శుక్రవారం బెంగళూరులో విధానసౌధలో మాట్లాడుతున్న సీఎం కుమారస్వామి
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్‌లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి.
సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్
సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు.
రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు
బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్‌లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు.
అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్‌లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్‌లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు.
ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్
అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్‌పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు.
రాహుల్‌కు బెయిలు మంజూరు
నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్‌కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి.
యథాతథ స్థితి: సుప్రీంకోర్టు
10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు.
స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా?
ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్‌కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్‌కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది.
అహ్మదాబాద్‌లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment