vision document
-
అభివృద్ధి చెందిన భారత్ హోదానే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే బాటలో రాష్ట్రాలు.. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. విద్యకు ప్రాధాన్యత... కేంద్రం దేశంలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఈఓ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో కాలేజీల నమోదు రేటును 27 శాతం నుంచి 50–60 శాతానికి పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందని పేర్కొన్న ఆయన, ఇప్పుడు భారత విద్యా రంగాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాలేజీకి వెళ్లే జనాభా 4 కోట్ల నుండి 8–9 కోట్లకు పెరుగుతుందని ఆయన పేర్కొంటూ, కాబట్టి మనకు ఈ రోజు ఉన్న వెయ్యి విశ్వవిద్యాలయాలతో పాటు మరో వెయ్యి విశ్వవిద్యాలయాలు అవసరమని విశ్లేషించారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నందున, కొత్త విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి ప్రైవేట్ రంగం నుండి నిధులు మరింత రావాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పరిశోధన–అభివృద్ధి– ఆవిష్కరణలే లక్ష్యంగా పనిచేసే బోస్టన్– శాన్ ఫ్రాన్సిస్కో వంటి విద్యా నగరాలను దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్లలోపేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘భారతదేశం జనాభా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనకు 25 సంవత్సరాల సుదీర్ఘ అద్భుత సమయం ఉంది’’ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని అందించే దేశంగా భారత్ అవతరించబోతోందని పేర్కొన్న సుబ్రహ్మణ్యం, ప్రతి సంవత్సరం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయడానికి భారతదేశం నుండి బయటకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులను భారత్‌కు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. తలసరి ఆదాయం 18,000 డాలర్లు లక్ష్యం... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నేడు రెండో త్రైమాసిక జీడీపీ ఫలితాలు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి 7.8 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, రెండవ త్రైమాసికంలో మంచి ఫలితాలే నమోదవుతాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యక్తం చేశారు. అంతక్రితం ఆయన ‘పట్టణ మౌలిక రంగం అభివృద్ధి కోసం ప్రైవేట్ పెట్టుబడుల వినియోగం– జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ నుండి అనుభవ పాఠాలు’ అనే అంశంపై జరిగిన ఒక జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం. ఇది జీడీపీ నిష్పత్తిలో చూస్తారు) లక్ష్య సాధన సాధ్యమేనని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. -
భారత్, శ్రీలంకల మధ్య విజన్ డాక్యుమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మిషన్ 6జీ.. 5జీ కంటే వందరెట్ల వేగంగా నెట్ స్పీడ్.. భారత్ భారీ ప్లాన్!
టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. 5జీ సేవల్ని 125 నగరాల్లో అందుబాటులోకి తెచ్చి ఆరు నెలలైందో లేదో 6జీపై అధ్యయనం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2030 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రజా జీవనంలోనూ, సామాజికంగా సమూల మార్పు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 6జీని ఒక మిషన్లా తీసుకువెళ్లి దక్షిణ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాల సాంకేతికతతో పోటీపడతామని సగర్వంగా ప్రకటించింది. ప్రస్తుతం భారతీయులు 100 కోట్ల మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 2014లో 25 కోట్లు ఉంటే ఇప్పుడు 85 కోట్లకు చేరుకుంది. ఇక ఏడాదికేడాది స్మార్ట్ ఫోన్లు వాడే సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 30 కోట్ల గృహాలకు చెందిన వారు ఏడాదికి 16 కోట్ల కంటే ఎక్కువగానే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రతీ ఇంటివారు రెండేళ్లకి ఒకసారి కొత్త ఫోన్‌ను కొంటున్నట్టు లెక్క. భారతీయులు ఫోన్ లేకుండా ఒక నిముషం కూడా గడిపే పరిస్థితి లేదు. అన్ని పనులు ఫోన్‌ద్వారా చేస్తున్నారు. ఏదైనా బిల్లు కట్టాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఆన్లైన్ క్లాసులు వినాలన్నా , బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు ఇలా.. ఏ పనైనా అరచేతిలో ఉన్న ఫోన్‌తోనే. అందుకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా మన దగ్గరే ఎక్కువ. 6జీ ద్వారా నెట్ స్పీడ్ పెరిగితే మరింత సులభంగా పనులన్నీ అయిపోతాయి. ఆ మేరకు మార్కెట్ కూడా విస్తృతమవుతుంది. పదేళ్లలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఏమిటీ 6జీ...? టెలికమ్యూనికేషన్ రంగంలో ఆరో తరం సేవల్ని 6జీ అంటారు. 5జీ సేవలు పూర్తిగా విస్తరించకుండానే 6జీపై కేంద్రం పరిశోధనలు మొదలు పెట్టింది. 5జీ కంటే దీని నెట్ స్పీడ్ వందరెట్లు వేగంగా ఉంటుంది. సెకనుకు ఒక టెరాబైట్ వేగంతో పని చేస్తుంది. క్షణ మాత్రం ఆలస్యం లేకుండా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. కేంద్రం ప్రణాళికలు ఇవే ..! భారత్ 6జీ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో ప్రధానంగా పరిశోధనలపై ఫోకస్ ఉంటుంది. రెండో దశలో వాణిజ్యపరంగా 6జీ సేవల వాడకంపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్రం అత్యున్నత కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. 6జీ ప్రమాణాలు, స్పెక్ట్రమ్‌ల గుర్తింపు, సిస్టమ్స్, డివైజ్‌లకు ఎకో సిస్టమ్ ఏర్పాటు, పరిశోధన, అధ్యయనాలకు ఆర్థిక సాయం తదితరాలను ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. రూ.10వేల కోట్లతో ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి 6జీపై తొలిదశ పరిశోధనలు మొదలు పెట్టనున్నారు. మొత్తంగా 6జీ పరిశోధనలకు రూ. 63 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి. కొత్త సాంకేతిక వ్యవస్థలైన టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్, రేడియో ఇంటర్ఫేసెస్, టాక్టిల్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త ఎన్కోడింగ్ పద్ధతులు, 6జీ పరికరాలకు అవసరమయ్యే చిప్ సెట్స్ వంటివాటిపై కూడా ప్రధానంగా అత్యున్నత మండలి దృష్టి పెడుతుంది. ఎలాంటి మార్పులు వస్తాయి? ► 6జీ అందుబాటులోకి వస్తే ఫ్యాక్టరీలన్నీ రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయొచ్చు ► రియల్–టైమ్ గేమింగ్ ఇండస్ట్రీకి కొత్త హంగులు చేకూరుతాయి. ► స్వయంచోదక కార్లు రోడ్లపై ఇక పరుగులు తీస్తాయి ► డేటా ట్రాన్స్ఫర్ జాప్యం లేకుండా క్షణాల్లో జరగడం వల్ల సుదూరంలో ఉండి కూడా సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ► 6జీ సపోర్ట్‌తో నడిచే డివైజ్‌లన్నీ బ్యాటరీలతో నడుస్తాయి. దీంతో బ్యాటరీ తయారీ రంగం పరుగులు పెడుతుంది ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) మరో దశకు చేరుకుంటుంది. ► ఆత్మనిర్భర్ భారత్ కింద ఉన్న డిజిటల్ ఇండియా, రూరల్ బ్రాడ్‌బ్యాండ్, స్మార్ట్ సిటీలు, ఈ–గవర్నెన్స్ వంటివి పుంజుకుంటాయి. ► రేడియో ఫ్రీక్వెన్సీ వినియోగం మరింత సామర్థ్యంతో పని చేస్తుంది. ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా ఒకేసారి అత్యధిక డివైజ్‌లకు నెట్ కనెక్షన్ ఇవ్వొచ్చు. 5జీతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పరికరాలకు 6జీ కనెక్షన్ ఒకేసారి ఇచ్చే అవకాశముంటుంది. ► వైర్లెస్ కమ్యూనికేషన్లలో విప్లవాత్మక మార్పులు రావడంతో పర్యావరణం అనుకూలంగా ఉంటుంది. 5జీ రేడియేషన్‌తో పర్యావరణానికి దెబ్బ ఎక్కువగా ఉందనే ఇప్పటికే విమర్శలున్నాయి. ► సామాజికంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కడ నుంచైనా పని చేసే అవకాశం ఉంటుంది. దీంతో పల్లెలు, పట్టణాల మధ్య తేడా తగ్గిపోతుంది. పల్లెల నుంచి వలసల్ని నిరోధించవచ్చు ► 6జీ సర్వీసులు అందరికీ అందుబాటులోకి రావడం, ఎక్కడ నుంచైనా రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే అవకాశాలు ఉండడంతో గ్రామీణ జీవనంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఇతర దేశాల్లో ఎలా..? ► 6జీ సేవల్లో ప్రస్తుతం దక్షిణ కొరియా ముందంజలో ఉంది. రూ.1200 కోట్ల పెట్టుబడులతో 2025కల్లా తొలి దశ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. ► జపాన్‌లో ఐఒడబ్ల్యూఎన్ ఫోరమ్ 6జీ సేవలపై 2030 విజన్ డాక్యమెంట్ని విడుదల చేసింది. ► చైనా 6జీపై 2018లోనే అధ్యయనం ప్రారంభించింది. 2029లో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ► అమెరికా కూడా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)తో కలిసి 2018లో 6జీపై అధ్యయనాలు మొదలు పెట్టింది. యాపిల్, గూగుల్ వంటి కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తోంది. -
కేసీఆర్ ‘విజన్ డాక్యుమెంట్’ రైతులు, దళితుల పురోభివృద్ధికి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహాలు వేగవంతం చేసిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రైతులు, దళితులపై కొత్త పార్టీ అనుసరించే విధానంపై కసరత్తు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు దసరాను ముహూర్తంగా ఎంచుకోగా, అంతలోగానే ఈ రెండు వర్గాల అభ్యున్నతికి ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికీ ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తి జాతీయ పార్టీ ఎజెండాలో ప్రతిబింబించాలని సంకల్పిస్తున్నారు. ఈ పథకాలకు మరికొన్ని జోడించి ‘విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, ఎస్సీలతో భేటీ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల్లో ఆచరణ సాధ్యమైన వాటికి విజన్ డాక్యుమెంట్లో చోటుకల్పిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మోడల్‌ను పరిచయం చేసేలా... దేశంలో సాగుకు యోగ్యమైన భూమి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతు అనుకూల సాగు చట్టాల రూపకల్పన తదితరాల్లో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్.. వ్యవసాయ రంగంపై రూపొందిస్తున్న ‘విజన్ డాక్యుమెంట్’లో కొత్త పార్టీ విధానాలపై స్పష్టత ఇస్తారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, దళితబంధు వంటి వాటితోపాటు దేశవ్యాప్తంగా కాళేశ్వరం తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, వనరుల వినియోగం తదితరాలను ప్రస్తావిస్తారు. తెలంగాణ రైతుల కేస్ స్టడీలు, గణాంకాలు, నిపుణుల అభిప్రాయాలు తదితరాలను పొందుపరుస్తారు. త్వరలో దేశవ్యాప్తంగా దళిత సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ చేసిన డిమాండ్‌పై జాతీయస్థాయిలో చర్చ జరిగిందని, విజన్ డాక్యుమెంట్ మరింత చర్చకు దోహదం చేస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. -
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకో టీవీ ఛానల్
న్యూఢిల్లీ: రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్ ‘ఐఎన్‌సీ టీవీ’కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 24న పార్టీ చానెల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చానెల్ ద్వారా తమ పార్టీ సమాచారాన్ని నేరుగా ప్రజలకు తెలియ జేయవచ్చని భావిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతుకను వినిపించే తమ చానెల్‌ను పంచాయతీ రాజ్ రోజున విడుదల చేస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాలు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అందులో రోజూ దాదాపు 8 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలిపారు. మొదటగా ఆంగ్లం, హిందీ భాషల్లో చానెల్ ప్రసారమవుతుందని, అనంతరం స్థానిక భాషల్లో కూడా అందు బాటులోకి తెస్తామన్నారు. చదవండి: ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్ -
విజనే లేని పార్టీ కాంగ్రెస్..: పల్లా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ డొల్లతనం బయటపడిందన్నారు. విజనే లేని కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 80 శాతం మంది అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ.. వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్టు గొప్పలకు పోతోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రావు, పార్టీ నేతలు దండే విఠల్‌తో కలిసి గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రూ.5కే భోజనం పెడతామని విజన్ డాక్యుమెంట్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కడుపు నింపుతోందన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని అడిగి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఇవన్నీ తమ ప్రభుత్వ పథకాలే అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్, తమ ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామంటోందని ఎద్దేవా చేశారు. -
తాజ్ పరిరక్షణకు విజన్ డాక్యుమెంట్
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక ప్రాచీన కట్టడం తాజ్ మహల్ పరిరక్షణకు యూపీ ప్రభుత్వం పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల మూసివేత. నో ప్లాస్టిక్ జోన్, యమున కరకట్టలపై నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం వంటి చర్యలతో చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే ప్రణాళికతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. 17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ అద్భుత కట్టడాన్ని పరిరక్షించడంలో యూపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై జులై 11న సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడిన క్రమంలో ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్‌ను కోర్టుకు నివేదించింది. తాజ్ మహల్ పరిసరాల్లో ప్యాకేజ్డ్ వాటర్‌ను నిషేధించాలని, ఆ ప్రాంతమంతటినీ ప్లాస్టిక్ రహిత జోన్‌గా ప్రకటించాలని యోచిస్తున్నామని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్‌కు యూపీ ప్రభుత్వం తెలిపింది. తాజ్ పరిసర ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలను మూసివేసి, టూరిజం హబ్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పాదచారులను ప్రోత్సహించేలా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణను చేపడతామని వెల్లడించింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకంగా నిర్మించిన తాజ్ మహల్ కాలక్రమేణా కాలుష్య కోరలతో తన ప్రాభవాన్ని కోల్పోతుండటంపై సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజ్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు నిరంతరం పర్యవేక్షిస్తోంది. -
విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ
⇒ మిషన్ కాకతీయ, భగీరథ, సౌర విద్యుత్‌కు చోటు ⇒ రాష్ట్ర పథకాలను ప్రశంసించిన నీతి ఆయోగ్ ⇒ శాఖల వారీగా భవిష్యత్ లక్ష్యాలను నివేదించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు సౌర విద్యుత్ విధానాన్ని జాతీయ విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తామని నీతి ఆయోగ్ బృందం తెలిపింది. ఈ పథకాల విసృ్తత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మూడు పథకాలకు సంబంధించి ప్రత్యేక నోట్‌ను సమర్పిస్తే విజన్ డాక్యుమెంట్లో చేరుస్తామని నీతి ఆయోగ్ సలహదారు అశోక్‌కుమార్ జైన్ ప్రభుత్వ అధికారులకు తెలిపారు. 15 ఏళ్ల దార్శనికత, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికలతో దేశానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను నీతి ఆయోగ్ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందం హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. నీతి ఆయోగ్ జాయింట్ అడ్వయిజర్ అవినాష్ మిశ్రా, డెరైక్టర్ జుగల్ కిషోర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ... విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగంగా వివిధ రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎజెండాలో చేర్చండి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నీతి ఆయోగ్ ఎజెండాలో చేర్చాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య కోరారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో తెలంగాణ దార్శనికతకు చోటు కల్పించాలని రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు రూ.42,853 కోట్లతో మిషన్ భగీరథ అమలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకొని వచ్చే అయిదేళ్లలో 60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు జరుగుతున్నాయని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా చేపడుతున్న 46 వేల చెరువుల పునరుద్ధరణతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ చెప్పారు. వచ్చే 15 ఏళ్లలో రూ.2.82 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. తెలంగాణలో ఇప్పటికే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వచ్చే రెండేళ్లలో జెన్కో ద్వారా 5,880 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కృషి చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో సౌర విద్యుత్తును 80 మెగావాట్ల నుంచి 850 మెగావాట్లకు పెంచామని చెప్పగా నీతి ఆయోగ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మాట్లాడుతూ వచ్చే 15 ఏళ్ళలో ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఐదారు గ్రామాలకో గురుకులం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి విస్తృత స్థాయి చర్యలు చేపట్టనున్నట్లు విద్యాశాఖ నీతి ఆయోగ్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. డ్రాపౌట్స్‌ను పూర్తిగా తగ్గించడం, నాణ్యత ప్రమాణాల పెంపు వంటివి 15 ఏళ్ల విజన్‌లో లక్ష్యంగా పేర్కొంది. కేజీ టు పీజీ ఏడేళ్ల ప్రణాళికలో చేర్చారు. మూడేళ్ల కార్యాచరణలో ఐదారు గ్రామాలకో గురుకుల పాఠశాల వంటివాటిని పేర్కొన్నారు. పంటలకు ప్రోత్సాహం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహిస్తున్నట్లు వ్యవసాయశాఖ తమ నివేదికలో పేర్కొంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయికి అందించడం, పండ్లు, కూరగాయలు, పూలసాగులో ఆధునిక విధానాలపై శిక్షణకు ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’, మార్కెటింగ్‌కు వినూత్న విధానాలను అందులో పేర్కొన్నారు. ఇంటింటికీ మంచినీరు మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత నీరందించాలనేది ప్రధాన లక్ష్యమని గ్రామీణ నీటి సరఫరా విభాగం నీతి ఆయోగ్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చేందుకు 29.94 లక్షల మరుగుదొడ్లను నిర్మించనున్నామని పేర్కొంది. విద్యుత్‌లో అగ్రగామిగా.. నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాల కోసం చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ నివేదికలో పేర్కొంది. 2018-19 నాటికి కొత్తగా 5,880 మెగావాట్ల విద్యుదుత్పత్తి, సరఫరా నష్టాలను 9 శాతానికి తగ్గించడం లక్ష్యాలను వివరించింది. సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తాం 15 ఏళ్లలో శిశు మరణాల రేటును 10 లోపునకు తీసుకురావడం, ఏడేళ్లలో అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, అన్ని జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీలుగా తీర్చిదిద్దడం, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటు తమ లక్ష్యాలని వైద్యారోగ్య శాఖ నివేదికలో వెల్లడించింది. ఐదేళ్లలో 1.15 కోట్ల ఎకరాలకు నీరు ఐదేళ్లలో 1.15 కోట్ల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ నీతి ఆయోగ్‌కు వివరించింది. చెరువుల పునరుద్ధరణ, తక్కువ ముంపుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి తగిన సహకారం అందితే నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటామని పేర్కొంది.