జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
పార్లమెంటులో పన్నీర్ అనుకూల ఎంపీల డిమాండ్
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతిస్తున్న ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం పార్లమెంటులో డిమాండ్ చేశారు. పలుసార్లు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ఒకసారి వాయిదాపడగా, రాజ్యసభలో కార్యక్రమాలు కాసేపు స్తంభించాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ఆరుగురు అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ ఆమె ఆస్పత్రిలో ఉన్న ఫొటో ప్లకార్డులు ప్రదర్శించారు.
సబ్సిడీ వంటగ్యాస్, ఇతర ఇంధన ధరల పెంపుపై విపక్షాలు లోక్‌సభలో మండిపడ్డాయి. ధరలు పెంచి ప్రభుత్వం పేదలపై పెనుభారాన్ని మోపుతోందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాగా, శత్రు ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సవరణ బిల్లును రాజ్యసభ శుక్రవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. విద్యాసంస్థల్లో నైతిక విద్య కింద భగవద్గీత బోధనను తప్పనిసరి చేయాలంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. మొత్తం 103 ప్రైవేటు బిల్లులను సభ్యులు తీసుకొచ్చారు.