న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి సంబంధించి మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ బీజేపీ నేత ఫడ్నవీస్ ను ఆహ్వానిస్తూ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను సోమవారం ధర్మాసనం పరిశీలించింది. అనంతరం, ‘ఇక ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మెజారిటీ ఉందా? లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించింది.
ఫడ్నవీస్‌కు బలనిరూపణ కోసం గవర్నర్ నవంబర్ 23న 14 రోజుల గడువు ఇచ్చినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఫడ్నవీస్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఫడ్నవీస్ ప్రభుత్వం తక్షణమే విశ్వాసపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్– ఎన్సీపీ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, శివసేన తరఫు లాయర్ కపిల్ సిబల్ కోర్టును మరోసారి కోరారు. మెజారిటీ ఉందని నమ్మకం ఉన్నప్పుడు బలపరీక్షకు వెనకడుగు ఎందుకని ప్రశ్నించారు.
కేంద్రం, గవర్నర్ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించిన తుషార్ మెహతా.. ‘ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు? అని గవర్నర్ లెక్కలు వేసుకోలేరు’ అని వ్యాఖ్యానించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ ప్రెస్‌మీట్‌లో పేర్కొన్న విషయాన్ని సిబల్ ప్రస్తావించారు. ‘తెల్లవారుజామున 5.27 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయాల్సినంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది?’ అని సిబల్ ప్రశ్నించారు.
అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఏ ఒక్క ఎన్సీపీ ఎమ్మెల్యే కూడా ముందుకు రాలేదని ఎన్సీపీ న్యాయవాది సింఘ్వీ వ్యాఖ్యానించారు. ‘ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో బీజేపీని ఆహ్వానించారు. మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ స్పష్టంగా పేర్కొన్నారు. గవర్నర్ చెప్పిన గడువులోగా కాకుండా.. ఆ లోపే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందా?’ అని రోహత్గీ ప్రశ్నించారు. ‘సభలో బలనిరూపణ తప్పదు. అది ఎప్పుడు జరగాలనేది కోర్టు నిర్ణయించలేదు’ అని వాదించారు. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ.. 24 గంటల్లో, 48 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన దృష్టాంతాలు గతంలో ఉన్నాయన్నారు. వాదనల అనంతరం, మంగళవారం ఉదయం 10.30 గంటలకు విశ్వాస పరీక్షకు సంబంధించి ఆదేశాలిస్తామని కోర్టు పేర్కొంది.
తుషార్, సిబల్‌ల వాగ్యుద్ధం
అధికారం చేపట్టేందుకు వీలుగా ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడాన్ని ఇంగ్లిష్‌లో ‘హార్స్ ట్రేడింగ్’ అంటారనే విషయం తెలిసిందే. వాదనల సందర్భంగా తుషార్ మెహతా.. ‘ఇది హార్స్ ట్రేడింగ్ కాదు. ఇక్కడ మొత్తం గుర్రపు శాలనే మరోవైపునకు తరలిపోయింది (అజిత్ పవార్‌తో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపు వెళ్లారనే అర్థంలో)’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కపిల్ సిబల్ స్పందిస్తూ.. ‘గుర్రపు శాల ఇక్కడే ఉంది. జాకీ(అజిత్ పవార్) మాత్రమే వెళ్లిపోయాడు’ అని రిటార్ట్ ఇచ్చారు. మరో సందర్భంలో.. ‘కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు సుప్రీంకోర్టులో ఒక్కటిగా ఒకే పిటిషన్ వేశామన్నాయి. కానీ న్యాయవాదులను మాత్రం మూడు పార్టీలు వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కూటమి తీరేంటో దీంతో అర్థమవుతుంది’ అని మరో సందర్భంలో తుషార్ వ్యాఖ్యానించారు.
‘విశ్వాసం’పై నేడు ఆదేశాలు
Published Tue, Nov 26 2019 4:00 AM | Last Updated on Tue, Nov 26 2019 8:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment