జయను తోసేశారు
► డిశ్చార్జ్ రిపోర్టులో స్పష్టీకరణ
► అమ్మ మరణంపై అన్నీ అనుమానాలే
► మాజీ స్పీకర్, మాజీ ఎంపీ ఆరోపణ
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి మరణించే వరకూ అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, అయన కుమారుడైన మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ అన్నారు. జయలలిత తోసివేసి నట్లుగా ఆమె మరణం తరువాత విడుదల చేసిన డిశ్చార్జ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఇంతకూ జయను తోసివేసింది ఎవరో తేలాల్సి ఉందని వారు చెప్పారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన వారిద్దరూ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జయలలిత మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జవాబు దొరకని అనేక ప్రశ్నల వల్ల జయలలిత మరణం ఒక మిస్టరీగా తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. జయలలిత కిందికి తోసివేయబడినట్లుగా అపోలో ఆసుపత్రి డిశ్చార్జ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొని ఉంద ని, ఇంతకూ జయలలితను తోసివేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. జయలలిత ఇంటిలో అనేక సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని, జయ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే ముందు జరి గిన సంఘటనలు, ఆసుపత్రికి తీసుకెళ్లే దృశ్యాల సీసీ టీవీ ఫుటేజీని బైటపెడితే నిజాలు వెలుగులోకి వస్తాయని వారు చెప్పారు.
అంతేగాక అపోలో ఆసుపత్రిలో అమర్చి ఉండి న 27 సీసీ టీవీ కెమెరాలు అకస్మాత్తుగా తొలగించబడ్డాయని, ఎవరి ప్రో ద్బలం మేరకు వాటిని తొలగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. జయలలిత శాంతా రాం అనే వైద్యుడే చికిత్స చేయడం ఆనవాయితీ. అయి తే ఇతన్ని పోయస్‌గార్డెన్ వైపు రాకుండా చేసింది ఎవరో తేలాలని అన్నారు. జయకు చికి త్స చేసేందుకు అపోలో ఆసుపత్రి దరఖాస్తు, ఇతర ఫారాల్లో సంతకం చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అమ్మ ఇడ్లీ తిన్నారని అపోలో ప్రకటించిందని, వీవీఐపీలకు ఆహారం సరఫరా చేసేపుడు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. జయకు సరఫరా చేసిన ఇడ్లీ ఇతర ఆహార పదార్థాలకు నిర్వహించిన ల్యాబ్ పరీక్ష రిపోర్టును వెల్లడి చేయాలని వారు కోరారు.
గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన జ యలలిత అడ్మిట్ కాగా నవంబరు 2 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు విదేశీ వైద్యులు ఎందుకు రాలేదు, జయకు ఎక్మా చికిత్సను అందించాలని కోరిన వ్యక్తులు ఎవరని వారు ప్రశ్నించారు. జయ భౌతికకాయంలో ముఖానికి ఎడమవైపున ఉన్న నాలుగు చుక్కలు ఏమిటని వైద్యులను ప్రశ్నించగా ప్లాస్టర్ గుర్తులని బదులిచ్చారని తెలిపారు. అయితే ఆ నాలుగు చుక్కలు సందేహాస్పదమని అన్నారు. మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక బీఫారంలో జయలలిత వేలిముద్ర గుర్తులకు సాక్ష్యంగా నిలిచిన డాక్టర్ బాలాజీని విచారించాల్సి ఉందని చెప్పారు. అపోలో ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయి ఫిజియోథెరపీ విభాగం ఉండగా సింగపూర్ నుంచి వైద్యులను పిలిపించాలనే నిర్ణయం తీసుకున్నది ఎవరని ఆయన అన్నారు.
సీఎం హోదాలో జయకు నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ ఎస్‌జీ) బందోబస్తు కల్పించి ఉండగా, అపోలోలో జయ ఉన్నపుడు ఎన్ ఎస్‌జీ దళాలు లేకపోవడం, కొన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తులు రాకపోకలు సాగించడం పలు సందేహాలకు తావిచి్చందని తెలిపారు. అపోలోకు వచ్చి వెళ్లిన వ్యక్తులు ఎవరో పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జయలలితకు అందించిన వైద్యంపై ఎయిమ్స్ నివేదికను కేంద్రం విడుదల చేయాలని కోరారు. జయకు సింగపూర్‌లో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎయిర్‌పోర్టులో ఎయిర్ అంబులెన్స్ ను సిద్ధం చేసినా ప్రయాణాన్ని అడ్డుకున్నది ఎవరని ఆయన అన్నారు. గత ఏడాది డిసెంబరు 4వ తేదీన జయ మరణించినట్లు ప్రచారం జరిగింది. అయితే 5వ తేదీన ఆమె మరణాన్ని ప్రకటించారు, ఈ 24 గంటల్లో ఏమి జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి అనేక ప్రశ్నలకు సరైన సమాధానం దొరికిన పక్షంలో జయ మరణానికి కారకులెవరో తేలిపోతుందని అన్నారు.