నాయని, దీనికి సంబంధించిన వివరాలన్నీ సభ ముందుంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కోసం 11 శాతం వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నట్లుగా కాగ్ నివేదికలో పేర్కొందని.. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఏటా రూ.4,500 కోట్లు అవసరమని భట్టి పేర్కొన్నారు. ఈ వడ్డీతోపాటు అసలు చెల్లించేందుకు, పథకం నిర్వహణకు కలిపి ఏటా సుమారు రూ.12 వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు. ఇంత భారాన్ని ప్రజలపై మోపితే ఎలాగని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారు ఏం చేయాలని నిలదీశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.62 వేల కోట్ల అప్పులుంటే ఈ రెండేళ్లలో అవి రూ.1.25 లక్షల కోట్లకు పెరిగాయని... ఇంత అడ్డగోలుగా ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. దీనిపై హౌజ్ కమిటీ వేయాలని లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భగీరథ మంచిదే మిషన్ భగీరథ పథకం మంచిదని.. రాజకీయాల కోసం దీనిని విమర్శించడం మంచిది కాదని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు నీరిచ్చే జంట జలాశయాల వద్ద అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సింగూరు ద్వారా నీళ్లివ్వాలని మజ్లిస్ సభ్యుడు ముంతాజ్‌ఖాన్ కోరారు. ఉత్పాదక రంగాలపై ఖర్చు పెడితే ఫలితం ఉంటుందని, మిషన్ భగీరథలాంటి అనుత్పాదక పథకాన్ని కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో దశలవారీగా పూర్తి చేయా లని.. ఇన్ని వేల కోట్లు ఆ పథకానికి ఖర్చు చేయడం మంచిది కాదని టీడీపీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సూచించారు. పారదర్శ కతతో వేగంగా పథకాన్ని అమలు చేయాలని.. గిరిజన ఆవాసాలన్నింటికీ నీరందేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. ఈ పథకం దళితుల ఆత్మగౌరవ పథకమని అధికార పక్ష సభ్యుడు రసమయి పేర్కొన్నారు. ఆయన విపక్ష సభ్యులనుద్దేశించి విమర్శలు చేయడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. -
ప్రత్యేక సాయం రూ.450 కోట్లు
రెండో విడత నిధుల విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక సాయం కింద మంగళవారం రూ.450 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని వెనుకబడిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం (పాత) జిల్లాలకు 2016–17 ఆర్థిక సంవత్స రానికి ప్రత్యేక సహాయంగా ఈ నిధులు విడుదల చేసింది. గతేడాది మొదటి విడతగా కేంద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.900 కోట్లు ప్రత్యేక సాయం అందింది. ఆయా జిల్లాల్లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు వీటిని ఖర్చు చేయాలని కేంద్రం నిర్దేశించింది. హైదరాబాద్ మినహా తొమ్మిది పాత జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఈ నిధులను మంజూరు చేసింది. కేంద్రం ప్రత్యేక సాయం కింద నిధులు విడుదల చేయడం పట్ల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి హర్షం వ్యక్తం చేశారు.