
కొలంబో/రామేశ్వరం: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో ఆదివారం వేలాదిమంది ఓ పార్కులో గుమికూడారు. రాజపక్సకు వ్యతిరేకంగా ‘గో హోం గొటా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఆహారం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఔషధాలు లేకుండా ఎలా బతకాలని జనం మండిపడుతున్నారు.
రాజపక్స రాజీనామా చేసే దాకా ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు మద్దతిస్తామని తమిళ్ నేషనల్ అలయెన్స్(టీఎన్‌ఏ) పార్టీ ఆదివారం ప్రకటించింది. గొటబయపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని సమాగీ జన బలవెగయా(ఎస్‌జేబీ) పార్టీ శుక్రవారం వెల్లడించింది. శ్రీలంకలో సంక్షోభాన్ని తట్టుకోలేక జనం ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంక నుంచి 19 మంది తమిళులు పడవలో ఆదివారం భారత్‌లోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.