తన పాత్రపై స్పందించిన శశికళ భర్త
చెన్నై: జయలలిత వారసత్వం కోసం అన్నా డీఎంకేలో రసవత్తరమైన పోరు సాగుతోంది. తామే అసలైన వారసులమని జయ నెచ్చెలి శశికళ, విశ్వాసపాత్రుడు పన్నీరు సెల్వం, మేనకోడలు దీపా జయకుమార్ పోటీపడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతానికైతే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న శశికళ.. తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంపైనా పట్టు సంపాదించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో తన సోదరి కొడుకు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించి తన తర్వాతి స్థానం కట్టబెట్టారు. జయ బతికున్నప్పుడు తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టిన తన బంధువులను మళ్లీ తీసుకువచ్చారు. కాగా పార్టీలో శశికళ భర్త నటరాజన్ పాత్ర ఏమిటి? అన్నది ఎప్పుడూ రహస్యమే. ఆయన తెరవెనుకే ఉండి మంత్రాంగం నడిపిస్తుంటారు.
శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా అన్నా డీఎంకే నాయకులు చెన్నై మెరీనా బీచ్‌కు వెళ్లి ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నటరాజన్ మాట్లాడుతూ.. తానెప్పుడూ అన్నా డీఎంకే రాజకీయాల్లో తెరవెనుకే ఉంటానని చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. నటరాజన్ పలుమార్లు శశికళ పక్కన వివిధ కార్యక్రమాల్లో కనిపించారు. జయలలిత అంత్యక్రియల సమయంలో ఆయన భార్య దగ్గరే ఉన్నారు. అయితే మీడియాకు ఆయన దూరంగానే ఉంటున్నారు. అలాగే అన్నా డీఎంకే రాజకీయాల్లో తెరవెనుక ఉండే నటరాజన్.. తన భార్య శశికళకు సలహాలు ఇస్తుంటారని సమాచారం. ఇదిలావుండగా జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. శశికళ, ఆమె కుటుంబ సభ్యులపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. శశికళ కుటుంబాన్ని మన్నార్‌గుడి మాఫియాగా ఆయన అభివర్ణించారు.