‘మోదీ’ ఆశ పడ్డారు ...! | IADMK reconciliation under cloud as Panneer selvam dissolves panel for merger | Sakshi
Sakshi News home page

‘మోదీ’ ఆశ పడ్డారు ...!

Published Wed, Jun 14 2017 7:08 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

‘మోదీ’ ఆశ పడ్డారు ...! - Sakshi

‘మోదీ’ ఆశ పడ్డారు ...!

► విలీనంపై పన్నీరు వ్యాఖ్య
►పళనిస్వామితో ఫలితం శూన్యం
► అన్నీ నాటకాలే

సాక్షి, చెన్నై : ముక్కలైన అన్నాడీఎంకే మళ్లీ ఏకం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ పడ్డారని అన్నాడిఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. ఆయన సూచనతో విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నానని పేర్కొన్నారు. అయితే, అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా రాజకీయాల్లో రావొచ్చని, అయితే, ప్రజాభీష్టం మేరకే నాయకుడిగా అవతరించాల్సి ఉంటుందని రజనీ రాజకీయంపై వ్యాఖ్యానించారు.

అన్నాడిఎంకే అమ్మతో ఇక, విలీనం ప్రసక్తే లేదని పురట్చి తలైవీ శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చర్చలకు ఎంపిక చేసిన కమిటీనీ కూడా రద్దుచేశారు. రెండు రోజుల క్రితం తాను తీసుకున్న నిర్ణయంపై బుధవారం మద్దతు నేతలు, ఎమ్మెల్యేలతో పన్నీరు సెల్వం చర్చించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సమీక్షించుకున్నారు. ఈసందర్భంగా విలీనం విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందంటే.. అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పన్నీరు స్పందించారు.

మోదీ ఆశపడ్డారు : దివంగత నేతలు ఎంజియార్, అమ్మ జయలలిత చేతుల మీదగా మహా శక్తిగా అన్నాడిఎంకే అవతరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ముక్కలు కావడం వేదన కల్గించినా, పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు. అమ్మ ఆశయ సాధనతో పాటుగా, ఆమె గతంలో తనకు అప్పగించిన బాధ్యతల మేరకు పార్టీని రక్షించుకునేందుకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోక తప్పలే దని వివరించారు.

తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడిఎంకే ముందుకు సాగాలని, అవినీతి రహిత పాలన సాగాలంటే, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని మోదీ సూచించారని వివరించారు. అవినీతి అన్నది బయట పడ్డ పక్షంలో ప్రభుత్వం పని పడుతానన్న హెచ్చరికను సైతం ఆయన చేశారని పేర్కొన్నారు. అన్నాడిఎంకే ఒకే వేదికగా సాగాలని మోదీ ఆశ పడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తు చేశారు.

నాటకాలు రక్తికట్టాయి

విలీన నినాదంతో ప్రయత్నాలు సాగిన సమయంలో అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టాయని ఆరోపించారు. ప్రధానంగా తనను మోసం చేయడం, ఒంటరిని చేయడం, తన పేరుకు కళంకం తీసుకు రావడం లక్ష్యంగా ఆ నాటకాల్ని ఎంత అద్భుంతంగా అంటే, అంతగా...రక్తి కట్టించారని మండి పడ్డారు. విలీనానికి తాను మొగ్గు చూపినా, ఈ నాటకాలతో అస్సలు విషయాన్ని గ్రహించి వెనక్కు తగ్గక తప్పలేదని స్పష్టంచేశారు. శశికళ, దినకరన్‌ చెప్పినట్టుగానే పళని స్వామిలు నాటకాలు రచించారన్నది తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నాటకాల్లో కొన్ని ఆథ్యాత్మికంగాను, మరికొన్ని భావోద్వేగంగాను, ఇంకా చెప్పాలంటే, ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగాయని వివరించారు.

దినకరన్‌ నాటకం నమ్మకాన్ని కల్గించ లేదని, పళని తృప్తి పరచలేదని ఎద్దేవా చేస్తూ, అందుకే విలీనంకు ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్నాడిఎంకే ముక్కులైనా కేడర్‌ చెల్లా చెదరు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన వైపు కింది స్థాయి కేడర్, ద్వితీయ శ్రేణి వర్గాలతో పాటుగా ప్రజలు ఉన్నారని, వారి వైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల బలం ఉందని వ్యాఖ్యానించారు. అందరూ తలా ఓ దిక్కున ఉన్నారేగానీ, మరో పార్టీలోకి వెళ్ల లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్నాడిఎంకే బలం అన్నాడిఎంకేదేనని, ఇతరులు ఎవ్వరూ కేడర్‌ను తమ వైపుకు తిప్పుకోవడం ఇక్కడ వీలు కాదన్నారు.

రజనీ రాజకీయాలపై స్పందిస్తూ, ఎవరైనా రావొచ్చని, అయితే, ప్రజల ఆదరణ, అభిష్టం ఉంటే తప్ప, నాయకుడిగా ఎదగలేడని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై శరవణన్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఇందులో తమ వాళ్లెవ్వరూ లేరని అన్నారు. ముడుపుల వ్యవహారాల్ని ఉపేక్షించకూడదన్నారు. చివరగా, సంధించిన ప్రశ్నకు, చిన్నమ్మ శశికళ చేతిలో పళని స్వామి రిమోట్టే అంటూ, ఆమె కంట్రోల్లోనే ఇక్కడ వ్యవహారాలు సాగుతున్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement