పట్టు వీడండి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నో ఆశలతో ఢిల్లీకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు నిరాశే ఎదురైంది. పన్నీర్ రాజకీయ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ తన పక్షం అని ధీమాతో ఉన్న పన్నీర్ సెల్వం డీలాపడిపోయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలమయ్యా యి. జయలలిత అభిమానాన్ని చూరగొన్న నేతగా పేరుగాంచిన పన్నీర్‌సెల్వంను ప్రధాని చేరదీసి శశికళ వర్గాన్ని దూరం పెట్టారు. తదనంతర పరిణామాల్లో శశికళ, దినకరన్ జైలు పాలుకాగా, సీఎంగా ఎడపాడి ఎన్నికై పాలన సాగిస్తున్నారు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి చేరువయ్యారు.
రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం లేదన్న సామెతను ప్రధాని మోదీ మరోసారి రుజువుచేస్తూ ఎడపాడి పట్ల సానుకూల వైఖరిని ప్రారంభించారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న పన్నీర్‌సెల్వం ఢిల్లీ విమానం ఎక్కారు. సుమారు 45 నిమిషాలపాటు ప్రధానితో జరిగిన సంభాషణల్లో పన్నీర్‌కు ఊరట లభించకపోగా ఉసూరుమంటూ బైటకు వచ్చారు. ‘శశికళ కుటుంబీకులు పాలనకు మాత్రమే తాను వ్యతిరేకం, మరెవరైనా తనకు అభ్యంతరం లేదు, సీఎం ఎడపాడి వైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు గణనీయమైన సంఖ్యలో ఉండగా, మీ వద్ద నామమాత్రం ఉన్నారు.
సీఎం, ప్రధాన కార్యదర్శి పదవులే మీకు ముఖ్యం, పార్టీ ఏమై పోయినా ఫరవాలేదు. పట్టువిడుపులు ప్రదర్శించి విలీనంపై దృష్టిపెట్టండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ పన్నీర్‌సెల్వంను తూర్పారపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఊహించని ఈ పరిణామంతో బిక్కచచ్చిపోయిన పన్నీర్‌సెల్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై పునరాలోచనలో పడ్డారు. బీజేపీతో కలిసి పోటీచేస్తామని గతంలో ప్రకటించిన పన్నీర్ సెల్వం శనివారం తన ట్విట్టర్‌లో మాటమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాతనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి ప్రధాని మోదీపై తనకున్న కోపాన్ని చాటుకున్నారు.
అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం అన్నాడీఎంకేలోని ఇరువర్గాలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో పన్నీర్‌సెల్వం చేదు అనుభవాలను అందిపుచ్చుకున్న సీఎం ఎడపాడి మేట్టుపాళయంలో శనివారం జరిగిన సభలో విలీనంపై మళ్లీ ఆహ్వానం పలికారు. తమ ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చలేరు, నాలుగేళ్లు కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. శశికళ, దినకర్‌లు జైలు నుంచే ఎడపాడి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, అందుకే విలీనంపై వెనకడుగు వేశామని పన్నీర్‌వర్గంలోని మధుసూదనన్ విమర్శించారు.