ఆ ముగ్గురికి శశికళ కృతజ్ఞతలు
జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6న జయలలిత భౌతికకాయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి నివాళులర్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శశికళ లేఖలు రాశారు. వారు వచ్చి తనను ఓదార్చడం, సంతాపం తెలుపడం తనను భావోద్వేగానికి గురిచేసిందని ఆయా లేఖల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న రాసిన ఈ లేఖలను అన్నాడీఎంకే మంగళవారం విడుదల చేసింది.
జయలలిత నెచ్చెలి అయిన శశికళ ఆమె మరణం తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అప్పగించడంతోపాటు.. తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా ఆమెనే కొనసాగించాలని అన్నాడీఎంకే భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. రోజురోజుకు అధికార అన్నాడీఎంకే పార్టీపై ఆమె పట్టు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.