సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో ఇచ్చిన హామీలను ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ డొల్లతనం బయటపడిందన్నారు. విజనే లేని కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 80 శాతం మంది అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ.. వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్టు గొప్పలకు పోతోందని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ నవీన్‌రావు, పార్టీ నేతలు దండే విఠల్‌తో కలిసి గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రూ.5కే భోజనం పెడతామని విజన్ డాక్యుమెంట్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కడుపు నింపుతోందన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని అడిగి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఇవన్నీ తమ ప్రభుత్వ పథకాలే అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్, తమ ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామంటోందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment