సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో జయలలితది ఒక బ్రాండ్. వేష, భాషలే కాదు రాజకీయ చతురతలో సైతం ఆమెది ప్రత్యేక శైలి. సుమారు ఏడాది క్రితం అమ్మ మరణంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోగా, ప్రస్తుతం శశికళ సంచారంతో జయ వినియోగించిన కారు ఒక కథగా మారింది. అన్నాడీఎంకేలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను ‘టీఎన్ 09–బీఇ 6167’ ఈ నంబరు ఏ వాహనానిది అని అడిగితే అమ్మ కారుదని ఠక్కున చెప్పేస్తారు. డ్రైవర్ పక్కన ఆశీనులైన అమ్మ అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ రోడ్డున సాగిపోతుంటే అభిమానులు ఆనందపరవశులై జయ జయ ధ్వానాలు చేసేవారు. ఆ వాహనం, రిజిస్ట్రేషన్ నెంబరు అన్నాడీఎంకే శ్రేణుల హృదయాల్లో అంతగా ముద్రపడిపోయింది. జయలలిత మరణం తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టన శశికళ తన చీరకట్టు, పాపిడిబొట్టు సైతం జయలలితలాగనే మార్చుకుని అదే కారుల్లో పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారు. మంత్రి పదవులను కాపాడుకోదలుచుకున్న నేతలు అమ్మకు పెట్టినట్లే చిన్నమ్మకు సైతం వంగివంగి దండాలు పెట్టారు. అయితే కార్యకర్తలు మాత్రం శశికళను ఖాతరు చేయలేదు.
ఇదిలా ఉండగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత చిక్కినపుడు రెండు టయోటా బ్రాడా కార్లు, ఒక టెంపో ట్రావలర్, ఒక టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, అంబాసిడర్ కారు, మహేంద్ర బొలెరో, స్వరాజ్ మజ్దా మేక్సీ, 1990 మాడల్ కాంటెసా కారు తదితర 9 వాహనాలను కేసులో చేర్చారు. 1996 నాటి ధరల ప్రకారం ఈ వాహనాల విలువ రూ..42.25 లక్షలుగా లెక్క కట్టారు. జామీనులో బైటకు వచ్చిన అనంతరం 6167 కారును జయ వాడటం ప్రారంభించారు. ఈ కారులోనే సచివాలయం, పార్టీ ప్రధాన కార్యాలయం సహా అన్ని కార్యక్రమాలకు జయ వినియోగించేవారు.
కాగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు పెరోల్‌పై ఐదు రోజుల చెన్నైలో ఉన్న శశికళ ప్రస్తుతం 6167 కారునే వినియోగిస్తున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తరువాత పోయస్‌గార్డెన్‌లో ఉన్న ఈ కారు ఎలా, ఎప్పుడు బైటకు వెళ్లింది, ఇన్నాళ్లు ఎవరి స్వాధీనంలో ఉంది, ఒక ముఖ్యమంత్రి వినియోగించిన కారు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి నేడు శశికళ వినియోగంలోకి ఎలా వచ్చిందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పలు అనుమానాలకు తావిచ్చింది.
దీనిపై దినకర్ వర్గంలోని ఒక నేత మాట్లాడుతూ, కార్లన్నీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుకున్నందున తనపేరుపై కార్లు ఉంటే అచ్చిరాదని భావించిన జయలలిత దినకరన్ పేరున ఒకటి, అతని భార్య అనూరాధ పేరున మరో కారును కొన్నట్లు తెలిపారు. మరణించే వరకు జయలలిత ఈ రెండు కార్లనే వినియోగించగా, ఆ తరువాత దినకరన్ స్వాధీనంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సదరు కారుపై శశికళ మోజుపడటంతో మరెవ్వరూ వినియోగించ కుండా జాగ్రత్త చేయగా ఆమె కోర్కె మేరకు పెరోల్ ఐదురోజుల వినియోగానికి 6167 కారును బైట పెట్టినట్లు ఆయన వివరించారు.
జయ సమాధి వద్దకు నో
పెరోల్‌పై బెంగళూరు జైలు నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి, ఇంటి మధ్య తిరుగుతున్న శశికళ పనిలో పనిగా జయలలిత సమాధి వద్దకు వెళ్లాలనే ప్రయత్నాలను పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. జైలు కెళ్లే ముందు అమ్మ సమాధిని శశికళ దర్శించకున్న సమయంలో సమాధిపై అరచేత్తో మూడుసార్లు గట్టిగా చరచడాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. సుమారు 7 నెలల తరువాత జైలు నుండి వచ్చిన శశికళను మరలాఅమ్మ సమాధి వద్దకు అనుమతిస్తే ఎటువంటి పోకడలకు పోతారోనని పోలీసు అనుమానిస్తోంది. పెరోల్ సమయంలో రాజకీయ జోక్యం ఎంతమాత్రం ఉండరాదని షరతు విధించగా, అమ్మ సమాధిని దర్శించుకోవడం కూడా రాజకీయాల కిందకు వస్తుందని భావించి ఆమె కోర్కెను పోలీసుశాఖ నిరాకరించింది. కాగా, శశికళ సోమవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి భర్త నటరాజన్‌ను మూడో రోజు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment