కర్నాటకం క్లైమాక్స్‌ నేడే | Karnataka Governor asks Kumaraswamy to prove majority | Sakshi
Sakshi News home page

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

Published Fri, Jul 19 2019 3:55 AM | Last Updated on Fri, Jul 19 2019 8:02 AM

Karnataka Governor asks Kumaraswamy to prove majority - Sakshi

విధానసౌధలో మంత్రులతో మాట్లాడుతున్న సీఎం కుమారస్వామి

సాక్షి బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభ ప్రారంభం కాగానే ‘ఈ సభ నా నేతృత్వంలోని మంత్రివర్గంపై విశ్వాసం ఉంచుతోంది’ అని ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈరోజే విశ్వాసపరీక్షను పూర్తిచేయాలని ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప స్పీకర్‌ రమేశ్‌ను డిమాండ్‌ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్దరామయ్య రెబెల్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేసేందుకు వీలుగా రూలింగ్‌ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.
ఈ విషయమై తాను అడ్వొకేట్‌ జనరల్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి పోటీగా కాంగ్రెస్‌ నేతలు కూడా ఆందోళన చేయడంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్‌ వజూభాయ్‌వాలాను కలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి స్పీకర్‌ న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నారు.

దేశానికి నిజాలు చెప్పాలి: కుమారస్వామి
విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్‌తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్‌డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష నేత, కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప స్పందిస్తూ..‘విశ్వాసపరీక్ష ప్రక్రియ మొత్తం ఒక్కరోజులోనే పూర్తికావాలి’ అని డిమాండ్‌ చేశారు.

దీంతో ‘చూస్తుంటే ప్రతిపక్ష నేతకు తొందర ఎక్కువైనట్లు ఉంది’ అని కుమారస్వామి వ్యంగ్యంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా రెబెల్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయడంపై తుది నిర్ణయం తీసుకునేవరకూ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్‌ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రెబెల్‌ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించే అవకాశముందనీ, కాబట్టి ఈ విషయంలో రూలింగ్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా విశ్వాసపరీక్షను చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తాను అడ్వొకేట్‌ జనరల్‌ సలహా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో స్పీకర్‌ కావాలనే విశ్వాసపరీక్షను ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదృశ్యం..
అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీమంత్‌ పాటిల్‌ అదృశ్యమయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్‌ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్‌ విధానసౌధలో ఆరోపించారు. ‘పాటిల్‌ను కిడ్నాప్‌ చేసి ముంబైలోని ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్‌వచ్చింది. పాటిల్‌ వెంట బీజేపీ నేత లక్ష్మణ్‌ సవది ఉన్నారు. నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని(స్పీకర్‌ను) ఒక్కటే కోరుతున్నా. మా ఎమ్మెల్యేను వెనక్కి తీసుకురండి సార్‌. మాకు పోలీస్‌ భద్రత కావాలి. పాటిల్‌ను బలవంతంగా తరలించారనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాటిల్‌ ఫొటోలతో వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్‌ సభ్యులు ‘బీజేపీ డౌన్‌డౌన్‌’ ‘ఆపరేషన్‌ కమల డౌన్‌డౌన్‌’ అని నినాదాలు చేశారు.

అయితే సంఖ్యాబలం లేకపోవడంతోనే కాంగ్రెస్‌ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. దీంతో స్పీకర్‌ రమేశ్‌ స్పందిస్తూ..‘అంటే నేను కళ్లు మూసుకుని నాకు ఏమీ సంబంధం లేనట్లు కూర్చోవాలా? అసలు మనం ఎటువైపు పోతున్నాం. ఛాతినొప్పి ఉండటంతో తాను ఆసుపత్రిలో చేరినట్లు పాటిల్‌ నుంచి లేఖ అందింది. ఇది సహజంగా అనిపించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కుటుంబీకులతో మాట్లాడి నాకు నివేదిక అందించండి’ అని హోంమంత్రి ఎంబీ పాటిల్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమంత్‌ పాటిల్‌ అదృశ్యంపై కాంగ్రెస్‌ నేతలు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తననెవరూ కిడ్నాప్‌ చేయలేదనీ, సొంతపనిపై బుధవారం ముంబైకి రాగా ఛాతిలోనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని శ్రీమంత్‌ పాటిల్‌ ఓ వీడియోను విడుదల చేశారు.

అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా..
విశ్వాసపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్‌ సభను వాయిదావేయడంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసతీర్మానంపై కనీసం 15 నిమిషాలు కూడా సభలో చర్చించలేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము విధానసౌధలోనే నిద్రపోతామని తెలిపారు. సభలో విశ్వాసపరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఖరారయ్యేవరకూ ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని బీజేపీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.  2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇది మూడో విశ్వాసపరీక్ష తీర్మానం కావడం గమనార్హం. మొదటగా సీఎం యడ్యూరప్ప తగిన సంఖ్యాబలం లేక విశ్వాసపరీక్షకు 3 రోజులముందే రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.

గవర్నర్‌తో బీజేపీ బృందం భేటీ
విశ్వాసపరీక్ష ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ వజూభాయ్‌వాలాను కలుసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా వెంటనే విశ్వాసపరీక్ష జరిపేలా స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను ఆదేశించాలని వినతిపత్రాన్ని సమర్పించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి కుయుక్తులు పన్నుతుందన్న భయం తమకు ఉందని ఈ సందర్భంగా జగదీశ్‌ షెట్టర్‌ అన్నారు. దీంతో ‘సీఎం సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోండి’ అని వజూభాయ్‌వాలా స్పీకర్‌ను ఆదేశించారు. దీంతో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఈ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్‌ బలపరీక్షకు దూరంగా ఉన్నారు.

కుమారస్వామికి గవర్నర్‌ లేఖ
కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్‌ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్‌ ధ్రువీకరించారు.

విప్‌ అంటే?
చట్టసభల్లో ఏదైనా కీలకాంశం చర్చకు వచ్చిన సందర్భాల్లో, లేదంటే ఫలానా తరహాలోనే ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు భావించిన సందర్భాల్లో తమ సభ్యులకు విప్‌లను పార్టీ జారీచేస్తాయి. ఇది ఏకవాక్య విప్, రెండులైన్ల విప్, మూడులైన్ల విప్‌ అని మూడురకాలుగా ఉంటుంది. సభలో కోరం(కనీస సభ్యులు) ఉండాలని భావించినప్పుడు పార్టీలు ఏకవాక్య విప్‌ను జారీచేస్తాయి. సభలో ఓటింగ్‌ సందర్భంగా హాజరుకావాలని తమ సభ్యులకు రాజకీయ పార్టీలు రెండు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. సభలో ముఖ్యమైన బిల్లుపై రెండోసారి చర్చ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భాల్లో  సభ్యులు తప్పనిసరిగా తమ ఆదేశాలమేర నడుచుకోవాలని పార్టీలు మూడు లైన్ల విప్‌ను జారీచేస్తాయి. వీటిలో మూడులైన్ల విప్‌ను ఉల్లంఘించే చట్టసభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొంటారు.  

విధానసౌధలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న యడ్యూరప్ప

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement