
ఢిల్లీలో ప్రధాని మోదీతో విక్రమ్ సింఘే కరచాలనం
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు.
గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.
శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment