మోడీ ప్రమాణస్వీకారానికి జయ దూరం!
తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలంటూ శ్రీ లంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించిన కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రేపు న్యూఢిల్లీలో జరగనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకుడదని జయలలిత నిర్ణయించుకున్నారని ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నాయి. అంతేకాదు తన తరఫున కనీసం ఒక్కరిని కూడా ఆ కార్యక్రమానికి పంపడం లేదని సమాచారం.
ఎన్నికల ప్రచారంలో మోడీని జయలలిత, జయలలితను మోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. చివరికి ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి 282 సీట్లు రావడం, అలాగే ఏఐఏడీఏంకేకు 35 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ సందర్బంగా ఆ ఇద్దరు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు కూడా. అప్పటివరకు అంతా బాగానే ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మహేంద రాజపక్సేను ఆహ్వానించారు.
నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై జయలలిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ హామీయిచ్చిన నేపథ్యంలో రాజపక్సెను ఆహ్వానించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మోడీ నిర్ణయం దురదృష్టకరమన్నారు. మోడీ నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి కూడా మండిపడ్డారు. ఈలం తమిళుల మృతదేహాలను గుట్టలుగాపోసి మానవహక్కులను కాలరాసిన రాజపక్సే సమక్షంలో కొత్త ప్రధానిగా మోడీ ప్రమాణం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు, ఆహ్వానాన్ని మరోసారి పరిశీలించండని మోడీని కరుణానిధి కోరిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ సభ్య దేశాధ్యక్షులను ఆహ్వానించారు. ఆ సభ్య దేశాలలో శ్రీలంక కూడా ఓ సభ్య దేశమైన విషయం విదితమే.