ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.
తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.
రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.
రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment