కేసీఆర్‌ ‘విజన్‌ డాక్యుమెంట్‌’ రైతులు, దళితుల పురోభివృద్ధికి.. | CM KCR Vision Document For Development Of Farmers And Dalits | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ‘విజన్‌ డాక్యుమెంట్‌’ రైతులు, దళితుల పురోభివృద్ధికి..

Published Sat, Sep 17 2022 2:56 AM | Last Updated on Sat, Sep 17 2022 2:56 AM

CM KCR Vision Document For Development Of Farmers And Dalits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సన్నాహాలు వేగవంతం చేసిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రైతులు, దళితులపై కొత్త పార్టీ అనుసరించే విధానంపై కసరత్తు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనకు దసరాను ముహూర్తంగా ఎంచుకోగా, అంతలోగానే ఈ రెండు వర్గాల అభ్యున్నతికి ‘విజన్‌ డాక్యుమెంట్‌’ను విడుదల చేయాలని నిర్ణయించారు.

కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికీ ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తి జాతీయ పార్టీ ఎజెండాలో ప్రతిబింబించాలని సంకల్పిస్తున్నారు. ఈ పథకాలకు మరికొన్ని జోడించి ‘విజన్‌ డాక్యుమెంట్‌’ను రూపొందిస్తున్నారు. ఇటీ­వలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, ఎస్సీలతో భేటీ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల్లో ఆచరణ సాధ్యమైన వాటికి విజన్‌ డాక్యుమెంట్‌లో చోటుకల్పిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ మోడల్‌ను పరిచయం చేసేలా...
దేశంలో సాగుకు యోగ్యమైన భూమి, అందుబా­టులో ఉన్న నీటి వనరులు, రైతు అనుకూల సాగు చట్టాల రూపకల్పన తదితరాల్లో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను పదేపదే విమర్శిస్తున్న కేసీఆర్‌.. వ్యవ­సాయ రంగంపై రూపొందిస్తున్న ‘విజన్‌ డాక్యు­మెంట్‌’లో కొత్త పార్టీ విధానాలపై స్పష్టత ఇస్తారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, దళితబంధు వంటి వాటి­తోపాటు దేశవ్యాప్తంగా కాళేశ్వరం తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, వన­రుల విని­యోగం తదితరాలను ప్రస్తావిస్తారు.

తెలం­గాణ రైతుల కేస్‌ స్టడీలు, గణాంకాలు, నిపు­ణుల అభిప్రా­యాలు తదితరాలను పొందుపరు­స్తారు. త్వరలో దేశవ్యాప్తంగా దళిత సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి నుంచి వచ్చే సలహాలు, సూచ­నల ఆధారంగా విజన్‌ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని కేసీఆర్‌ చేసిన డిమాండ్‌పై జాతీయ­స్థాయిలో చర్చ జరిగిందని, విజన్‌ డాక్యుమెంట్‌ మరింత చర్చకు దోహదం చేస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement