Floor Test in Assembly
-
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్‌కు లేఖ రాసిన జేజేపీ
చండీగఢ్: ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరించుకోవటంతో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మిత్ర పక్షం జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా అసెంబ్లీలో ఫోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) నిర్వహించాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.‘‘మేజార్టీని లేని బీజేపీ కూటమిని విశ్వాస పరీక్షకు పిలవాలని కోరుతున్నాం. ఇటీవల ఒక బీజేపీలో ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్యెల్యే రాజీనామా చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరిచుకున్నారు. దీంతో బీజేపీ కూటమి ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టండి. మేము ఫ్లోర్ టెస్ట్ తీర్మానికి మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ చౌతాలా గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు.మరోవైపు.. ‘‘మేము గవర్నర్‌కు ఫ్లోర్ టెస్ట్ చేపట్టాలని లేఖ రాశాం. విశ్వాస పరీక్షలో జేజేపీ.. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. మేము బహిరంగా మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మా మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ ఓ వీడియో విడుదల చేశారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.ఇక.. జేజేపీకి 10 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కాంగ్రెస్ పార్టీ కూటమికి 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒకవేళ జేజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మొత్తం సంఖ్య 43 కు చేరుంది. ఇలా అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటచేయాలంటే కూడా మరో ఇద్దరు ఎమ్యెల్యేలు అవసరం అవుతారు. ఎలా చూసినా కాంగ్రెస్‌కు ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
విశ్వాసపరీక్షలో నెగ్గిన సైనీ
చండీగఢ్: ఖట్టర్ రాజీనామాతో హరియాణా సీఎం కుర్చీపై కూర్చున్న నాయబ్ సింగ్ సైనీ బుధవారం అసెంబ్లీ చేపట్టిన విశ్వాస పరీక్షలో గెలిచారు. మంగళవారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనే స్వయంగా విశ్వాస పరీక్షకు గవర్నర్‌ను అభ్యరి్ధంచి శాసనసభ ప్రత్యేక సమావేశం జరిగేలా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక సంకీర్ణ ప్రభుత్వం నుంచి జననాయక్ జనతాపారీ్ట(జేజేపీ) వైదొలగడం, సీఎంగా ఖట్టర్ రాజీనామా చేయడం, నూతన సీఎంగా సైనీ ప్రమాణం చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విశ్వాసపరీక్షలో పాల్గొనకుండా 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలకు జేజేపీ విప్ జారీచేసింది. అయినాసరే ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. కానీ తీరా బలపరీక్షపై ఓటింగ్ జరిగే సమయానికి బయటకు వెళ్లిపోయారు. విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టారు. రెండుగంటల చర్చ తర్వాత తీర్మానంపై ఓటింగ్‌ను స్పీకర్ అనుమతించారు. మూజువాణి ఓటుతో తీర్మానం నెగ్గింది. 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది సొంత ఎమ్మెల్యేల బలముంది. మరో ఏడుగురు మద్దతు పలికారు. బుధవారం 12 మంది సభకు రాకపోవడంతో సభలో సభ్యుల సంఖ్య 78కి, మెజారిటీ మార్కు 40కి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ బలపరీక్షలో నెగ్గడం లాంఛనమైంది. -
జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా
పాట్నా: సీఎం నితీశ్ కుమార్ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు. -
పుదుచ్చేరిలో కుప్పకూలిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూప్పకూలింది. బలనిరూపణలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. బలపరీక్ష కోసం సోమవారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. ఆధిపత్యపోరు.. పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2016లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్– డీఎంకే, బీజేపీ–ఎన్ఆర్ కాంగ్రెస్ కూటములు బరిలోకి దిగాయి. 15 సీట్లు గెలుపొందడం ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. సీఎం నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్‌బేడీ మధ్య అధిపత్య పోరు ఆరంభంలో మొదలైంది. పతనం దిశగా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పార్టీ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నెల క్రితం మంత్రి నమశ్శివాయం తన పదవికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన అనుచరుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపాయన్దన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు మంత్రి పదవికి, ఈనెల 15న ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేయడంతో సర్కార్ సంక్షోభంలో పడింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. అయినా, ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థితో కలుపుకుని తమకు 14 మంది సభ్యుల బలం ఉందని సీఎం చెప్పారు. ప్రతిపక్షానికి ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో 14 సభ్యుల బలం ఉంది. బలపరీక్షకు సిద్దం కావాలని ఎల్జీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సీఎంను ఆదేశించారు. 21న∙కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం స్పీకర్, స్వతంత్య్ర ఎమ్మెల్యేను కలుపుకున్నా 12కే పరిమితమైంది. గరంగరంగా అసెంబ్లీ సమావేశం సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అధికార పక్షంలో సీఎం నేతృత్వంలో డీఎంకే, స్వతంత్య్ర ఎమ్మెల్యే , స్పీకర్ వీపీ శివకొళుందు (కాంగ్రెస్) కలుపుకుని 12 మందితో బలనిరూపణకు సిద్దమయ్యారు. ప్రధాన ప్రతిపక్షనేత రంగస్వామిసహా మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బలపరీక్ష తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత ఎల్జీ కిరణ్‌బేడీ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. తర్వాత సీఎం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోగా అధికార పక్ష సభ్యులు ఆయనతో పాటు వాకౌట్ చేశారు. దాంతో, విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే.. సీఎం ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానం వీగిపోయింది, అసెంబ్లీలో ఆయన బలాన్ని నిరూపించుకోలేక పోయారని స్పీకర్ ప్రకటించారు. సీఎం నారాయణస్వామి అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌నివాస్‌కు చేరుకుని మంత్రివర్గ రాజీనామా పత్రాన్ని ఎల్జీకి సమర్పించారు. అనంతరం, విశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టకపోవడంపై స్పీకర్‌ను నారాయణస్వామి తప్పుబట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆనందరామన్ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారని, అయినా, ఆయన స్పందించలేదని పేర్కొన్నారు. నిబంధనలను స్పీకర్ పాటించలేదని, ఓటింగ్ జరపకుండానే తీర్మానం వీగిపోయిందని ప్రకటించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం అధికార పక్ష సభ్యులు వాకౌట్ చేసినా, స్పీకర్ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్, విపక్ష నేత ఎన్‌రంగస్వామి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం లేదని, రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్‌లతో కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామినాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షం కూడా సిద్ధంగా లేని పరిస్థితి నెలకొనడంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. -
పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ సర్కార్
సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగిన పుదుచ్చేరి రాజకీయాలకు తెర పడింది. బల నిరూపణలో నారాయణస్వామి సర్కార్ విఫలమయ్యింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. సరైనా సంఖ్యబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లి పోయారు. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరగకముందే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. దాంతో విశ్వాసం తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలందు ప్రకటించారు. బలనిరూపణలో ఓడిపోయిన సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మీద నిప్పులు చెరిగారు నారాయణ స్వామి. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారు ప్రజల ముందుకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు సాఫీగానే సాగింది. ఇలా ఉండగా గతేడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిగురుబావుటా ఎగురవేశారు. ఇక నాటి నుంచి నారాయణ స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో ప్రభుత్వం మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. తాజాగా నేడు నిర్వహించని బల పరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం విఫలం అవడంతో ఆయన రాజీనామా చేశారు. -
మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్– డీఎంకేల అధికార కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి సర్కారుకు ఇద్దరు అధికార పక్ష ఎమ్మెల్యేల రాజీనామా రూపంలో మరో సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా, ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కే లక్ష్మి నారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను స్వయంగా స్పీకర్ వీపీ శివకొలుందుకు అందజేశారు. ఈ రాజీనామాలతో అధికార పక్షం బలం ఒక ఇండిపెండెంట్ సభ్యుడితో కలుపుకుని 12కి చేరింది. తమకు మద్దతిస్తున్న నామినేటెడ్ సభ్యులు ముగ్గురితో కలుపుకుని విపక్ష సభ్యుల సంఖ్య 14గా ఉంది. మొత్తం 33(ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కలుపుకుని) మంది సభ్యుల అసెంబ్లీలో ఏడు ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సీఎం నారాయణస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు నామినేటెడ్ సభ్యులకు ఉంటుందా? ఉండదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. నామినేటెడ్ సభ్యులకు బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు ఉండదని, అయినా, ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని ఇప్పటికే సీఎం నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని రాజీనామా అనంతరం లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేశానన్నారు. అయితే, వెంకటేశన్ మాత్రం తాను డీఎంకేలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయడం లేదని, దాంతో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని వివరించారు. ఇద్దరు మాజీ మంత్రులు నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యారు. -
సొంత గూటికి పైలట్!
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పార్టీలోకి తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పునః ప్రవేశానికి రంగం సిద్ధమైంది. పైలట్ సోమవారం పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో సమావేశమయ్యారు. దాంతో, కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రాజస్తాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారనే వార్తల నేపథ్యంలో సచిన్ పైలట్ పార్టీ అగ్ర నేతలను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీతో సచిన్ పైలట్ భేటీ అనంతరం.. కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. పైలట్ పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేస్తారని అందులో పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య నిర్మాణాత్మకమైన, స్పష్టతతో కూడిన చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘పైలట్, ఇతర ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారాలను సూచించేందుకు త్వరలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు’ అని అందులో స్పష్టం చేశారు. మరోవైపు, పైలట్ తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ సోమవారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ను కలిశారు. గహ్లోత్ నివాసంలో జరిగిన ఆ భేటీ అనంతరం.. ‘ప్రభుత్వం క్షేమం. రేపటికి అంతా చక్కబడుతుంది’ అని శర్మ వ్యాఖ్యానించారు. దాదాపు నెల క్రితం 18 మంది ఎమ్మెల్యేలతో పైలట్ సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేసి, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన విషయం, గహ్లోత్ సర్కారు మనుగడకు ముప్పుగా పరిణమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గహ్లోత్, పైలట్లు తమ మద్దతుదారులను హోటళ్లలో ఉంచి, క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. రెబెల్స్‌పై చర్యలుండవు రాహుల్ గాంధీ నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పైలట్ మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చేందుకు వీలుగా ఒక ఫార్మూలా సైతం సిద్ధమైందని వెల్లడించాయి. రాహుల్, ప్రియాంకలతో పైలట్ రెండు గంటలకు పైగా సమావేశమయ్యారని, పైలట్ లేవనెత్తిన అభ్యంతరాలపై అగ్రనేతలిద్దరూ సానుకూలంగా స్పందించారని తిరుగుబాటు నేతకు సన్నిహితులైన నాయకులు తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, పదవుల నుంచి తొలగించినవారికి మళ్లీ మంత్రి పదవులు ఇస్తామని పైలట్‌కు హామీ ఇచ్చారన్నాయి. అయితే, గహ్లోత్ శాసనసభలో బల నిరూపణకు సిద్ధమైతే.. తన వర్గం ఎమ్మెల్యేలతో సహా అనుకూలంగా ఓటేయాలని పైలట్‌కు వారు స్పష్టం చేసినట్లు సమాచారం. పైలట్ వర్గం ఎమ్మెల్యేల్లో మరి కొందరు కూడా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలోకి మళ్లీ వెళ్లక తప్పని పరిస్థితులు పైలట్‌కు నెలకొన్నాయన్నారు. త్రిసభ్య కమిటీ పైలట్ వర్గం లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్‌లతో పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఒక త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు. జూలై 12 నుంచి.. దాదాపు నెల క్రితం, జూలై 12న రాజస్తాన్ పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. తను సహా 19 మంది ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేశారు. తమవైపు 30 మంది వరకు ఎమ్మెల్యేలున్నారన్నారు. దాంతో ఒక్కసారిగా రాజస్తాన్ రాజకీయాలు వేడెక్కాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్, పైలట్‌ను పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారని, ప్రభుత్వాన్ని నిలబెడ్తానని గహ్లోత్ హామీ ఇవ్వడంతో అధిష్టానం కూడా ఆయన వైపే నిలిచింది. ఇదంతా బీజేపీ కుట్ర అని, భారీ ఆఫర్లు ఇస్తూ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీశారని గహ్లోత్ ఆరోపించారు. తన ఆరోపణలకు మద్దతుగా కేంద్ర మంత్రి షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, వ్యాపారవేత్త సంజయ్ జైన్ల ఆడియోటేప్లను చూపారు. వారిపై కేసులు పెట్టారు. అలాగే, తన వర్గం ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్‌కు తరలించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరారు. దాంతో, పైలట్, ఆయన వర్గం కోర్టును ఆశ్రయించింది. పదవి కోసం పాకులాడను పదవి కోసం తాను పాకులాడనని సచిన్ పైలట్ పేర్కొన్నారు. విలువల కోసమే తన పోరాటమన్నారు. తనకు పదవి ఇచ్చింది పార్టీనేనని, కావాలనుకుంటే ఆ పదవిని పార్టీ మళ్లీ వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) పెట్టిన దేశద్రోహం కేసు, రాష్ట్రంలో పాలన తీరు సహా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను భేటీలో లేవనెత్తాను. వాటిని సమయానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొందరు నాపై కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అలాంటి రాజకీయాల్లో బురదజల్లే వ్యవహార శైలికి నేను వ్యతిరేకం’ అని పైలట్ పేర్కొన్నారు. -
సత్యం పక్షాన నిలబడండి
జైపూర్: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు జరగునున్న నేపథ్యంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’అంటూ లేఖ ద్వారా శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. సచిన్ పైలెట్ తనకు అనుకూలమైన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. విశ్వాస పరీక్ష కోసం ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి పార్టీ చేసిన వాగ్దానాలను పరిపూర్తి చేయడానికి ఎమ్మెల్యేలంతా సహకరించాలని ఆ లేఖలో గహ్లోత్ కోరారు. మీరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ, మీరంతా ప్రజాపక్షం వహించాలని, తప్పుడు సాంప్రదాయాలను తిరస్కరించాలని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’’అని లేఖలో వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి జరిగే ప్రయత్నాలేవీ సఫలం కావని కూడా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన అనంతరం ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగించారు. ఇప్పటికీ గహ్లోత్‌కే నంబర్ గేమ్‌లో మెజారిటీ ఉంటుందని కొందరి బలమైన విశ్వాసం. 11న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ 11న భేటీ కానుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యేలందరికీ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా లేఖ రాశారు. 11న సాయంత్రం 4 గంటలకు జైపూర్‌లోని హోటల్ క్రౌన్ ప్లాజాలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి తరలివెళ్ళగా, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్ తరలి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలందర్నీ ఒకచోట ఉంచినట్లే, బీజేపీ కూడా తరలించిందని భావిస్తున్నారు. -
‘రేపటిలోగా బలం నిరూపించుకోవాల్సిందే’
భోపాల్ : రాజకీయ సంక్షోభం నెలకొన్న మధ్యప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కమల్‌నాథ్ రేపటిలోగా(మంగళవారం) అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ మరోసారి ఆదేశించారు. ఈ మేరకు కమల్‌నాథ్‌కు ఆయన సోమవారం ఓ లేఖ రాశారు. కాగా, గవర్నర్ గత ఆదేశాల ప్రకారం కమల్‌నాథ్ సోమవారం శాసనసభలో విశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి ఉండింది. అయితే సోమవారం ఉదయం ప్రారంభమైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను.. కరోనా వైరస్ నివారణలో భాగంగా స్పీకర్ మార్చి 26వ తేదీకి వాయిదా వేశారు. దీంతో నేడు శాసనసభలో కమల్‌నాథ్ బలపరీక్ష జరగలేదు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ బలపరీక్ష నిర్వహించాలని మరోసారి ఆదేశించారు. ఒకవేళ ప్రభుత్వ యత్రాంగం బలపరీక్షను నిర్వహించకపోతే.. కమల్‌నాథ్ అసెంబ్లీలో మెజారిటీ లేనట్టుగా భావించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు తమ పదవులకు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. కాంగ్రెలో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడంతో ఇది మరింత ముదిరింది. మరోవైపు రాజీనామా చేసిన మొత్తం 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో మధ్యప్రదేశ్ శాసనసభలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 222కు పడిపోయింది. చదవండి : కమల్‌నాథ్ బలపరీక్షకు బ్రేక్ మధ్యప్రదేశ్ హైడ్రామా : సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ -
నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్ ఆఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమయ్యారు. నవంబర్ 30 మధ్యాహ్నం అసెంబ్లీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుందని అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది. రాజకీయ, రాజ్యాంగ నైతికతలు వేరువేరు: సుప్రీంకోర్టు ఇతర రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకున్న ఆ హక్కును తొలగించలేమని వ్యాఖ్యానించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేన, బీజేపీ ఎన్డీయే భాగస్వామ్యులుగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయని పిటిషన్‌దారు అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది బీకే సిన్హా తెలిపారు. ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరికాదని ఆయన వాదించగా తమ పరిధిలోకి రాని ఎన్నికల అనంతర పొత్తుల్లోకి లాగవద్దని దర్మాసనం తెలిపింది. మేనిఫెస్టోలను అమలు చేయాలంటూ పార్టీలను కోర్టులు ఆదేశించలేవని కూడా పేర్కొంది. మహారాష్ట్ర తరువాత గోవానే! మహారాష్ట్ర తరువాత తమ తదుపరి లక్ష్యం గోవాయేనని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ) నేతలతో శుక్రవారం రౌత్ చర్చలు జరిపారు. పైన పేర్కొన్న రెండు పార్టీలు కూడా గతంలో బీజేపీ మిత్రపక్షాలే కావడం విశేషం. జీఎఫ్‌పీ చీఫ్ విజయ్ సర్దేశాయితో భేటీ అనంతరం రౌత్ మాట్లాడుతూ.. ‘త్వరలో పెద్ద భూకంపం రానుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడే ఉన్నారు. గోవాలో బీజేపీకి మద్దతిస్తున్న మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర తరువాత గోవానే. ఆ తరువాత వేరే రాష్ట్రాలపై దృష్టి పెడతాం’ అని రౌత్ తెలిపారు. -
‘మహా’ బలపరీక్ష ముహుర్తం ఖరారు
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. రేపు(శనివారం) ఉద్ధవ్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశాలను నిర్వహించడానికి ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారు. అయితే ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉద్ధవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోళంబ్కర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. ఆ రోజు సభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకరాం చేయించారు. కాగా, అసెంబ్లీలో బలనిరూపణకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉద్దవ్‌కు డిసెంబర్ 3 తేదీ వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. మహా వికాస్ ఆఘాడి కూటమి తరఫున ఉద్ధవ్ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఉద్ధవ్ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. మహా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అక్కడి రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. పదవులు విషయంలో బీజేపీతో విభేదాలు తలెత్తడంతో.. శివసేన, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందకు ఎన్సీపీ పావులు కదిపింది. ఈ క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలుపడంతో మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించాయి. సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయడంతో పరిస్థితులు మారిపోయాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు చాకచాక్యంగా వ్యవహరించడంతో మహా వికాస్ ఆఘాడి కూటమి మహారాష్ట్రలో అధికారం చేపట్టింది. -
‘విశ్వాసం’పై నేడు ఆదేశాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి సంబంధించి మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ బీజేపీ నేత ఫడ్నవీస్ ను ఆహ్వానిస్తూ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను సోమవారం ధర్మాసనం పరిశీలించింది. అనంతరం, ‘ఇక ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మెజారిటీ ఉందా? లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించింది. ఫడ్నవీస్‌కు బలనిరూపణ కోసం గవర్నర్ నవంబర్ 23న 14 రోజుల గడువు ఇచ్చినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఫడ్నవీస్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఫడ్నవీస్ ప్రభుత్వం తక్షణమే విశ్వాసపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్– ఎన్సీపీ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, శివసేన తరఫు లాయర్ కపిల్ సిబల్ కోర్టును మరోసారి కోరారు. మెజారిటీ ఉందని నమ్మకం ఉన్నప్పుడు బలపరీక్షకు వెనకడుగు ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం, గవర్నర్ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించిన తుషార్ మెహతా.. ‘ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు? అని గవర్నర్ లెక్కలు వేసుకోలేరు’ అని వ్యాఖ్యానించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ ప్రెస్మీట్లో పేర్కొన్న విషయాన్ని సిబల్ ప్రస్తావించారు. ‘తెల్లవారుజామున 5.27 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయాల్సినంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది?’ అని సిబల్ ప్రశ్నించారు. అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఏ ఒక్క ఎన్సీపీ ఎమ్మెల్యే కూడా ముందుకు రాలేదని ఎన్సీపీ న్యాయవాది సింఘ్వీ వ్యాఖ్యానించారు. ‘ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో బీజేపీని ఆహ్వానించారు. మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ స్పష్టంగా పేర్కొన్నారు. గవర్నర్ చెప్పిన గడువులోగా కాకుండా.. ఆ లోపే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందా?’ అని రోహత్గీ ప్రశ్నించారు. ‘సభలో బలనిరూపణ తప్పదు. అది ఎప్పుడు జరగాలనేది కోర్టు నిర్ణయించలేదు’ అని వాదించారు. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ.. 24 గంటల్లో, 48 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన దృష్టాంతాలు గతంలో ఉన్నాయన్నారు. వాదనల అనంతరం, మంగళవారం ఉదయం 10.30 గంటలకు విశ్వాస పరీక్షకు సంబంధించి ఆదేశాలిస్తామని కోర్టు పేర్కొంది. తుషార్, సిబల్‌ల వాగ్యుద్ధం అధికారం చేపట్టేందుకు వీలుగా ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడాన్ని ఇంగ్లిష్‌లో ‘హార్స్ ట్రేడింగ్’ అంటారనే విషయం తెలిసిందే. వాదనల సందర్భంగా తుషార్ మెహతా.. ‘ఇది హార్స్ ట్రేడింగ్ కాదు. ఇక్కడ మొత్తం గుర్రపు శాలనే మరోవైపునకు తరలిపోయింది (అజిత్ పవార్‌తో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపు వెళ్లారనే అర్థంలో)’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కపిల్ సిబల్ స్పందిస్తూ.. ‘గుర్రపు శాల ఇక్కడే ఉంది. జాకీ(అజిత్ పవార్) మాత్రమే వెళ్లిపోయాడు’ అని రిటార్ట్ ఇచ్చారు. మరో సందర్భంలో.. ‘కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టులో ఒక్కటిగా ఒకే పిటిషన్ వేశామన్నాయి. కానీ న్యాయవాదులను మాత్రం మూడు పార్టీలు వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కూటమి తీరేంటో దీంతో అర్థమవుతుంది’ అని మరో సందర్భంలో తుషార్ వ్యాఖ్యానించారు. -
బలనిరూపణ అంటే బీజేపీ పారిపోతోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే బీజేపీ వెనకడుగు వేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో చెప్పారు. సంఖ్యాబలం లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అక్రమమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. సంఖ్యాబల నిరూపణకు వెళదామని, అక్కడే ఎవరి బలమేమిటో తేలిపోతుందని బీజేపీకి చురకలంటించారు. బలనిరూపణకు వెళ్తే తమ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని బీజేపీ అక్రమ చర్యలకు దిగిందని ఆరోపించారు. -
చిన్న పార్టీల దారెటు?
ముంబై: ఫడ్నవీస్ ప్రభుత్వం త్వరలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో.. చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇటీవలి ఎన్నికల్లో చిన్న పార్టీల నుంచి 16 మంది, స్వతంత్రులు 13 మంది ఎమ్మెల్యేలయ్యారు. అసెంబ్లీలోని మొత్తం 288 మందిలో మెజారిటీకి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ ‘ఇతర’ ఎమ్మెల్యేల్లో తమ వైపు ఏడుగురున్నారని శివసేన, తమవైపు 14 మంది ఉన్నారని బీజేపీ చెబుతున్నాయి. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్‌కు ఎన్సీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది ఇప్పటి వరకు కచ్చితంగా వెల్లడి కాలేదు. అయితే, వీరు కాకుండా పలువురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కమలదళం చెబుతోంది. ఆ నలుగురు కీలకం బలపరీక్ష నేపథ్యంలో.. మేజిక్ మార్క్ 145కి చేరేందుకు బీజేపీ ముఖ్యంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. వారు నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్‌రావు లోనికర్. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించినవారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో ప్రత్యక్ష సంబంధాలున్నావారు. గణేశ్ నాయక్, బాబన్‌రావు మాజీ ఎన్సీపీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలున్నవారు. అందుకే బీజేపీ వీరిపై ఆధారపడుతోంది. -
విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్లపై ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అనంతరం, దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్ గవర్నర్‌కు రాసిన లేఖను సోమవారం ఉదయం తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది. పైన పేర్కొన్న రెండు లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ లేకపోవడంతో ఆ లేఖలను తమకు అందజేసే బాధ్యత తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. ‘24 గంటల్లోగా బల నిరూపణను ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను గవర్నర్ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్‌కు ఫడ్నవీస్ పంపిన లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ‘మహా వికాస్ అఘాడి’ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలన్న వినతిని సైతం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వినతిని పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సెలవు రోజైనప్పటికీ ఆదివారం విచారణను కోర్టు ప్రారంభించడం విశేషం. మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు చోటుచేసుకున్న ఉత్కంఠభరిత పరిణామాల నేపథ్యంలో కోర్టు విచారణకు పెద్ద సంఖ్యలో లాయర్లు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారిలో కాంగ్రెస్ నేతలు పృథ్వీరాజ్ చౌహాన్, రణ్‌దీప్ సూర్జేవాలా, ఎన్సీపీ ఎంపీ మాజీద్ మెమన్, శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ తదితరులున్నారు. కోర్టులో శివసేన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, కాంగ్రెస్– ఎన్సీపీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్ర కేబినెట్ సిఫారసు చేసిందా? రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన విధానం అత్యంత దారుణమని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ‘కేబినెట్ సమావేశం జరగకుండానే, కేబినెట్ సిఫారసు లేకుండానే, శనివారం తెల్లవారు జామున రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఇలా చేయాలంటూ గవర్నర్ సిఫారసు చేశారా? లేదా? అనే విషయంలో కానీ, ఒకవేళ సిఫారసు చేస్తే.. ఏ ప్రాతిపదికన అలా చేశారనే విషయంలో కానీ స్పష్టత లేదు’ అని సిబల్ వాదించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమికి సభలో పూర్తి మెజారిటీ ఉందని, అందువల్ల ఆ కూటమి నేత శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని, లేదా, 24 గంటల్లోపు సభలో బల నిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలని కోర్టును సిబల్ కోరారు. సెలవు రోజు విచారించాలా? బొంబాయి హైకోర్టును కాకుండా, డైరెక్ట్‌గా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తప్పుబట్టారు. ఆదివారం సెలవు రోజున సుప్రీంకోర్టును ఇబ్బంది పెట్టాల్సినంత ముఖ్యమైన కేసు కాదని వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం రాజకీయ పార్టీని కానీ, కూటమిని కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమనేది గవర్నర్ విచక్షణాధికారం. ఈ అధికారం న్యాయ సమీక్షకు కూడా అతీతం’ అని రోహత్గీ వాదించారు. కోర్టును సభ గౌరవించాలి.. సభను కోర్టు గౌరవించాలి అని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ఫడ్నవీస్, అజిత్‌పవార్‌ల తరఫున ఎవరు వాదిస్తున్నారంటూ ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించగా, తాను కేంద్రం తరఫున వచ్చానంటూ తుషార్ మెహతా సమాధానమిచ్చారు. గవర్నర్ తీరు బాలేదు ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం మోసపూరిత చర్య అని, అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్– ఎన్సీపీల తరఫు న్యాయవాది సింఘ్వీ వ్యాఖ్యానించారు. ఎన్సీపీకి చెందిన 54 ఎమ్మెల్యేల్లో 41 మంది ఎన్సీపీతోనే ఉన్నారని, వారు అజిత్ పవార్‌తో లేరని కోర్టుకు వివరించారు. గవర్నర్ తీరు పక్షపాత పూరితంగా, అన్యాయంగా, అన్ని న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది’ అన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 41 మంది తాము అజిత్ పవార్‌కు మద్దతివ్వడం లేదని స్పష్టం చేస్తూ గవర్నర్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి సింఘ్వీ తీసుకువచ్చారు. ఇలాంటి సందర్భాల్లో తక్షణమే సభలో విశ్వాస పరీక్ష జరపాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సింఘ్వీ ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఆ విషయంలో వివాదమేమీ లేదు. సభలో బల నిరూపణే అల్టిమేట్ టెస్ట్’ అని స్పష్టం చేసింది. -
విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్–జేడీఎస్ సభ్యులు డివిజన్ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వం.. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. స్పీకర్ రాజీనామా.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
కూటమి కుప్పకూలిన వేళ ఎమ్మెల్యే డ్యాన్స్
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు నిన్నటితో తెరపడింది. సుమారు14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంతోషంలో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ వైరలవుతోంది. రేణాకాచార్య కర్ణాటక దేవంగరే జిల్లా హోన్నాళి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. #WATCH Karnataka BJP MLA Renukacharya dances with supporters outside the Ramada Hotel in Bengaluru. HD Kumaraswamy led Congress-JD(S) government lost trust vote in the assembly, today. pic.twitter.com/6MBQNgzg4R — ANI (@ANI) July 23, 2019 స్పీకర్ సూచన మేరకు మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. -
కుమార ‘మంగళం’
సాక్షి బెంగళూరు: దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నెల మొదటి వారంలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. గవర్నర్ విధించిన గడువులు కూడా ముగిశాయి. చివరి అంకంగా స్పీకర్ సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో సభా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. పరస్పర విమర్శలు, క్యాంపు రాజకీయాలతోనే ఏడాదంతా గడిచిపోయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం సంకీర్ణంపైనా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని స్థానాలన్నిటినీ దాదాపు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. బీజేపీ పరోక్ష ప్రోద్బలంతో సంకీర్ణానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. అయితే, వీరిని అసెంబ్లీకి హాజరుకావాలంటూ బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే తీవ్ర హెచ్చరికలు చేసినా రాజీనామా చేసిన వారు తిరిగి వచ్చేందుకు నిరాకరించడంతో కుమారస్వామి సర్కారు పతనానికి దారులు పడ్డాయి. నాలుగు రోజులుగా చర్చలు, వాయిదాల అనంతరం మంగళవారం సభలో బల నిరూపణకు సిద్ధం కావాలని స్పీకర్ గడువు విధించారు. అయితే, తనకు బుధవారం వరకు సమయం ఇవ్వాలని సీఎం కుమారస్వామి కోరగా ఆయన నిరాకరించారు. దీంతో మంగళవారం యథావిధిగా అసెంబ్లీ సమావేశమయింది. సాయంత్రం సభలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం వీగిపోయిందిలా.. ప్రత్యర్థి పార్టీల ఉచ్చులో పడకుండా ఇప్పటి దాకా ముంబై వంటి చోట్ల తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, హోటళ్లలో బస ఏర్పాటు చేసిన అధికార, ప్రతిపక్షాలు మంగళవారం నాటి బలపరీక్షకు ప్రత్యేకంగా అసెంబ్లీకి బస్సుల్లో తరలించాయి. కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది, బీఎస్పీ సభ్యుడు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు మొత్తం 20 మంది మంగళవారం సభకు గైర్హాజరయ్యారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 225 నుంచి 204(స్పీకర్ మినహా)కు తగ్గింది. మ్యాజిక్ ఫిగర్ 103 కాగా, తీర్మానానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఉద్వేగపూరితంగా ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి సభా కార్యకలాపాలను నిర్వేదంతో చూస్తూ తన స్థానంలో కూర్చుండిపోయారు. బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొనలేదు. సర్కారు కూలిపోయినట్లు ప్రకటించగానే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆనందోత్సాహాలుపెల్లుబికాయి. బీజేపీ పక్ష నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను అభినందించారు. సంతోషంగా త్యజిస్తున్నా: కుమారస్వామి బలపరీక్షకు ముందు సీఎం కుమారస్వామి సుదీర్ఘంగా ప్రసంగించారు. రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేటాయించిన నిధుల వివరాలను చదివి వినిపించారు. పలు అభివృద్ధి పనులు కేటాయించినా ప్రభుత్వంపై విశ్వాసం లేకుండా తిరుగుబాటు చేశారని వాపోయారు. అయితే కుమారస్వామి తనకు మూడు గంటల వ్యవధి ఇవ్వాలని కోరగా, త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదని, తాను అధికారం కోసం పాకులాడలేదన్నారు. సీఎం కుర్చీని సంతోషంగా వదిలివేస్తున్నట్లు తెలిపారు. బల పరీక్షను వాయిదాలు వేసి స్పీకర్‌ను నొప్పించినందుకు క్షమిం చాలని కోరారు. సభాపతిని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. 10 రోజులుగా జరిగిన పరిణామాల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ‘మాకూ సిగ్గుంది. ఇంకా అధికారంలో కొన సాగలేం. అయినా మేం చేసిన తప్పేంటి? నిజాయతీతో ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషిచేశాం. రాజీనామా తర్వాత నేను ఎక్కడికీ పారిపోను. నన్ను ఎందుకు తప్పించారో ప్రజలు కూడా తెలుసుకోవాలి. కుర్చీ శాశ్వతం కాదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పదేపదే ప్రయత్నించింది. ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండదు. అదే జరిగితే, ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం’ అని అన్నారు. కుమారస్వామి రాజీనామా విశ్వాస పరీక్షలో ఓటమి అనంతరం సీఎం కుమారస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన గవర్నర్.. మరో ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కాగా, బల పరీక్షలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వని బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధినేత్రి మాయావతి ప్రకటించారు. అపవిత్ర మైత్రికి చెల్లుచీటీ: యడ్యూరప్ప కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ నేతలు కమీషన్ల కోసం పని చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ –జేడీఎస్ అపవిత్ర మైత్రికి కాలం చెల్లిపోయిందన్నారు. 2018 ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం ఉప ఎన్నికలో మరో సీటును గెలుచుకుని 105కు బలం పెంచుకుంది. గత ఏడాది మేలో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే యడ్యూరప్ప వైదొలగిన విషయం తెలిసిందే. అనంతరం కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటయింది. స్పీకర్, నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 సభ్యులున్న అసెంబ్లీలో రెబెల్స్ రాజీనామాలకు ముందు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం బలం 117. ఇందులో స్పీకర్ కాకుండా కాంగ్రెస్ 78, జేడీఎస్ (37), బీఎస్పీ (1), నామినేటెడ్ (1)సభ్యులున్నారు. ప్రజాస్వామ్యం ఓడింది: రాహుల్ ‘ప్రజాస్వామ్యం, నిజాయితీ, రాష్ట్ర ప్రజల తీర్పు’ ఓడిపోయాయి అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘సంక్షోభాలు సృష్టించిన వారి లక్ష్యం నేరు నెరవేరింది’ అని బీజేపీనుద్దేశించి అన్నారు. తదుపరి సీఎం యడ్యూరప్ప! న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలనేదానిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తదుపరి సీఎం అవుతారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ, ‘సీఎం పదవిని చేపట్టేది యడ్యూరప్పేనన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులతో కూడిన పార్టీ అగ్రనాయకత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కర్ణాటకకే చెందిన ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ యడ్యూరప్పకే సీఎం అవకాశాలు అత్యధికంగా ఉన్నప్పటికీ, పార్టీ జాతీయ నాయకత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మోదీ, షాతో మాట్లాడాక గవర్నర్‌ను కలుస్తాం: యడ్యూరప్ప పార్టీ కేంద్ర నాయకత్వంలోని మోదీ, అమిత్ షాతో సంప్రదింపులు జరిపిన అనంతరం తాము గవర్నర్‌ను కలుస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. కుమారస్వామి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారనీ, వారి ప్రభుత్వం కూలిపోవడం ప్రజా విజయమని ఆయన అన్నారు. విశ్వాసపరీక్షలో బీజేపీ పక్షానే నిలిచిన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి అభివృద్ధిలో నవశకం మొదలవుతుందని పేర్కొన్నారు. 4 రాష్ట్రాల్లోనే.. న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు గడ్డు రోజులు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుని, దేశవ్యాప్తంగా కేవలం 52 స్థానాల్లో గెలుపుతో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన ఆ పార్టీని కర్ణాటక పరిణామాలు మరో దెబ్బతీశాయి. సంకీర్ణ భాగస్వామి అయిన కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ‘చే’జారింది. 2018లో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలోనూ అధికారాన్ని కోల్పోవడంతో ప్రస్తుతం ‘చేతి’లో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే ఉన్నాయి. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. దక్షిణాదిలో అధికారం పంచుకుంటున్న ఏకైక రాష్ట్రాన్ని కూడా కోల్పోవాల్సి రావడం పార్టీకి దెబ్బగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ముచ్చటగా ముగ్గురే! ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎంలు వీరే న్యూఢిల్లీ : కర్ణాటక చరిత్రలో ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగిన ముఖ్యమంత్రులు ముగ్గురే. వారు కూడా కాంగ్రెస్ పార్టీ వారే కావడం గమనార్హం. ఎస్.నిజలింగప్ప (1962–68), డీ దేవరాజ ఉర్స్ (1972–77), సిద్దరామయ్య (2013–18) మాత్రమే విజయవంతంగా తమ పదవీకాలాన్ని ముగించగలిగారు. బీజేపీ నుంచి కానీ జేడీఎస్ నుంచి కానీ ఎవరూ ఐదేళ్లు సీఎంగా నిలవలేకపోయారు. గతంలో బీజేపీ సంకీర్ణంలో భాగంగా సీఎం పదవి చేపట్టిన కుమారస్వామి రెండేళ్లలోపే గద్దె దిగారు. ఫిబ్రవరి 2006 నుంచి అక్టోబర్ 2007 వరకు మాత్రమే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మరోసారి 2018 మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి.. విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో 2019 జూలై 23న రాజీనామా చేశారు. బీజేపీ విషయానికి వస్తే.. 2007లో తొలిసారి సీఎం అయిన యడ్యూరప్ప జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారం రోజులకే పదవీచ్యుతులయ్యారు. మరోసారి, 2018 మే 17 నుంచి 23 వరకే అధికారంలో కొనసాగి, మెజారిటీ లేకపోవడంతో రాజీనామా చేశారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటివరకు 25 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సంక్షోభం సాగిందిలా.. 2019 జూలై 1: కుమారస్వామి సర్కార్‌తో విభేదాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా. జూలై 6: రాజీనామా చేసిన మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు. మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అందాయని స్పీకర్ ప్రకటన. రెబెల్స్ అంతా విమానంలో ముంబైకి వెళ్లారు. జూలై 7: అమెరికా నుంచి తిరిగొచ్చిన కుమారస్వామి జూలై 8: మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్, శంకర్. బీజేపీకి మద్దతు. జూలై 9: 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సక్రమంగా లేవన్న స్పీకర్. సరైన ఫార్మాట్లో పంపాలని సూచన. సీఎల్పీ భేటీ. 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా. మరో ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా. జూలై 10: ముంబైలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లోని ముగ్గురు అసంతృప్త నేతల్ని బుజ్జగించడానికి కాంగ్రెస్ నేత శివకుమార్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ఆయనను కలవడానికి నిరాకరించి పోలీసుల సాయాన్ని అభ్యర్థించారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె.సుధాకర్ రాజీనామా జూలై 11: స్పీకర్ తమ రాజీనామాలు చెల్లవని తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టిన రెబెల్ ఎమ్మెల్యేలు జూలై 17: రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనన్న సుప్రీంకోర్టు. దానికి నిర్దిష్ట సమయం అంటూ లేదని, సభకు హాజరు కావాలా వద్దా అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని స్పష్టీకరణ. తన రాజీనామాను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి. జూలై 18: ఇదే రోజు కర్ణాటకలో సీఎం కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండేది. అయితే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సహా 21 మంది అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను అపహరించిందంటూ సభలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఆరోపణలు. సభకు హాజరుకావడంపై ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తే, విప్ జారీ చేసి ఉపయోగం ఉండదని, దీనిపై స్పష్టత కావాలంటూ వాదించిన కాంగ్రెస్. విశ్వాసపరీక్ష జరగకుండా సభ వాయిదా వేయడంతో సభలోనే రాత్రంతా కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన జూలై 19: శుక్రవారం సభలో విశ్వాస పరీక్ష జరపాలని గవర్నర్ వజూభాయ్ రెండుసార్లు సీఎం కుమారస్వామికి లేఖలు రాశారు. అయినా సీఎం, స్పీకర్ ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. గందరగోళ పరిస్థితుల మధ్య సభ వాయిదా జూలై 22: సభలో బలాన్ని నిరూపించుకోవడానికి బుధవారం వరకూ స్పీకర్‌ని గడువు కోరిన కుమారస్వామి. నిరాకరించిన స్పీకర్. విశ్వాస పరీక్షపై కాలయాపన ఎవరికీ మంచిది కాదని హితవు. విశ్వాస తీర్మానం చర్చకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రసంగాన్ని తగ్గించాలంటూ స్పీకర్ అసహనం. అధికార, విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే సభ వాయిదా. జూలై 23: ఎట్టకేలకు బలపరీక్ష నిర్వహణ. కుప్పకూలిన కుమారస్వామి సర్కార్. గైర్హాజరైన 21 మంది ఎమ్మెల్యేలు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు. సభలో బలాబలాలు మొత్తం సభ్యులు (1 నామినేటెడ్ సహా) 225 సభకు హాజరైనవారు (స్పీకర్‌తో) 205 మ్యాజిక్ ఫిగర్ 103 విశ్వాసానికి అనుకూలంగా 99 విశ్వాసానికి వ్యతిరేకంగా 105 హాజరుకాని వారు 20 -
అయ్యో ‘కుమార’ కూల్చేశారా
సాక్షి, బెంగళూరు: దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక సంక్షోభం ముగిసింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓ పార్టీ, కాపాడుకోడానికి మరో పార్టీ రచించిన వ్యూహాలన్నీంటికి నేటితో తెరపడింది. బీజేపీ అనుకున్నట్లుగానే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. సీఎం కుమారస్వామి ఉద్వేగ ప్రసంగం అనంతరం.. స్పీకర్ రమేష్ కుమార్ బలపరీక్ష నిర్వహించారు. మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. తొలుత ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ ఆదేశించడంతో వారు ఆశీనులయ్యారు. ఓటింగ్ ముగిసే వరకు అసెంబ్లీ తలుపులను పూర్తిగా మూసివేశారు. అనంతరం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విశ్వాస పరీక్షలో ప్రభుత్వ ఓడినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన నేటితో ముగిసింది. మరోవైరు సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అంతకుమందు విశ్వాస పరీక్షపై సీఎం కుమార స్వామి భావోద్వేగంగా మాట్లాడారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, సీఎంగా కన్నడ ప్రజలకు ఎంతో చేశానని ఉద్వేగంగా మాట్లాడారు. త్వరలో కుమారస్వామి గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. బెంగళూరులో 144 సెక్షన్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్-కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో రెండు రోజులపాటు బార్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. -
ఒక్కరోజు ఆగితే తిరుగులేదు
కర్ణాటక,శివాజీనగర: బల పరీక్ష నిరూపణ ప్రక్రియను మంగళవారం కూడా వాయిదా పడేటట్లు చూసుకోవాలి, బుధవారం నుంచి అదృష్టమే మారిపోతుంది అని జ్యోతిష్యులు ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామికి సూచించినట్లు వదంతులు విహరించాయి. జ్యోతిష్యుల సలహా ప్రకారమే కుమారస్వామి విశ్వాస పరీక్షను వాయిదా వేస్తున్నారని సమాచారం. ఆయన జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతారన్నది తెలిసిందే. మంగళవారం కూడా బలపరీక్ష జరగకుండా ఉంటే, బుధవారం నుంచి గ్రహబలం అనుకూలిస్తుందని కొందరు జ్యోతిష్యులు చెప్పినట్లు సమాచారం. అందుకే ఆయన పదేపదే స్పీకర్‌ను కలిసి వాయిదాకు గడువు కోరడంతో పాటు గవర్నర్ ఆదేశాలనూ పక్కనపెడుతూ వచ్చారు. -
నేడే బల నిరూపణ!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన.. విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్బుక్లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ.. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. బలిపశువును చేయొద్దు: స్పీకర్ అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్‌ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు. -
క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగిసేలా కనిపిస్తోంది. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారం రోజు సాయంత్ర 6 గంటలకు ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు, విశ్వాస పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీనికి నిరాకరించిన స్పీకర్ నేడు తప్పనిసరిగా బల పరీక్ష నిర్వహించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే సోమవారం రెబల్స్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా వారంత తన ముందు హాజరుకావాలని 16 మంది సభ్యులకు సమన్లు జారీచేశారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు రెబల్స్‌పై అనర్హత వేటు వేయాలని స్వీకర్‌కు చెప్పడంతో ఆయన సమన్లు జారీచేసినట్లు తెలుస్తోంది. అయితే విశ్వాస పరీక్షపై చర్చ పూర్తయిన వెంటనే బలపరీక్ష ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభానికి నేడో, రేపో తెరపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న వారి అభ్యర్థనకు ధర్మాసనం నిరాకరించింది. విశ్వాస పరీక్షలో తాము జోక్యం చేసుకోలేని స్పష్టం చేస్తూ.. ఇవాళే బలపరీక్ష చేపట్టాలని తాము స్వీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం తేల్చిచెప్పింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషిన్‌ను రేపు విచారిస్తామని తెలిపింది. ‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. కాగా విశ్వాస పరీక్షపై గవర్నర్ ఇప్పటికే రెండు సార్లు స్పీకర్‌ను లేఖ రాయగా.. వాటిని రమేష్ కుమార్ ధిక్కరించారు. దీంతో బలనిరూపణపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంకానుంది. -
కర్నాటకంలో కాంగ్రెస్ సీఎం!
బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్ ముంబైలోని రినైసెన్స్ హోటల్లో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేలు శివకుమార్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు. కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే.. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ‘తాజ్వివంత హోటల్’లో, బీజేపీ నేతలు ‘హోటల్ రమద’లో సమావేశమై చర్చించారు. ‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్.. బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం. సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు. దయచేసి వెనక్కి రండి: సీఎం ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్‌వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్‌తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్‌లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం శుక్రవారం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురవుతున్నట్లు గవర్నర్‌కు ఇప్పుడే జ్ఞానోదయమైందని కుమారస్వామి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వజూభాయ్‌వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఆయనేమీ శాసనవ్యవస్థకు అంబుడ్స్‌మన్ కాదని చురకలు అంటించారు. బల నిరూపణపై గవర్నర్ రాసిన రెండు లేఖలను ‘లవ్ లెటర్స్’గా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. జూలై 22న విశ్వాసపరీక్షపై తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామనీ, ఇక ఆలస్యం చేయబోమని చెబుతూ స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం.. విధానసౌధ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ కోల్పోయిందని తెలిపారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..‘కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటే రూ.40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అస్థిరపరిచే ప్రక్రియ సాగుతోంది. 14 నెలల తర్వాత ఇప్పుడది చివరిదశకు చేరుకుంది. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని నాకు ముందే తెలుసు.కాబట్టి విశ్వాసపరీక్ష విషయంలో మనం నిదానంగా చర్చిద్దాం. సోమవారం లేదా మంగళవారం కూడా విశ్వాసపరీక్షను చేపట్టవచ్చు. మీరు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఇబ్బందేమీ లేదు. మీకిప్పుడు మద్దతు తెలిపిన రెబెల్స్ అండతో మీ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంతకాలం అధికారంలో ఉంటుందో నేనూ చూస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కావడంతో గవర్నర్ ఆదేశాల మేరకు విశ్వాసపరీక్ష డివిజన్ నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అయితే నిబంధనల మేరకు విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాకే ఓటింగ్ జరగాలని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగగా, పోటీగా కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ రమేశ్ అసెంబ్లీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదావేశారు. నిమ్మకాయ ఉంటే చేతబడేనా? ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి రావడంతో రగడ మొదలైంది. ప్రభుత్వ మనుగడ కోసమే ఆయన చేతబడి చేయించిన నిమ్మకాయతో వచ్చారని కొందరు బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కుమారస్వామి వెంటనే స్పందిస్తూ..‘నిమ్మకాయను తెచ్చుకున్నందుకు మీరంతా రేవణ్ణను నిందిస్తున్నారు. మీరు హిందూ సంస్కృతిని గౌరవిస్తామంటూనే, ఆయన్ను అవమానిస్తున్నారు. రేవణ్ణ ఆలయాలకు వెళతారు. వెంట నిమ్మకాయను ఉంచుకుంటారు. కానీ మీరుమాత్రం ఆయన చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు. చేతబడులతో అసలు ఎక్కడైనా ప్రభుత్వాలు నిలుస్తాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని జిల్లాలకు నిధులు కేటాయించినా, బీజేపీ మాత్రం తనను 2–3 జిల్లాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ ఇచ్చిన రెండో గడువు దాటిపోతున్న సమయంలో బీజేపీ నేత సురేష్ కుమార్ విశ్వాసపరీక్ష ఓటింగ్ చేపట్టాలని కోరారు. తాను చెప్పాల్సింది చెప్పేశాననీ, ఇంకేమైనా ఉంటే సోమవారం చూసుకుందామని కుమారస్వామి అన్నారు. దీంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. రెబెల్స్‌ను హోటల్లో బంధించారు: శివకుమార్ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బంధించారని మంత్రి డి.కె.శివకుమార్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘మమ్మల్ని బంధించారు.. కాపాడండి అని రెబెల్ ఎమ్మెల్యేల నుంచి సీఎం కుమారస్వామికి ఫోన్ వచ్చింది. అందుకే మేం ముంబై వెళ్లాం. తొలుత కుమారస్వామి స్వయంగా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం అలా వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వారించారు. ఈ నేపథ్యంలో మేం సదరు హోటల్లో గదిని బుక్ చేశాం’ అని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు, వారి కుటుం సభ్యులెవరూ సాయం కోసం తనను సంప్రదించలేదని స్పీకర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఛాతినొప్పితో ముంబైలోని సెయింట్ జార్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్‌కు మహారాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రెండో ‘లవ్ లెటర్’ వచ్చింది.. అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వజూభాయ్‌వాలా రెండో లేఖను రాశారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి’ అని లేఖరాశారు. దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..‘‘గవర్నర్ వజూభాయ్‌వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింది. వజూభాయ్‌వాలాకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గవర్నర్ లేఖలో చెప్పారు. అంటే ఇన్నిరోజులు రాష్ట్రంలో జరుగుతున్న తతంగమంతా ఆయనకు కన్పించలేదా? మా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ప్రలోభాలపర్వం ఆయనకు కనిపించలేదా? ఆరోజే గవర్నర్ చర్య తీసుకునిఉంటే ఈ ప్రత్యేక విమానాలు అసలు గాల్లోకి లేచేవా? రెబెల్ ఎమ్మెల్యేలకు పోలీస్‌భద్రత కల్పించిన గవర్నర్ వారు ముంబైకి వెళ్లేలా చేశారు. ఇక విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాన్ని నేను మీకే(స్పీకర్‌కే) వదిలిపెడుతున్నాను. ఇలాంటి ఆదేశాలు ఢిల్లీ(కేంద్రం) సూచనలతో రాకూడదు. గవర్నర్ రాసిన లేఖ నుంచి నన్ను రక్షించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని కోరారు. స్పీకర్ విధుల్లో గవర్నర్ జోక్యం తగదు అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్ వజూభాయ్ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని గతంలో అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుణాచల్ అసెంబ్లీ కేసు.. 2016లో అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ లేదన్న కారణంగా అప్పటి గవర్నర్ రాజ్కోవా నబం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇస్తూ స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది. రద్దయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ‘గవర్నర్ స్పీకర్‌కు గురువుగానీ మార్గదర్శిగానీ కాదు. కాబట్టి స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదు. స్పీకర్‌ను తొలగించే హక్కు గవర్నర్‌కు లేదు. స్పీకర్, గవర్నర్లు ఇద్దరూ వేర్వేరు రాజ్యాంగ సంస్థలకు అధిపతులు’అని ఆనాటి తీర్పులో సుప్రీం కోర్టు వివరించింది. రాజకీయ పార్టీలో చెలరేగే సంక్షోభం లేదా కల్లోలానికి గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలకు ఆయన దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ లేఖపై భిన్నాభిప్రాయాలు స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి గవర్నర్ ఇలా లేఖలు పంపడం సమర్థనీయమేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అన్నారు. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్‌కు ఉందని, దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉందని ఆయన అన్నారు. గవర్నర్ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టంగా చెపుతోందన్నారు. అయితే, కర్ణాటక గవర్నర్ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని లోక్‌సభ మరో మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు.శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సభకు సూచించవచ్చని రాజ్యాంగంలోని 175వ అధికరణ చెబుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు. అంతేకాని సభ ఎలా జరగాలో చెప్పే అధికారం ఆయనకు లేదు. ఏమైనా కర్ణాటక గవర్నర్ అసాధారణ చర్య తీసుకున్నారు’అని ఆచార్య తెలిపారు. గవర్నర్ చర్య సరైనదా కాదా అన్నది న్యాయస్థానం తేల్చుతుందన్నారు. శాసన సభకు సంబంధించినంత వరకు స్పీకరే సర్వాధికారి అని, సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్‌ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాత్రి విధానసౌధలో నిద్రిస్తున్న బీఎస్ యడ్యూరప్ప