విజన్ డాక్యుమెంట్‌లో తెలంగాణ | telangana vision document appreciated | Sakshi
Sakshi News home page

విజన్ డాక్యుమెంట్‌లో తెలంగాణ

Published Wed, Oct 19 2016 4:31 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

విజన్ డాక్యుమెంట్‌లో తెలంగాణ

విజన్ డాక్యుమెంట్‌లో తెలంగాణ

మిషన్ కాకతీయ, భగీరథ, సౌర విద్యుత్‌కు చోటు
రాష్ట్ర పథకాలను ప్రశంసించిన నీతి ఆయోగ్
శాఖల వారీగా భవిష్యత్ లక్ష్యాలను నివేదించిన ప్రభుత్వం

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు సౌర విద్యుత్ విధానాన్ని జాతీయ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరుస్తామని నీతి ఆయోగ్ బృందం తెలిపింది. ఈ పథకాల విసృ్తత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మూడు పథకాలకు సంబంధించి ప్రత్యేక నోట్‌ను సమర్పిస్తే విజన్ డాక్యుమెంట్‌లో చేరుస్తామని నీతి ఆయోగ్ సలహదారు అశోక్‌కుమార్ జైన్ ప్రభుత్వ అధికారులకు తెలిపారు. 15 ఏళ్ల దార్శనికత, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికలతో దేశానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను నీతి ఆయోగ్ రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందం హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. నీతి ఆయోగ్ జాయింట్ అడ్వయిజర్ అవినాష్ మిశ్రా, డెరైక్టర్ జుగల్ కిషోర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ... విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగంగా వివిధ రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
ప్రభుత్వ కార్యక్రమాలను ఎజెండాలో చేర్చండి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నీతి ఆయోగ్ ఎజెండాలో చేర్చాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య కోరారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో తెలంగాణ దార్శనికతకు చోటు కల్పించాలని రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు రూ.42,853 కోట్లతో మిషన్ భగీరథ అమలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకొని వచ్చే అయిదేళ్లలో 60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు జరుగుతున్నాయని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా చేపడుతున్న 46 వేల చెరువుల పునరుద్ధరణతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ చెప్పారు.

వచ్చే 15 ఏళ్లలో రూ.2.82 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. తెలంగాణలో ఇప్పటికే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వచ్చే రెండేళ్లలో జెన్‌కో ద్వారా 5,880 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కృషి చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో సౌర విద్యుత్తును 80 మెగావాట్ల నుంచి 850 మెగావాట్లకు పెంచామని చెప్పగా నీతి ఆయోగ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మాట్లాడుతూ వచ్చే 15 ఏళ్ళలో ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
 
ఐదారు గ్రామాలకో గురుకులం
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి విస్తృత స్థాయి చర్యలు చేపట్టనున్నట్లు విద్యాశాఖ నీతి ఆయోగ్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. డ్రాపౌట్స్‌ను పూర్తిగా తగ్గించడం, నాణ్యత ప్రమాణాల పెంపు వంటివి 15 ఏళ్ల విజన్‌లో లక్ష్యంగా పేర్కొంది. కేజీ టు పీజీ ఏడేళ్ల ప్రణాళికలో చేర్చారు. మూడేళ్ల కార్యాచరణలో  ఐదారు గ్రామాలకో గురుకుల పాఠశాల వంటివాటిని పేర్కొన్నారు.
 
 పంటలకు ప్రోత్సాహం
 వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహిస్తున్నట్లు వ్యవసాయశాఖ తమ నివేదికలో పేర్కొంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయికి అందించడం, పండ్లు, కూరగాయలు, పూలసాగులో ఆధునిక విధానాలపై శిక్షణకు ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’, మార్కెటింగ్‌కు వినూత్న విధానాలను అందులో పేర్కొన్నారు.
 
 ఇంటింటికీ మంచినీరు
 మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత నీరందించాలనేది ప్రధాన లక్ష్యమని గ్రామీణ  నీటి సరఫరా విభాగం నీతి ఆయోగ్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చేందుకు 29.94 లక్షల మరుగుదొడ్లను నిర్మించనున్నామని పేర్కొంది.
 
 విద్యుత్‌లో అగ్రగామిగా..
 నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాల కోసం చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ నివేదికలో పేర్కొంది. 2018-19 నాటికి కొత్తగా 5,880 మెగావాట్ల విద్యుదుత్పత్తి, సరఫరా నష్టాలను 9 శాతానికి తగ్గించడం లక్ష్యాలను వివరించింది.
 
 సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తాం
 15 ఏళ్లలో శిశు మరణాల రేటును 10 లోపునకు తీసుకురావడం, ఏడేళ్లలో అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, అన్ని జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీలుగా తీర్చిదిద్దడం, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటు తమ లక్ష్యాలని వైద్యారోగ్య శాఖ నివేదికలో వెల్లడించింది.
 
 ఐదేళ్లలో 1.15 కోట్ల ఎకరాలకు నీరు
 ఐదేళ్లలో 1.15 కోట్ల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ నీతి ఆయోగ్‌కు వివరించింది. చెరువుల పునరుద్ధరణ, తక్కువ ముంపుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి తగిన సహకారం అందితే నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement