అమ్మ లేని లోటు కనిపిస్తోంది: మోదీ
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దివంగత ముఖ్యమంత్రి జయలలితను స్మరించుకున్నారు. 'అమ్మ ఇక్కడ లేని లోటు కనిపిస్తోంది. ఆమె ఆత్మ తన ఆశీస్సులను మనకు అందిస్తూనే ఉంటుంది' అని ప్రధాని మోదీ అన్నారు. 'అమ్మ ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే.. ఆమె ఎంతో సంతోషించి ఉండేవారు. శుభాకాంక్షలు తెలిపేవారు. మనమందరం గుర్తించుకోదగిన నేత ఆమె' అని అన్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారక మండపాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రామేశ్వరం జిల్లా పేయ్‌కరుంబులో రూ.15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కలాం యువతకు ఎంతగానో ప్రేరణ ఇచ్చారు. ఈ రోజు ఎంతోమంది యువత జాబ్ క్రియేటర్లుగా ఎదగాలనుకుంటున్నారు' అని చెప్పారు.
కలాంను పేయ్‌కరుంబులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో రూ.15 కోట్లతో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు. అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా మోదీ ఈ మండపాన్ని ఆరంభించారు. అలాగే కలామ్ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అంతకు ముందు కలామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.