నకిలీ, బోగస్ పేర్లతో ఉన్న సంస్థల జప్తులో భాగంగా శశికళ, ఆమె కుటుంబ ఆస్తులపై కేంద్రం గురిపెట్టినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తుల్లో సీఎం పళనిస్వామి ప్రభుత్వం నిమగ్నమైనట్టు తెలిసింది. నల్లధనం నిర్మూలన లక్ష్యంగా చర్యలు చేపట్టిన కేంద్రం, నకిలీ, బోగస్ సంస్థలను గుర్తించి, వాటి భరతం పట్టే విధంగా ముందుకు సాగుతోంది. ఆయా సంస్థల ఆస్తుల్ని జప్తుచేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, కుటుంబీకుల సంస్థలు కూడా ఉన్నట్టు సమాచారం.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో అమ్మ జయలలిత గొడుగు నీడలో గతంలో చిన్నమ్మ శశికళ కుటుంబం సాగించిన అవినీతి భాగోతాలకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని పసిగట్టిన జయలలిత 2011లో శశికళ కుటుంబీకుల్ని సాగనంపిన విషయం తెలిసిందే. జయలలితకు తెలియకుండా కోట్లాది రూపాయాల్ని ఆర్జించి, విదేశీ బ్యాంకుల ద్వారా కొన్ని సంస్థలకు నగదు బదిలీలు సాగినట్టు ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చి ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం కేసు శశికళతో పాటు ఆమె కుటుంబానికి చెందిన పలువురి మీద ఉండడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన జాబితాలో పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ, ఆమె కుటుంబానికి చెందిన పలు సంస్థల పేర్లు ఉన్నట్టు తెలిసింది.
నకిలీ కంపెనీలుగా గుర్తింపు
శశికళ, ఆమె కుటుంబీకుల పేర్లతో ఉన్న ఆరేడు కంపెనీలు నకిలీవిగా గుర్తించి, వాటి ఆస్తుల జప్తు మీద దృష్టి పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఎప్పుడెప్పుడు చిన్నమ్మ కుటుంబం భరతంపడుదామా..? అని ఎదురుచూస్తున్న సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పాలకులు ఇందుకు తగ్గ పనుల్ని చాప కింద నీరులా వేగవంతం చేసినట్టు తెలిసింది. చిన్నమ్మ కుటుంబీకుల ఆస్తుల్ని, సంస్థల్ని గుర్తించడం పాలకులకు పెద్ద కష్టం ఉండదని చెప్పవచ్చు. ఇందుకు కారణం, ఇదివరకు చిన్నమ్మ గొడుగు నీడలో అమ్మకు పాదపూజ చేసిన వాళ్లే ప్రస్తుతం అధికారంలో ఉండటమే.
Comments
Please login to add a commentAdd a comment