
తాజ్ మహల్‌ను కాపాడేందుకు..
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక ప్రాచీన కట్టడం తాజ్ మహల్ పరిరక్షణకు యూపీ ప్రభుత్వం పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల మూసివేత. నో ప్లాస్టిక్ జోన్, యమున కరకట్టలపై నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం వంటి చర్యలతో చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే ప్రణాళికతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. 17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ అద్భుత కట్టడాన్ని పరిరక్షించడంలో యూపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై జులై 11న సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడిన క్రమంలో ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్‌ను కోర్టుకు నివేదించింది.
తాజ్ మహల్ పరిసరాల్లో ప్యాకేజ్డ్ వాటర్‌ను నిషేధించాలని, ఆ ప్రాంతమంతటినీ ప్లాస్టిక్ రహిత జోన్‌గా ప్రకటించాలని యోచిస్తున్నామని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్‌కు యూపీ ప్రభుత్వం తెలిపింది. తాజ్ పరిసర ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలను మూసివేసి, టూరిజం హబ్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పాదచారులను ప్రోత్సహించేలా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణను చేపడతామని వెల్లడించింది.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకంగా నిర్మించిన తాజ్ మహల్ కాలక్రమేణా కాలుష్య కోరలతో తన ప్రాభవాన్ని కోల్పోతుండటంపై సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజ్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు నిరంతరం పర్యవేక్షిస్తోంది.