కష్టాలు.. కన్నీళ్ల కలబోత.. చేనేత | powerloom workers strugle | Sakshi
Sakshi News home page

కష్టాలు.. కన్నీళ్ల కలబోత.. చేనేత

Published Sat, Aug 6 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

కష్టాలు.. కన్నీళ్ల కలబోత.. చేనేత

కష్టాలు.. కన్నీళ్ల కలబోత.. చేనేత

  • కడుపు నింపని మగ్గం
  • నిరంతర శ్రమ.. బతుకుదెరువు భ్రమ 
  • చక్రబంధంలో చేనేత కార్మికులు
  • రెడీమేడ్‌తో చేనేతకు గడ్డుకాలం 
  • నేడు జాతీయ చేనేత దినోత్సవం
  • సిరిసిల్ల/ బోయినపల్లి/హుజూరాబాద్‌: మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కష్టాలు కన్నీళ్ల కలబోత అయింది. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండోస్థానాన్ని ఆక్రమించిన  చేనేత రంగంలో కనీస వేతనాలు లేవు. ఈ రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా కార్మికుల ఆకలి తీరడం లేదు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చేనేత స్థానంలో మరమగ్గాలు, ఆధునిక మగ్గాలు వచ్చినా.. శ్రమించే చేతులకు మిగిలేది శూన్యం. 
     
    చేనేత దినోత్సవ నేపథ్యం..
    1905లో పశ్చిమబెంగాల్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్‌ హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అప్పటిస్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ 2015, ఆగస్టు 7న జాతీయస్థాయిలో చేనేత దినోత్సవంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ చేనేత కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా 2012 నుంచే ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. 
     
    చిరిగిన వస్త్రం.. చేనేత రంగం
    చేనేత రంగం చిరిగిన వస్త్రమైంది. చేనేత మగ్గాలు మరణశయ్యపై ఉన్నాయి. 60 ఏళ్లు పైబడిన వాళ్లే చేనేత మగ్గాలను నడిపిస్తున్నారు. ఆధునిక మగ్గాల ప్రవేశంతో చేనేత మగ్గాలు అటకెక్కాయి. తెలంగాణలో 42 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. పాతికవేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి సిరిసిల్లలో జీవిస్తున్నాయి. సిరిసిల్లలో నిత్యం 34 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్‌టైల్‌ పార్క్‌ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల కాటన్‌ వస్త్రంలో దేశంలోని ఆరు రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంగా ఉంది. వస్త్రోత్పత్తి ఖిల్లాగా పేరుగాంచింది. రెండో షోలాపూర్‌గా పేరుంది. సిరిసిల్లలో దేశంలోనే తొలి చేనేత కార్మికుని కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అయినా కార్మికులకు మిగిలేది శూన్యం. 
     
    36 చేనేత సంఘాలు..
    జిల్లావ్యాప్తంగా 36 చేనేత సహకార సంఘాలు ఉండగా ఇందులో ఆరువేల మంది సభ్యులున్నారు. నిజానికి 29 సంఘాలు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఏటా రూ.23 కోట్ల వ్యాపారం సాగిస్తున్నాయి. సిరిసిల్లలో మూడు సహకార సంఘాలు పని చేస్తున్నాయి.  
     
    గోదాములోనే రూ.70 లక్షల ఉత్పత్తులు 
    హుజూరాబాద్‌ పట్టణంలోని చేనేత సంఘంలో 350 మంది కార్మికులు నేతవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ సంఘంలో ఉత్పత్తి చేసిన రూ.70 లక్షల విలువ గల సరుకు గోదాముల్లోనే నిల్వ ఉండడం  కార్మికులపై ప్రభావం చూపుతోంది. గతంలో చేనేత, ఆప్కో కలిసి ఉన్న నేపథ్యంలో కార్మికులు జనరల్‌ ఉత్పత్తులను తయారుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 140దుకాణాల ద్వారా అమ్మకాలు జరిపేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి 40 దుకాణాలను కేటాయించారు. దీంతో ఆప్కోవారు తమ వద్ద ఉన్న ఉత్పత్తుల అమ్మకాలు పూర్తయితేనే జనరల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో రూ.70 లక్షల విలువ గల ఉత్పత్తులు గోదాములోనే కొన్ని నెలలుగా నిల్వ ఉంది. 
     
    కిరాయి ఇల్లే ఉంది..
    – రాపెల్లి హన్మండ్లు, గణేశ్‌నగర్, సిరిసిల్ల
    నేను ఆరవై ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తే ఐదారు మీటర్లు బట్ట తయారవుతుంది. మీటరుకు రూ.13.50 ఇస్తున్నారు. వారానికి ఏడు వందలు వస్తుంది. నా భార్య పెంటవ్వకు పక్షవాతం. నెలకు రూ.1600 మందులకే కావాలే. మూడేళ్లుగా గిదే గోస. ఒక కొడుకు ఉరి పెట్టుకుని చనిపోయిండు. ఇద్దరు కొడుకులు ఎవరికి వాళ్లు బతుకుతరు. మేం ఇద్దరమే ఉంటం. ఎంత పని చేసినా పొట్టకు ఎల్లుత లేదు.  
     
     కూలి పెంచి ఆదుకోవాలి
    – చిదురాల రాజయ్య, నేత కార్మికుడు,  హుజూరాబాద్‌ 
    రోజుకు 10 గంటలు పని చేస్తే 6 మీటర్ల బట్ట నేస్తం. కూలిగిట్టుబాటు కావడం లేదు. రెక్కాడితేనే డొక్కాడే మా బతకంతా చీకటే. రోజంతా నేసి రోగాల బారిన పడుతున్నం. ఆసుపత్రికి పోదామంటే ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇస్తున్న కూలి డబుల్‌ పెంచి ఇవ్వాలి. ఇళ్లులేని చేనేత కార్మికులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టియ్యాలె. 
     
      
     ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
    –జక్కని లక్ష్మినారాయణ, మండల పద్మశాలి సమాజ సేవాసంఘం అధ్యక్షుడు, బోయినపల్లి
    ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి. మా కష్టాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించాలి. కనుమరుగైపోతున్న చేనేత వృత్తిని కాపాడాలి. సబ్సిడీపై మరమగ్గాలు అందించాలి. కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడిచ్చే కూలీతో ఇల్లు గడువడం కష్టమైతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement