
ఆగ్రా: ప్రపంచ అద్భుతాలతో ఒకటైన తాజ్ మహల్ మాయమవడం ఏంటి? ఇది పచ్చి అబద్ధం అని అనుకుంటున్నారా? కాదు.. కాదు.. ఇది నిజం.. ఇటీవలికాలంలో తాజ్ మహల్ మాయమైపోతోంది. ఇది ఉదయం వేళల్లో జరుగుతోంది. దీనివెనకగల కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
దేశరాజధాని ఢిల్లీలో మాదిరిగానే ఇప్పుడు యూపీలోని ఆగ్రా నగరంలోనూ కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆగ్రావాసులు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కాలుష్యం కమ్మేసిన కారణంగా ఆగ్రాలో 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజ్ మహల్ సమీపంలో తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదయ్యింది. ఈ నేపధ్యంలో ఏర్పడిన పొగమంచు తాజ్ మహల్‌ను కప్పేస్తోంది. దీంతో ఉదయం వేళ తాజ్ అందాలు చూడాలనుకున్న పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.
ఢిల్లీ గ్యాస్ చాంబర్‌గా మారిపోయింది. ఎన్‌సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) 500కి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీకి పక్కనే ఉన్న ఆగ్రా కాలుష్యం బారిన పడింది. ఇక్కడ వాయు కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు, రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏక్యూఐ ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాబోయే 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయానికి వాయు కాలుష్య స్థాయి తగ్గకపోతే మొదటి, రెండో దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
ఆగ్రాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరితో ఆగ్రాలోని పలు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కాలుష్యం పెరుగుతున్నందున ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్‌ను వినియోగించాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఊపిరాడని మరోరోజు.. 500 వద్ద ఏక్యూఐ
Comments
Please login to add a commentAdd a comment