భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం పూర్తిస్థాయి మెజారిటీ లేదనీ, అసెంబ్లీలో బలపరీక్ష కోసం తాము గవర్నర్‌ను కలుస్తామని ప్రకటించింది. ఈ విషయమై మధ్యప్రదేశ్ విపక్ష నేత గోపాల్ భార్గవ మాట్లాడుతూ..‘రుణమాఫీ, శాంతిభద్రతలు, తాగునీటి సమస్య వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడంతో పాటు ప్రభుత్వ మెజారిటీ విషయంలో బలపరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మేం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు ఇప్పటికే లేఖ రాశాం.
ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా ముఖం చాటేస్తున్న కమల్‌నాథ్ ప్రభుత్వం గుట్టలకొద్దీ కాగితాలను మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇంటికి పంపుతోంది. రాష్ట్రంలోని 21 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసేశామని చెబుతోంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ బలహీన కాంగ్రెస్ ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉందా? లేదా? అని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా, స్థిరంగా కొనసాగడంపై ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అని తెలిపారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డ మరుసటి రోజే మధ్యప్రదేశ్‌లో కమలనాథులు బలపరీక్ష కోరడం గమనార్హం. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరమైన నేపథ్యంలో బీఎస్పీ(2), ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
బీజేపీ కుట్ర పన్నుతోంది: కాంగ్రెస్
అవినీతి పద్ధతుల ద్వారా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీపక్ బబరియా ఆరోపించారు. మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు.
విశ్వాస పరీక్షకు సిద్ధం: కమల్‌నాథ్
విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమల్‌నాథ్ చెప్పారు. గడిచిన ఐదు నెలల్లో నాలుగు సార్లు తమ సంకీర్ణ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నామనీ, అవసరమైతే మరోసారి కూడా సిద్ధమేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment