ఆగ్రా : తాజ్‌మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా మరే రోజూ నమాజ్ చేయరాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ముస్లింలను కోరింది. ఈ ఉత్తర్వులు పెనువివాదం రేపుతుండగా, సుప్రీం కోర్టు జులైలో ఇచ్చిన ఉత్తర్వులనే తాము అమలు చేస్తున్నామని ఏఎస్‌ఐ అధికారులు వివరణ ఇచ్చారు. శుక్రవారం తాజ్‌మహల్‌ను ప్రజా సందర్శనకు అనుమతించని క్రమంలో ఆ రోజు ప్రవేశ టికెట్ లేకుండానే స్ధానికులు ప్రార్ధన చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
తాజ్ మహల్ కాంప్లెక్స్‌లోని మసీదులో శుక్రవారం స్ధానికేతరులు నమాజ్ చేసుకోరాదని స్ధానిక అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించింది. భద్రతా కారణాల రీత్యా స్ధానికేతరులెవరూ శుక్రవారం తాజ్ ప్రాంగణంలోని మసీదులో నమాజ్ చేయరాదని ఆగ్రా ఏడీఎం ఈ ఏడాది జనవరి 24న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. అయితే ఇతర రోజుల్లో నమాజ్‌లపై సుప్రీం కోర్టు ఎంతమాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.
మరోవైపు నమాజ్‌కు ముందు ముస్లింలు తాజ్ ప్రాంగణంలోని స్నానం చేసే వుదు చెరువును ఏఎస్‌ఐ ఆదివారం మూసివేసింది. దశాబ్ధాలుగా తాజ్ మహల్ మసీదులో నమాజ్ చేస్తున్న ఇమాం సయ్యద్ సాధిక్ అలి ఏఎస్‌ఐ ఉత్తర్వుల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో ఏ కారణం లేకుండానే నమాజ్‌ను నిలిపివేశారని తాజ్‌మహల్ మసీదు నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహిం హుసేన్ జైదీ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని యూపీ, కేంద్ర ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment