విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం! | Supreme Court asks Centre, Fadnavis to show letters of BJP | Sakshi
Sakshi News home page

విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం!

Published Mon, Nov 25 2019 4:32 AM | Last Updated on Mon, Nov 25 2019 10:24 AM

Supreme Court asks Centre, Fadnavis to show letters of BJP - Sakshi

సుప్రీంకోర్టు వద్ద కాంగ్రెస్‌ నేతలు సూర్జేవాలా, పృథ్వీరాజ్‌ చౌహాన్, అభిషేక్‌ సింఘ్వీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్లపై ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అనంతరం, దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్‌ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్‌ గవర్నర్‌కు రాసిన లేఖను సోమవారం ఉదయం తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.

24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది. పైన పేర్కొన్న రెండు లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ లేకపోవడంతో ఆ లేఖలను తమకు అందజేసే బాధ్యత తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది. ‘24 గంటల్లోగా బల నిరూపణను ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం.

ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను గవర్నర్‌ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్‌కు ఫడ్నవీస్‌ పంపిన లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ‘మహా వికాస్‌ అఘాడి’ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలన్న వినతిని సైతం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వినతిని పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సెలవు రోజైనప్పటికీ ఆదివారం విచారణను కోర్టు ప్రారంభించడం విశేషం.

మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు చోటుచేసుకున్న ఉత్కంఠభరిత పరిణామాల నేపథ్యంలో కోర్టు విచారణకు పెద్ద సంఖ్యలో లాయర్లు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారిలో కాంగ్రెస్‌ నేతలు పృథ్వీరాజ్‌ చౌహాన్, రణ్‌దీప్‌ సూర్జేవాలా, ఎన్సీపీ ఎంపీ మాజీద్‌ మెమన్, శివసేన ఎంపీ గజానన్‌ కీర్తికర్‌ తదితరులున్నారు. కోర్టులో శివసేన తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్, కాంగ్రెస్‌– ఎన్సీపీ తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ, కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

కేంద్ర కేబినెట్‌ సిఫారసు చేసిందా?
రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన విధానం అత్యంత దారుణమని కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. ‘కేబినెట్‌ సమావేశం జరగకుండానే, కేబినెట్‌ సిఫారసు లేకుండానే, శనివారం తెల్లవారు జామున రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఇలా చేయాలంటూ గవర్నర్‌ సిఫారసు చేశారా? లేదా? అనే విషయంలో కానీ, ఒకవేళ సిఫారసు చేస్తే.. ఏ ప్రాతిపదికన అలా చేశారనే విషయంలో కానీ స్పష్టత లేదు’ అని సిబల్‌ వాదించారు.  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమికి సభలో పూర్తి మెజారిటీ ఉందని, అందువల్ల ఆ కూటమి నేత శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని, లేదా, 24 గంటల్లోపు సభలో బల నిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలని కోర్టును సిబల్‌ కోరారు.

సెలవు రోజు విచారించాలా?
బొంబాయి హైకోర్టును కాకుండా, డైరెక్ట్‌గా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ల తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తప్పుబట్టారు. ఆదివారం సెలవు రోజున సుప్రీంకోర్టును ఇబ్బంది పెట్టాల్సినంత ముఖ్యమైన కేసు కాదని వ్యాఖ్యానించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం రాజకీయ పార్టీని కానీ, కూటమిని కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమనేది గవర్నర్‌ విచక్షణాధికారం. ఈ అధికారం న్యాయ సమీక్షకు కూడా అతీతం’ అని రోహత్గీ వాదించారు.  కోర్టును సభ గౌరవించాలి.. సభను కోర్టు గౌరవించాలి అని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ఫడ్నవీస్, అజిత్‌పవార్‌ల తరఫున ఎవరు వాదిస్తున్నారంటూ ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించగా, తాను కేంద్రం తరఫున వచ్చానంటూ తుషార్‌ మెహతా సమాధానమిచ్చారు.   

గవర్నర్‌ తీరు బాలేదు
ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడం మోసపూరిత చర్య అని, అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్‌– ఎన్సీపీల తరఫు న్యాయవాది సింఘ్వీ వ్యాఖ్యానించారు. ఎన్సీపీకి చెందిన 54 ఎమ్మెల్యేల్లో 41 మంది ఎన్సీపీతోనే ఉన్నారని, వారు అజిత్‌ పవార్‌తో లేరని కోర్టుకు వివరించారు. గవర్నర్‌ తీరు పక్షపాత పూరితంగా, అన్యాయంగా, అన్ని న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది’ అన్నారు.

ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 41 మంది తాము అజిత్‌ పవార్‌కు మద్దతివ్వడం లేదని స్పష్టం చేస్తూ గవర్నర్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి సింఘ్వీ తీసుకువచ్చారు.  ఇలాంటి సందర్భాల్లో తక్షణమే సభలో విశ్వాస పరీక్ష జరపాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సింఘ్వీ ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఆ విషయంలో వివాదమేమీ లేదు. సభలో బల నిరూపణే అల్టిమేట్‌ టెస్ట్‌’ అని స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement