కమలనాథుల కనుసన్నల్లోనే!?
తమిళ పోరులో గెలుపు ఓపీఎస్‌దా బీజేపీదా?
- కేంద్రంలోని బీజేపీ వ్యూహం ప్రకారమే తమిళనాట పరిణామాలు
- ఓటుకు నోట్లు.. ఈసీకి ప్రలోభాలు... కేసులు కేంద్ర సంస్థలవే
- ఆకస్మిక పరిణామాలతో అన్నాడీఎంకే శశికళ వర్గంలో గుబులు
- అది కేంద్రం నుంచి పరోక్ష హెచ్చరికలేనంటున్న పరిశీలకులు
- కనుకే చిన్నమ్మ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం నుంచి ఉద్వాసన?
- పన్నీర్‌తో రాజీకి పళని వర్గం సై... అధికార పంపిణీయే సమస్య
(సాక్షి నాలెడ్జ్ సెంటర్): అమ్మ జయలలిత సమాధి వేదికగా రెండు నెలల కిందట చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఒ.పన్నీర్‌సెల్వం తన పోరాటంలో గెలుస్తున్నట్లు కనిపిస్తోంది. శశికళ వర్గంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పళనిస్వామి మంత్రివర్గం.. శశికళ మేనల్లుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న టి.టి.వి.దినకరన్ కుటుంబాన్ని పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా శశికళను కూడా వెలివేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. దీంతో.. ఓపీఎస్ వర్గం, శశికళ వర్గంగా చీలిపోయిన అన్నా డీఎంకే మళ్లీ ఏకమయ్యేందుకు మార్గం సుగమమయింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ రెండు వర్గాలూ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలతో.. శశికళ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన ఓపీఎస్ అంతిమ విజయం సాధించినట్లు తమిళనాడు ప్రజలు భావిస్తుండవచ్చు. నిజానికి ఈ నాటకీయ పరిణామాలన్నిటికీ సూత్రధారి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనేతా పార్టీయేనని.. ఢిల్లీలోని కమలనాథుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోందని.. కాబట్టి వాస్తవమైన విజేత బీజేపీయే అవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ప్రోద్బలం ప్రోత్సాహం లేకుండా ఓపీఎస్ తిరుగుబాటు చేసేవారు కాదని.. ఒకవేళ చేసినా ఆ పార్టీ అండదండలు లేనిదే ఈ విజయం సాధించగలగటం సంగతి తర్వాత.. ఇంతకాలం తిరుగుబాటు నేతగా మనగలగడం కూడా సాధ్యం కాదని ఆ వర్గాలు ఉద్ఘాటిస్తున్నాయి.
ఆకస్మిక పరిణామాలు..: చీలిక వర్గాలు రెండూ అకస్మాత్తుగా విలీనం దిశగా అడుగులు వేయడానికి కారణం.. దినకరన్ మీద ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత సోమవారం నాడు నమోదు చేసిన ఒక కేసు. అన్నా డీఎంకే చీలిక నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ‘రెండు ఆకుల’ ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆ గుర్తును తమ వర్గానికి కేటాయించేలా చూడాలంటూ ఈసీ అధికారులకు దినకరన్ లంచం ఇవ్వజూపారనే ఆరోపణతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందే.. జయలలిత మరణం వల్ల ఖాళీ అయిన ఆర్.కె.నగర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలోనూ దినకరన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఎన్నికల్లో శశికళ వర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు దాదాపు రూ. 89 కోట్లు ఖర్చు చేశారని ఆదాయ పన్ను శాఖ అంచనా. అసలు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీని, ప్రభుత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలకు తమిళ ప్రజలు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఈ రెండు ఉదంతాలతో ఆ వర్గం, ఆ వర్గ ప్రభుత్వంపై ప్రజల్లో అప్రదిష్ట ఇంకా పెరిగిపోయింది.
కేంద్ర సంస్థల కేసులే..: ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక వాయిదాకు కారణమైన ఓట్ల కొనుగోలు వ్యవహారం గానీ.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఎన్నికల చిహ్నం కోసం ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు గానీ.. రెండూ కేంద్ర సంస్థలే బయటపెట్టడంలో ఏదో మతలబు ఉందనేది తమిళనాడులోని శశికళ వర్గం రాజకీయ నాయకులే కాదు, పలువురు రాజకీయ పరిశీలకుల సందేహం. నిజానికి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభానికి గురిచేయడం కొత్త విషయం కాకపోయినా.. ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో అది అసాధారణ స్థాయిలో సాగడం.. దానిపై ఈసీ తదితర కేంద్ర సంస్థలు తీవ్రంగా స్పందించడం సరైన చర్యే అయినా.. దాని వెనుక ఏవైనా రాజకీయ శక్తులు పనిచేసి ఉండొచ్చనే అంశాన్ని కొట్టి వేయలేమని వారు అంటున్నారు. ఇక దినకరన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణల తీరుతెన్నులు విచిత్రంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణలు చేసిన ‘మధ్యవర్తి’ ఒక చిన్నపాటి మోసగాడని.. అత్యున్నతస్థాయిలోని ఈసీ అధికారులను ప్రలోభపెట్టడానికి దినకరన్ నిజంగా సదరు వ్యక్తి ద్వారానే ప్రయత్నించారంటే ఆశ్చర్యం కలిగిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
అది పరోక్ష హెచ్చరిక..: ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక విషయంలో పరిణామాలు, దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం తదితర పరిణామాలు.. శశికళ వర్గానికి కేంద్రం నుంచి వచ్చిన పరోక్ష హెచ్చరికగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. శశికళ కుటుంబాన్ని దూరం పెట్టి.. ఓపీఎస్‌తో రాజీపడి పార్టీని కలిపేయాలన్నది ఆ హెచ్చరిక సారాంశంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళ గ్రూపులోని చాలా మంది నాయకులు కూడా ఆమె కుటుంబానికి విధేయతను కొనసాగిస్తే.. తమపైనా ‘దాడులు, సోదాలు’ జరుగుతాయని.. మొత్తంగా పార్టీయే కూలిపోయే పరిస్థితి రావచ్చని ఆందోళన చెందున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌తో చేతులు కలపడం మినహా ప్రత్యామ్నాయం లేదని.. అది జరగాలంటే ఓపీఎస్ షరతులు విధించినట్లు శశికళ, దినకరన్‌లను దూరం పెట్టకతప్పదని పరిశీలకులు వివరిస్తున్నారు. అయితే.. శశికళ, ఆమె కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పార్టీ టికెట్లు పొంది, ఎన్నికల్లో గెలుపొందిన చాలా మంది నాయకులు తక్షణమే ఆమెతో విభేదించే పరిస్థితి లేదని.. అందువల్ల ఆమె పేరును ప్రస్తావించకుండానే.. ఆరోపణలు, కేసులతో అప్రదిష్ట పాలైన దినకరన్ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారని చెప్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్షకు గురై ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో క్రియాశీలంగా జోక్యం చేసుకునే అవకాశం లేనందున ప్రస్తుతం ఆమె వల్ల రాగల ఇబ్బందులు కూడా పెద్దగా లేవన్నది ఆ వర్గం అంచనాగా భావిస్తున్నారు.
ఓపీఎస్‌తో రాజీ తప్పనిసరి..: శశికళ జైలులో ఉండటం, దినకరన్‌ను పదవి నుంచి తప్పించడంతో.. అన్నా డీఎంకేలో కుల వర్గాల కుమ్ములాటలు తీవ్రమవుతాయని పరిశీలకులు జోస్యం చెప్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రస్తుతం ప్రముఖ నాయకులుగా ఉన్న మాజీ సీఎం ఓపీఎస్, సీఎం పళనిస్వామి, ఎంపీ ఎం.తంబిదురై వంటి వారి మధ్య అధికార పంపిణీ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. పళనిస్వామి సీఎంగానే కొనసాగే అవకాశముందని, పన్నీర్‌సెల్వం పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టవచ్చునని, తంబిదురై పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఢిల్లీలో చక్రం తిప్పవచ్చునని పళనివర్గం భావిస్తోంది. అలాగే ఓపీఎస్ సహచరుడు కె.పాండ్యరాజన్‌కు కోల్పోయిన పదవులు తిరిగి దక్కే అవకాశముందనీ చెప్తున్నారు. అయితే.. జయలలిత పరోక్షంలో సీఎంగా ఉన్న ఓపీఎస్‌నే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, పళనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పన్నీర్ వర్గం డిమాండ్‌గా చెప్తున్నారు. రాష్ట్రంలో బలమైన థేవర్ వర్గానికి చెందిన పన్నీర్‌కి.. డిప్యూటీ సీఎం పదవి అంటే డిమోషన్ వంటిదేనని, దానిని ఆయన అంగీకరించకపోవచ్చునని చెప్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ మరో బలమైన గౌండర్ల వర్గానికి చెందిన పళని మాత్రం డిమోషన్‌కు అంగీకరిస్తారా అనేది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో అధికార పంపిణీలో ఎలా రాజీపడతారన్నది వేచిచూడాల్సిందే.
శశికళ పట్టు సడలినట్లే..: ఇక దినకరన్‌కు ఉద్వాసన పలకడం, శశికళను కూడా పరోక్షంగానే అయినా దూరంగా పెట్టిన చర్యలకు అన్నాడీఎంకే కార్యకర్తలు, సాధారణ ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తుందని పరిశీలకుల అంచనా. నిజానికి పార్టీ మద్దతుదారులు శశికళను సహజంగా ఎన్నుకోలేదు. అలాగని ఆమెను జయలలిత తన వారసురాలిగా ప్రకటించనూ లేదు. తనకు నమ్మకస్తులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ద్వారా ఆమె పార్టీని తన చేతుల్లోకి తీసుకోగలిగారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆమె ద్వారానే సీట్లు సంపాదించారన్నది బహిరంగ రహస్యం. సాధారణ పరిస్థితుల్లో అయితే ఆమె పార్టీపై తన పట్టును బిగించేందుకు అవకాశం ఉంటేది. అయితే.. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లడం.. ఆమె తన ప్రతినిధిగా పార్టీ పగ్గాలు అప్పగించిన మేనల్లుడు దినకరన్ సైతం ఓటుకు నోట్లు ఆరోపణలు, ఈసీని ప్రలోభానికి గురి చేసే ప్రయత్నాల కేసులతో ఆ పదవి కోల్పోవడం.. వారి కుటుంబాన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఆమె వర్గమే వెలివేయడం పరిణామాలతో శశికళ వ్యూహం బెడిసికొట్టిందని.. ఆమె పార్టీపైనా ఇతర నాయకులపైనా తన పట్టును కోల్పోతారన్నది పరిశీలకుల అంచనా.
వాళ్లది దొడ్డిదారిలో పాగా వేసే వ్యూహం: అళగురాజ్
కేంద్రంలోని బీజేపీ తమిళనాడులో రాజకీయంగా బలపడేందుకు ఓపీఎస్‌ను పావుగా వాడుకుంటోందని.. ఆయనకు బీజేపీతో రహస్య సంబంధాలు ఉన్నాయని శశికళ వర్గం ఆరోపిస్తోంది. బీజేపీ దొడ్డిదారిన రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఆ పార్టీ వలలోకి ఓపీఎస్ నడుచుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోందని అన్నా డీఎంకే అధికార పత్రిక డాక్టర్ నామాధు ఎంజీఆర్ సంపాదకుడు మరుదు అళగురాజ్.. ఇటీవలే పార్టీ పత్రికలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నపుడు ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం తెలుసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఆమె మరణం వెనుక ఏదో రహస్యం ఉందంటూ సందేహాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడటం ద్వారా రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడమే ఆ ఆరోపణల లక్ష్యమని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్ సాయంతో.. అన్నా డీఎంకే ఎన్నికల గుర్తును చీలిక వర్గాల్లో ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేసిందని తన వ్యాసంలో ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ కూడా ఓపీఎస్ను తమిళనాడు రక్షకుడిగా అభివర్ణించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి బీజేపీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని కూడా ఆరోపించారు. రెబల్ రాజ్యసభ సభ్యుడు వి.మైత్రేయన్, మాజీ మంత్రి కె.పాండ్యరాజన్ల మూలాలు బీజేపీలోనే ఉన్నాయని.. వారు బీజేపీకి సాయం చేయడానికే ఓపీఎస్ శిబిరానికి మారారని ధ్వజమెత్తారు.
ఇక తమిళ కమలం వికసిస్తుంది: బీజేపీ
అన్నా డీఎంకేలో అంతర్గత సంక్షోభంతో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ‘‘బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారు మాతో టచ్లో ఉన్నారు’’ అని రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తమిళనాడు వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్రావు ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక రద్దుకు సంబంధించిన మొత్తం వ్యవహారం మీద, ఈసీకి దినకరన్ లంచం ఇవ్వజూపిన ఉదంతం మీద సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడంలేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించి ప్రజల్లో అనుమానాలు ఉన్నాయంటూ.. దానికి సంబంధించిన వాస్తవాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలు.. రాజకీయ దుష్ప్రచారమని కొట్టివేశారు. అయితే.. తమిళనాడులో బీజేపీ వికసించడానికి పరిస్థితి సానుకూలంగా ఉందని.. ఈ రాష్ట్రంలో పార్టీ గణనీయంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అయితే.. జయలలిత మరణం, క్రియాశీల రాజకీయాలకు కరుణానిధి దూరం కావడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో ఒక రకమైన నాయకత్వ శూన్యత ఏర్పడిందని.. దానిని బీజేపీ విస్తరణకు వినియోగించుకోవడంలో తప్పు ఏమిటని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.గణేశన్ వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ తన 92 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో అత్యున్నత స్థాయి ప్రతినిధుల సభ సమావేశాన్ని నిర్వహించడం కూడా.. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడే వ్యూహంలో భాగమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.