న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు పెనుముప్పుగా మారిన వాయు కాలుష్యంపై దూరదృష్టితో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. దాని పరిరక్షణ నిమిత్తం పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించాలని కోరింది. పరిస్థితి చేయి దాటాక తాజ్‌మహల్‌ను కాపాడుకునేందుకు మరో అవకాశం రాదని హెచ్చరించింది. తాజ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ, చుట్టుపక్కల ఉన్న కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం, యమునా నదిలో నీటి మట్టం పెరుగుదల తదితరాలను దార్శనిక పత్రం రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
‘ఒకసారి తాజ్‌మహల్ చేజారితే, మరో అవకాశం లభించదు’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజ్ చుట్టుపక్కల ఉన్న పచ్చదనం, నడుస్తున్న పరిశ్రమలు, హోటళ్ల సంఖ్య తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ దార్శనిక పత్రాన్ని రూపొందిస్తోందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, లాయర్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ణి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు తాజ్ పరిరక్షణకు అగాఖాన్ ఫౌండేషన్, ఇంటాచ్ సంస్థల నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment