Sri Lankan president
-
భారత్, శ్రీలంకల మధ్య విజన్ డాక్యుమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే!
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆందోళనకారుల నిరసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశం విడిచి మాల్దీవులకు పరారైన రాజపక్సకు అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. రాజపక్స మాల్దీవులకు చేరిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి శ్రీలంక పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గొటబయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన మళ్లీ సింగపూర్‌కు పయనమవుతున్నారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను అధికారులు బయటకు పంపించారు. అయితే సింగపూర్‌కు వెళ్లిన తర్వాత గొటబయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ మహిందాయాపా అబేయవర్ధనేకు అందించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చదవండి: రాజపక్స పారిపోతాడనుకోలేదు.. భారత్‌ను ఎంత సాయం అడుగుతాం! తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆందోళనలు ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధింపుతో మిన్నంటుతున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. కాగా గోటబయ తన భార్య ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో కలిసి సైనిక విమానంలో బుధవారం ఉదయమే మాల్దీవులకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశ స్పీకర్ మహ్మద్ నషీద్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు గోటబయ దేశం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్న జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. రోడ్డుపైకి చేరుకొని కేరింతలు కొట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వీడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూలై 20న పార్లమెంట్లో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. -
కొనడానికి లేదు.. తినడానికి లేదు
ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. కొనడానికి డబ్బుల్లేవు. డబ్బులున్నా కొనడానికి ఏమీ దొరకవు. పెట్రోల్ బంకుల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లు ఆఫీసుల్లేవు, పనుల్లేవు. చదువుల్లేవు. కాస్త గాలి ఆడేలా ఫ్యాన్ కింద కునుకు తీద్దామంటే కరెంట్ ఉండదు. ఏం చేయాలి? ఎలా బతకాలి? అందుకే కడుపు మండిన సగటు శ్రీలంక పౌరులు రోడ్డెక్కారు. అవినీతి అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ సమరభేరి మోగించారు. కడుపు నింపుకోవడానికి కావల్సినంత తిండి దొరకదు. అర్థాకలితో కంచం ముందు నుంచి లేవాలి. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుద్దామంటే కరెంట్ ఉండదు. రోజుకి 13 గంటల విద్యుత్ కోతలు. బయటకు వెళ్లాలంటే పెట్రోల్ లేక వాహనం కదలదు. పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి. అటు ధరాభారం, ఇటు నిత్యావసరాల కొరతతో శ్రీలంక పౌరుల బతుకు భారంగా మారింది. ఏది కొనాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాలి. కాళ్లు పడిపోయేలా నిల్చున్నా కావల్సినవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. లీటర్ పెట్రోల్ రూ.450, కేజీ బియ్యం రూ.250, కేజీ కందిపప్పు రూ. 420, ఒక కొబ్బరికాయ రూ.110, కేజీ కేరట్ రూ.250, అయిదు కేజీల గ్యాస్ బండ ధర రూ.1150... ఇవీ శ్రీలంకలో ధరలు ... నిత్యావసరాల ధరలు ఆ స్థాయిలో ఉంటే ఎలా కొంటారు ? ఏం తింటారు ? ఇక పిల్లలకైతే పౌష్టికాహారం దొరకడం లేదు. పాల పౌడర్ దిగుమతులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బతుకు దుర్భరమైన పరిస్థితుల్లో ఒంటికేదైనా వచ్చినా ఆస్పత్రుల్లో అత్యవసర మందులకి కూడా కొరత నెలకొంది. వైద్యం కూడా అందరికీ అందని పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్ ధరలు మండిపోతూ ఉండడంతో చాలా మంది తమ కండబలాన్ని నమ్ముకున్నారు. స్కూటర్లు, కార్లు అమ్మేసి సైకిళ్లు కొనుక్కుంటున్నారు. బంగారాన్ని, ఆభరణాల్ని కూడా అమ్మేస్తున్నారు. 2021లో 7 టన్నుల బంగారాన్ని అమ్మిన శ్రీలంక ప్రజలు ఈ ఏడాది 20శాతం అధికంగా అమ్మేయవచ్చునని అంచనాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజాగ్రహం అధ్యక్ష పీఠాన్ని వదలని గొటబాయ రాజపక్స మీదకు మళ్లింది.దేశంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడించారు. మొత్తంగా శ్రీలంక ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి ? పర్యాటక రంగం మీద ప్రధానంగా ఆధారపడిన శ్రీలం కోవిడ్–19 విసిరిన పంజా కోలుకోలేని దెబ్బ తీసింది. 2019లో 19 లక్షల మంది లంకను సందర్శిస్తే, 2020లో వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రధానంగా పర్యాటకం మీద ఆధారపడ్డ ఆ దేశానికి దెబ్బ తగిలింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీగా ఆదాయం వచ్చే దేశంలో రైతులు అందరూ సేంద్రీయ ఎరువులు వాడి తీరాలన్న ప్రభుత్వ నిబంధనతో వ్యవసాయ దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.. మరీ ముఖ్యంగా ధాన్యం, రబ్బర్, టీ, కొబ్బరి వంటి పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు రాజపక్స కుటుంబం ఏళ్ల తరబడి చేస్తున్న అవినీతి, ప్రభుత్వ అరాచక విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విదేశీ అప్పుల్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో డాలర్ మారకం విలువ రూ.200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.360కు చేరుకుంది. విదేశీ నిల్వలు తరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రపంచ దేశాల సహకారంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి తేవాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగులో ఉత్పాదకత పెంచడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన, సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడం, కార్మికులు రెట్టింపు శ్రమ చేయడం, ప్రజా సేవలు, విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించడం వంటివి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘గో హోం గొటా’.. శ్రీలంకలో నిరసనల హోరు..
కొలంబో/రామేశ్వరం: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో ఆదివారం వేలాదిమంది ఓ పార్కులో గుమికూడారు. రాజపక్సకు వ్యతిరేకంగా ‘గో హోం గొటా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఆహారం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఔషధాలు లేకుండా ఎలా బతకాలని జనం మండిపడుతున్నారు. రాజపక్స రాజీనామా చేసే దాకా ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు మద్దతిస్తామని తమిళ్ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) పార్టీ ఆదివారం ప్రకటించింది. గొటబయపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని సమాగీ జన బలవెగయా(ఎస్‌జేబీ) పార్టీ శుక్రవారం వెల్లడించింది. శ్రీలంకలో సంక్షోభాన్ని తట్టుకోలేక జనం ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంక నుంచి 19 మంది తమిళులు పడవలో ఆదివారం భారత్‌లోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
డ్రైవర్ కోసం దేశాధినేత నిరీక్షణ
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు పది నిమిషాలపాటు కారులోనే డ్రైవర్‌కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో అంతా నిర్ఘాంతపోయారు. ఒక దేశాధ్యక్షుడు ఇలా నిరీక్షించడమా అని ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందంటే.. పోలీసు విభాగం అనుమతి లేకుండానే అధ్యక్షుడి వాహన డ్రైవర్‌ను బయోమెట్రిక్ ద్వారం నుండి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. దర్శనం త్వరగా కల్పించి డ్రైవర్‌ను ఆలయం వెలుపలకు పంపి ఉంటే సమస్య ఉండేది కాదు? డ్రైవర్ క్యూలో చిక్కుకున్నాడు. తర్వాత డ్రైవరు ఆదరాబాదరాగా వాహనం వద్దకు చేరుకున్నాడు. దీనివల్ల సిరిసేనపదినిమిషాలపాటు కారులోనే నిరీక్షించాల్సి వచ్చింది. వీఐపీల దర్శనం విషయంలో ఆలయ అధికారులు ముందుగానే పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుని ఉంటే పరిస్థితి బాగుండేది. ముందస్తు సమచారం లేకపోవడం, తీసుకెళ్లిన డ్రైవర్‌ను ఆలయంలోనే వదిలేయటం వంటివి చేయటం వల్లే డ్రైవర్ క్యూలో చిక్కుకున్నాడు. ఇలాంటి సంఘటన తిరుమల చరిత్రలోనే ఇది తొలిసారి. ఆలయ, పోలీసు విభాగాల సమన్వయ తప్పిదం అయినప్పటికీ, దాని ప్రభావం మనదేశ ప్రతిష్ట , పరిపాలన వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు. ఇలాంటి తప్పిదాలను ఆ దేశ విదేశాంగ విభాగం తీవ్రంగా పరిగణిస్తుంది. దేశాధ్యక్షుడి పర్యటన ముగిశాక ఆ దేశ విదేశాంగ విభాగం వివరణ అడిగే అవకాశం ఉందని తెలిసింది. ఈ తప్పిందంపై అర్బన్‌జిల్లా ఎస్పి జయలక్ష్మి ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావుపై మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా డ్రైవర్‌ను శ్రీవారి దర్శనానికి ఎలా తీసుకెళతారు? తీసుకెళ్లిన డ్రైవర్‌ను ఎలా వదిలేస్తారు? దీనికి బాధ్యులెవరు? అంటూ మండిపడ్డారు. ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావు మాత్రం పెద్దగా స్పందించకపోవడం విస్మయం కలిగించింది. సాధారణంగా అత్యున్నత స్థాయి వ్యక్తుల సందర్శనకు ముందు సంబంధిత విభాగాలన్నీ ప్రతి చిన్న సమన్వయపర్చుకోవాలి. ముందస్తు కసరత్తు లేకపోవడం వల్లే ఈ పొరపాటు తలెత్తినట్లు సమాచారం. -
శ్రీవారిసేవలో శ్రీలంక అధ్యక్షుడు
-
శ్రీలంక అధ్యక్షుడి సోదరుని దారుణహత్య
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన సోదరుడు ప్రియాంత సిరిసేన(40) దారుణహత్యకు గురయ్యారు. వివరాలు...రెండు రోజుల క్రితం ప్రియాంత సిరిసేన ఆయనపై ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. పారిశ్రామికవేత్త అయిన ప్రియాంతపై గురువారం రాత్రి ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఒక అగంతకుడు దాడి చేశాడు. అనంతరం ఆయనను పొలొన్నారువకు సమీపంలోని కొలంబోకి అదే రోజు రాత్రి తరలించారు. ప్రియాంత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి వర్గాలు ఆయనను ఐసీయూలో ఉంచాయి. మైత్రిపాల సిరిసేన చైనా పర్యటనలో ఉండగా ఈ దాడి జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత సిరిసేన స్నేహితుడు కావడం గమనించదగ్గ విషయం. హత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించింది. -
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు
-
రాజపక్సే గో బ్యాక్
యుద్ధం పేరుతో ఈలం తమిళుల్ని టార్గెట్ చేసి నరమేధం సృష్టించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుపతి పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలకు రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోనూ, తిరుపతిలోనూ నల్ల జెండాల ప్రదర్శనకు నిర్ణయించాయి. తమిళ ద్రోహి రాజపక్సేను తెలుగు గడ్డపై అడుగు పెట్టనివ్వొద్దని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు నామ్ తమిళర్ కట్ట్చి నేత సీమాన్ విజ్ఞప్తి చేశారు. అడుగు పెట్టనిస్తే చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : శ్రీలంకలో యుద్ధం పేరుతో సాగిన మారణ కాండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈలం తమిళుల్ని నామరూపాలు లేకుండా చేసిన రాజపక్సేను అంతర్జాతీయ న్యాయ స్థానం బోనులో దోషిగా నిలబెట్టాలన్న కాంక్షతో తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పక్షాలు ఉద్యమిస్తున్నాయి. అదే సమయంలో రాజపక్సేను భారత్‌లోకి అనుమతించ కూడదన్న డిమాండ్‌తో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే, ఫలితం శూన్యం. ఓ వైపు రాజపక్సేను పొగడ్తలతో ముంచెత్తే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, మరో వైపు భారత్ పర్యటనకు వచ్చే ఆయనకు రెడ్ కార్పెట్ ఆహ్వానం పలకడం జరుగుతూనే ఉన్నది. గో బ్యాక్: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజపక్సే తిరుపతికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయ న పర్యటన వివరాల్ని కేంద్రం గోప్యంగా ఉంచినా, చివరి క్షణంలో బయటకు పొక్కింది. దీంతో రాజపక్సే గో బ్యాక్ అన్న నినాదాన్ని తమిళాభిమాన సంఘాలు, పార్టీలు అందుకున్నాయి. రాజపక్సేకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. తమిళనాడులోనూ, తిరుపతిలోనూ నిరసనలకు నిర్ణయించాయి. ఎండీఎంకే నేత వైగో ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ నేత మాసిలామణి నేతృత్వంలో తిరుపతిలో నల్ల జెండాలతో నిరసనలు తెలిపేందుకు ఓ బృందం సిద్ధమైంది. శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ, తదితర తమిళాభిమాన సంఘాలు సైతం రాజపక్సేకు వ్యతిరేకంగా నల్ల జెండాల నిరసనలకు నిర్ణయించాయి. వీసీకే నేత తిరుమావళవన్ ఇచ్చిన పిలుపుతో ఆపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నేతృత్వంలో తిరుపతిలో నల్ల జెండాల ప్రదర్శనకు వ్యూహ రచన చేశారు. రాష్ట్రంలోనూ నిరసలనకు ఆ పార్టీ పిలుపు నివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీమాన్ హెచ్చరిక: నామ్ తమిళర్ కట్చి సైతం నిరసనలకు సిద్ధం అయింది. ఆ పార్టీ నేత సీమాన్ మీడియా తో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. తమిళల మనోభావాల్ని గౌరవిం చాలని విన్నవించారు. తమిళనాడులో తెలుగు వారు, తమిళులు సోదర భావంతో మెలుగుతున్నారని గుర్తు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. తమిళ ఈలంను సర్వనాశనం చేసిన వ్యక్తి ఆ రాష్ట్రంలోకి అడు గు పెడుతున్నారని, ఆయన్ను అడ్డుకోవాలని కోరారు. తమిళుల్ని యుద్ధం పేరుతో మట్టుబెట్టిన రాజపక్సేను, వారికి అనుకులంగా వ్యవహరించే వారిని తాము క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఒక వేళ రాజపక్సేను అనుమతించిన పక్షంలో చెన్నైలోని టీటీడీ సమాచార కేం ద్రాన్ని ముట్టడిస్తామని, భారీ నిరసనతో తమ ఆగ్రహా న్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
రేపు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం కోసం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స కుటుంబ సభ్యులతో మంగళవారం తిరుపతికి వస్తున్నారు. అధికారుల అనధికార సమాచారం మేరకు... ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయనికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకుని రాత్రికి కొలంబోకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం శ్రీలంక నుంచి వచ్చిన భద్రతాధికారుల బృందం తిరుమలలోని పలు ప్రదేశాల్లో పర్యటించింది. తిరుమల విజిలెన్స్ ఏవీఎస్వో, ఇతర అధికారులను కలసి శ్రీలంక అధ్యక్షుడి పర్యటనపై చర్చించారు. -
శ్రీలంక అధ్యక్షుడికి వ్యతిరేకంగా వైకో నిరసన
న్యూఢిల్లీ: మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు నిరసన తెలిపేందుకు యత్నించిన ఎండీఎంకే చీఫ్ వైకోను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన పార్టీకి చెందిన దాదాపు వంద మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఇక్కడి పార్లమెంట్ స్ట్రీట్‌లోకి వచ్చిన ఎండీఎంకే కార్యకర్తలు శ్రీలంక జాతీయ జెండాతో పాటు రాజపక్స ఫొటోలతో కూడిన బ్యానర్లను తగులబెట్టారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఎండీఎంకే.. రాజపక్సకు ఆహ్వానం పలకడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలో తమిళుల హక్కులను అధ్యక్షుడు కాలరాశాడని వైకో ధ్వజమెత్తారు. రాజపక్స హాజరవడం వల్ల మోడీ ప్రమాణ స్వీకారోత్సవం పవిత్రత దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక విషయంలో యూపీఏ బాటలో ఎన్డీయే సాగవద్దని సూచించారు. -
అలిగిన జయలలిత
మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆమె ఈ విషయమై ఆదివారం రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. బీజేపీ మిత్రపక్షాలైన తమిళ పార్టీలు డీఎండీకే, ఎండీఎంకే కూడా రాజపక్సను ఆహ్వానించడాన్ని వ్యతిరేకించాయి. రాజపక్స రాకకు నిరసనగా సోమవారం ఢిల్లీలో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎండీఎంకే అధినేత వైగో ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, కేరళల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, ఊమెన్ చాందీలు మోడీ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కానున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. -
మోడీ ప్రమాణస్వీకారానికి జయ దూరం!
తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలంటూ శ్రీ లంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించిన కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రేపు న్యూఢిల్లీలో జరగనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకుడదని జయలలిత నిర్ణయించుకున్నారని ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నాయి. అంతేకాదు తన తరఫున కనీసం ఒక్కరిని కూడా ఆ కార్యక్రమానికి పంపడం లేదని సమాచారం. ఎన్నికల ప్రచారంలో మోడీని జయలలిత, జయలలితను మోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. చివరికి ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి 282 సీట్లు రావడం, అలాగే ఏఐఏడీఏంకేకు 35 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ సందర్బంగా ఆ ఇద్దరు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు కూడా. అప్పటివరకు అంతా బాగానే ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మహేంద రాజపక్సేను ఆహ్వానించారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై జయలలిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ హామీయిచ్చిన నేపథ్యంలో రాజపక్సెను ఆహ్వానించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మోడీ నిర్ణయం దురదృష్టకరమన్నారు. మోడీ నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి కూడా మండిపడ్డారు. ఈలం తమిళుల మృతదేహాలను గుట్టలుగాపోసి మానవహక్కులను కాలరాసిన రాజపక్సే సమక్షంలో కొత్త ప్రధానిగా మోడీ ప్రమాణం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు, ఆహ్వానాన్ని మరోసారి పరిశీలించండని మోడీని కరుణానిధి కోరిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ సభ్య దేశాధ్యక్షులను ఆహ్వానించారు. ఆ సభ్య దేశాలలో శ్రీలంక కూడా ఓ సభ్య దేశమైన విషయం విదితమే.