crices
-
బ్యాంకింగ్ సంక్షోభం నేర్పే పాఠాలు
ప్రధానంగా అమెరికా కేంద్రంగా పనిచేసే కొన్ని బ్యాంకుల సంక్షోభం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. దీంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ బ్యాంకుల సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం గమనార్హం. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో తగినన్ని ఏర్పాట్లు ఉన్నా రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసుల విషయంలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలన్నది ఈ సంక్షోభం చెబుతున్న ఒక పాఠం. పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదన్నది మరో పాఠం. సిల్వర్‌గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్వీస్... ఇటీవలి కాలంలో పత్రికల పతాక శీర్షికలకు ఎక్కిన బ్యాంకుల పేర్లు. భారత్‌లో క్రెడిట్ స్వీస్ గురించి చాలామందికి తెలుసు కానీ... మిగిలిన మూడింటితో పరిచయం అంతంత మాత్రమే. ఎందుకంటే ఇవి ప్రధానంగా అమెరికాలో పనిచేసే బ్యాంకులు. అయినాసరే, వీటి గురించి బోలె డన్ని కథనాలు వరుసగా వస్తూండటం కొంత అసౌకర్యంగా అనిపించే విషయమే. ఇప్పుడు తలెత్తిన ప్రశ్న ఏమిటంటే, మన బ్యాంకింగ వ్యవస్థఎంత సురక్షితం? అన్నది. అమెరికాకు చెందిన లేహ్మ¯Œ బ్రదర్స్ దివాళా సంక్షోభం తరువాత ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ మూలధనానికి సంబంధించిన విధానాలను మరింత కఠినం చేసింది. బేసెల్ కమిటీ మార్గదర్శకాలు ఇందుకు కారణమయ్యాయి. అయినా ప్రస్తుత సంక్షోభాన్ని అది నివారించలేక పోయింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న తలెత్తుతోంది. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? లేక ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అయితే, ఈ బ్యాంకుల మూసివేతకు దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. దేని కారణాలు దానివే! ఈ మూడు బ్యాంకుల మూసివేతకూ, భారతీయ బ్యాంకులకూ నేరుగా సంబంధం లేకపోవచ్చు. సిల్వర్‌గేట్ బ్యాంకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఉంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి అంత ఆదరణ లేదు. ఇంకొన్నేళ్లు పోతే అసలు క్రిప్టో అన్న పదం కూడా వినిపించకపోవచ్చు. అదంత సుస్థిరమైంది కాదని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు కేవలం స్టార్టప్‌లపైనే ఎక్కువగా కేంద్రీ కరించింది. అందిన డిపాజిట్లు అత్యధికం స్టార్టప్‌ల నుంచి వచ్చినవే. కొంతమేరకు అప్పులూ ఇచ్చారు కానీ ఎక్కువ మొత్తం ప్రభుత్వాలకు అప్పు ఇచ్చింది. (మన బ్యాంకుల మాదిరిగానే ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టారన్నమాట.) ఇక సిగ్నేచర్ బ్యాంకు గురించి: ఇది అటు క్రిప్టో, ఇటు స్టార్టప్‌లు రెండు రంగాల్లోనూ పనిచేస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆదుకునేందుకు న్యూయార్క్ కమ్యూనిటీ బ్యా¯Œ కార్ప్ ఒక ప్రయత్నం చేస్తోంది. చివరగా క్రెడిట్ స్వీస్: ఇది స్విట్జర్లాండ్ బ్యాంక్. ఎవరికి రుణా లిచ్చారన్న విషయంలో ఈ బ్యాంకు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే రకరకాల వ్యాపార వ్యవహారాల కారణంగా నష్టాలు ఎదు ర్కొంది. ఆ దేశ కేంద్ర బ్యాంకు దీనికి బెయిల్ అవుట్ ఇస్తోంది. అలాగే యూబీఎస్ దీన్ని స్వాధీనం చేసుకుని కష్టాల నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగు ఘటనలు వేటికవే ప్రత్యేకం కానీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేవి. లేహ్మన్ బ్రదర్స్ సంక్షోభం కంటే ప్రస్తుత సంక్షోభం భిన్నమైంది. ఎలాగంటే... ఇప్పుడు అన్ని నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆర్బీఐ కూడా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉందన్న భరోసా ఇచ్చింది. యూరప్‌లోనూ కేంద్ర బ్యాంకులు క్రెడిట్ స్వీస్ సంక్షోభం ప్రభావాన్ని మదిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ప్రభావం భారత్‌పై ఏమిటి? మనం నేర్చుకోవాల్సిన గుణపాఠా లేమిటి? అప్పుల గురించి కూడా యోచించాలి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం నేర్పించే మొదటి పాఠం... కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలని! రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ముప్పు ఒక్క దగ్గర పోగు పడకుండా చూడటం వీటి ఉద్దేశం. అయితే డిపాజిట్లు పోగుపడటం వల్ల కూడా ముప్పు ఉంటుందన్నది వినూత్నమైన విషయం. డిపా జిట్లు ఎక్కువగా స్టార్టప్‌ల నుంచి రావడం వల్ల సంక్షోభం మరింత ముదిరింది. ఎందుకంటే డిపాజిట్లు చేసిన వారందరూ అకస్మాత్తుగా వాటిని ఉపసంహరించుకునే ప్రయత్నం చేశారు. భారతీయ బ్యాంకులు ఈ విషయమై ఆలోచన చేయాలి. చిన్న బ్యాంకులు మరీ ముఖ్యంగా. ఇక రెండో గుణపాఠం: పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదని చెబుతోంది. యూఎస్ ట్రెజరీ బాండ్లు కలిగి ఉండటం వాస్తవానికి చాలా సురక్షితం. కానీ వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల ఈ పెట్టుబడుల విలువల్లో తేడాలొస్తాయి. ఈ విషయాన్ని బ్యాంకులు గుర్తించాలి. రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసెస్‌లను సమీక్షించుకోవాలి. ముచ్చటగా మూడో పాఠం: వాణిజ్య బ్యాంకింగ్‌లో నైపుణ్యం సాధించాలని బ్యాంకులకు తరచూ చెబుతూంటారు. ఇతర కార్య కలాపాలను అనుబంధ కంపెనీల ద్వారా నడపాలనీ, వాటి మూల ధన నిర్మాణం కూడా వేరుగా ఉండాలనీ అంటారు. క్రెడిట్ స్వీస్ విషయంలో ఈ రెండు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో వచ్చిన నష్టాలు, వెల్త్ మేనేజ్మెంట్ విభాగపు నిధులను విత్‌డ్రా చేయడం కాస్తా వాణిజ్య బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపింది. భారత్‌లో ఈ బలహీనతను చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఇన్వెస్ట్మెంట్, మర్చెంట్ బ్యాంకింగ్, ఇన్సూరె¯Œ ్స, మ్యూచు వల్ ఫండ్స్ తదితరాలను అనుబంధ సంస్థల ద్వారా నడుపుతున్నారు. దీనివల్ల ముప్పు కొంచెం తక్కువవుతుంది. క్రిప్టో కరెన్సీని ఎలాగూ భారత్ గుర్తించలేదు. కాబట్టి రెండు బ్యాంకులు కుప్పకూలడం తాలూకూ ప్రభావం మనపై ఉండదు. వాస్తవానికి తాజా సంక్షోభం తరువాత ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వ్యవహారాలను బ్యాంకింగ్‌కు దూరంగా ఉంచాలన్న అభి ప్రాయం బలపడటం గుర్తించాలి. ప్రత్యక్ష ప్రభావం లేదు అమెరికన్ బ్యాంకులు, క్రెడిట్ స్వీస్ సంక్షోభం తాలూకూ ప్రత్యక్ష ప్రభావం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఏమీ కనపడటం లేదు. కాకపోతే ఒక్కసారి పరిస్థితిని సమీక్షించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. బ్యాలెన్స్ షీట్లను ఒక్కసారి పరిశీలించుకుని డిపాజిట్లు, అప్పులు ఎలా విభజితమై ఉన్నాయో చూసుకోవడం మేలు. ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా రిస్క్ టీమ్స్‌తో కలిసి పెట్టుబడుల తీరు తెన్నులను మదింపు చేయాలి. అంతేకాకుండా... డెట్(రుణ) సర్వీస్ కవరేజి నిష్పత్తికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఇది నిరంతర ప్రక్రియలా సాగాలి. ఆర్బీఐ కూడా డిపాజిట్లపై ప్రస్తుతం జారీ చేస్తున్న ఇన్సూరెన్స్‌ను సమీక్షించాల్సిన అవసరముంది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఐదు లక్షల గరిష్ఠ ఇన్సూరెన్స్ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలి. ముప్పు తీవ్రత ఆధారంగా బ్యాంకులను వర్గీకరించే అంశాన్నీ పరిశీలించాలి. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఎదు ర్కొనేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై త్వరలోనే చర్చ మొదలు కావచ్చు. ‘బేసిల్–4’ (సంస్కరణల కోసం) వంటివి ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. ఇది బ్యాంకులకు అవసరమైన మూలధనం మరింత పెరిగేందుకు దారితీసే అవకాశముంది. అంతేకాకుండా... మార్కెట్, క్రెడిట్ రిస్క్‌లను అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షల్లాంటివి చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. మదన్ సబ్నవీస్, వ్యాసకర్త బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్, (‘ద బిజినెస్ లైన్’ సౌజన్యంతో). -
‘గో హోం గొటా’.. శ్రీలంకలో నిరసనల హోరు..
కొలంబో/రామేశ్వరం: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో ఆదివారం వేలాదిమంది ఓ పార్కులో గుమికూడారు. రాజపక్సకు వ్యతిరేకంగా ‘గో హోం గొటా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఆహారం, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఔషధాలు లేకుండా ఎలా బతకాలని జనం మండిపడుతున్నారు. రాజపక్స రాజీనామా చేసే దాకా ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు మద్దతిస్తామని తమిళ్ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) పార్టీ ఆదివారం ప్రకటించింది. గొటబయపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని సమాగీ జన బలవెగయా(ఎస్‌జేబీ) పార్టీ శుక్రవారం వెల్లడించింది. శ్రీలంకలో సంక్షోభాన్ని తట్టుకోలేక జనం ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లంక నుంచి 19 మంది తమిళులు పడవలో ఆదివారం భారత్‌లోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. -
విశ్వాసపరీక్షకు సిద్ధం!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్‌లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి. సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్ సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు. రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్‌లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్‌లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు. ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్ అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్‌పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు. రాహుల్‌కు బెయిలు మంజూరు నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్‌కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి. యథాతథ స్థితి: సుప్రీంకోర్టు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు. స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా? ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్‌కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్‌కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ -
కష్టాలు.. కన్నీళ్ల కలబోత.. చేనేత
కడుపు నింపని మగ్గం నిరంతర శ్రమ.. బతుకుదెరువు భ్రమ చక్రబంధంలో చేనేత కార్మికులు రెడీమేడ్‌తో చేనేతకు గడ్డుకాలం నేడు జాతీయ చేనేత దినోత్సవం సిరిసిల్ల/ బోయినపల్లి/హుజూరాబాద్: మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కష్టాలు కన్నీళ్ల కలబోత అయింది. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండోస్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కనీస వేతనాలు లేవు. ఈ రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా కార్మికుల ఆకలి తీరడం లేదు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చేనేత స్థానంలో మరమగ్గాలు, ఆధునిక మగ్గాలు వచ్చినా.. శ్రమించే చేతులకు మిగిలేది శూన్యం. చేనేత దినోత్సవ నేపథ్యం.. 1905లో పశ్చిమబెంగాల్ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్ హాల్లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అప్పటిస్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ 2015, ఆగస్టు 7న జాతీయస్థాయిలో చేనేత దినోత్సవంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ చేనేత కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా 2012 నుంచే ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. చిరిగిన వస్త్రం.. చేనేత రంగం చేనేత రంగం చిరిగిన వస్త్రమైంది. చేనేత మగ్గాలు మరణశయ్యపై ఉన్నాయి. 60 ఏళ్లు పైబడిన వాళ్లే చేనేత మగ్గాలను నడిపిస్తున్నారు. ఆధునిక మగ్గాల ప్రవేశంతో చేనేత మగ్గాలు అటకెక్కాయి. తెలంగాణలో 42 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. పాతికవేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి సిరిసిల్లలో జీవిస్తున్నాయి. సిరిసిల్లలో నిత్యం 34 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల కాటన్ వస్త్రంలో దేశంలోని ఆరు రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంగా ఉంది. వస్త్రోత్పత్తి ఖిల్లాగా పేరుగాంచింది. రెండో షోలాపూర్‌గా పేరుంది. సిరిసిల్లలో దేశంలోనే తొలి చేనేత కార్మికుని కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అయినా కార్మికులకు మిగిలేది శూన్యం. 36 చేనేత సంఘాలు.. జిల్లావ్యాప్తంగా 36 చేనేత సహకార సంఘాలు ఉండగా ఇందులో ఆరువేల మంది సభ్యులున్నారు. నిజానికి 29 సంఘాలు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఏటా రూ.23 కోట్ల వ్యాపారం సాగిస్తున్నాయి. సిరిసిల్లలో మూడు సహకార సంఘాలు పని చేస్తున్నాయి. గోదాములోనే రూ.70 లక్షల ఉత్పత్తులు హుజూరాబాద్ పట్టణంలోని చేనేత సంఘంలో 350 మంది కార్మికులు నేతవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ సంఘంలో ఉత్పత్తి చేసిన రూ.70 లక్షల విలువ గల సరుకు గోదాముల్లోనే నిల్వ ఉండడం కార్మికులపై ప్రభావం చూపుతోంది. గతంలో చేనేత, ఆప్కో కలిసి ఉన్న నేపథ్యంలో కార్మికులు జనరల్ ఉత్పత్తులను తయారుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 140దుకాణాల ద్వారా అమ్మకాలు జరిపేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి 40 దుకాణాలను కేటాయించారు. దీంతో ఆప్కోవారు తమ వద్ద ఉన్న ఉత్పత్తుల అమ్మకాలు పూర్తయితేనే జనరల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో రూ.70 లక్షల విలువ గల ఉత్పత్తులు గోదాములోనే కొన్ని నెలలుగా నిల్వ ఉంది. కిరాయి ఇల్లే ఉంది.. – రాపెల్లి హన్మండ్లు, గణేశ్‌నగర్, సిరిసిల్ల నేను ఆరవై ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తే ఐదారు మీటర్లు బట్ట తయారవుతుంది. మీటరుకు రూ.13.50 ఇస్తున్నారు. వారానికి ఏడు వందలు వస్తుంది. నా భార్య పెంటవ్వకు పక్షవాతం. నెలకు రూ.1600 మందులకే కావాలే. మూడేళ్లుగా గిదే గోస. ఒక కొడుకు ఉరి పెట్టుకుని చనిపోయిండు. ఇద్దరు కొడుకులు ఎవరికి వాళ్లు బతుకుతరు. మేం ఇద్దరమే ఉంటం. ఎంత పని చేసినా పొట్టకు ఎల్లుత లేదు. కూలి పెంచి ఆదుకోవాలి – చిదురాల రాజయ్య, నేత కార్మికుడు, హుజూరాబాద్ రోజుకు 10 గంటలు పని చేస్తే 6 మీటర్ల బట్ట నేస్తం. కూలిగిట్టుబాటు కావడం లేదు. రెక్కాడితేనే డొక్కాడే మా బతకంతా చీకటే. రోజంతా నేసి రోగాల బారిన పడుతున్నం. ఆసుపత్రికి పోదామంటే ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇస్తున్న కూలి డబుల్ పెంచి ఇవ్వాలి. ఇళ్లులేని చేనేత కార్మికులకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టియ్యాలె. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి –జక్కని లక్ష్మినారాయణ, మండల పద్మశాలి సమాజ సేవాసంఘం అధ్యక్షుడు, బోయినపల్లి ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి. మా కష్టాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించాలి. కనుమరుగైపోతున్న చేనేత వృత్తిని కాపాడాలి. సబ్సిడీపై మరమగ్గాలు అందించాలి. కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడిచ్చే కూలీతో ఇల్లు గడువడం కష్టమైతుంది.